కృతజ్ఞత-కృతఘ్నత

కృతజ్ఞత-కృతఘ్నత

అబ్డుల్ఖాదిర్ ఉమ్రీ

‘కృతజ్ఞత-కృతఘ్నత’ అనే మాటలు తరచు మనం వింటుంటాం. వినడానికి ఇవి సామాన్య పదాలు గా ఉన్నా – అద్భుతమైన మానవ జీవన రహస్యం వీటిలో నిక్షిప్తమై ఉంది.  మానవుడికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం కృతజ్ఞత. ఉండకూడని లక్షణం కృతఘ్నత. ఈ రెంటి వైశిష్ట్యం బాగా అవగాహన చేెసుకొని తన జీవితంతో వీటిని సమన్వయం చేసుకుని జీవన యానం చేయగలిగినవాడు మహా మనీషి! చేసిన మేలును గుర్తుంచుకోవడం  కృతజ్ఞత. చేసిన మేలుని మరచిపోవడం కృతఘ్నత.

ఈ జీవితమూ, ఈ యవ్వనమూ, ఈ శక్తీ సామర్థ్యాలూ, ఈ బుద్ధీవివేకాలూ, ఈ సిరి సంపదలూ, ఈ ఆస్తీఅంతస్తలూ, ఈ పలుకుబడీ, ఈ అధికారమూ, ఈ అందచందాలూ సమస్తమూ మనిషికి అల్లాహ్‌ాయే అనుగ్రహించాడు.'(ఓ జనులారా!) మీకు లభించిన అను గ్రహం ఏదైనా అల్లాహ్‌ా తరపు నుండే (ఆయన కారుణ్యంతోనే) లభించింది”. (16:53)

ఈ జీవితం మనిషికి ఇవ్వబడిన ఆచరణా వ్యవధి. పరీక్షా  సమయం. ఈ అశాశ్వతమైన ప్రపంచం పరీక్షా స్థలం. మరణం పరీక్షా  సమయం. ఆచరణా వ్యవధి పూర్తి అయిందని అర్థం. జీవన్మరణాల ఈ పరంపరను తన దాసులను పరీక్షించడానికి మహోన్నతుడు అయిన అల్లాహ్‌ా ప్రారంభించాడు. ”మీలో మంచి పనులు చేసేవారు ఎవరో పరీక్షించి చూద్దామని ఆయన చావుబ్రతుకులను సృష్టించాడు”. (67:2)

చదువో, పదవో, పసిడో సంపాదించినంత మాత్రాన మనిషి జీవితం సార్థకం అన్పించు కోదు. వీటన్నింటినీ మనకు ఇచ్చిన ఆ పరమోన్నత ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపే నిమిత్తం వీటిని ఆయన అభీష్టం ప్రకారం వినియోగించినప్పుడే మానవ జన్మకు అసలు అర్థమూ, పరమార్థము. చివరికి అపకారం తలిపెట్టిన వారికి సయితం మహనీయ ముహమ్మద్‌ (స) లా ఉపకారమే చేయడం సిసలైన మానవత్వం. ‘చంపదగినయట్టి శత్రువు తన చేత- జిక్కెనేని కీడు చేయ రాదు. పొసగి మేలు చేసి పొమ్మనుటే చాలు’.

”పరిశుద్ధుడైన అల్లాహ్‌ా, దావూద్‌ (అ)కు సత్యజ్ఞానంతోపాటు అపారమైన శక్తి సామర్థాలూ అనుగ్రహించాడు. ఆయన విశ్వ ప్రభువును కీర్తించేటప్పుడు పర్వతాలూ, పక్షులూ ఆయన తోపాటు కీర్తించేవి. ఇనుము ఆయన చేతిలో మైనమయిపోయేది. ఆయన కవచాలు తయారు చేసేవారు. దుష్టశక్తులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసేవారు. శాంతిస్థాపన కోసం శ్రమించే వారు.” (34:10-11) దావూద్‌ (అ) అల్లాహ్‌ా ప్రసాదించిన శక్తియుక్తుల్ని ఆయన అభీష్టం ప్రకారం ఉపయోగించారు. పరీక్షలో నెగ్గారు.

