దివ్య ఖుర్‌ఆన్ పరిచయం ఖుర్‌ఆన్ – అంతిమ దైవగ్రంథం.
ఖుర్‌ఆన్ – అంతిమ దైవసందేశహరులు అయిన ముహమ్మద్ (అల్లాహ్ కరుణాకాక్షాలు ఆయనపై అవతరించుగాక!)పై విశ్వప్రభువు తరపు నుండి అవతరించిన దివ్యగ్రంథం.
ఈ దివ్యగ్రంథం- స్వచ్ఛమయిన , స్పష్టమయిన అరబీ భాషలో అవతరించింది.
ఈ దివ్యగ్రంథం – తౌరాత్, ఇన్జీల్, జబూర్ మరియు పూర్వ గ్రంథాల లోని సత్యసందేశాన్ని బలపరుస్తుంది.
దివ్యఖుర్‌ఆన్ – సాధారణంగా మనం చదివే పుస్తకాలకు పూర్తిగా భిన్నమయిన గ్రంథం.
ఈ దివ్య గ్రంథంలో – సృష్టి ప్రక్రియ గురించి, సృష్టికర్త ఘనత ఔన్నత్యం గురించి హృదయాన్ని హత్తుకుని మదిలో ముద్రవేసే స్పష్టమయిన వచనాలూ ఉన్నాయి.
ఈ దివ్య గ్రంథంలో – ఏకదైవారాధనకు సంబంధించి హేతుబద్దమ యిన నిదర్శనాలూ ఉన్నాయి. బహుదైవారాధను ఖండించే సహేతుకమ యిన నిరూపణలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – మానవుని పుట్టుకను గురించి, ఈ సువిశాలమైన విశ్వంలో మానవుని పుట్టుక లక్ష్యం ఏమిటో తెలియజేసే వాక్యాలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – పూర్వప్రవక్తల మచ్చలేని జీవితాల గురించి, తమ తమ జాతులకు వారు అందజేసిన సత్యసందేశం గురించి సమాచారమూ ఉంది. దైవ సందేశహరులను ధిక్కరించిన జాతుల పర్యవసానం గురించి గుణపాఠమూ ఉంది.
ఈ దివ్యగ్రంథంలో – చారిత్రక గాథలూ ఉన్నాయి. విశ్వాసులకు దైవవిధేయులకు ఇహపరలోకాలకు సంబంధించిన శుభవార్తలూ ఉన్నాయి. అవిశ్వాసులకు దైవధిక్కారులకు హెచ్చరికలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – మానవుల హక్కులకు సంబంధించిన నీతి బోధనలూ ఉన్నాయి. మానవుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన ధర్మశాసనాలూ ఉన్నాయి. నాగరిక, రాజకీయ, ఆర్థిక , సామాజిక విష యాలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడే సూత్రాలూ ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ శాంతి సామరస్యాలకు సంబంధించిన ఆదేశాలూ ఉన్నాయి.
ఈ దివ్యగ్రంథంలో – జనుల్లో ఉన్న అంధవిశ్వాసాలు, మూఢనమ్మ కాలు, పూర్వీకుల అంధానుకరణ మొదలయిన విషయాల్లోని ఘోరమ యిన తప్పుల్ని, అత్యాచారాలు, అన్యాయం, దౌర్జన్యం, అరాచకాలను స్పష్టమయిన ఆధారాల ద్వారా ఖండించడమూ జరిగింది.
ఈ దివ్యగ్రంథంలో – ప్రాపంచిక జీవిత వాస్తవికత, మరణానంతర జీవితానికీ సంబంధించిన స్పష్టమయిన వచనాలూ ఉన్నాయి.
ఈ దివ్య గ్రంథం అవతరణకు 1438 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇందులో ఎలాంటి మార్పూ చేర్పూ జరగలేదు. ఇది నేటికీ సురక్షితంగా ఉన్న ఏకైక దివ్యగ్రంథం.
అల్లాహ్ విశ్వప్రభువు అయితే, అల్లాహ్ తరపు నుంచి అరేబియాలో ప్రభవింపజేయబడిన మహనీయ ముహమ్మద్ (స.అ.సం) విశ్వప్రవక్త. దివ్యఖుర్‌ఆన్ – విశ్వప్రభువు అయిన అల్లాహ్ సమస్తలోక వాసుల కొరకు అవతరించిన హితోపదేశం.
