కరుణించు కరుణించ బడతావు / Be merciful will be merciful అల్హమ్దు లిల్లాహ్! మనమందరం కరుణామయుని దాసులం. మనం దరి ప్రభువు కరుణామయ ప్రభువు. మనందరి ధర్మం కారుణ్య ధర్మం. మనందరి గ్రంథం కారుణ్య గ్రంథం. మనందరి ప్రవక్త కారుణ్య ప్రవక్త. మనందరి సముదాయం కరుణించబడిన సముదాయం. మనం ఏది చేయాలనుకున్నా, ఏది చదవాలనుకున్నా ‘బిస్మిల్లాహి ర్రహ్మానిహ్రీమ్’-అనంత కరుణామయుడు, అపార దయానిధి అయిన అల్లాహ్‌ా పేరుతో అని చెప్పడం ఆనవాయితి. కరుణ అల్లాహ్‌ా గుణం. కరుణామయుడు-రహ్మాన్-రహీమ్ అల్లాహ్‌ా నామం.అల్లాహ్‌ా కారుణ్యం ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”అల్లాహ్‌ా తన కారుణ్యాన్ని వంద భాగాలుగా విభజించాడు. అందులో 99 భాగాలు తన వద్ద పెట్టుకొని ఒక భాగాన్ని సమస్త లోకాల్లో అవతరింపజేశాడు. ఓ క్రూర జంతువు తన బిడ్డను ప్రేమతో, కరుణావాత్సల్యంతో స్పృశించడం ఆ ఒక్క భాగ కరుణ ఆధారంగానే. అలాగే మీరు పరస్పరం కనబరచుకుంటున్న కరుణ సయితం అందులోనిదే”. (బుఖారీ)
అంతటి దయాసాగరుడయి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (స) వారి గురించి ఇస్తున్న కితాబు -”ఓ ప్రవక్తా! మేము నిన్ను సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా చేసి పంపాము”. (అన్బియా: 107) స్వయంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) వారు తన గురించి చెప్పిన మాట – ”నేను కానుకగా పంపబడిన కారుణ్యాన్ని”. (హాకిమ్) కానుకగా మనం చాలా వస్తువుల్ని పోమదుతుంటాము. అయితే విశ్వ కారుణ్యమూర్తిగా అల్లాహ్‌ా మనకు ముహమ్మద్ (స) వారిని కాను కగా ఇవ్వడం ఎంత భాగ్యం, ఎంత భాగ్యం!
కారుణ్యం – మానవ నైజంలో అంతర్లీనమయి ఉన్న మౌలిక గుణం కారుణ్యం. సాటి ప్రజలపై వచ్చి పడే ఆపదలను చూచినపుడు మనలో, మదిలో కలకలం రేపేదే కారుణ్యం. సాటి వ్యక్తుల తప్పులపై బాధ పడేలా చేసేది, వారి రుజువర్తనం కోసం పరితపించేలా చేసేదే నిజమయిన కారుణ్యం, ఈ కారణంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) అన్నారు: ”కరుణించని వారిపై కరుణించడం అనేది జరుగదు”. (బుఖారీ)
ప్రేమ, కరుణ, అనురాగం, ఆప్యాయత, దయ, జాలి వంటి మానవ నైజం వాంఛించే, మానవ సమాజం కాంక్షించే సుగుణాలు మనం దరిలోనూ మొగ్గ తొడగాలి. అవి ఫలించి మరో మహా వృక్ష సృజన కు దారీ తీయాలి. కరుణను పెంచాలి, ప్రేమను పంచాలి. కరుణా ప్రదాత, మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ా మనలో సయితం ఈ గుణం వేళ్ళూనుకోవాలని కోరుతున్నాడు. ఆయన మనల్ని కరుణించా లంటే మనం ఆయన దాసుల యెడల కరుణతో, దయతో వ్యవహరిం చాలంటున్నాడు.”మీరు నేలనున్నవారిపై దయ జూపండి, నింగిన్ను వాడు మిమ్మల్ని కనికరిస్తాడు” అని స్వయంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) అన్నారు. (అబూ దావూద్)
