కర్తవ్యం పిలుస్తోంది… కదలి రండి!

Originally posted 2013-08-15 05:54:36.

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

మా నవ పురోగమన పోరాటం అనేక రూపాల ఆధారంగా జరిగింది. అజ్ఞానం నుండి, భయం నుండి, దోపిడి నుండి, పెత్తనం నుండి, నియంతృత్వ భావన నుండి, బానిసత్వం నుండి, అణచివేత నుండి విముక్తి నొందడానికి కృషి చేస్తూనే ఉన్నాడు మనిషి. ఈ కార్య సాధన కోసం అసాధారణ త్యాగాలు చేస్తూ వచ్చాడు మనిషి. విశ్వంలోని జనవాహిని సమానంగా గౌరవించబడాలని, ఆదరించబడాలని అభిలషించారు మానవోత్తములు కొందరు. ఆ విధంగా లోకవాసులంతా సమరస భావంతో విరాజిల్లాలని, వారిలో సోదర భావం వెల్లి విరియాలని ఆకాంక్షించారు ఆ పురుషోత్తములు.

ఈ ఆశయ సిద్ధి కొరకు పురుషులతోపాటు అపూర్వ త్యాగాలు చేసిన ఆడపడుచులు సయితం అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారిలో కొందరు ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక పరమైన త్యాగాలకు పేరెన్నికగంటే మరి కొందరు కార్య దీక్షకు, పశ్రాంత చిత్తానికి పత్రీకలయ్యారు. కొందరు అసమాన నాయకత్వ లక్షణాలలో పస్రిద్ధి పొందగా, ఇంకా కొందరు కమ్రశిక్షణకు, ధైర్యసాహసాలకు మచ్చుతునకలయ్యారు.
ఈజిప్టులో ప్రవక్త మూసా (అ) ఫిరౌన్‌ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చినప్పుడు గాని, పాలస్తీనాలో ప్రవక్త ఈసా (అ) అంధానుసరణకు వ్యతిరేకంగా గళం విప్పినప్పుడు గాని, అరేబియాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) విశ్వ మానవ సోదరభావంతో కూడిన సత్య శంఖాన్ని పూరించినప్పుడుగాని పురుషులతోపాటు స్త్రీలు సయితం సహజంగానే స్పందించారు. తమవంతు సహాయం అందించారు. నిరుపమాన త్యాగాలూ చేశారు. పురుషుల్లాగే స్త్రీలూ అమరగతి నొందారు. సంఘ బహిష్క రణకు, ఏలికల వైషమ్యానికి బలయ్యారు. ఇలా తమ ధన, మాన, ప్రాణ త్యాగాలతో లోకశాంతి సిద్ధిస్తుందని పురుషులు మాదిరి వారూ కలలు కన్నారు. ఆ కలల్ని నిజం చేసే దిశలో పయనించి పరమోన్నత ప్రభువు సన్నిధికి పయన మయిన పడతులెందరో! లోకశాంతికి సంబంధించిన గురుతర బాధ్యతలను స్వీకరించడానికి వారు ఏనాడూ వెనుకాడి ఎరుగరు. సమరస భావం సమానత్వం, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కరుణ, దయ, జాలి, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం – తౌహీద్‌ ప్రాతిపదికలపై ఆధునిక సత్సమాజాన్ని నిర్మించాలనే తపనలో అలనాటి సుమతులు, సదయులు అహరహం శ్రమించారు. విశ్వ మానవ కళ్యాణం నిమిత్తం అంటే- వర్గ, వర్ణ, ప్రాంత, భాష, జాతి తర తమ భేదరహిత సమరస సమాజాన్ని వారు ఆకాంక్షించారు. ఈ మహోన్నత లక్ష్య పునాదులు నూహ్‌ా ప్రవక్త నాటి నుండే పాదులు వేసుకున్నాయన్నది గమనార్హం.
కూపస్థ మండూకాల్లా పడివున్న ఇస్రాయీల్‌ సంతతి ప్రజలు ప్రవక్త మూసా (అ) పిలుపుతో భావ దారిద్య్రం నుండి తేరుకొని స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశించారు. అప్పటికే వారిపై ఎన్నో ఆంక్షలు ఉండేవి. 70 వేల పసికందుల్ని కోల్పోవాల్సి వచ్చిన నికృష్ట సందర్భం కూడా అదే. అయినా వారు అధైర్య పడలేదు. కరుణ ఆభరణాల్లో సంకల్పాల వజ్రాలు పొదిగి, కూర్మి కవచాలు తొడిగి సమర క్షేత్రంలో సమరస స్ఫూర్తితో దూసుకుపోయారు. స్రీలు సయితం సమాజంలోని సగ భాగం గనుక కర్తవ్య పరాయణత పారీణతతో ప్రతి ఒక్క పడతిలో చైతన్యం పెల్లుబికింది. జాతి విముక్తి కోసం పోరాటపటిమను కొన సాగించమని కొండంత ధైర్యాన్నిచ్చి సాగ నంపారు అలనాటి వీర నారీమణులు.

