‘ఏప్రిల్ ఫూల్’ ఒక వెకిలి చేష్ట / మేడిపండు నాగరికత మనకొద్దు

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

ప్రపంచ ముఖచిత్రం రోజురోజుకీ మారిపోతూ ఉంది. నేటి మన యువతరం ఎక్కువగా ఏదో ఆందోళన, భయం, కంగారు, మానసిక ఒత్తిడితో సతమతమవుతూ ఉంది. ఏమి చేయాలో తోచక సిగరెట్లు, మద్యపానం, మాదకద్రవ్యాలపై ఆధారపడటమో, నిస్పృహకు లోనై తమనితాము వంచించుకొని, ఇతరులను మానసిక క్షోభకు గురి చేయడమో చేస్తున్నారు. ఇలాంటి చెడు అలవాట్లకు జతగా చేరిన మరో – మూర్ఖ ఆచారమే ‘ఏప్రిల్ ఫూల్’

పాతదైనంత మాత్రాన ప్రతీదీ పనికిరానిది కాదు. కొత్తదైనంత మాత్రాన ప్రతీదీ గొప్పది కాదు. పాత కొత్తల మేలు కలయికే జీవితంలో అనుసరించవలసిన అసలు మార్గం. సమయం సందర్భాన్ని బట్టి ఉచితానుచితాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తమ ఆలోచనలో వైఖరిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే మార్పు చైతన్యానికి చిహ్నం! చైతన్యం జీవానికి చిహ్నం!!

ఈ సందర్భంగా వార్తా పత్రికల్లో, సామాజిక మాధ్యమాలలో పతాక శీర్షికతో అనేక వార్తలు … .ఎందరో సత్పౌరుల్ని కలతకు గురి చేస్తాయి. కాకపోతే లోపలి పేజీల్లో ఎక్కడో చెప్పబడుతుంది. ‘ఏప్రిల్ ఫూల్!’ అని. అయితే పరిహాసానికి ఇలాంటి వార్తలే కావాలా!? ఈ వార్తను ప్రచురించిన ఆ పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గం ఆలోచనలు ఎంత ప్రమాదకరమైన దిశలో పయనిస్తున్నాయో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణం ఇది.

అలాగే విన్న ప్రతి మాటలోని నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు చెప్పేయటం, లేక దాన్ని నిజమని తలపోయడం మనకు ఏ విధంగానూ శోభించదు. ఎందుకంటే-‘మనిషి అబద్దాలకోరు’ అని చెప్పడానికి విన్న ప్రతి మాటను (ఉచితానుచితాలు తెలుసుకోకుండా) ప్రచారం చెయ్యడం ఒక్కటి చాలు’ అన్నారు. అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స).

‘అబద్ధం చెడు గుణాలన్నిటికీ మూలం’ అన్నారు వెనుకటికి పెద్దలు. అబద్ధం చెప్పే ఈ దురలవాటుని ప్రపంచ మతాలన్నీ తప్పు పట్టాయి. బుద్ధి వివేకాలు సైతం ఈ మాటను సమర్ధిస్తాయి.
అదే సత్యసంధతను తీసుకోండి. అది మానవ ప్రగతికి, లోకాభివృద్ధికి ఆయువు పట్టులాంటిది. సత్యం లోకంలో జరిగే మేళ్ళన్నింటికి సరోవరం. అది దైవ దౌత్యపు ఉత్పత్తి స్థానం. దైవ భీతికి చిహ్నం. సత్పురుషులు సేద తీరే ఆలయం. సత్యసంధతే గనక లేకపోతే నేడు మనకు అందుబాటులో ఉన్న మంచి సూత్రాలన్నీ కాలం చెల్లిన సిద్ధాంతాలుగా మిగిలిపోయి ఉండేవి. ఈ కారణంగానే ఇస్లాం ధర్మ శాస్త్రం -ప్రతి భక్తుడు సత్యసంధతను తన ఆభరణంగా స్వీకరించి, నీతి, నిజాయితీగా బ్రతికేందుకు కృషి చేయాలని వక్కాణిస్తోంది. అబద్ధం, అపహాస్యం, అపనింద, అపవాదాలకు ఆమడ దూరంలో ఉండాలని హితవు చేస్తోంది. ఎందుకంటే- సత్యసంధత మంచి వైపు తీసుకెళుతుంది. సత్కార్యం స్వర్గానికి గొనిపోతుంది. (బుఖారీ) ఇక ‘స్వర్గం’ అంటారా! అది ప్రతి భక్తుడి యొక్క సత్కార్యాలకు ప్రతిఫలంగా ప్రాప్తించే శాంతి నిలయం!! దారుస్సలాం!!!