తప్పుల తడికెగా మారిన మనల్ని ఉద్దేశించి కరుణామయుడయిన అల్లాహ్ ఎంతో ప్రేమతో ఇస్తున్న పిలుపు – ”తమ ఆత్మలపై అన్యా యానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ా సకల పాపాలను మన్ని స్తాడు. నిస్సందేహంగా ఆయన అపార క్షమాశీలి. పరమ కృపా కరుడు”. (జుమర్:53)
నేడు భూమండలంలో – పరస్పర ప్రేమానురాగాలు, సత్ప్రవర్తన, దయాదాక్షిణ్యాలు, శ్రేయోశుభాలు, పరోపకారాలు వంటి పేర్లతో పూస్తున్నట్టుగా కానవస్తున్న పారిజాతాలన్నీ అల్లాహ్‌ా చలువ వల్లనే పూస్తున్నాయి. అదే కోవకు చెందిన పుష్పరాజం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స). అల్లాహ్ తర్వాత ఆయనంతటి కరుణ ఇంకెవ్వరికీ లేదు. ఒకరెండు సంవత్సరాలు కాదు దాదాపు 23 యేండ్లు చిత్రహిం సలు పెట్టిన వారిని ఆయన కరుణించారే గానీ కోపగించుకోలేదు. ఆయన్ను ఆయన జన్మ స్థలం నుండి వెలివేసిన వారిని దీవించారే గానీ శపించ లేదు. ఆయన ప్రాణాల్ని బలిగొనాలని పన్నాగాలు పన్నిన వారిని ప్రేమించారేగానీ, ధ్వేషించలేదు. రాత్రి సమయాన ఆయన నడిచే దారిలో కంపలు పర్చ బడ్డాయి. ఆయన సజ్దాలో ఉండగా ఆయన మెడలో త్రాడు వేసి బిగించి చంపే ప్రయత్నం జరిగింది. ఆయనపై చెత్త విసిరేయడం జరిగింంది. ఆయన్ను మూడు సంవత్స రాల పాటు సంఘం నుండి బహిష్కరించడం జరిగింది.
ఆయన్ను ఆర్థికంగా దెబ్బ తీయడం జరిగింది. ఆయన కుమార్తెలకు విడాకులిచ్చి ఆయన్ను మానసికంగా కృంగదీయడం జరిగింది. ఆయన్ను రాళ్ళతో కొట్టి రక్తసిక్తం చేయడం జరిగింది. అయన్ను పిచ్చోడని ఓసారి, మాత్రికుడని మరోసారి నింద మోపడం జరిగింది. ఆయన్ను నమ్మి నడుచుకునే వారిని నానా యాతనలకు గురి చేయడం జరిగింది. ఎంత జరిగినా, ఏమి చేసినా ఆయన కరుణను కురిపిం చారే గానీ, అందరిపై ఆధిపత్యాన్ని పొంది తర్వాత ఒక్కరిని కూడా తన స్వయం కోసం శిక్షించ లేదు. మక్కా విజయ సందర్భంలో చోటు చేసుకున్న ఈ మహా ఘట్టం మొత్తం మానవ చరిత్రలో అంతకు ముందుగానీ, ఆ తర్వాత గానీ-కనీ, వినీ, ఎరుగనిది. ఆయన అంతటి కరుణామూర్తి గనకే అన్నారు: ”కరుణ అనే గుణం నుండి ఒక్క దౌభాగ్యుడిని మాత్రమే దూరం చేయడం జరుగుతుంది”. (తిర్మిజీ)
మనం చూపే కరుణావాత్సల్యాలకు, దయాదాక్షిణ్యాలకు, ప్రేమానురా గాలకు అందరికన్నా ఎక్కువ అర్హులు-మన రక్త సంబంధీకులు. మన సమీప బంధువుల్లో అగ్రజులు మన తల్లిదండ్రులు. వారి కోసం చేయా ల్సిన ప్రార్థనను పరమ దయాళువు అయిన అల్లాహ్‌ాయే మనకు నేర్పు తున్నాడు:
”ఇలా అను: ప్రభూ! ఏ విధంగానయితే వారు నన్ను బాల్యంలో కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించారో ఆ విధంగానే వారిపై కరుణ జూపు స్వామీ!” (బనీ ఇస్రాయీల్:23)
అంటే తల్లిదండ్రుల కరుణకు సరితూగగలిగే కరుణ విశ్వం మొత్తం లో మరొకటి లేదు గనక ప్రతిగా వారి కరుణనే పేర్కొనడం జరిగింది.
