ఆలోచనాపరులు ఆలోచిస్తారని…

ఆలోచనాపరులు ఆలోచిస్తారని…

జ్ఞాన సముపార్జన మరియు దాని మార్గాల విస్తరణ, విశ్వం లోతుల పరిశీలన నేటి మన కర్తవ్యం. ఆవశ్యం కూడా. కానీ మానవ ప్రపంచం సాధించిన విజయాలను చూసుకొని మురిసి పోవడం, మోసపోవడం సరి కాదు. మనిషి సాధించిన మొత్తం ప్రగతి, వికాసం, విజ్ఞానం – సర్వ జ్ఞాని అయిన అల్లాహ్ జ్ఞాన నిధి నిక్షేపంలోని ఒక్క చుక్కకి కూడా సమానం కాదు.

గత జాతులవారి దగ్గరకు వారి ప్రవక్తలు సూక్తులు, సూచనలు తీసుకు వచ్చినప్పుడు వారు తమ దగ్గరున్న (స్వయంకృత) జ్ఞానంలో తలమునకలయి ఉన్నారు. చివరికి వారు తాము అపహాస్యం చేసిన విషయాల ఉచ్చులోనే పడిపోయారు. (గాఫిర్,మోమిన్: 83)

మానవుని వినాశకర చర్యలు భూమి గుండెలలో భయంకర విస్ఫోటనాలు రేపుతున్నాయి. సాగరాల్లో చమురు తెట్టుకట్టిన విషపు అలలను లేపుతున్నాయి. మహాటవులను ఘోర ఎడారులుగా మారుస్తున్నాయి. ఈ భూమిని ఫలపుష్పభరితంగా, సారవంతంగా, నివాసయోగ్యంగా మలచిన అనేక జీవజాతుల ఉసురు తీస్తున్నాడు మనిషి. వన్యప్రాణుల ఆవాసాలు చెదిరి మనిషికి, వనచరాలకు మధ్య సామాజికదూరం తగ్గింది. ఆపాపమే కరోనా రూపంలో నేడు మనిషికి మనిషికి మధ్య అనివార్యమైన భౌతికదూరాన్ని, ఎడబాటును సృష్టించింది.

కరోనా ఉత్పాతం మానవజాతి అహంకారాన్ని కూకటివేళ్ళతో కూల్చివేస్తున్నది. ‘ఈ భూమి అంతా నాదే, నేనే సర్వధికారిని, ప్రతి చెట్టూ, ప్రతి పిట్టా నాకు దాసోహం అనవలసిందే’ అని విర్రవీగిన మానవ జాతి, నేడు భయవిహ్వలమై మోకాళ్ళమీద కూలబడి రోదిస్తున్నది. స్వార్థం, అహంభావం, విచ్చలవిడి సుఖం, అధికార దర్పం, సామ్రాజ్య కాంక్ష, వెరసి మనిషి చేసిన అఘాయిత్యాలు, క్షమించరాని పాపాలు నేడు తిరగబడి, వెంటాడి వెంటాడి, వేటాడుతున్నాయి. స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, వేల సంవత్సరాల విజ్ఞానం, నవ నాగరిక జీవనం అంతా ఒక సూక్ష్మక్రిమి ముందు కుంచించుకుపోయి తల దించింది. ఒక నిష్ఫల, నిష్టుర వేదన, శవాలు కాలుతున్న కమురువాసన ప్రపంచాన్ని ఆవరించింది. సమస్త మానవ ప్రపంచాన్ని తన చేతులలోకి తీసుకొని, దేవుడు ఒక్క చెంపదెబ్బ కొడితే ఏమవుతుందో ఇవ్వాళ మనిషి అనుభవంలోకి వస్తున్నది. వర్తమానం సుడిగుండమై సుళ్ళు తిప్పుతున్నది. భయంకర విపత్తులను గర్భంలో దాచుకున్న భవిష్యత్తును తలుచుకుంటే మృతువు దూత మరణ శంఖం మనిషి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది.