అప్పట్లో త్యాగాలు చేసిన మహిళా లోకంలో ఆసియా బిన్తె ముజాహిమ్‌కు గొప్ప ఖ్యాతియే లభించింది. అప్పటి నిరంకుశ చక్రవర్తి ఫిరౌన్‌కు స్వయాన భార్యగా, ఈజిప్టు దేశానికే మహారాణిగా సకల భోగభాగ్యాలు అనుభవించే వీలు ఉన్నప్పటికీ ఆమె వాటిని ఖాతరు చేయలేదు. తన చేతుల మీదుగా, తన ఒడిలోనే పెరిగి పెద్దయిన మూసా ప్రవక్త సత్య పిలుపుని విని ఉత్తేజితురాలై తన సువర్ణ సౌధాన్ని, అందలి పసిడి ఆభర ణాల్ని, వజ్ర వైఢూర్యాలు నిండిన జీవితాన్ని సన్యసించి సత్య పక్షం వహిం చింది. సత్య ధర్మ పరివ్యాప్తికి స్వయంగా ఫిరౌన్‌ రాజ భవనంలోనే పాదులు వేసి, అసత్య నిర్మూలనకై అవిరళ కృషి సలిపి త్యాగ ధనురాలయింది. పర్యవసానం చాలా భయంకరంగానే పరిణమించింది. సత్యాన్ని విడనాడమని షైతాన్‌ స్వభావుడు ఫిరౌన్‌ ఎంత ఒత్తిడి చేసినా, చివరికి సజీవంగానే శిలువపై వ్రేలాడదీసి అవయవాల్ని ఒక్కొక్కటిగా కోసినా, గుండెల్లో గునపాలు గుచ్చినా , తలలో మేకులు కొట్టినా తొణకక, పట్టు సడలని విశ్వాసంతో ధర్మోన్నతి కోసం ‘రబ్బిజ్‌అల్లీ ఇన్‌దక బైతన్‌ ఫిల్‌ జన్నహ్‌’ (ప్రభూ! స్వర్గంలో నా కోసం నీ తరఫున ఒక నిలయాన్ని నిర్మించు) అంటూ తుది శ్వాస విడిచింది. ఆ విధంగా అలనాటి అనువంశిక దౌర్జన్యంపై తన చెర్నాంకోలును ఝుళిపించింది. అలా అనితర సాధ్య ధైర్యసాహసాల్ని, మొక్క వోని సహనాన్ని పదర్శించిన ఆ మహిళా మూర్తిని సత్య దేవుడైన అల్లాహ్‌ ప్రశంసిస్తూ మానవ జాతి మనుగడకు మణి కుసుమంగా పేర్కొన్నాడు:

”మరి అల్లాహ్‌ా విశ్వాసుల కొరకు ఫిరౌను భార్యను ఆదర్శంగా పేర్కొంటు న్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది: ‘నా ప్రభూ! నా కోసం నీ దగ్గర – స్వర్గంలో – ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని దాష్టికా న్నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు”. (తహ్రీమ్: 11)