ఒకరిని బాధలో చూసి కంట తడి పెట్టడం ‘జాలి గుండె’ కు ప్రతీక. ప్రవక్త (స) అన్నారు: ”సలామ్‌ను సర్వవ్యాప్తం చేయండి. అన్నదానాలు చేపట్టండి. బంధువ్య సంబంధాలను బల పర్చండి. రాత్రి వేళ ప్రజలు నిద్రిస్తుండగా మీరు ప్రార్థనలు చేయండి. ఇలా గనక మీరు చేస్తే మీ ప్రభువు స్వర్గధామంలో ప్రశాంతంగా ప్రవేశించగలరు”. (ఆహ్మద్)
మనం తప్పనిసరిగా ప్రేమానురాగాలను పంచవలసిన వారిలో అనాథలు, వితంతువులు, వికలాంగులు కూడా ఉన్నారు. వారి యెడల మంచిగా మెలగటం, వారికి మేలు చేయడం, వారి పొషణా భారాన్ని సహృదయంతో స్వీకరించడం, వారి ఉజ్వల భవిష్యత్తుకై పరితపిం చడం – ఇదంతా పవిత్రమయిన ఆరాధనగా పరిగణిమచబడుతుంది. ”వితంతువుల బాగు కోసం పరిశ్రమించే వ్యక్తి విరామం లేకుండా ఉపవాసాలు ఉండేవానితో సమానం. నిర్విఘ్నంగా ప్రార్థనలు చేసేవాని తో సమానం” అన్నారు కారుణ్యమూర్తి ముహమ్మద్ (స). (ముస్లిం)
ఓ వ్యక్తి ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి – ”నాలో హృదయ కాఠిన్యం చోటు చేసుకుంది. నాలో మచ్చుకయినా దయాదాక్షిణ్యాలు లేకుండా పోయాయి” అని ఫిర్యాదు చేసుకున్నాడు. అది విన్న ప్రవక్త (స) – ”అనాథ తలను అప్యాయంగా నిమురు మరియు నిరుపేదకు అన్నం పెట్టు” అని సలహా ఇచ్చి పంపారు. (ముస్నద్ అహ్మద్)
మరో సందర్భంలో ఇటువంటి ఫిర్యాదుకి నివారణోపాయంగా -”నీ మనసు మెత్త బడాలనీ, నీ జీవితం బాగవ్వాలని ఆశిస్తున్నావా? అనాథను ఆదరించు, వాత్సల్యంగా చేత్తో అతన్ని దీవించు. అతని ఆకలిని తీర్చు. అప్పుడు నీ మనసు మెత్తబడుతుంది, నీ అక్కర తీరు తుంది” అన్నారు ప్రవక్త (స). (తబ్రానీ).