మహా ప్రవక్త (స) వారికి సైతం అబద్ధాలకోరంటే మహా అసహ్యం. కాపట్య లక్షణాల్లోని ఓ లక్షణంగా అబద్ధాన్ని పేర్కొన్నారు. అబద్ధం- అది అవిధేయత వైపు తీసుకెళుతుంది. అవిధేయత నరకానికి గొనిపోతుంది. (బుఖారీ)

నరకం మహా భయంకర నివాసం. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తీ దాన్నుండి అల్లాహ్ శరణు కోరుకుంటాడు. దాన్నుండి శాయశక్తులా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఇక ఆ సత్య స్వరూపుడు చేసే హితవును కాస్త గమనించండి! “విశ్వాస భాగ్యం పొందిన ప్రజలారా! అల్లాహు భయపడండి. సత్యవంతులకు తోడ్పడండి’ (తౌబా: 119)

కాపట్య లక్షణాల్లోని ఓ లక్షణంగా అబద్ధాన్ని పేర్కొన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). అవి: (1) కపటి – అతనికి ఏదైనా వస్తువు అప్పగిస్తే
ద్రోహానికి పాల్పడతారు. (2) నోరు తెరిస్తే అబద్ధం చెబుతాడు. (3) మాట ఇచ్చి తప్పుతాడు. (4) గొడవకు దిగితే (పచ్చి బూతులు తిడుతూ) నోరు పారేసుకుంటాడు.’ (ముస్లిం)

అయితే నేడు అత్యంత బాధాకరమైన విషయం. ఏమిటంటే- పాశ్చాత్య దుష్కృతి మోజులో పడి, గాడి తప్పి ప్రవర్తిస్తోంది మన యువతరం. మానవ జీవితాల్లో వెగటును నింపి, మానవతను ఛిన్నాభిన్నం చేసి, జీవితాల్లో శాంతి తృప్తి అన్నవి లేకుండా చేసిన పాశ్చాత్య విష సంస్కృతి నేటి మన యువతరానికి ప్రోగ్రసివ్ నాగరికతగా తోచడం కడు శోచనీయం! పాశ్చాత్య సంస్కృతి నుండి దిగుమతి చేసుకున్న మరో ఫూల్ ఆచారమే ‘ఏప్రిల్ ఫూల్’!

ఈ వెర్రి పోకడ కారణంగా ఎంత మంది ప్రజలు మనోక్షోభకు గురయ్యారు? ఎంత మంది మానమర్యాదలు మంటగలిశాయి? ఎన్ని ఆర్థిక నష్టాలు జరిగాయి? ఎందరి జీవితాలు ఈ పెనుభూతానికి బలయ్యాయి? పైపై దృష్టిగలవారికి విడమరచి చెప్పినా ఇది బోధపడదు. ఇలా చేసే వారి వైఖరిని ప్రవక్త (స) తీవ్రంగా ఖండించారు. “ప్రజల్ని నవ్వించేందుకు అబద్ధమాడే వ్యక్తి నాశనంగాను, నాశనంగాను” అని గర్హించారు. హజ్రత్ ఉమర్ (ర.జి) గారు ఇలా అభిప్రాయ పడ్డారు: ‘విశ్వాస శిఖరానికి చేరుకోవాలంటే మాట వరుసకైనా, అబద్ధం అనకూడదు. హద్దు మీరిన పరిహాసం వల్ల మనిషి ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఇతరుల్ని అపహాస్యం పాలుజేసి నవ్వుకునే వ్యక్తి కన్నా- తన పరలోక జీవితాన్ని నాశనం చేసుకునేవాడు మరొకడుండడు.