అదే రాజ మహలులోని పని మనిషి కూడా తక్కువేమీ కాదు. ఫిరౌన్‌ రాజ భవనంలో స్వయాన అతని ముద్దుల కూతురికి సేవకురాలిగా పని చేసే విశ్వాస మహిళ ఆమె. స్వేచ్ఛా పిపాసతో రగిలిపోయిన, సత్య జ్యోతి ప్రభావంతో వెలిగిపోయిన అబలగా భావించబడే సబల ఆ స్త్రీ మూర్తి. ‘అన రబ్బుకు ముల్‌ ఆలా’ అన్న ఫిరౌన్‌ దురహంకార గర్జనతో స్తబ్ధత ఆవరించిన ఆ సమాజంలో సత్యాగ్ని కణాన్ని రాజేసిన ఆ మాతృమూర్తి విశ్వాసం శక్తివంత మైనది. అసలే బానిసరాలు. ఆపై అబలయి కూడా ఆమె ప్రదర్శించిన సాహసం, సమయస్ఫూర్తి సాటి లేనిది. ఫిరౌన్‌ రాజభవనంలో సత్య శంఖం పూరించింది. ఆమె సత్య ప్రచార శైలికి ముగ్దురాలయి ‘ఆసియా బిన్తె ముజా హిమ్‌’ ఇస్లాం స్వీకరించింది. ఇది తెలుసుకున్న ఫిరౌన్‌ ఆమె నలుగురు బిడ్డల్ని సలసలకాగే నూనెలో పడేసి వేయించేశాడు. ఆ నలుగురిలో ఒకడు పాలు త్రాగే పసికందు కూడా ఉన్నాడు.

అయినా ఆమె తొణకలేదు సరికదా ”నన్ను సయితం ఈ నూనెకి ఆహుతి చేశాక మా అందరి ఎముకల్ని ఒకే చోట సమాధి చెయ్యండి. రేపు ప్రళయ దినాన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ సద్వచనం పలుకుతూ మేమంతా సమాధి నుండి లేస్తాము’ అని ఘంటాపథంగా ప్రకటిం చింది. ఆమె చూపిన ధైర్యసాహసాల్ని మెచ్చుకుంటూ మేరాజ్‌ సందర్భంగా ఏడు ఆకాశాలపైన దైవ దూతల నాయకుడు జిబ్రయీల్‌ ద్వారా ప్రవక్తలందరి నాయకుడైన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి ఆమె దృష్టాం తాన్ని విన్పించాడు దేవుడు. అట్టి ‘సత్య బాంధవి’ అయిన ఆ వీర వనిత చరిత్రలో చిరస్మరణీయురాలయింది.

ఆ పరంపరలో పరమ పవిత్రమైన పుణ్యస్త్రీ అయిన జైనబ్‌ (ర)నూ విస్మరిం చలేము. ఆమె మహా నిరాడంబర జీవి. సిగ్గు సిరులే ఆమె ఆభరణాలు. నిస్వార్థ సేవే ఆమె స్వరూపం. సాత్విక ప్రేమానురాగాలే ఆమె నైజం. అనాథ బాలలు, వితంతువులు, నిరుపేదలు అభాగ్యజీవులే ఆమె అనుఁగు సంతానం. ప్రజా సేవే ఆమె ఊపిరి. సంస్కరణా భిలాషే ఆమె మూల ధనం. సత్య ధర్మోన్నతియే ఆమె ప్రాణం. ఆ సత్య వ్యవస్థపై ఆమెకు ఎనలేని అభిమానం. మక్కా మదీనాల్లోని నిరుపేదలతోనే గడిపేది. దీన జనంపై తప్ప మరి దేని పైనా ఆమెకు మమకారం లేదు. వారి క్షేమం కోసమే అహరహం శ్రమించేది. వారి ధ్యాసలోనే ఆమె అసువులు బాసింది. ఇటు ప్రజా సేవ, అటు దైవ సేవలో సమతౌల్యంతో జీవితాన్ని సార్థకం చేసుకుని ‘ఉమ్ముల్‌ మసాకీన్‌’ అన్న ప్రశంస స్వయానా ప్రవక్త (స) నోట పొందిన ధన్యజీవి విశ్వాసుల మాత హజ్రత్‌ జైనబ్‌ (ర).

