మహాప్రవక్త (సల్లం) మరణం పట్ల ఉమర్ (రజి) తీరు
{హజ్రత్ ఉమర్ (రజి) ఈ వార్త వినగానే ఆయనకు కాళ్ళ క్రింద భూమి బ్రద్దలైనట్లు అనిపించింది. ఒక్కసారిగా నిలువునా కంపించిపోయారు. అయితే ఆయన కూడా ఈ విషయాన్ని ఓ పట్టాన నమ్మలేకపోయారు. పరుగు వేగంతో హజ్రత్ ఆయిషా (రజి) ఇంటికి పోయారు. అక్కడ జనం శోకమూర్తులయి కనిపించారు.
ఉమర్ (రజి) లోపలికి ప్రవేశించి చూస్తే ప్రవక్త (సల్లం) భౌతికకాయంపై వస్త్రం కప్పబడి ఉంది. ఆయన దైవప్రవక్త (సల్లం) ముఖం మీది వస్త్రం తొలగించి చూశారు. ఆ ముఖం ఎలాంటి మార్పులేకుండా ఎప్పటిలాగానే విప్పారిన పువ్వులా ఉంది. బహుశా వ్యాధి తీవ్రత వల్ల స్పృహతప్పి ఉంటారని, కాస్సేపటికి స్పృహ రావచ్చని భావించారు ఆయన అయోమయంగా చూస్తూ.
ఆ తరువాత ఆయన (రజి) మస్జిద్ కు వెళ్ళారు. అక్కడ కూడా విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. మస్జిదు ఏడ్పులు, ఎక్కిళ్ళతో ప్రతిధ్వనిస్తోంది. ప్రవక్త అనుచరులు తమ ప్రియతమ నాయకుడిని తలచుకొని కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్నారు. ఈరోజు ఈ అనాథల్ని ఓదార్చేవారు, ఓదార్చగలవారు ఒక్క అల్లాహ్ తప్ప మరెవరూ లేరు. దైవప్రవక్త (సల్లం) మరణం వారి గుండెల్ని పిండివేస్తోంది.
హజ్రత్ ఉమర్ (రజి) వర నుంచి ఖడ్గం లాగి, “ఖబర్దార్! ఎవరైనా దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) చనిపోయారని అంటే అతని తల ఎగిరిపోతుంది” అన్నారు కోపోద్రేకాలతో అటూ ఇటూ తిరుగుతూ.
తరువాత ఆయన అదే పరిస్థితిలో ఖడ్గం చేతపట్టుకొని మస్జిద్ లోకి ప్రవేశించారు. మస్జిద్ లో జనం కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్నారు.
“ప్రజలారా! కొంతమంది దైవప్రవక్త (సల్లం) చనిపోయారని చెబుతున్నారు. లేదు, లేదు. ఆయన (సల్లం) చనిపోలేదు, స్పృహ తప్పారు. కాస్సేపటికి స్పృహలోకి రావచ్చు. మూసా ప్రవక్త (అలైహి)లా ముహమ్మద్ ప్రవక్త (సల్లం) కూడా నలభై రోజుల పాటు అదృశ్యమయి ఉంటారు. ఆ తరువాత తిరిగొస్తారు….” అంటూ హజ్రత్ ఉమర్ (రజి) వేదిక ఎక్కి ఉపన్యాసం మొదలెట్టారు.
అబూ బక్ర్ (రజి) తీరు
ఈ విషాదవార్త హజ్రత్ అబూ బక్ర్ (రజి) చెవిన పడగానే క్షణంపాటు ఆయన నోట మాట పెగల్లేదు. ఆ తరువాత కాస్త తేరుకొని ఆయన ఆదరాబాదరాగా హజ్రత్ ఆయిషా (రజి) ఇంటికి పరుగెత్తారు.
అప్పటికే అక్కడ వేలాదిమంది ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడారు. వారి కళ్ళు కుండపోతలా కన్నీళ్ళు వర్షిస్తున్నాయి. హజ్రత్ అబూ బక్ర్ (రజి) లోపలికి ప్రవేశించడానికి అనుమతి అడిగారు.
“ఈ రోజు అందరికి అనుమతి ఉంది. ఏ ఒక్కరూ ప్రత్యేక అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు” లోపలి నుండి సమాధానం వచ్చింది.
హజ్రత్ అబూ బక్ర్ (రజి) మౌనంగా లోపలికి వెళ్ళారు. దుప్పటి తొలగించి దైవప్రవక్త (సల్లం) ముఖపద్మాన్ని తనివితీరా దర్శించారు. కళ్ళ నుండి అశ్రుధారలు కారుతుండగా ఆయన దైవసందేశహరుని (సల్లం) నుదుటపై ముద్దాడారు.
“దైవప్రవక్తా! జీవించి ఉన్నప్పుడు కూడా మీరు బాగున్నారు. మరణించిన తరువాత కూడా మీరు బాగుంటారు. నిస్సందేహంగా ఇది మీ కోసం దైవం లిఖించిన మరణం తప్ప మరేమీ కాదు. దీని తరువాత మీకు మరెన్నటికీ మరణం సంభవించదు” అన్నారు ఆయన పొంగివస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుతూ.
దైవప్రవక్త (సల్లం) సతీమణి హజ్రత్ ఆయిషా (రజి) ఇళ్ళు విషాదనిలయమయి పోయింది. దైవప్రవక్త (సల్లం) భౌతికకాయం పడక మీద చలన రహితంగా పడి ఉంది. హజ్రత్ అబూ బక్ర్ (రజి) కన్నీటితో దైవప్రవక్త (సల్లం)కు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత ఆయన బయటికొచ్చి మస్జిద్ కు వెళ్ళారు.
