ప్రశ్నోత్తరాలు మొదటి భాగం

అల్హందులిల్లాహ్ – సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే. మేము ఆయన్ను ప్రశంసిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము, మనలోని ప్రతి చెడు మరియు దుష్ట పనుల నుండి ఆయన శరణు వేడుకుంటాము. అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ సన్మార్గం నుండి తప్పించలేరు మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలి వేసిన వారికి మరెవ్వరూ దారి చూపలేరు. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యుడు లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అనీ. తరుచుగా ముస్లిమేతరులు ఇస్లాం మరియు ముస్లింల గురించి అడిగే ప్రశ్నలు ఇక్కడ చర్చించబడినాయి.

ముస్లింలు తమ గుర్తింపును ఇస్లాం పేరు నుండి తీసుకున్నారే గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు నుండి కాదు. కాబట్టి, వారిని “ముహమ్మదీయులు” అని పిలవడం సరైన పద్ధతి కాదు.

దీనిని చదివే ప్రతి పాఠకుడు అల్లాహ్ తలిస్తే క్రింది అనేక విషయాలు మరియు అంశాల గురించి స్పష్టమైన మరియు సంతృప్తికరమైన అవగాహన పొందుతాడు:

 

1- ఇస్లాం అంటే ఏమిటి ?

జ: “ఇస్లాం” అనే అరబీ పదానికి అర్థం శాంతి మరియు సమర్పణ. శాంతి అంటే స్వయంగా ప్రశాంతత కలిగి ఉండటం మరయు మీ చుట్టుప్రక్కల కూడా. అలాగే సమర్పణ అంటే ఏకైక ఆరాధ్యుడు, సకల లోకాల సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా సమర్పించుకోవడం.

ఇస్లాం ధర్మం నైతిక విలువలను మరియు జీవన శైలిని సూచించే పేరు కలిగున్న ఒక సంపూర్ణ ఏకైక ధర్మం. యూదమతం దాని పేరును జూడా తెగ నుండి తీసుకున్నది, క్రైస్తవమతం దాని పేరును క్రీస్తు నుండి తీసుకున్నది, బౌద్దమతం దాని పేరును గౌతమబుద్ధుడి నుండి తీసుకున్నది, హిందూ మతం దాని పేరును సింధూ నది నుండి తీసుకున్నది. అయితే ముస్లింలు తమ గుర్తింపును ఇస్లాం పేరు నుండి తీసుకున్నారే గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు నుండి కాదు. కాబట్టి, వారిని “ముహమ్మదీయులు” అని పిలవడం సరైన పద్ధతి కాదు.

2- అల్లాహ్ అంటే ఎవరు ?

జ: అల్లాహ్ అనేది అరబీ భాషలో “ఏకైక ఆరాధ్యుడు, సకల లోకాల సృష్టికర్త మరియు ప్రభువు“ యొక్క స్వంత పేరు. అల్లాహ్ కేవలం ముస్లింల కొరకు మాత్రమే ఆరాధ్యుడు కాదు, ఆయన సృష్టిలోని ప్రతిదానికీ ఆరాధ్యుడు ఎందుకంటే వాటన్నింటినీ సృష్టించింది మరియు పోషిస్తున్నదీ ఆయనే. అరబీ భాషలో అల్లాహ్.

3- అల్లాహ్ మనలాగే ఉంటాడా?

జ: అస్సలు కాదు. నిజానికి, అల్లాహ్ ఏకైకుడు మరియు సంపూర్ణుడు. తన సృష్టిలోని దేనినీ ఆయన పోలి లేడు. అల్లాహ్ తన గురించి స్వయంగా తెలిపిన విషయాలు తప్ప ఒక ముస్లిం ఆయన గురించి మరేదీ పలుకడు.

4- కఅబహ్ గృహం అంటే ఏమిటి ?

జ: కఅబహ్ గృహమనేది ముస్లింలందరూ తాము ప్రతిరోజు చేసే ఐదుపూట్ల నమాజు కోసం అభిముఖంగా నిలబడే ఆరాధనా స్థలం. అల్లాహ్ దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం దీనిని నిర్మించమని ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాంలను ఆదేశించాడు. ఇదొక రాతి కట్టడం. ప్రవక్త ఆదం అలైహిస్సలాం నిర్మించిన అల్లాహ్ యొక్క మొట్టమొదటి ఆరాధనాలయం యొక్క అసలు పునాదులపైనే ఇది నిర్మించబడిందని చాలా మంది విశ్వాసం. దీనిని సందర్శించేందుకు మొత్తం మానవజాతిని ఆహ్వానించమని అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ఆదేశించినాడు. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం పిలుపుకు స్పందిస్తూ యాత్రికులు అక్కడికి చేరుకున్న తర్వాత ‘లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అంటే హాజరయ్యాం, ఓ ప్రభూ హాజరయ్యాం’ అని పలుకుతారు.

