పగవారి పన్నాగాలు

madina-wallpaper1
మహాప్రవక్త ముహమ్మద్‌ (స) మక్కా ప్రజల ఆచార సంప్రదాయాల్ని, నమ్మకాల్ని, పద్ధతుల్ని గుడ్డిగా సమర్ధించి ఉంటే, వాళ్ళ ఆదరాభిమానాల్ని చూర గొని ఉండేవారేమో. కాని, ఆయన అలా చేయలేదు. వారిలో చోటు చేసుకున్న రుగ్మతలను, వెర్రి పోకడలను అంతిమ ప్రవక్త (స) నిరసించారు. దురాచారాలు, దుష్చర్యలన్నింటినీ కూల్చివేసి, వాటి శిథిలాలపైనే ఉత్తమ నైతిక నిర్మాణ పునాదులు కూడా వేశారు. మహా ప్రవక్త (స) వారి దృష్టి నిశితం – సునిశితం. ఆయన దృష్టి విశ్వాంతరాళంలోకి దూసుకుపోయింది. సృష్టి పరమ రహస్యాలను, సృష్టికర్త శక్తియుక్తులను లోతుగా – విశాలంగా, నిదానంగా – నెమ్మదిగా – నమ్రతతో పరిశీలించా రాయన. సృష్టి గురించి ఆయనకు తెలిసిన విషయాలు అగణ్యం. సృష్టికర్త ఆయనకు తెలిపిన రహస్యాలు అనన్యం. కనుకనే ఆయన వాక్కు సత్యం. సత్య సౌందర్యం ఆయన మాటల్లో, భావాల్లో, ఆచరణల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యేది. సూక్ష్మం-సున్నితం-సత్యం అయిన దివ్య వాణిని ఆయన తన మధురమైన స్వరంతో కోటి రాగాలు పలికించారు. ఆయన నోట వెలువడే ప్రతి మాట శక్తివంతం-సుకుమారం -మార్దవం. అది రమ్యమైనది- మనోహరమైనది- సంతోష కరమైనది-సహజమైనది- అద్భుతమైనది – అద్వితీయమైనది – అమోఘమైనదీను. అది ఒక్కోసారి భయాన్ని కలిగిస్తుంది. దడ పుట్టిస్తుంది. పాపం, నేరం, నరకం విషయంలో అది అలాగే ఉంటుంది.
 దైవ నామస్మరణ లేమితో నిర్జీవమైన మానవ హృదయాలకు తిరిగి నవ జీవనాన్ని ఇచ్చేందుకు, రుజుమార్గాన్ని చూపించేందుకు వచ్చారు  మహా  ప్రవక్త (స). కామం,  క్రోధం,మదం,  మత్సర్యాలతో బైర్లు కమ్మిన మానవ నేత్రాలకు కాంతిని ఇచ్చేందుకు ప్రభవించారు అంతిమ ప్రవక్త (స) దాసుల్ని, దాసుల, సృష్టితాల దాస్యం నుండి వెలికితీసి  దైవ విధేయులుగా మలచి మహోన్నత స్థానానికి ఎత్తి అద్భుతానంద జగత్తులో విహరింప జేయడానికి విచ్చేశారు ప్రియ ప్రవక్త (స) కామాంధుల కబంద హస్తాల్లో చిక్కుబడి విలవిల్లాడుతున్న మాననీమణుల దుఃఖమయ జీవితంలో సంతోషాల పూలు పూయించడానికి, ఆనందాన్ని పంచడానికి అరుదెంచారు ఆదర్శ ప్రవక్త (స).