ఎందుకంటే, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగం వంటి సలక్ష ణాలు ఏ సమాజానికయినా టానిక్కు లాంటివి. మరే సమాజంలో, హృదయంలోనయితే కరుణ ఉండదో అది దేనికీ పనికిరానిదిగా తయారవుతుంది అనడంలో సందేహం లేదు. అటుంటి సమాజం నుండి, అట్టి రాతి గుండె గల వ్యక్తుల నుండి ప్రజలు పారి పోతారు ఇదే యదార్థాన్ని అల్లాహ్‌ా ఇలా తెలియజేస్తున్నాడు: ”ఇది కేవలం అల్లాహ్ కారుణ్యం కారణంగానే నువ్వు వారి యెడల మృదువుస్వభావు డవయ్యావు. నీవే గనక కర్కశుడవు, కాఠిన్య హృదయుడవు అయి ఉంటే వారందరూ నీ నుండి దూరంగా జరిగి పోయేవారు”. (ఆల్ ఇమ్రాన్:159)
మనం నివసించే సమాజంలో అందరూ ఆరోగ్యవంతులే ఉండరు. రోగగ్రస్తులు కుడా ఉంటారు. వారి యెడల దయతో మెలగాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్య ఖర్చులు భరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి చేతనయినంత సహాయం అందించాలి. ఒకవేళ ఆర్థిక సహా యం అందించే స్థితిలో మనం లేకపోయినా సహాయం చేయగలిగే దాతల వరకు వారి విషయాన్ని చేరవేయాలి. అదీ సాధ్యం కాకపోతే వారి కోసం చేతులెత్తి ప్రార్థించాలి. వీలు కుదిరితే వెళ్ళి పరామర్శించి రావడం మరీ మంచిది. ప్రవక్త (స)ఇలా అన్నారు: ”రోగగ్రస్తుని వద్దకు ఉదయం వెళ్ళి పరామర్శిస్తే-పరామర్శ జరిపిన వ్యక్తి కోసం 70 వేల మంది దైవదూతలు సాయంత్రం వరకు దుఆ చేస్తూనే ఉంటారు. ఒక వేళ సాయంత్రం వెళ్ళి పరామర్శిస్తే మరుసటి ఉదయం వరకూ 70 వేల మంది దైవదూతలు అతని బాగు కోసం ప్రార్థిస్తూనే ఉంటారు. అలాగే రొగిని పరామర్శిస్తున్నంత సేపూ పరామర్శ జరిపే వ్యక్తి స్వర్గ తాజా ఫలాలను ఏరుకుంటూ ఉంటాడు”. (అబూ దావూద్)
మనం కరుణ చూప వలసిన వారిలో కార్యాలయంలో, ఇంట్లో పని చేసే కార్మికులు కూడా ఉంటారు. వారితో వీలయినంత వరకు దయ తోనే వ్యవహరించాలి. ‘నేను నా బానిసను రోజుకి ఎన్ని సార్లు కమించాలి’ అన్న ప్రశ్నకు ”రోజుకి 70 సార్లు” అన్నారు ప్రవక్త (స).
పోతే మన మనుగడలో సృష్టిలోని సమస్త ప్రాణులు తమవంతు భాగస్వామ్యాన్ని అందిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సకల చరాచరాల పట్ల దయ, కరుణ కలిగి వ్యవహరించాలి. ప్రవక్త (స) అన్నారు: ”మీరు పరస్పరం ప్రేమతో. దయతో వ్యవహరిం చండి” అని. అందుకు అక్కడ ఉన్నవారు-‘ఓ దైవప్రవక్తా! (స) మేము ఒండొకరి యెడల ప్రేమాభిమానాలతోనే వ్యవహరిస్తాము’ అన్నారు. అందుకు వివరణ ఇస్తూ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నా ఉద్దేశ్యం మీరంటున్న ఈ ప్రేమ మాత్రమే కాదు, ప్రజలందరి యెడల ప్రేమ కలిగి ఉండండి. సకల ప్రాణుల యెడల సాత్విక ప్రేమ,దయా బావం తో మెలగండి”.
”ఒక స్త్రీ పిల్లిని బంధించి ఉంచిన పాపానికి నరకానికి ఆహుతి అయ్యింది. ఎందుకంటే ఆమె పిల్లిని కట్టి పడేసేది. దానికి ఆహారమూ పెట్టేది కాది, పోనీ అది ఎక్కడికయినా వెళ్ళి పొట్ట నింపుకునేందుకు దాన్ని వదిలేదీ కాదు”. (బుఖారీ హథీసు గ్రంథం)దీనికి భిన్నంగా-‘ఒక పాపాత్మురాలయిన స్త్రీకి దాహంతో ఉన్న కుక్కపై జాలేసి నీళ్లు తోడి తాపించింది. ఆమె ఆ మూగ జీవం పట్ల చూపిన జాలికి అల్లాహ్‌ా ఆమె పాపాలన్నింటినీ ప్రక్షాళించేశాడు”.(ముస్లిం హథీసు గ్రంథం)
చూశారా! ఒక కుక్కపై చూపిన జాలికే ఒక పాపాత్మురాలి పాపాలన్నీ హరించుకు పోతుండగా, సాటి మానవులపై మనం చూపే కరుణ ఎన్నెన్ని మహిమల్ని సృష్టించగలదో ఊహించండి!