ఆ విషయానికొస్తే – సత్యోద్యమంలో, విద్యార్జనలో, ప్రవక్త (స) వారి ప్రవచ నాల్ని ప్రజలకు ప్రబోధించడంలో హజ్రత్‌ ఆయిషా (ర) మహా ధీరోదాత్త. దాదాపు ”2210” హదీసలను ఉల్లేఖించిన ఘనత స్త్రీలలో ఆమె ఒక్కరికే దక్కింది. ప్రవక్త (స) వారి సత్య సూక్తులకు, పరలోక మోక్ష సిద్ధాంతాలకు ప్రభావితురాలయిన ఆమె తర్వాతి కాలంలో ‘జమల్‌ రణ రంగం’లో పాల్గొన్నారు. అప్పట్లో ధార్మిక ఫత్వాలు జారీ చేసిన ధర్మ పండితురాలు. అనేక మంది సహాబాలు ఆమె వద్ద శిష్యరికం పొంది ధార్మిక విద్యార్జన చేసేవారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ పరంపరలో హజ్రత్‌ మర్యమ్‌ (అ), హజ్రత్‌ ఖదీజా (ర), హజ్రత్‌ ఫాతిమా (ర), హజ్రత్‌ అస్మా (ర), హజ్రత్‌ ఉమ్మె సలమా (ర), హజ్రత్‌ ఉమ్మె తలహా (ర) లాంటి వారెందరో ఉన్నారు. వీరంతా ‘ప్రకృతి ధర్మం’ నుండి ప్రేరణ పొందిన నారీమణులే. ఇస్లాం మెచ్చిన వనితలే.

కాలంతోపాటే విలువలు కూడా మారినాయి. అన్ని రంగాలలోనూ కల కంఠి ముందంజ వేస్తున్నప్పటికీ ఆమె కంట వొలికే కన్నీళ్ళు మాత్రం తగ్గటం లేదు. కారణం ఆధునిక దోపిడీ! నవ నాగరికత పేరిట జరిగే ఎక్స్‌పాయిటే షన్‌!! సబ్బు బిళ్ళ మొదలుకుని షేవింగ్‌ బ్లేడు అమ్మకం వరకు ప్రతి దానికీ మాననీమణి సిగ్గు సిరిని అంగడీలో ప్రదర్శించే మగ మారాజు స్వార్థానికి ‘ఆమె’ అవలీలగా బలైపోతున్నది. తల్లి కడుపులో ప్రాణం పోసుకుంటోందని తెలిసిన క్షణం నుంచే ‘భ్రూణ హత్య’ ఆలోచనతో మొదలయ్యే ఈ ఎక్స్‌పాయిటే షన్‌ ఆమె జీవితంలోని అన్ని థలలోనూ జరుగుతున్నఇద. దానికి బదులు మానవ మనుగడలో ఆమె ‘సగమ’ని, సగాలు రెండూ ఒకటైతేనే గాని జగానికి ఓ నిండుదనం రాదని గ్రహించే సహృద యత పెంపొందాలి. కోమలాంగికి ఆమె కార్య క్షేత్రంలో నిరాటంకంగా పురోగ మించే వ్యవస్థను ఏర్పరచాలి. అదే మహిళాభ్యుదయం. అదే మహిళాభిరామం!!

