మీ ప్రభు వైపునకు మరలండి

one_way_to_heaven_wallpaper

  అబ్దుల్ అజీజ్ 

 తల్లిదండ్రులు, బంధుమిత్రులు, పొరుగువారు, అతిథుల పట్ల సద్వ్యవహారం కలిగి ఉండండి. ఒకవేళ జనాలు మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించినా మన్నింపుల వైఖరిని అవలంభించండి. అసభ్యంగా వ్యవహరిస్తే హుందాగా సలాం చేసి తప్పుకోండి. ఎట్టి స్థితిలోనూ ఎవ్వరితోనూ కయ్యానికి కాలు దువ్వకండి. సిగ్గుమాలిన పోకడల జోలికి వెళ్ళకండి. సారాయి, జూదం, వ్యభిచారం, పాచికల జోస్యం సమాజాన్ని భ్రష్టు పట్టించే, సంసారాన్ని నట్టేట ముంచే మహా భయంకర వ్యసనాలు. వీటికి దూరంగా మసలుకోండి. ఇదంతా ఎక్కడ నేర్చుకుని చెబుతన్నాడు? అంటారా-; ఇస్లాం ధర్మం నాకు నేర్పిన నైతిక విధానం ఇది. ఇది అన్నీ మతాల్లో ఉన్న అంశాలే కదా అని మీరు అనవచ్చు. నిజమే-, కానీ ఇస్లాంలో ఇలాంటి సమాజానికి పనికివచ్చే హితోక్తులు పరిపూర్ణంగా ఉన్నాయి అని నేనంటాను.
  ఒకప్పుడు నేనూ అందరిలా ఇస్లాం అంటే ఒక ప్రాంతానికి, భాషకి సంబంధించిన మతం అని, అల్లాహ్‌ అంటే కేవలం ముస్లింల దేవుడని, ఖుర్‌ఆన్‌ అంటే ఏదో కొద్దిమంది మత విశ్వాసాలకు సంబంధించిన గ్రంథమని, మహా ప్రవక్త ముహమ్మద్‌ అంటే  అరబ్బు ప్రాతానికి పరిమితమైన ప్రవక్త అని, చివరికి ముస్లిలు అంటే మహమ్మదీయులని (ముహమ్మద్‌ ప్రవక్తను ఆరాధించేవాళ్ళని) అనుకునేవాణ్ణి. కానీ నా అభిప్రాయం తప్పని పుస్తకాలు చదివిన మీదట తెలిసింది. మహా ప్రవక్త (స) వారి జీవిత చరిత్ర ద్వారా మనిషి ఎలా జీవించాలో తెలుసుకున్న నేను, ఖుర్‌ఆన్‌ గ్రంథ పారాయణం ద్వారా జీవితం – జీవితంలోని కష్ట సుఖాలు, మరణం-మరణం తర్వాతి జీవితం పరలోకం, తీర్పు దినం, స్వర్గం, నరకం మొదలైనవి గ్రహించగలిగాను.
  ‘తమ పాపాలపై పశ్చాత్తాపం చెందేవారిని పరిశుద్ధతను, పరిశుభ్రతను పాటించేవారిని అల్లాహ్‌ అమితంగా ప్రేమిస్తాడు”.
 (అల్‌ బఖరా: 222) అన్న మోక్ష సౌరభాలు నిండిన శుభవార్త ఖుర్‌ఆన్‌ లోనిదే. ఇస్లాం కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలో కూడా నేర్పుతుంది అంటే మీరు నమ్ముతారా? చూడండి!
1) మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ముందు ఎడమ కాలు పెట్టి లోనికి ప్రవేశిస్తూ ”అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్‌ ఖుబ్‌సీ వల్‌ ఖబాయిస్‌” అనాలి.
2) నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోగానీ, నీడనిచ్చే చెట్ల క్రిందగానీ, జనులు నడిచివెళ్ళే రహదారుల్లోగానీ, మల మూత్ర విసర్జన చేయకూడదు.
3) పిడకలతో, ఎముకలతో ఇస్తిన్జా చేయకూడదు. అలాగే రంద్రాల్లో, బిలముల్లో మూత్రం పోయకూడదు.
4) మైదాన ప్రదేశాల్లో కాలకృత్యాలకై వెళితే ఏదైనా వస్తును తెరగా పెట్టుకోవాలి.
5) అనివార్య పరిస్థితిలో తప్ప ఎప్పుడూ మూత్ర విసర్జన కూర్చోనే చేయాలి.
చూశారుగా ఇస్లాం చూపే జీవన సంవిధానం. త్వరపడిండి. నిజ ధర్మమేదో తెలుసుకోండి. మీ ప్రభు వైపునకు మరలిపోండి. ఆయన ప్రసన్నతను చూరగొని స్వర్గవనాలలో హాయిగా విహరించండి.

Related Post