మక్కాలో అవతరించిన సూరాల్లో:
1) విశ్వజనీన సత్యాలు వివరించబడ్డాయి. ఆ సత్యాలకు ఆధారాలు, నిదర్శనాలు సంబోధిత ప్రజలకు సుపరిచితమయిన పరిస్థితుల నుండి గ్రహించబడ్డాయి.
2) సంబోధిత ప్రజల విశ్వాసాల్లోని, వారి నైతికతలోని, వారి సామూహిక జీవితంలోని లోపాలను, చెడులను చర్చించటం జరిగాయి. వారవలంబించే తప్పుడు జీవిత విధానాన్ని , వారిని వెంటాడుతున్న మూచారాలను నిశితంగా విమర్శించటం జరిగింది.
3) దేవుని ఏకత్వానికీ, మరణానంతర జీవితానికీ సంబంధించిన దృష్టాంతాలు, తార్కాణాలు సూచించబడ్డాయి.
4) బహుదైవారాధన, సర్వస్వతంత్రతా భావన,పరలోక నిరాకరణ, పూర్వీకుల అంధానుకరణ- మొదలయిన విషయాల్లోని ఘోరమైన తప్పుల్ని స్పష్టమయిన ఆధారాల ద్వారా విశదీకరించడం జరిగింది.
5) సంబోధితుల ఒక్కొక్క సంశయాన్ని దూరం చేసి, వారి ఒక్కొక్క అదిక్షేపణకు సమంజసమయిన సమాధానం ఇవ్వబడింది.
6) బహుదైవారాధకులు అనుసరించిన సత్యద్వేషం, విశ్వసించిన వారిపట్ల వారు జరిపే హింసా వైఖరిని ఖండించడం జరిగింది.
7) దైవాగ్రహం, ప్రళయ బీభత్సం, నరక బాధల వర్ణనల ద్వారా సత్య తిరస్కారులను భీతి గొలపటం జరిగింది.
8) విశ్వసించిన వారికి విజయాన్ని చేకూర్చే వాగ్దానాలతో, పరలోకంలో సాఫల్యం ప్రసాదించే శుభవార్తలతో ధైర్యం చెప్పటం జరిగింది. అలాగే వారి ప్రాథమిక విధులేవో తెలుపటం జరిగింది. ఓరిమితో, నిలకడతో, తొణకని ధీమాతో అల్లాహ్ మార్గంలో కృషి చెయ్యాలని ఉత్తేజ పరచటం జరిగింది. ఎలాంటి కష్టాన్నయినా సహించేందుకు, ఎంత వ్యతిరేకతనయినా ఎదుర్కొనేందుకు, వారిలో ప్రాణాలొడ్డి కృషి చేసే అపూర్వ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ప్రజ్వలితం చెయ్యడం జరిగింది.
మదీనాలో అవతరించిన సూరాలు:
సంఘటితమయిన ముస్లిం సమాజం తమపై మోపబడిన దైవప్రాతి నిధ్యపు బాధ్యతలను నిర్వహించానికి ఏ విధంగా సన్నద్ధమవ్వాలో ముఖ్యహితవులు ఇవ్వబడ్డాయి.
ఉత్తమ సమాజ నిర్మాణం, రాజ్య వ్యవస్థీకరణ, ఉత్తమ నాగరికతా స్థాపన, జీవితపు విభిన్న విభాగాలను ఏ సిద్ధాంతాల, ఏ నియమాల ఆధారంగా తీర్చిదిద్దాలో సూచనలు ఇవ్వబడ్డాయి.
కపటులు(మునాఫిక్‌ల)తో ఎలా వ్యవహరించాలో, ఇస్లామీయ రాజ్య రక్షణలో ఉన్న ముస్లిమేతరుల పట్ల ఎటువంటి వైఖరిని అవలంబించాలో, గ్రంథం కలవారి (యూదులు, క్రైస్తవుల)తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవాలో, యుద్ధానికి సన్నద్ధులైన శత్రువుల పట్ల, ఒడం బడిక చేసుకున్న జాతుల పట్ల ఏ విధానాన్ని అనుసరించాలో సూచనలు ఇవ్వబడ్డాయి.