మన భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషులు సమానులని 1950లో చట్టం అమల్లోకి వచ్చినా అది కాస్తా పురుషా హంకార చుట్టమై కూర్చుంది. 1961లో వరకట్న నిషేధం చట్టం వచ్చినా, 1956లో వితంతు వివాహాలకు వీలు కల్పిస్తూ శాసనం పుట్టినా, సుమారు 200 సం నాడు సతి సహగమన వ్యతిరేక చట్టం అమల్లో వచ్చినా ఇంకా స్త్రీలపై అనేక విధాల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం శుల్కం చెల్లించి కన్యల్ని అమ్మే, కొనేవారు, ప్రస్తుతం వరకట్నం ఇచ్చి భర్తల్ని కొంటున్నారు, అమ్ముకొంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లోనూ బలి పశువు స్త్రీయే.
చివరిగా ఒక మాట చెప్పక తప్పదు. ఎవరు సంకెళ్ళలో బంధించబడ్డారో వారే బంధ విముక్తికై స్థిర చిత్తంతో పోరాడాలి. ‘స్త్రీ స్వర్గానికి సోపానం’ అని ప్రవక్త మహాశయుల వారు ప్రకటించి ఆ ఆశయ సిద్ధికై ప్రజల్లో చైతన్య కణాల్ని రాజేసినట్లే స్త్రీలు సయితం తమ శక్తి యుక్తుల్ని వాడి స్వేచ్ఛాసమానత్వాన్ని సాధించుకునే దిశగా పయనించి సమాజాన్ని, దేశాన్ని అభ్యుదయ పథాన నడిపించిన నాడే భవిష్యదర్శనం సుఖ శాంతులకాలవాలమవుతుంది. ఇక్కడ విస్మరించరాని విషయమేమిటంటే స్త్రీల భాగస్వామ్యం లేనిదే సమాజ పురోగాభివృద్ధి అసాధ్యం. పురుష సహకారం లేనిదే అది సాధ్యం అవదు. అంటే- స్త్రీ లేని పురుష ప్రపంచాభివృద్ధి బలహీనపడితే, పురుషుడు లేని స్త్రీ సమాజ అభ్యుదయం కుంటుపడుతుంది. సంసార రథం సాఫీగా సాగదు. సంతానం సత్పౌరులుగా ఎదగరు. ఈ మటుకు విలువలు, బాధ్యతలు మృగ్యమైన ఏ దేశం అభివృద్ధిని పొందలేదు. ఈ పరిణామ ప్రక్రియలో స్త్రీల పాత్ర ఏపాటిదై ఉండాలి? అంటే- 1) స్వయం ఉద్ధరణ. 2) సమాజం యావత్తులో పరివర్తనం తీసుకురావాల్సిన బాధ్యత.

ఆ మేరకు తల్లులుగా వారు ముందు తమ కుటుంబాల్లోనే సమరస భావానికి పునాదులు వేయాలి. పిల్లల్లో చిన్న నాటనే విశాల భావాన్ని ప్రోది చేయాలి.. స్త్రీ పురుషుల విషయంలో మహా ప్రవక్త (స) చేసిన హితవుల్ని పిల్లలకు బాల్య థ నుండే నూరిపోయాలి. వారిలో తమ చెల్లి, తల్లి, పిన్నీల పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని పెంపొందించాలి. సత్య నిరతి, సోదర ఆవం, ప్రేమ, కరుణ, దయ, క్షమ, పరోపకార పారీణత వారిలో నిత్య గుణాలుగా రూపొందాలి. ‘తల్లి ఒడి ప్రాథమిక బడి’ గనుక – తల్లుల ఈ శిక్షణ – సంతాన వ్యక్తిత్వాన్ని సంరక్షిస్తుంది. కుటుంబంలో శాంతిని నింపుతుంది. ఆ దరిమిలా సమాజంలో, దేశంలో శాంతి, అభ్యున్నతి, ప్రగతి, పురోగాభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయల్లా విరాజిల్లుతుంది. స్త్రీలందరూ తమ ఈ కర్తవ్యాన్ని గుర్తించి అహరహం పరిశ్రమించినప్పుడే విశ్వ జనులందరికి సౌభాగ్యం ఇనుమడిస్తుంది. అందు నిమిత్తం కర్తవ్యం మహిళా లోకాన్ని పిలుపునిస్తోంది! స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా స్రీలందరూ సహజంగానే స్పందిస్తారని ఆశిస్తూ….

Related Post