మానవ సమైక్యతకు మూల సాధనం

Cute-Muslim-Baby-Kid-offering-Namaz

షేక్ రియాజ్ అహ్మద్

అల్లాహ్‌ తాను సృష్టించిన జీవరాసులన్నింటిలో మానవుడిని అత్యున్నతంగా ఎంతో అందమైన రీతిలో సృష్టించి అతని కొరకు పూర్తి సృష్టిని లోబరిచాడు. కనుక అటువంటి ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్‌ాకు కృతజ్ఞతగా మనిషి తన పూర్తి జీవితం ఆయన్నే ఆరాధిస్తూ, పూజిస్తూ, విధేయతను పాటిస్తూ గడపాలి.

నమాజు దైవానికి – దాసునికి మధ్య సంబంధాన్ని పటిష్టపరిచే మాధ్యమం. నమాజు ఒక దాసునికి – అతని ప్రభువుకి మధ్య జరిగే సంభాషణ. నమాజు దారి తప్పిన హృదయాన్ని దైవసన్నిధికి చేర్చే సాధనం.

సృష్టి మొత్తం అల్లాహ్‌నే ఆరాధిస్తోంది
”సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన (అల్లాహ్‌) పవిత్రతనే కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతోపాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమా గుణం కలవాడు”. (బనీ ఇస్రాయీల్: 44)
ఈ విశ్వంలోని సమస్త సృష్టిరాసులు సూర్యుడు, చంద్రుడు, ఆకాశాలు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, వృక్షాలు, జంతువులు, పక్షులు, పర్వతాలు, సముద్రాలు, నదులు – ఇలా సమస్త సృష్టిలోని వస్తువులు వాటికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా అల్లాహ్‌నే ఆరాధిస్తున్నాయి. ఆయనకే విధేయత చూపు తున్నాయి. ఆయన ముందే సాష్టాంగపడుతున్నాయి. కాని వీటిని స్తుంతించే విధానం ఎలా ఉంటుంది? అనేది మన బుద్ధికి అందనిది. ఇప్పటి వరకు మానవుని జ్ఞానం అంతవరకూ చేరలేదు. వీటిని సృష్టించిన సృష్టికర్త అల్లాహ్‌కే బాగా తెలుసు. ఆకాశాలలోను, భూమిలోను ఉన్న సృష్టితాలన్నీ తమకు ఇష్టమున్నా లేకపోయినా – అల్లాహ్‌కు సాష్టాంగపడుతున్నాయి. వాటి నీడలు సయితం, ఉదయం సాయంత్రం” (ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి). (అర్రాద్: 15)

మానవుడు సర్వ స్వతంత్రుడా?
సృష్టిమొత్తం అల్లాహ్‌ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనకే విధేయత చూపుతుంటే మరి అల్లాహ్‌ాయొక్క సృష్టితాలలోని మనిషి దీనికి అతీతుడా? లేక స్వతంత్రుడా? లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే, మానవుడు తనకు స్వాతంత్య్రాధికారాలు లేని రంగంలో అల్లాహ్‌ నిర్ద్దేశించిన ఈ ప్రకృతి చట్టానికే తలవొగ్గి వ్యవహరిస్తున్నాడు. ఉదాహరణకు:- మానవుడు కాళ్ళకు బదులు చేతులతో నడవలేడు. కళ్ళకు బదులు చెవులతో
చూడలేడు. నోటికి బదులు ముక్కుతో మాట్లాడలేడు. దీనివల్ల తెలిసేదేమిటంటే, మానవుడు అన్ని రంగాలలో సర్వ స్వతం త్రుడు కాడు. కాని దేవుడు మానవులకు కొన్ని స్వేచ్ఛాధికారాలు ఇచ్చాడు. మానవులకు మాత్రమే మంచి, చెడు, ధర్మాధర్మాల విచక్షణా జ్ఞానం ఇచ్చి అందులో ఏదైనా ఎంచుకొని ఆచరించే స్వేచ్ఛ ఇచ్చాడు.
మానవుడు దేవుడిచ్చిన ఈ స్వేచ్ఛను వినియోగించుకొని దేవుడు నిర్ణయించిన ఆరాధనా పద్ధతులు, కుటుంబ, సామాజిక,