మీకు ఏ ఆపద వచ్చినా అది మీ చేజేతులా తెచ్చిపెట్టుకున్నదే అవుతుంది. మీరు చేస్తున్న అనేక పొరపాట్లను ఆయన ఇట్టే క్షమించి వదలిపెడ్తున్నాడు. (అయినా మీరు మీ దురాగతాలను మానుకోవడం లేదు.) అయితే మీరు ప్రపంచంలో అల్లాహ్ పట్టు నుండి తప్పించుకొని ఎక్కడికీ పారి పోలేరు.అల్లాహ్ కు వ్యతిరేకంగా మీకు ఎలాంటి సహాయకుడూ, సంరక్షకుడూ లభించడు. (షూరా: 30-31)

భూమిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం. ”నువ్వు ప్రపంచంలో ఒక అపరిచుతునిలా లేదా ఒక బాట సారిలా జీవించు” అన్న అంతిమ దైవ ప్రవక్త (స) మాట మనిషికి బోధ పడినట్లు లేదు. టాల్ స్టాయ్ చెప్పిన ‘ఎంత భూమి కావాలి’ కథ ఇన్ని శతాబ్దాలు గడిచినా మనిషికి కావడం లేదు. ‘అతిథివోలె ఉండి ఉండి, అవని విడిచి వెళ్ళుతాను’ అని కాళోజి పలికిన జీవనవేదం మనిషికి ఇమడలేదు. ఈ భూమిమీద మనిషిగా నువ్వూ ఒక అతిథివే, అధిపతివి కానే కావు. భూమి మనిషి ఒక్కడి కోసం కాదు. సమస్త ప్రాణులతో మనిషి సమష్టిగా భూమిని పంచుకోవాలే. సహజీవన ధర్మాన్ని పాటించాలన్న ఇంగితం ఏనాడో మనిషి కోల్పోయినాడు.

భయం, ఆకలి, ధనప్రాణ, పంటల నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పని సరిగా పరీక్షిస్తాము. అలాంటి స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు “నిశ్చయంగా మేము అల్లాహ్ కు వారము. మరియు నిశ్చయంగా ఆయన వైపుకే పోవలసినవాళ్ళం”అని పలికేవారికి వారి ప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (బఖరః – 155-157)

ఈ భూమి సకలజీవులకు జీవ ధాత్రీ. ప్రతి జంతువును, మొక్కను చరాచరాలన్నిటినీ అల్లాహ్ పోషిస్తున్నాడు.

భూమండలంపై సంచరించే ప్రతి ప్రాణికీ ఉపాధినిచ్చే బాధ్యత అల్లాహ్ పైనే ఉంది. అలాగే ఏప్రాణి ఎక్కడ నివసిస్తుందో, ఎక్కడ (దాని ప్రాణం) భద్ర పరచబడుతుందో కూడా దేవునికి తెలుసు. సమస్త విషయాలు స్పష్టంగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. (హూద్ :6)

పది వేల సంవత్సరాల కింద జంతువుల జనాభాలో మానవులు ఒక శాతం మాత్రమే కాగా, నేడు 32శాతం మేరకు అరణ్యాలలో ఉండే జంతువులను హరిస్తున్నాడు. అరణ్యేతర జంతువులలో 67 శాతం మనిషికి ఆహారం అవుతున్నాయి.

కారణం, విచక్షణా రహితంగా ఏది దాన్ని తినేయడమే. అల్లాహ్ సమస్త మానవాళికి అనుగ్రహించిన జీవన విధానంలో ఏంతో సమతుల్యతను, సహేతుకతను అల్లాహ్ ఉంచాడు. మనిషికి మేలు చేసే ఆహార పానీయాలను మాత్రమే హలాల్ చేశాడు. ఆయన నిషిద్ధం అన్న ప్రతిదీ మానవాళి పాలిట అనర్థదాయకమే, అంతం లేని సంకటాలకు అంకురార్పణమే.

“మీప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెలుపనా” అని వారికిలా చెప్పు:

ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదు.

తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి.

దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము.

నీతిబాహ్యమైన పనుల దరిదాపులక్కూడా వెళ్ళకండి- రహస్యంగానైనా, బహిరంగంగానైనా సరే.

న్యాయప్రాతిపదికపై తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ చంపకండి. మీరు అర్థంచేసుకొని మసలుకుంటారని దేవుడు మీకీ విషయాలు బోధిస్తున్నాడు.

అనాథ బాలలు యుక్త వయస్సుకు చేరుకోనంతవరకు సక్రమ పద్ధతి ద్వారా తప్ప వారి సొమ్ము సమీపానికి పోకండి.

తూనికల్లో, కొలతల్లో పూర్తిగా న్యాయం పాటించండి. ప్రతి వ్యక్తిపై మేము అతను మోయగలిగినంత బాధ్యతాభారమే మోపుతాము.

వ్యవహారం మీ బంధువులకు సంబంధించినదైనా సరే న్యాయంగా మాట్లాడండి.

దేవుని విషయంలో మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. మీరు విషయాన్ని గుర్తుంచుకుంటారని దేవుడు మీకిలా హితోపదేశం చేస్తున్నాడు.