శక్తివంతుడైన అల్లాహ్‌ా సులైమాన్‌ (అ)కు గొప్ప రాజ్యాధికారాన్ని ప్రసాదించాడు. గాలిని ఆయన వశం చేశాడు. అది ఆయన ఆజ్ఞానుసారం ఆయన కోరిన వైపునకు మృదువుగా వీచేది. జిన్నాతులను షైతానులను ఆయన అధీనంలో ఉంచాడు.  ఆయన ఆజ్ఞ మేరన ఎత్తైన కట్టడాలు నిర్మించేవారు. నీటిలో మునిగి ముత్యాలు వెదికేవారు. అల్లాహ్‌ా సులైమాన్‌ (అ)కు పక్షుల భాషలూ నేర్పాడు. చీమల మాటల్నీ వినిపించాడు. అయితే ఆ మహనీ యులు ఏనాడూ అహంకారాన్నీ ప్రదర్శించలేదు. పైగా అల్లాహ్‌ాను ఇలా వేడుకున్నారు. ”ప్రభూ! నన్ను అదుపులో ఉంచు. నీవు నాకూ, నా తల్లిదండ్రులకూ చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉండేందుకు, నీకు నచ్చిన మంచి పనులు చేస్తూ ఉండేందుకు నీ కారుణ్యంతో నన్ను సజ్జనులైన నీ దాసులలో చేర్చు.” (27:15-19) సులైమాన్‌ (అ) అణకువ, వినమ్రతను ప్రదర్శించి, దైవదాస్యానికి కృతజ్ఞతాభావానికి ప్రతిరూపంగా నిలిచి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. సజ్జనులకు ఆదర్శంగా నిలిచారు. దీనికి భిన్నంగా –

‘ఫిర్‌ఔన్‌’ అధికార మదంలో విర్రవీగాడు. తన ఆధిపత్యానికి ముప్పు రాకూడదని ముందస్తు జాగ్రత్తగా ఇస్రాయీలు సంతతిని ఘోర హింసకు గురిచేసాడు. వారి మగ శిశువులను 70 వేల మందిని వధించాడు. దైవప్రవక్త మూసా (అ)ను తిరస్కరించాడు. అంతేకాదు మూసా (అ)ను అంతమొందించడానికి పన్నాగాలు కూడా పన్నాడు. తన రాజ్యపరిధిలో ఉన్న ప్రజలను సమావేశపరచి గర్వంతో ”మీ ప్రభువుని నేనే” అని విర్రవీగాడు. పరీక్షలో తప్పి పోయాడు. దైవాగ్రహానికి గురయ్యాడు. నియంతలకు అధికారపిపాసులకు గుణపాఠంగా మారాడు”. (79:15-26)

‘ఖారూన్‌’కు ఎన్నో నిధులను ఇచ్చాడు అల్లాహ్‌ా. తన దగ్గరున్న ఐశ్వర్యం, సిరిసంపదల్ని అల్లాహ్‌ా ఉపకారంగా భావించ లేదు. ”నేను నా జ్ఞానం మూలంగా సొంతం చేసుకున్నాను” అని బీరాలు పోయాడు. పేదవారిని అసహ్యంగా చూడసా గాడు. తనకు హితబోధన చేసిన వారిని హేళన చేశాడు. అధికార పిపాసి ఫిరౌన్‌తో కలిసి రాజ్యంలో అరాచకాన్ని కల్లోలాన్ని సృష్టించాడు. పదార్థ పూజారులు అతని ఠీవి దర్పాన్ని చూసి ‘ఖారూన్‌’ ఎంత అదృష్టవంతుడు! అతనికి లభిం చినటువంటి సిరిసంపదలు మాకూ లభించి ఉంటే ఎంత బాగుండు! అని అనుకునేవారు.

‘ఖారూన్‌’ ప్రదర్శించిన ఠీవి, దర్పం ప్రవక్త మూసా(అ)పట్ల అతని ప్రవర్తన అల్లాహ్‌ాకు నచ్చ లేదు. అంతే సర్వశక్తిమంతుడు అతన్ని అతని భవనాన్ని భూమిలోనికి అణగద్రొక్కాడు. దైవాను గ్రహాలను పొంది దైవం పట్ల కృతజ్ఞతాభావన చూపనివారి పరిణామం ఎలా ఉంటుందో ఈ దుష్టాంతంలో ఉంది. ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది:

”మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చ యంగా నా శిక్ష  చాలా కఠినమైనది(అని మరు వకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధాన పరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి”. (ఇబ్రాహీమ్‌: 7)

Related Post