రాజకీయ, ఆర్థిక విధానాలను పాటించి, అల్లాహ్‌కు విధేయుడై పోవచ్చు లేదా వాటిని తిరస్కరించి అవిధేయుడైపోవచ్చు ఒకవేళ దైవ శాసనాన్ని ధిక్కరిస్తే అతను ఇహలోకంలో అశాంతికి, పరలోకంలో నరకయాతనకు గురవుతాడు. దానికి బదులు అతను దేవునికి విధేయుడై, ఆయన ఆజ్ఞలను శిరసా వహిస్తే ఇహలోకంలో శాంతి, పరలోకంలో దేవుని ప్రసన్నతా భాగ్యం, మరియు స్వర్గ సౌఖ్యాలు లభిస్తాయి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”నిస్సందేహంగా ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో వారి కోసం కింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలున్నాయి. ఇదే గొప్ప విజయం”. (అల్‌ బురూజ్‌: 11) మానవుల్లో దేవుడిని ఆరాధించే వేర్వెరు పద్ధతులు ఎలా చోటు చేసుకున్నాయి?
సృష్టికర్త అయిన అల్లాహ్‌ా మనిషి స్వభావంలోనే దైవభీతి, దైవ భక్తి అనే భావనల్ని ఇమిడ్చాడు. దీనినే మనం మన పరిసరాలలో అన్ని మతాల వారిలో చూస్తాము. కాని శోచనీయమైన విషయ మేమిటంటే, మానవులలో అధికులు తమను సృష్టించిన అసలు సృష్టికర్తను వదలి అమాయకంగా సృష్టితాలను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు.
మానవుల సృష్టి ఈ భూమ్మీద ఏర్పడినప్పటి నుంచి మానవుల మార్గదర్శనం కొరకు అల్లాహ్‌ా ఒక లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల్ని పంపి గ్రంథాలను కూడా అవతరంపజేశాడు. ఆయాకాలాల్లో వచ్చిన ప్రవక్తలు తమ జాతి జనులకు అల్లాహ్‌ాను ఆరాధించే పద్ధతులను తెలియజేశారు. కాని అల్లాహ్‌ాను, ఆ ప్రవక్తలను విశ్వసించనివారు విగ్రహాలను, సూర్యుడ్ని, చంద్రుడ్ని, వర్షాన్ని, జంతువులను, చెట్లను, పుట్టలను తమ ఆరాధ్య దైవాలుగా చేసుకుని పూజించటం, ఆరాధించటం చేస్తూ వచ్చారు. ఈ ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్‌ (స). చిట్ట చివరి గ్రంథం ఖుర్‌ఆన్‌ అవతరించాక దానిని విశ్వసించినవారు, ఆయన (స) చూపిన విధంగా దేవుడిని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తు న్నారు. కాని అవిశ్వాసులు మాత్రం సృష్టికర్తను వదలి సృష్టితాలను పూజిస్తున్నారు. ఇంకా కొందరైతే గతించిన ప్రవక్తలనే దేవుళ్ళుగా చేసి వారినే ఆరాధిస్తున్నారు.
ఇప్పుడైనాసరే ఇతర మతావలంబీకులు తమ వద్ద ఉన్న గ్రంథాలు ఎన్ని మార్పులు చేర్పులకు గురైనా కూడా వాటిలో సృష్టికర్త ఒక్కడేనని, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) రాబోవుచున్నారని, వారిని విశ్వసించమని, వారికే విధేయత చూపమని ఉంది.
సత్యాన్ని ప్రేమించేవారు, ఇహలోకంలో శాంతిని కోరుకునేవారు, పరలోక సాఫల్యాన్ని అభిలషించేవారు ఆయా గ్రంథాలను పరిశోధించాలి, వాటితోపాటు అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌ను కూడా చదవాలి. అప్పుడు వారికి సరైన మార్గం కనబడుతుంది. అప్పుడు భూమ్మీద ఉండే మానవులంతా ఒకే దేవునికి ఒకే విధమైన పూజలు, ఆరాధనలు, ప్రార్థనలు చేయనారంభిస్తే మానవుల మధ్య ఉన్న ఈ దూరాలు అంతరిస్తాయి. ఇహలోకంలో శాంతి వర్థిల్లుతుంది. పరలోకంలో సాఫల్యం వరిస్తుంది. అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:
” మీ ఈ సమాజం (జీవన ధర్మం) వాస్తవానికి ఒకే సమాజం. నేను మీ అందరి ప్రభువును. కనుక మీరు నన్నే ఆరాధించండి. కాని ప్రజలు పరస్పరం విభేదించుకొని తమ ధర్మాన్ని చీలికలుగా చేసుకున్నారు. కాని చివరికి అందరూ మా వద్దకు మరలి రావలసి ఉంది”. (అల్‌ అంబియా: 92, 93)