ఇదే తాను నిర్దేశించిన రుజుమార్గమని, మీరు ఈ మార్గానే నడవాలని ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. ఇతరులు చూపే మార్గాలు అనుసరించకూడదని, అలా అనుసరిస్తే వారు ఆయన మార్గం నుండి మిమ్మల్ని తప్పిస్తారని నచ్చజెప్తున్నాడు.

మీరు చెడుల జోలికి పోకుండా భయభక్తులతో మసలుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు. (అన్ ఆమ్ : 151-153)

మానవుని వినాశకర చర్యలు భూమి గుండెలలో భయంకర విస్ఫోటనాలు రేపుతున్నాయి. సాగరాల్లో చమురు తెట్టుకట్టిన విషపు అలలను లేపుతున్నాయి. మహాటవులను ఘోర ఎడారులుగా మారుస్తున్నాయి. ఈ భూమిని ఫలపుష్పభరితంగా, సారవంతంగా, నివాసయోగ్యంగా మలచిన అనేక జీవజాతుల ఉసురు తీస్తున్నాడు మనిషి. వన్యప్రాణుల ఆవాసాలు చెదిరి మనిషికి, వనచరాలకు మధ్య సామాజికదూరం తగ్గింది. ఆపాపమే కరోనా రూపంలో నేడు మనిషికి మనిషికి మధ్య అనివార్యమైన భౌతికదూరాన్ని, ఎడబాటును సృష్టించింది.

కార్పొరేట్ శక్తులు, వాటి బహుళజాతి కంపెనీలు చేస్తున్న భూగర్భదోపిడీ అంతా ఒక చీకటిచరిత్ర. గుత్తపెట్టుబడిదారీ విధానం భూమికి కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని భూమ్యాకాశాలను, సముద్రాలను జయించే ఆయుధంగా అవి మలుచుకుంటున్నాయి .

ప్రజలు చేసిన (అ)కృత్యాల కారణంగా నేలపై, నీటిపై సంక్షోభం ఏర్పడింది. వారికి దేవుడు వారి దుష్కార్యాల పర్యవసానాన్ని చవిచూపేందుకే ఇలా జరిగింది, ఈ శిక్ష వల్ల వారు (తమ దుశ్చర్యలు) మానుకుంటారేమో (చూడాలి). (ప్రవక్తా!) పూర్వం గతించిన ప్రజలకు ఎలాంటి గతి పట్టిందో ప్రపంచంలో తిరిగి చూడండని చెప్పు. (రూమ్ : 41-42)

మనిషి చేస్తున్న దారుణాలకు, పెట్టుబడిదారీ దురాశకు వ్యతిరేకంగా నేడు ప్రక్రుతి పోరాడుతున్నది. ఈ ఘర్షణ అనేక వ్యాధి బీజాలను నాటుతున్నది. కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం ఎంత మాత్రమూ కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. అమెరికన్లు ఈ మహమ్మారి విస్తృతిని అంగీకరించలేక పోయారు. దివాంధాలైన గబ్బిలాలనుంచి పుట్టిన ఈ వ్యాధిశక్తిని దివాంధుడైన అంకుల్ శామ్ చూడలేకపోతున్నాడు. భూమి మీదకు ఏ గ్రహాంతరవాసులో దాడికి దిగితే, భూరక్షకులు అమెరికన్లే! అనే అహంకారంతో సినిమాలు తీసిన హాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు చిత్ర నిర్మాణ నిపుణులకు నేడు మానవుని స్వీయాపరాధం లోంచి పుట్టిన ఒక సూక్ష్మక్రిమిని ఎదుర్కోలేని నిస్సహాయత మింగుడుపడుతుందా? దేశదేశాలలో ఆధిపత్యాన్ని చలాయిస్తూ, ధిక్కారమును సైతునా అని, తనను ప్రతిఘటించిన వారు ఏ బంకర్లలో దాక్కున్నా ఈడ్చి చంపిన సామ్రాజ్యవాదానికి ఇప్పుడు కరోనా నుంచి తప్పించుకునే బంకర్లు కావాలి.