  అయితే ఆయన పట్ల లోకం వ్యవహ రించిన విధానమే విడ్డూరం!! లోకోద్ధరణ కోసం, లోక శాంతి కోసం, సర్వ మానవ కళ్యాణం కోసం ప్రభవించిన ఆ క్రాంతికారుడినే ”ఇతనో పిచ్చోడు, మతి స్థిమితం లేనివాడు’ అన్నారు. వాస్తవంగా వారి హృదయాలపైనే గాఢాంధకారాలు అలుముకుని ఉన్నాయి. వారు నిజంగా వివేచనాపరులై ఉంటే, అవినీతి చట్టాలతో బూజు పట్టిన మత సిద్ధాంతాలతో, కల్లిబొల్లి కథనాలతో కంపు కొట్టే వ్యవస్థను సమర్ధించేవారే  కాదు.
  ఇవేమీ పట్టని పగవారు అటు ప్రవక్త (స) వారిని హతమార్చేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ‘ముహమ్మద్‌ (స) తీసుకొచ్చిన ఉద్యమాన్ని ఎలాగైనా సరే అరికట్టాలి. చివరికి అతన్ని హత మార్చాల్సి వచ్చినా పరవాలేదు’ అన్నారు అందరూ. ‘బ్రహ్మాండంగా ఉంది మీ ప్రణాళిక. అసలు పన్నాగం అంటే ఇలా ఉండాలి. మీ పుర్రెల్లో పుట్టిన ఈ ఆలోచన అమోఘం! అద్భుతం!!’ అని షైతాను కూడా సర్టిఫికెట్‌ ఇచ్చాడు.
  నలు దిక్కులా చీకటి రాజ్యమేలుతోంది. నింగిలోని తారలు నేలపై నీతినడవడికల్ని  శాంతిని, ధర్మాన్ని  నాశనం  చేసేందుకు నిలబడివున్న నరరూప రాక్షసుల గురించి తర్జనభర్జనలు పడుతున్నాయి. గాఢాంధ కారంలో మక్కా నగరం మౌన సముద్రం దాల్చి ఉంది. కారుణ్యమూర్తి (స) వారి ఇంటి చుట్టూ శత్రువులు ఈటెలు, బాకులతో మాటు వేసి కూర్చుని ఉన్నారు …ఏం జరుగుతుంది..? అన్న ఉత్కంఠ, ఆందోళనతో చంద్రుడు సయితం అవని వైపు కళ్ళు చించుకుని చూస్తున్నాడు.
  దైవప్రవక్త (స) వారి గృహంలో ఏదో అలకిడి వినబడుతుంది!…”అలీ! జాగ్రత్త!! తెల్లవారగానే ఇంట్లో భద్రపరచిన వస్తువులన్నీ ఎవరివి వాళ్ళకు అప్పజెప్పి, ఆనక బయలుదేరి మదీనా వచ్చెయ్యి”. ఏమిటా వస్తువులు? ప్రజలతోపాటు పగవారు సయితం ప్రవక్త (స) వద్ద దాచుకున్న ధన కనక వస్తువులు అవి. ఎంత ఔదార్యం! అదే రాత్రి – ”వ జఅల్నా మిన్‌ బైని ఐదీహిమ్‌ సద్దఁ వ్వమిన్‌ ఖల్ఫిహిమ్‌ సద్దన్‌ ఫ అగ్‌షైనా హుమ్‌ ఫహుమ్‌ లా యుబ్‌సిరూన్‌” (యాసీన్: 9) – (మేము వారి ముందు ఒక అడ్డును, వారి వెనుక ఒక అడ్డును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు చూడలేరు) అన్న ఆయతు చదువుతూ… గుప్పెడు మన్ను శత్రువులపై విసిరి అక్కడి నుండి సురక్షితంగా బైటపడ్డారు ప్రవక్త (స). అటుపిమ్మట అబూ బక్ర్‌ (ర) ఇంటికెళ్ళి ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకొని ‘సౌర్‌’ గుహ వైపునకు సాగిపోయారు. ప్రవక్త (స) తమ కళ్ళు గప్పి వెళ్ళిపోయారని తెలుసుకున్న శత్రువులు గాలింపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పట్టుకొచ్చి ఇచ్చే వ్యక్తికి 100 ఎర్ర ఒంటెలు బహుమానం అని ప్రకటించారు.

Related Post