ఇక ప్రియప్రవక్త(స) వారి విషయానికొస్తే అప్పుడప్పుడు మహాప్రవక్త(స) వారి మాటల్లో హాస్యం తొణికిసలాడేది అన్న మాట నిజమే. అయితే ఆయన (స) చెప్పే ప్రతి మాటలోనూ సత్యం ఉట్టిపడుతూండేది. తరచూ ఆయన(స) “నిశ్చయంగా నేనూ హాస్యమాడుతాను … సత్యం తప్ప మరో మాట నా నోట పలుకను” (తబ్రానీ) అనేవారు. పోతే శిక్ష అంటారా! మేరాజ్ సందర్భాన ప్రవక్త(స) చూసిన అనేక దృశ్యాల్లోని ఒక దృశ్యానికి వివరణ చెబుతూ దైవదూతలు ఇలా అభిప్రాయపడ్డారు: “మేము సమీపించిన మూడవ వ్యక్తి అతని దవడను, ముక్కు రంధ్రాన్ని, కంటిని, మెడ వెనుక భాగం వరకూ చీలేయబడుతూ ఉంది. అతడు ఎవరంటే ఉదయం తన ఇంటి నుండి బయలు దేరినప్పటి నుంచి అబద్ధాలు చెబుతూ (తిరుగుతూ ఉండేవాడు. అతడు చెప్పిన అబద్ధాలు ( లోకం ) నలుదిక్కులా (ఆకాశం అంచులదాక) వ్యాపించేవి.” (బుఖారీ)

ఇతరులు మనల్ని ఆట పట్టించటాన్ని, అవహేళన చేయటాన్ని మనం ఎలాగైతే ఇష్టపడమో, మనం ఇతరుల్ని అపహాస్యం చేయడం, ఆట పట్టించడం, ర్యాగింగ్ చేయడం వారికీ సుతరామూ ఇష్టం ఉండదు. “వ్యక్తి తన కోసం దేన్నయితే ఇష్టపడతాడో తన సోదరుడి కోసం కూడా దాన్నే ఇష్టపడాలి. అప్పుడే అతను నిజ ముస్లిం అవుతాడు ” (తబ్రానీ) అని ప్రవక్త(స) చెప్పే వున్నారు. అంతగా నవ్వాలనే అనుకుంటే – కాలే కడుపుల మంటను పిడికెడు అన్నంతో చల్లార్చి నవ్వండి. బట్టలు లేక అర్ధనగ్న శరీరాలతో చితికి పోయిన బ్రతుకులకు నిండు బట్టలు తొడిగించి నవ్వండి. తల దాచుకోవటానికి పూరి గుడిసె అయినా లేక ఫుట్పాత్ పై పడి అల్లాడే అభాగ్యులకు ఆశ్రయం కల్పించి నవ్వండి. అప్పుడు మీ సంతోషానికి పుణ్యమూ లభిస్తుంది, మీ ఆనందానికి ఓ అర్ధమూ ఉంటుంది. అంతే గాని పాశ్చాత్య నాగరికత మోజులో పడి మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోకండి. ఏప్రిల్ ఫస్ట్ లాంటి ఫూల్స్ ఆచారాలకి దూరంగా ఉండండి. దైవశిక్షకు భయపడండి. పగ ద్వేషాలను రూపుమాపి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పండి. ఇలా గనక మీరు చేస్తే ఇటు మనుషులూ సంతోషిస్తారు. అటు దేవుడూ మెచ్చుకుంటాడు. మార్పు అవసరమే. మారేందుకు సిద్ధమవ్వండి. గతం గతః. మంచి
భవిష్యత్తుకు బాట వేయవలసిన అవసరం, సమయం ఆసన్నమయ్యాయి అని గుర్తించండి, చివరి మాటగా ఆ మాధవుడి మాటను స్వీకరించండి!

“మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ అన్నింటి (ప్రతి ఇంద్రియం) విషయంలోనూ విచారణ జరుగుతుంది.” (బనీ ఇస్రాయీల్: 34)

 

Related Post