వారికిలా చెప్పు: “ఏ మృత్యువు నుండి మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారో ఆ మృత్యువు మిమ్మల్ని కబళించి తీరుతుంది. ఆ తర్వాత మీరు గోచర, అగోచరాలన్నీ ఎరిగిన దేవుని సన్నిధిలో ప్రవేశపెట్టబడతారు. అప్పుడాయన మీరు (ఇహలోకంలో) ఏమేమి చేస్తుండేవారో అంతా మీ ముందు రట్టు చేస్తాడు.” (జుముఅహ్: 8)

ఆరోగ్యం, పర్యావరణ విధానం వేరువేరు కావు. వాతావరణమైనా మన ఆరోగ్యమైనా, మనం భూమిని పంచుకుంటున్న ఇతరజీవుల మీద ఆధారపడి ఉంటాయనేది ప్రాథమికసూత్రం. రోగాలు వచ్చినప్పుడు పరిష్కారాలు వెతుక్కోవడం దప్పైనప్పుడు బావి తోడిన చందంగా కాకూడదు. భయంతో తీసుకునే తత్తరపాటు చర్యలు ఘోర విపత్తులకు సమాధానం కాజాలవు. నిజమైన పశ్చాతాపంతో, వివేకంతో కూడిన విధానం, ధైర్యంతో కూడిన కార్యాచరణ ఇప్పుడు అవసరం. ఇది మానవజాతి మేల్కొనవలసిన సందర్భం. ‘పారాహుషార్’ అనే ప్రకృతి హెచ్చరికను గంభీరంగా యోచించవలసిన క్షణం.

ఘోరమైన ఆ శిక్షకు పూర్వం ఇహలోకంలో కూడా మేము (ఏదో ఒక స్థాయిలో) వారికి శిక్షను చవిచూపిస్తూ ఉంటాము. దీని ద్వారానయినా వారు (తమ ద్రోహబుద్ధి) మానుకుంటారేమో చూడాలి. విశ్వప్రభువు సూక్తులు పఠించి హితోపదేశం చేస్తుంటే, వాటిని వినకుండా ముఖం తిప్పుకునేవాడికంటే పరమ దుర్మార్గుడు ఎవరుంటారు? (అస్సజ్దః – 21-22)

మొక్కుబడిగా కాకుండా, అంతకరణ శుద్ధితో ప్రాయశ్చిత్తం చేసుకొని, ప్రకృతితో సవ్యమైన సకారాత్మకమైన అవిభాజ్యమైన సంబంధాన్ని భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలి. సహజస్థలాల వినాశనాన్ని ఆపాలి. చెట్టూ, చేమ, గుట్ట, పిట్ట అన్నిటినీ వాటిమానాన వాటిని బతకనివ్వాలి. అడవుల్లో పర్వత గుహలలో జంతువులు, చెట్టు మీద గూళ్ళలో పిట్టలు క్షేమంగా ఉంటేనే మనిషి క్షేమంగా ఉంటాడనే సార్వత్రిక దృక్పథం మానవ జీవన గమనాన్ని నిర్దేశించాలి.

మీకు పూర్వం మేము అనేక జాతుల దగ్గరకు ప్రవక్తలను పంపాము. ఆ జాతులు (తలబిరుసుతనం వహించినప్పుడల్లా) మేము వాటిని కష్టాలకు గురి చేశాం, దాని ద్వారా నైనా వారు దీనంగా మాముందు తలవంచుతారన్న ఉద్దేశ్యంతో. ఈవిధంగా మేము వారిని కఠినపరీక్షలకు గురిచేసినప్పుడు వారు మాముందు ఎందుకు దీనంగా తలవంచ లేదు? అసలు వారి హృదయాలు పాషాణాల్లా కఠినమయిపోయాయి. వారు చేస్తున్న దుష్కార్యాల్ని షైతాన్‌ వారికి మనోహరమైనవిగా చేసి చూపాడు. (అన్‌ఆమ్‌: 42-43)

జీవవైవిధ్యానికి ఎక్కడా నష్టం వాటిల్లకుండా బాధ్యతాయుతంగా, ప్రకృతి పట్ల జవాబుదారీతనంతో మనిషి మెదులుకోవాలి. దుర్మార్గమైన వృకోదర లాభాపేక్షను విడిచిపెట్టాలి. మనుషులమధ్య రకరకాల అంతరాలు, వివక్షలు, అధిక ఐశ్వర్యం పక్కనే నిత్య దరిద్రం ఉండే ఈ క్రూర ప్రపంచాన్ని పరిహరించాలి. కరోనాకు వ్యాక్సిన్ కనుగొంటామా? అన్న ప్రశ్న కన్నా, కరోనా ఇస్తున్న సందేశం మానవాళికి కనువిప్పుకలిగిస్తుందా? అన్నదే అసలైన ప్రశ్న.