ఇందులో ఒక వైపున ముస్లిములను సుశిక్షితులుగా తీర్చిదిద్దే బోధనలున్నాయి. వారి బలహీనతల పట్ల వారిని హెచ్చరించడం జరిగింది. అల్లాహ్ మార్గంలో ధనప్రాణాలతో శాయశక్తులా కృషి చేసేందుకు ఉత్తేజ పరచడం జరిగింది. జయాపజయాల్లో, కష్టసుఖాల్లో, కలిమి లేముల్లో భయ నిర్బయావస్థల్లో – అన్ని పరిస్థితిల్లోనూ- సందర్భానికి తగిన విధంగా నైతిక హితవులు ఇవ్వబడ్డాయి.
మరొక వైపున విశ్వాస పరిధికి వెలుపల ఉన్న గ్రంథం కలవారికి, కపటులకు, ధర్మధిక్కారులకు, బహుదైవారాధకులకు, వారి వారి విభిన్న పరిస్థితులకు అనువైన రీతిలో బోధ పరచడం జరిగింది.వారిని మృదువుగా దైవవిధేయత వైపునకు ఆహ్వానించడానికి, కఠినంగా హెచ్చరించడానికి, హితోపదేశం చెయ్యానికి,
దైవాగ్రహం వల్ల లభించే శిక్షను గురించి వారిని భయ పెట్టానికి గుణ పాఠం గరిపే సంఘటనలు, సమాచారాల ద్వారా శిక్షణ గ్రహించేలా చెయ్యానికి ప్రయత్నం చెయ్య బడింది.
ఖుర్‌ఆన్ శైలి:
దివ్య ఖుర్‌ఆన్ అవతరణ ప్రారంభమయి పరిపూర్ణత చెందే వరకు 23 సంవత్సరాల వ్యవధి పట్టింది.దివ్యఖుర్‌ఆన్ విభిన్న భాగాలు-పరిస్థితుల విభిన్న అవసరాలకు అనుగుణంగా అవతరించాయి.
దివ్యఖుర్‌ఆన్‌లో ఒకే మాట సాధ్యమైనన్ని విధాలుగా ఎదుటి వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పటం జరిగింది.
ఖుర్‌ఆన్ శైలి-మనస్సునూ,మస్తిష్కాన్నీ, బుద్ధినీ, వివేకాన్నీ, భావోద్రేకాలనూ ఆకర్షింపజేసే శైలి.
ఖుర్‌ఆన్ శైలి- జనుల ఆలోచనా జగత్తునే మార్చివేసే శైలి.
జనుల భావోద్రేకాల్లో సంచలనం సృష్టించే శైలి.
వ్యతిరేక శక్తుల్ని ఛిన్నాభిన్నం చేసివేసే శైలి.
సహచరుల సంస్కరణకు వారిలో ఉత్తేజాన్ని, వజ్ర సంకల్పాన్ని సృజింప జేసే శైలి.
విరోధుల్ని ఆత్మీయులుగా, తిరస్కరించేవారిని స్వీకరించేవారుగా మార్చే శైలి.
ఖుర్‌ఆన్ అంతా – దేవుని ఏకత్వం, ఆయన గుణవిశేషాలు, దైవ దూతలు వారి కర్తవ్యం, దైవదౌత్యం, దైవ సందేశహరుల సందేశం, వారి మచ్చలేని జీవితం, జాతులు ప్రవక్తల పట్ల అవలంబించిన తీరు, దైవ గ్రంథాల పట్ల విశ్వాసం, దైవ గ్రంథాల విశిష్టత, పరలోకం, అక్కడ జరిగే విచారణ, అక్కడ లభించే శిక్షా బహుమానాలు, నైతిక విలువలు, అల్లాహ్ యెడల భయభక్తులు, సహనస్థయిర్యాలు, అల్లాహ్ పై భారం మోపటం మొదలయిన మౌలిక విషయాల పునశ్చరణ కనిపిస్తుంది.