నమాజ్‌ మేరాజ్‌ కానుక

  ఇస్లాం ధర్మానికి రెండవ మూల స్తంభం నమాజ్‌. దైవప్రవక్త (స) మేరాజ్‌ (గగన యాత్ర) చేసిన రాత్రి ఆయనపై నమాజ్‌ విధిగా చేయబడింది. దీని గురించి హదీసులలో ఈ విధంగా వివరించడం జరిగింది.
  హజ్రత్‌ అనస్‌ బిన్‌ మాలిక్‌ (రజి) కథనం: దైవప్రవక్త (స) మేరాజ్‌ (గగన యాత్ర) చేసిన రాత్రి ఆయనపై యాభై నమాజులు విధిగా చేయబడ్డాయి. తర్వాత అవి తగ్గుతూ తగ్గుతూ చివరికి అయిదు నమాజులుగా మిగిలాయి. అప్పుడు దేవుని తరఫు నుండి ఈ విధంగా ప్రకటించబడింది: ”ఓ ముహమ్మద్‌! నేను ఆడిన మాట తప్పేవాణ్ణి కాను. నీ అనుచర సమాజానికి ఈ ఐదు నమాజులకు బదులుగా యాభై నమాజుల పుణ్యం లభిస్తుంది”.(అహ్మద్‌, తిర్మిజీ)
నమాజ్‌ ఆదేశం
నమాజ్‌ గురించి అల్లాహ్‌ా ఇలా ఆదేశించాడు: ”మీరు నమాజును స్థాపించండి”.  (దివ్య ఖురాన్ – 2:110)
దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు:  ”నమాజ్‌ ధర్మానికి స్తంభం లాంటిది”.
నమాజు మూలంగా కంటి చలువ ప్రాప్తిస్తుంది
దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”నమాజు మూలంగా నాకు కంటి చలువ ప్రాప్తిస్తుంది”. (అహ్మద్‌, నసాయి)
  దేవుని దృష్టిలో నమాజ్‌కు ఎంతటి ప్రాముఖ్యం ఉందంటే ముస్లిం సమాజానికి దాని గురించి బోధించటానికి ఆయన హజ్రత్‌ జిబ్రయీల్‌ను దైవప్రవక్త (స) వద్దకు పంపాడు. దైవాజ్ఞ మేరకు జిబ్రయీల్‌ దైవప్రవక్త (స)కు నమాజు స్వరూప స్వభావాల గురించి వివరించారు. ఆ తర్వాత దైవప్రవక్త (స) జిబ్రయీల్‌ తనకు నేర్పిన విధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా, నియమిత కాల వ్యవధుల్లో నమాజును ఆచరిస్తూ వచ్చారు. అంతే కాదు….
”మీరు ఏ విధంగానయితే నన్ను నమాజు చేస్తుండగా చూశారో, ఆ విధంగానే మీరూ నమాజ్‌ చేయండి” అని తన అనుచర సమాజానికి తాకీదు కూడా చేశారు. (బుఖారీ)
కనుక మనం చేసే నమాజ్‌ దైవప్రవక్త (స) సూచించిన విధానానికి, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అది దేవుని సన్నిధిలో స్వీకృతిని పొందగలుగుతుంది.
  దైవప్రవక్త (స) సమక్షంలో ఒక వ్యక్తి ‘తాదీలె అర్కాన్‌’ను (నమాజ్‌ను పూర్తిగా నింపాదిగా నెరవేర్చటాన్ని) పాటించకుండా నమాజ్‌ చేశాడు. దైవప్రవక్త (స) అతనితో ”నువ్వు తిరిగి నమాజ్‌ చెయ్యి. ఇందాక నువ్వు చేసిన నమాజ్‌ నెరవేరలేదు” అన్నారు. ఆ వ్యక్తి మూడు సార్లు అదే విధంగా నమాజ్‌ చేశాడు. మూడుసార్లూ దైవప్రవక్త (స)   అతన్ని ఉద్దేశించి అదే మాట అన్నారు. ‘నీ నమాజు నెరవేరలేదు. తిరిగి నమాజు చెయ్యి’. ఆఖరికి అతను ‘దైవప్రవక్తా! నాకు ఇంతకన్నా బాగా నమాజ్‌ చేయటం రాదు. మీరే నాకు నమాజ్‌ చేసే పద్ధతిని బోధించండి’ అని విన్నవించుకున్నాడు.
 అప్పుడు దైవప్రవక్త (స) ఇలా బోధించారు: ”నువ్వు నమాజ్‌ చేయదలచుకున్నప్పుడు ముందు చక్కగా వుజూ చేసుకో. తర్వాత ఖిబ్లా దిశకు అభిముఖంగా నిలబడి ‘అల్లాహు అక్బర్‌’ అను. తర్వాత ఫాతిహా సూరా పఠించు. ఆ తరువాత ఖుర్‌ఆన్‌లో నీకు గుర్తున్న సూరా గానీ, వాక్యం గాని చదువు. ఆ తర్వాత నింపాదిగా రుకూ చెయ్యి. తిరిగి నింపాదిగా లేచి నిలబడు, తర్వాత నింపాదిగా సజ్దా చెయ్యి. తిరిగి సజ్దా నుండి నింపాదిగా లేచి కూర్చో”.
  వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”రెండవ రకాతు కోసం నిటారుగా లేచి నిలబడు. ఆ తర్వాత మొదటి రకాతులాగే మిగతా రకాతులు కూడా పూర్తి చేసుకో. ఆపై తషహ్హుద్‌ పూర్తి చేసినాక (మెడ త్రిప్పి) సలాం చెయ్యి”. అని దైవప్రవక్త (స) ఆ వ్యక్తికి ఉపదేశించారు. (బుఖారీ – ముస్లిం)
‘తాదీలె అర్కాన్‌’ను పాటించకుండా కాకి పొడిచినట్టు తొందర తొందరగా నమాజ్‌ చేయటాన్ని దైవప్రవక్త (స) వారించారు, (నసాయి, అబూదావూద్‌)
నమాజ్‌ ఘనత
నమాజ్‌ ఘనతా విశిష్ఠతల గురించి వివరిస్తూ దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”మీలో ఎవరి ఇంటి ముందయినా సెలయేరు ప్రవహిస్తూ ఉందనుకోండి. ఆ ఇంటి అతను ఆ సెలయేరులో ప్రతి రోజూ అయిదు సార్లు స్నానం చేస్తూ ఉంటే, అతని ఒంటి మీద మురికి మిగులుతుందా?”
అందుకు అనుచరులు ”లేదు. అతని శరీరం మీద ఎలాంటి మురికీ మిగిలుండదు” అని బదులిచ్చారు. అప్పుడు దైవప్రవక్త (స) ”ఐదు పూటల నమాజు సంగతి కూడా అంతే. అల్లాహ్‌ా వాటి మూలంగా పాపాలను తుడిచి పెట్టేస్తాడు” అని చెప్పారు.
 దైవప్రవక్త (స) మరో సందర్భంగా ఇలా అన్నారు: ”ప్రతి నమాజు దాని క్రితం నమాజు వరకు, ప్రతి జుమా మరో జుమా వరకు, రమజాను మాసం – సంవత్సరం పొడుగునా జరిగే పాపాలకు పరిహారం అవుతుంది. అయితే అందుకోసం కబాయెర్‌లకు (ఘోర పాపాలకు) మాత్రం దూరంగా ఉండాలి”.

Related Post