విశ్వాసుల హృదయాలు దేవుని ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నంకాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులైఉన్నారు. మీరలా కాకూడదు సుమా! వినండి! భూమి మృతప్రాయమైన తర్వాత దేవుడు దానికి తిరిగి జీవంపోస్తు న్నాడు. (అలాగే మృతప్రాయమైన మానవతక్కూడా ప్రవక్తల ద్వారా జీవం పోస్తున్నాడు.) మీరు విషయం గ్రహిస్తారని మాసూక్తులు మీకు విడమరచి చెబుతున్నాం. (హదీద్‌: 16-17)

‘అంతర్జాతీయ పరిణామాలు, శ్రీఘ్ర అంటువ్యాధులు, ఉద్భవిస్తున్న ప్రమాదాల పరిశోధన సంస్థ’ డైరెక్టర్‌గా ఉన్న డెన్నిస్ కారోల్ పరిశోధనల సారాంశం ప్రకారం ‘జంతువుల ద్వారా వచ్చే వైరస్‌ల వల్ల మనిషి ప్రతి మూడు సంవత్సరాల కొకసారి అంటు రోగాల బారిన పడే వ్యాధి చట్రంలో ఇరుక్కున్నాడు. మనిషి అవివేకంతో, ఎన్నటికీ తీరని తోడేలు ఆకలితో సర్వభక్షకుడై స్వైరవిహారం సాగిస్తే, సుషుప్తిలో ఉన్న, మరేదో వైరస్ ఒళ్ళువిరిచి, విజృంభించకపోదు. అప్పుడు మనం గడపలో పల గొళ్ళెం బిగించుకు కూర్చున్నా, అది కబళించకపోదు.

ప్రవక్తా! (వారికి నా మాటలుగా) ఇలా చెప్పు: “ఆత్మవంచనకు పాల్పడిన నా దాసులారా! దేవుని కారుణ్యం పట్ల నిరాశచెందకండి. దేవుడు తప్పకుండా మీ పాపా లన్నిటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (జుమర్‌:52-53)

కనుక మీపై శిక్ష వచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని పరిస్థితి రాకముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి; ఆయనకు పూర్తిగా విధేయులయిపోండి. అలాగే మీరు ఏమరుపాటులో ఉన్నప్పుడు హఠాత్తుగా మీపై (దైవ)శిక్ష విరుచుకుపడక ముందే మీ ప్రభువు పంపిన శ్రేష్ఠమైన గ్రంథాన్ని అనుసరించండి. (జుమర్‌: 54-55)

(మీరలా చేయకపోతే) ఆ తరువాత మీరు “దేవుని విషయంలో నేనెంత పొరపాటు చేశాను, పైగా నేను అపహాస్యం చేసినవారిలో చేరిపోయానే!” అని విచారించవలసి వస్తుంది. లేదా “అయ్యయ్యో! దేవుడు నాకు సన్మార్గం చూపివుంటే నేను కూడా భయ భక్తులుకలవారిలో చేరేవాణ్ణే!!” అని పశ్చాత్తాపపడవలసి వస్తుంది. లేదా దైవశిక్షను చూసి “మరోఅవకాశం లభిస్తే నేను కూడా సదాచార సంపన్నులలో చేరుతానే!” అని బాధపడ వలసివస్తుంది. (అప్పుడతనికి) “అవకాశం ఎందుకు లభించలేదు, నీదగ్గరికి నాసూక్తులు వచ్చాయి. నీవు వాటిని నిరాకరించావు. గర్విష్ఠి అయి అవిశ్వాసుల్లో చేరిపోయావు” (అని సమాధానం లభిస్తుంది). అలాంటి పరిస్థితులు రాకూడదు సుమా! (జుమర్‌: 56-59)

భౌతిక వృద్ధికన్నా, నైతికవృద్ధికోసం మనిషి తపించాలి. ఇప్పుడు మతంకన్నా మానవత్వం గురించి చర్చించాలి. మనిషి విజ్ఞానమే జయిస్తుంది. అది మానవీయ స్వభావాన్ని కలిగుండాలి. మహనీయ ముహమ్మద్ (స) కలలు గన్న శ్రేష్ఠ సమాజం ఊపిరి పోసుకోవాలి. అసమానతలను సమర్థించని పరమ సత్యాన్ని, నిజమైన దైవ ధర్మాన్ని స్థాపించుకోవాలి. అప్పుడు ధర్మం నోరు లేని వారి నోరుగా, గుండె లేనివారి గుండెగా, ఆత్మ లేనివారి ఆత్మగా వికసిస్తుంది. ఆ ధర్మమే ప్రకృతి హితంగా పరిణమిస్తుంది.

Related Post