Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క విశిష్టత

Originally posted 2013-11-04 16:35:49.

aashura

అబ్దుర్రహ్మాన్

ఆషూరాఅ రోజు (ముహర్రం నెల 10 తేదీ) ఉపవాసం గురించి అడిగిన ప్రశ్నకు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారని అబూ ఖతాదహ్ రధి అల్లాహు అన్హు ఉల్లేఖించినారు :

” ఆయన ఆషూరాఅ రోజు ఉపవాసానికి ప్రతిఫలంగా క్రిత సంవత్సరపు పాపాలు (చిన్న పాపాలు) మన్నిస్తాడని నేను అల్లాహ్ నుండి ఆశిస్తున్నాను.”

ఆషూరాఅ దినమున ఉపవాసం పాటించే పద్ధతి:

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క మూడు పద్ధతులను కొందరు ఇస్లామీయ పండితులు ఇలా తెలిపినారు.
(1) ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసంతో పాటు, దాని ముందు రోజున లేదా దాని తరువాత రోజున కూడా ఉపవాసం ఉండటం.
(2) కేవలం ఆషూరాఅ రోజున (ముహర్రం 10 వ తేదీన) మాత్రమే ఉపవాసం ఉండటం.
(3) ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసంతో పాటు, దాని ముందు రోజు (ముహర్రం 9 వ తేదీ) మరియు దాని తరువాత రోజులలో (ముహర్రం 11 వ తేదీలలో) కూడా ఉపవాసం ఉండటం, అంటే వరుసగా మూడు రోజులు (ముహర్రం నెల 9, 10 మరియు 11 వ తేదీలు) ఉపవాసం పాటించడం.

ఆషూరాఅ దినమున ఉపవాసం ఎందుకు ఉండవలెను :

ఆషూరాఅ దినమున అంటే ముహర్రం 10 వ తేదీన అల్లాహ్ తన ప్రవక్త మూసా అలైహిస్సలాం ను మరియు ఆయన ప్రజలను, ఫిరౌను మరియు అతడి ప్రజల దౌర్జన్యం నుండి రక్షించినాడు. కాబట్టి దీనికి కృతజ్ఞతగా అల్లాహ్ కొరకు ఉపవాసం ఉండవలెను.

ఆషూరాఅ రోజు ఉపవాసం – కొన్ని ప్రయోజనాలు:

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరిస్తూ ఆషూరాఅ దినము యొక్క ఉపవాసం పాటించడం ఉత్తమం.
ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) కంటే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తరువాత కూడా ఉపవాసం ఉండటం ఉత్తమం.
ఈ రోజు చాలా శుభమైనది. పూర్వం నుండే దీని పావనత్వం మరియు ఔన్నత్యం ప్రసిద్ది గాంచి యున్నది.
పూర్వ సమాజములలో నెలల నిర్ణయం ఇంగ్లీషు క్యాలెండరును బట్టికాక, చంద్రుడ్ని గమనాన్ని బట్టి జరిగేదని స్పష్టమవుతున్నది. ఎందుకంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపి ఉన్నారు – అల్లాహ్ ముహర్రం 10 వ తేదీన ఫిరౌను మరియు అతడి సహచరులను వినాశం చేసినాడు. మరియు ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు అతని సహచరులకు ఆ రోజున విజయం ప్రసాదించినాడు.
ఆషూరా దినమున ఉపవాసం ఉండటమనేది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు (విధానం) నుండి స్పష్టంగా ద్రువీకరించబడినది. ఉపవాసం కాకుండా ఈ దినమున చేసే ఇతర చేష్టలన్నీ నూతన కల్పితాలే (బిదాఅతులే) తప్ప ఇంకేమీ కావు. అంతేకాక – అవన్నీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలకు విరుద్ధమైనది కూడా.
ఒక దినపు ఉపవాసానికి బదులుగా మొత్తం ఒక సంవత్సరపు పాపాలన్నీ క్షమించివేయడమనేది అల్లాహ్ మనపై చూపుతున్న అనంతమైన కరుణకు మరియు అనుగ్రహానికిఒక చిన్న మచ్చు తునక మాత్రమే. నిశ్చయంగా అల్లాహ్ సాటిలేని అనుగ్రహం కలవాడు.

ఓ నా సోదరులారా! ఈ అనుగ్రహాన్ని చేజిక్కించుకోవటానికి సిద్ధపడండి. తమ నూతన సంవత్సరాన్ని అల్లాహ్ కు విధేయత చూపటంలో, దానధర్మాలు చేయటంలో మరియు పుణ్యాలు సంపాదించటంలో పోటీపడుతూ ప్రారంభించండి. పుణ్యాలు, మంచిపనులు తప్పకుండా పాపాలను, చెడుపనులను చేరిపివేస్తాయి.
(ఈ విషయాలు షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉధైమిన్ రహిమహుల్లాహ్ యొక్క నుండి మరియు షేఖ్ సాలెహ్ అల్ఫౌజాన్ హాఫిజహుల్లాహ్ యొక్క నుండి తీసుకోబడినవి.)

గమనిక:

కేవలం ఆషూరాఅ రోజున మాత్రమే ఉపవాసం ఉండటంలో ఎలాంటి తప్పూ లేదు – దీనికి ఆధారం షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉధైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ఫత్వా. కాని రెండు రోజులు ఉపవాసం ఉండటం సున్నత్.

Related Post