నా ప్రభువు ఎంతో కృపాకరం

నా ప్రభువు ఎంతో దయానిధం నా ప్రభువు ఎంతో కృపాకరం

నీ ఠీవి  ఎంతో అద్భుతం నీ కొలువు ఎంతో మహోన్నతం

నీ అనుగ్రహం సర్వాంతరం నీ ఆగ్రహం మహా భయంకరం

నీ శక్తి ఎంతో విరోచితం నీ యుక్తి ఎంతో లోకోహితం

”నా ప్రభువు ఎంతో”

 

అభాగ్యుల ఆసరా నువ్వే ప్రభూ, అనాథల ఆశ్రయం నువ్వే ప్రభూ

నీ నామ గుణాలు శుభదాయకం, నీ యుక్తి ప్రణాళిక మంగళప్రదం

లేరు ఎవ్వరు నీకు సమానం, సర్వానికి నువ్వే కదా మూలం

పోలిక లేనిదే నీ రూపం, సమస్తం నీతోనే కదా జ్యోతీర్మయం

”నా ప్రభువు ఎంతో”

 

నేను లోభం మోహాల పుట్టను, నేను మదం మత్సర్యాల గుట్టను

పాప పిపాస నా నరం నరం, ధన లాలస నా శిరం పదం

నువ్వు తప్ప లేదు నాకు దైవం, నువ్వే కదా నా సర్వం

కురవాలి నీ కరుణ క్షణం క్షణం, కావాలి నీ క్షమ నిరంతరం

”నా ప్రభువు ఎంతో”

నీ వాణి ధ్వని జీవ జలం, అదే నా మనో వసంతం

దుఃఖ నివారణం, ఖేద నిర్మూలనం, హృదయ దీపం

సత్య జలపాతం, కారుణ్య మేఘం, మార్గదర్శక గ్రంథం

నిత్య పారాయణ పుస్తకం, ఆ ఔషధం నాకు ప్రాణప్రదం

 

నన్ను నా వారు సమేతంగా తరిమేసినా, నిలువునా

నిలబెట్టి  తురిమేసినా, నిప్పుల్లో నెట్టేసి కాల్చేసినా,

తల తీసేసినా, ప్రాణ నరం తెగ్గోసేసినా,

అనంత వాయువుల్లో నన్ను కలిపేసినా

నా శిరస్సు శిఖరం వలే నా ప్రభువుకే చేస్తుంది ప్రణామం

 

లేదు నాకు ఏ ఉద్దేశ్యం, నీ దర్శనమే నా అంతిమ ఆశయం

నా శ్వాస సాంతం నీ శాసనం, నా ధ్యాస మొత్తం నీ ధ్యానం

స్వర్గ కొలువే నా లక్ష్యం, ప్రవక్త తోడే నా అసలు ధ్యేయం

ఇదే నా జీవిత పరామార్థం, ఇది తప్ప లేదు ఏ గమ్యం

”నా ప్రభువు ఎంతో”

Related Post