సర్వతోముఖ వికాసానికి సోపానం నమాజు
నమాజు విశ్వాసి జీవితంలో ప్రత్యేకంగా కానవచ్చే ప్రధానాంశం
నమాజు విశ్వాసి జీవితం నుండి విడదీయరాని అవిభాజ్యాంశం.
నమాజు విశ్వాసి జీవితానికి వన్నె తెచ్చే, స్వర్గానికి గొనిపోయే కాంతి పుంజం.
నమాజు సృష్టికర్త అయిన అల్లాహ్‌ా విశ్వాసులను అనుగ్రహించి ప్రసాదించిన అత్యద్భుత బహుమానం.
నమాజు అల్లాహ్‌ తన ప్రియ ప్రవక్తని సప్తాకాశాలపైకి (మేరాజ్‌ ద్వారా) పిలిపించుకుని మరీ ప్రసాదించిన అమూల్య వరం.
నమాజు కన్నులకు చల్లదనాన్నిస్తుంది. ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా అంటుండేవారు: ”ఖుర్రతు ఐనీ ఫిస్సలాతి” – నా కంటి చలువు నమాజులో ఉంది.
నమాజు హృదయానికి శాంతిని, స్వస్థతను, నెమ్మదిని చేకూర్చుతుంది. అందుకే కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) కలత చెందినప్పుడల్లా ”యా బిలాల్‌ అరిహ్‌నా బిస్సలాత్‌” – ఓ బిలాల్‌! నాకు నమాజు ద్వారా నిమ్మళాన్ని చేకూర్చు” అంటుండేవారు.

నమాజు గురించి ప్రళయ దినాన మొట్టమొదట ప్రశ్నించ బడుతుంది.
నమాజు ఉపాధిని లాక్కువస్తుంది.
నమాజు అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది
నమాజు ఏకాగ్రతను, దైవభక్తిని, పాప భీతిని, స్వర్గ ప్రీతిని పెంపొందిస్తుంది.
నమాజు మనిషి యొక్క బలహీనతల వల్ల జరిగే చిన్న పాపాల మన్నింపుకు కారణమవుతుంది.

సోదరసోదరీమణలారా! ఇలా నమాజు యొక్క ఘనతను గురించి వ్రాసుకుంటూపోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. శోచనీయ మైన విషయమేమిటంటే ఇంతటి మహత్పూర్వకమైన నమాజు విషయంలో ముస్లింలు ఏమరుపాటుకు గురై ఉన్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా నమాజును వదలి ముస్లింలు మానసికంగానూ, శారీరకంగానూ, పారలౌకికంగానూ నష్టపోతున్నారు.
సోదరులారా! మేలుకోండి. వేళకు నమాజు చేయండి. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇహలోకాన్ని వీడిపోయే చివరి ఘడియల్లో కూడా ముస్లిం సమాజానికి ‘నమాజు, నమాజు’ అనే సెలవిచ్చారు. అంటే నమాజు గురించి శ్రద్ధ వహించండి, నమాజును విడువకండి అని ప్రవక్త (స) చెప్పదలిచారు. ప్రవక్త (స)ను ప్రాణప్రదంగా ప్రేమించే ముస్లిములారా! ప్రవక్త (స) చివరి పలుకులను మీ హృదయాలలో నాటండి. నమాజును వదలకండి. చూడండి అల్లాహ్‌ ఏమంటున్నాడో!
”ఆ నమాజీలకు వినాశనం తప్పదు, (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు (ఒకవేళ నమాజు చేసినా) ఇతరులకు చూపటానికి చేస్తారు”’. (అల్‌ మావూన్: 4-6)

Related Post