కబహ్ అంటే చతురాకారం గలది అని అర్థం. కఅబ్ అంటే ఎత్తైనది, గౌరవప్రదమైనది అని అర్థం.

5- ముస్లిం అంటే ఎవరు ?

జ: “ముస్లిం” అనే పదానికి అర్థం “నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త”ని ప్రకటిస్తూ, అల్లాహ్ యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా తనను తాను సమర్పించుకున్నవాడు. మరోమాటలో చెప్పాలంటే ఎవరైతే తన ఇష్టాన్ని అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నారో, అతడిని ముస్లిం అంటారు. కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మందు వచ్చిన ప్రవక్తలందరూ ముస్లింలే. ఖుర్ఆన్ దివ్యగ్రంథంలో ప్రత్యేకంగా మూసా మరియు ఈసా అలైహిస్సలాంల కంటే చాలా కాలం ముందు జీవించిన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గురించి “ఆయన (ఇబ్రాహీం) యూదుడు కాదు క్రైస్తవుడు కాదు, కానీ ఆయన ఒక ముస్లిం,” ఎందుకంటే, ఆయన అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నారు. కాబట్టి వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను సంతృప్తిపరచాలని, ఆయన మెప్పు పొందాలని ఎల్లప్పుడూ ప్రయత్నించే ముస్లింలు కొందరు ఉన్నారు. మరికొందరు, అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకోకుండా, ఎల్లప్పుడూ ఇస్లాం పేరు మీద చెడు పనులు చేస్తూ, ఏనాడూ తమ సత్యధర్మం గురించి పట్టించుకోని ముస్లింలనబడే వారూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన ఆధారంగా ఇస్లాం ధర్మం గురించి తీర్మానించుకోకూడదు. ఎందుకంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణమైనదే కానీ మానవమాత్రులు కావడం వలన ముస్లింలు పరిపూర్ణులు కారు. ఒకవేళ ఎవరైనా అసలు ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటే, వారు ఇస్లాం ధర్మం గురించి అధ్యయనం చేయాలే గానీ ముస్లింల గురించి కాదు.

6- ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటే ఎవరు ?

జ: క్లుప్తంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోని ఉత్తమ తెగలలో ఒకటైన ఖురైష్ తెగలో క్రీ.శ. 570వ సంవత్సరంలో జన్మించారు. ఆయన ప్రవక్త ఇబ్రాహీమ్ జ్యేష్ఠ కుమారుడైన ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం వంశానికి చెందుతారు. ఆయన జన్మించక ముందే ఆయన తండ్రి చనిపోయారు మరియు ఆరెళ్ళ వయస్సులో తల్లి కూడా చనిపోయింది. ఆయన ఏ పాఠశాలలోనూ చదువుకోలేదు. ఎందుకంటే ఆనాటి ఆచారం ప్రకారం బాల్యంలో ఆయన ఒక పల్లెటూళ్ళో ముందుగా హలీమా అనే ఆమె వద్ద పెరిగారు, తర్వాత కొన్నేళ్ళు తాత వద్ద మరియు పినతండ్రి వద్ద పెరిగారు. యవ్వనంలో ఆయన ఎంతో ఉత్తముడు, నిష్కళంకుడు, సత్యవంతుడు, దయాళువు, గౌరవనీయుడు మరియు నిజాయితీపరుడిగా ప్రఖ్యాతి గాంచినారు. తరుచుగా హీరా గుహలో రోజులు తరబడి ఏకాంతంగా గడిపేవారు.

7- ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా అల్లాహ్ యొక్క ప్రవక్తగా మరియు సందేశహరుడిగా మారినారు ?

జ: 40 యేళ్ళ వయస్సులో, మొట్టమొదటిసారి హీరా గుహలో ఏకాంతంగా ఉన్నప్పుడు, దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ఆయనకు కనబడి, అల్లాహ్ నుండి తొలి దివ్యవాణిని అందజేసి, అల్లాహ్ ఆయనను అంతిమ ప్రవక్తగా ఎంచుకున్నట్లు తెలిపినారు. ఆనాటి నుండి 23 సంవత్సరాల వరకు దివ్యవాణి ఆయనపై అవతరించింది. వాటిని ఆయన సహచరులు ఖుర్ఆన్ గ్రంథంగా సంకలనం చేసినారు. ఇది మొత్తం మానవాళి కొరకు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ పంపిన అంతిమ దివ్యసందేశం. దివ్యఖుర్ఆన్ దాని అసలు అవతరించిన రూపంలో సురక్షితంగా భద్రపరచబడింది. ఎన్నడూ ఎలాంటి మార్పులు చేర్పులకు గురికాలేదు. తోరా(Torah), కీర్తనలు (psalms), జీసస్ సువార్తలలోని సత్యవచాలను పునఃధృవీకరించింది[1].

దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం నుండి విన్న వచనాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పఠించడం మొదలు పెట్టారు మరియు తనపై అల్లాహ్ అవతరింపజేసిన సత్యసందేశాన్ని ప్రజలకు బోధించసాగారు. ఆయను మరియు ఆయనతో పాటు ఉన్న చిన్న సహచరుల సమూహం తీవ్రమైన దౌర్జన్నాన్ని, అణచివేతను ఎదుర్కొనవలసి వచ్చింది. అది ఎంత తీవ్రరూపం దాల్చిందంటే, కొన్నేళ్ళ తర్వాత మరో ప్రదేశానికి వలస వెళ్ళేందుకు అల్లాహ్ ఆయనకు అనుమతి నిచ్చాడు. మక్కా నుండి మదీనా పట్టణానికి ఆయన చేసిన ఈ వలసనే హిజ్రత్ అంటారు. దీని ఆధారంగానే ఇస్లామీయ క్యాలెండరు తయారు చేయబడింది. అనేక సంవత్సరాల తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు సాటిలేని విజేతలుగా మక్కా నగరంలో ప్రవేశించి, తమపై ఎన్నో దౌర్జన్యాలు, అరాచకాలు చేసిన తమ శత్రువులను క్షమించారు, ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు. 63 యేళ్ళ వయస్సులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేనాటికి, అరేబియా ద్వీపకల్పంలోని అధిక భాగం ఇస్లాం ధర్మాన్ని అనుసరించసాగింది. ఆయన మరణానంతరం, ఇస్లాం ధర్మం తూర్పులో చైనా వరకు మరియు పశ్చిమంలో స్పెయిన్ వరకు వ్యాపించింది.

8- ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లుహు అలైహి వసల్లంను ఆరాధిస్తారా?

జ: ఖచ్ఛితంగా లేదు. ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గానీ, మరే ప్రవక్తను గానీ అస్సలు ఆరాధించరు. ఆదం, నూహ్, ఇబ్రాహీమ్, దావూద్, సులైమాన్, మూసా మరియు జీసస్ అలైహిస్సలాం మొదలైన ప్రవక్తలతో పాటు మొత్తం ప్రవక్తలందరినీ ముస్లింలు నమ్ముతారు. అంతేగాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ యొక్క ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త అని కూడా నమ్ముతారు. కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడనీ, ఏ మానవుడూ ఆరాధనలకు అర్హుడు కాదని వారు దృఢంగా నమ్ముతారు.

9- ఖుర్ఆన్ అంటే ఏమిటి?

జ: దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అరబీ భాషలో అవతరించిన అసలు వచనాల సంకలనమే ఖుర్ఆన్ గ్రంథం. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించగా, ఆయన దానిని తన సహచరులకు బోధించారు. కొందరు సహచరులు దానిని వ్రాతపూర్వకంగా భద్రపరచగా, మరికొందరు కంఠస్థం చేసి మరీ భద్రపరచుకున్నారు. ఆయన జీవిత కాలంలోనే ఆ సహచరులు ఆయనకు చదివి వినిపించి మరీ ధృవీకరించుకున్నారు. అనేక శతాబ్దాలు దాటినా దానిలోని 114 అధ్యాయాలలో, నేటికీ ఒక్క అక్షరం కూడా మార్చ బడలేదు, ఎన్నడూ మార్పు చెందదు కూడా. కాబట్టి, ప్రతికోణంలోనూ కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 14 శతాబ్దాలకు పూర్వం అవతరించిన ఖుర్ఆన్ గ్రంథం మాత్రమే పరిపూర్ణమైనది, అద్వితీయమైనది మరియు అపూర్వమైనది.

10- ఖుర్ఆన్ లో ఏమున్నది ?

జ: సర్వలోకాల సృష్టకర్త అయిన అల్లాహ్ యొక్క చిట్టచివరి దివ్యసందేశమైన ఖుర్ఆన్ ముస్లింల దైవవిశ్వాసం మరియు ఆచరణల యొక్క ప్రధాన మూలాధారం. ఇస్లామీయ మూలసిద్ధాంతం, ఆరాధన, జీవితం, మరణం, వివాహం, విడాకులు, విద్య, సైన్సు, కుటుంబం, సాంఘిక వ్యవహారాలు, మానవహక్కులు, సముచితమైన మానవ నైతిక ప్రవర్తన మరియు సరిసమాన ఆర్థిక వ్యవస్థ మొదలైన అనేక విషయాలు మరియు అంశాలన్నింటినీ ఖుర్ఆన్ గ్రంథం సంబోధిస్తున్నది. అయితే, దానిలోని అసలు ప్రధానాంశం – సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ మరియు ఆయన సృష్టితాల మధ్య నున్న సంబంధం.

Related Post