సూరహ్‌ అన్నిసా

నామకరణం: సూరహ్‌ అన్నిసా

‘అన్నిసా’ అని నామకరణం చెయ్యడానికి గల కారణం – ఈ సూరహ్‌లో ఇతర ఏ సూరాల్లో లేని విధంగా స్త్రీలకు సంబంధించిన ఆదేశాలుండటం మూలంగా ఈ సూరహ్‌ను ‘అన్నిసా అల్‌ కుబ్రా’ అని చెప్పడం జరిగింది. ‘అన్నిసా అస్సుగ్రా’ సూరతుత్‌ తలాఖ్‌ను చెప్పడం జరుగుతుంది.

ఈ సూరహ్‌ ముస్లిం కుటుంబానికి, ముస్లిం రాజ్యానికి, ముస్లిం సమాజానికి సంబంధించిన విషయాల గురించి చర్చిస్తుంది.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మదనీ సూరహ్‌.
2) తివాల్‌ సూరాలలోని ఒకటి.
3) మొత్తం ఆయతుల సంఖ్య 176.
4) ఖుర్‌ఆన్‌ క్రమానుసారం ఇది నాల్గవ సూరహ్‌.
5) ఇది సూరహ్‌ ముమ్‌తహినహ్‌ తర్వాత అవతరించింది.
6) ఈ సూరా ఖుర్‌ఆన్‌ పిలుపు శైలికి సంబంధించిన ఒక శైలీ – (يا أيها الناس) ఓ ప్రజలారా! తో ప్రారంభమవుతుంది.
7) ఈ సూరహ్‌లో వారసత్వపు ఆదేశాలుఆన్నయి.
8) ఈ సూరహ్‌ వారసత్వపు ఆదేశాలతోనే సమాప్తం అవుతుంది.
9) ఇది 4,5వ భాగంలో ఉంది. నాలుగు హిజ్బ్‌లు ఉన్నాయి. 8 రుబువులు ఉన్నాయి.


ఈ సూరహ్‌లో ప్రస్తావించ బడిన అంశాలు:


ఇది మదనీ తివాల్‌ సూరాల్లో ఒక సూరహ్‌. విశ్వాసుల లోపలి, బయటి వ్యవహారాలను చక్కదిద్దే బోలెడన్ని ఆదేశాలు ఈ సూరహ్‌లో ఉన్నాయి. ఈ సూరహ్‌ ముస్లిం కుటుంబానికి, ముస్లిం రాజ్యానికి, ముస్లిం సమాజానికి సంబంధించిన విషయాల గురించి చర్చిస్తుంది. అయితే ప్రత్యేకంగా స్త్రీల ఆదేశాలు ఈ సూరహ్‌లో అధికంగా ఉండటం వల్ల ఈ సూరహ్‌నూ ‘అన్నిసా’ అని చెప్పడం జరిగింది.


అవతరణ నేపథ్యం:


‘వ ఆతుల్‌ యతామా అమ్‌వాలహుమ్‌’ ఈ ఆయతు అవతరణ నేపథ్యం గురించి కల్బీ ఇలా అన్నారు: ”గత్ఫాన్‌ తెగకు చెందిన ఒక వ్యక్తి విషయమయి ఈ ఆయతు అవతరింపజేయడం జరిగింది. అతని దగ్గర అతని అన్న కుమారుడుండేవాడు. అతను యవ్వన దశకు చేరుకున్నాక తన ఆస్తి తనకివ్వాల్సిందిగా కోరాడు. అతని బాబాయి ఇవ్వనని నిరాకరించగా వారు పరిష్కారం కోసం ప్రవక్త (స) వారిని సంప్రదిచారు ఆ సందర్భంగా ఈ ఆయతు ఆవతరించింది. అప్పుడా వ్యక్తి – మేము అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతున్నాము. మహాపరాధం నుండి అల్లాహ్‌ శరణు వేడుకుంటున్నాము అని యావదాస్తిని తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు: ఎవరయితే తాము అమితావసరంలో ఉండి కూడా అన్యుల అవసరాలకు ప్రాధాన్యతినిస్తారో వారికి స్వర్గం తప్పక లభిస్తుంది”అని. అనాథ యువకుడు ఆస్తి చేతికి ముట్టగానే మొత్తం ఆస్తిని అల్లాహ్‌ మార్గంలో దానం చేసేశాడు. అది గమనించిన ప్రవక్త (స) – సబతల్‌ అజ్రు, వ బఖియల్‌ విజ్రు’ – పుణ్యం స్థితమితం అయింది. పాపం మిగిలి పోయింది. అన్నారు. అదెలా అని ఆరా తీయగా – అబ్బాయి ఆస్తిని దానం చేసిన కారణంగా అతనికి పుణ్యం లభించింది. అతని తండ్రి అవిశ్వాసి గనక అతని పాపం మిగిలి ఉంది అన్నారు.


ఈ సూరహ్‌ ఘనత:

ప్రవక్త (స) ఈ సూరహ్‌లోని మొదటి ఆయతును తన ప్రతి ప్రసంగంలోనూ ముందుగా పారాయణం చేసేవారు.

Related Post