మస్జిద్ లో ప్రవక్త అనుచరులు తమ ప్రియతమ నాయకుడ్ని తలచుకొని ఇంకా కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూనే ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) మాత్రం దైవప్రవక్త (సల్లం) బ్రతికే ఉన్నారని చెబుతూ ఇంకా ప్రసంగిస్తూనే ఉన్నారు.
“ఉమర్! కాస్త ఆగు. నన్ను మాట్లాడనివ్వు” అన్నారు హజ్రత్ అబూ బక్ర్ (రజి).
కాని హజ్రత్ ఉమర్ (రజి) ఆయన మాటలు పట్టించుకోకుండా ఉద్రేకంతో తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. హజ్రత్ అబూ బక్ర్ (రజి) ఆయన్ని ఈ పరిస్థితిలో ఆపడం కష్టమని భావించి నిలబడిన చోటు నుంచే సోదరులారా! అని సంబోధిస్తూ మాట్లాడటం ప్రారంభించారు. హజ్రత్ అబూ బక్ర్ (రజి) సంబోధనా పలుకులు వినగానే జనమంతా ఒక్కసారిగా ఆయన వైపు దృష్టి మళ్ళించారు. దాంతో హజ్రత్ ఉమర్ (రజి) తన ప్రసంగాన్ని ఆపేయక తప్పలేదు. హజ్రత్ అబూ బక్ర్ (రజి) కట్టలు తెంచుకొని వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగి ఎంతో నిబ్బరంగా ఇలా ప్రసంగించారు:
“సోదరులారా! వినండి. ఒకవేళ ఎవరైనా ముహమ్మద్ (సల్లం)ని ఆరాధిస్తుంటే ముహమ్మద్ (సల్లం) ఇహలోకం వీడిపోయారని తెలుసుకోవాలి. అల్లాహ్ ని మాత్రమే ఆరాధించే వారికి అల్లాహ్ సజీవంగా ఉన్న సంగతి తెలిసిందే. నిత్యజీవుడు అల్లాహ్ మాత్రమే. ఆయనకు మరణమన్నదే లేదు. ఆయన మనకు ఇది వరకే దైవప్రవక్తను గురించి ఇలా వివరించాడు.”
“ముహమ్మద్ (సల్లం) ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు – ఇస్లాం నుంచి – వెనుతిరిగిపోతారా? వెనుతిరిగి పోయేవాడు అల్లాహ్ కు ఏమాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపేవారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.” (ఖుర్ఆన్ 3:144).
“(ముహమ్మద్!) నిస్సందేహంగా నీవూ చావవలసిందే, వారు చావవలసిందే….”
“ఆయన (అల్లాహ్) తప్ప ప్రతి వస్తువూ అంతమయ్యేదే. సార్వభౌమాధికారం ఆయనకే ఉంది. ఆయన వైపుకే మీరంతా మరలిపోవలసి ఉంది….” (ఖుర్ఆన్).
“నా ప్రియ సోదరులారా! దైవప్రవక్త (సల్లం) దైవధర్మాన్ని స్థాపించారు. దైవమార్గంలో తన శక్తిసామార్థ్యాలన్నీ ధారపోసి దైవసందేశాన్ని నలుమూలలా వ్యాపింపజేశారు. అప్పటి దాకా ఆయన్ని అల్లాహ్ సజీవంగా ఉంచాడు.”
“దైవప్రవక్త (సల్లం) మనకు ఋజుమార్గం చూపించారు. అజ్ఞానంధకారం పటాపంచలు చేసి జ్ఞానజ్యోతి ప్రసాదించారు. ఇలాంటి పరిస్థితిలో ఎవరయితే దైవధర్మాన్ని విడనాడి దుర్మార్గంలో పడిపోతారో వారే దానికి బాధ్యులవుతారు.”
“సోదరులారా! అల్లాహ్ కి భయపడండి. ఆయన్నే నమ్ముకోండి. ఆయన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరు. దైవధర్మానికి సహాయపడుతూ, దాని వృద్ధీవికాసాల కోసం పోరాడేవారికి అల్లాహ్ తప్పకుండా సహాయం చేస్తాడు.”
“దైవగ్రంథం మన మధ్య ఉంది. అదే మన పాలిట జ్యోతిర్మండలం. మన కోసం అల్లాహ్ ధర్మసమ్మతం చేసినవి, నిషేధించినవి అన్నీ అందులోనే ఉన్నాయి.”
హజ్రత్ అబూ బక్ర్ (రజి) ప్రసంగంతో ముస్లింలకు కాస్తంత ధైర్యం వచ్చింది. దుఃఖంతో క్రుంగిపోయినవారి హృదయాలకు కాస్త ఊరట చేకూరింది. విషాద మేఘాలు మెల్లమెల్లగా విడిపోసాగాయి.
హజ్రత్ అబూ బక్ర్ (రజి) ఖుర్ఆన్ లోని ఈ సూక్తులు పేర్కొన్నప్పుడు అవి ఇప్పుడే అవతరించాయా అనిపించింది ముస్లింలకు. దాంతో వారు పుట్టిన ప్రతిజీవీ గిట్టక తప్పదన్న యధార్థంతో పాటు, దైవప్రవక్త (సల్లం) దివంగతులైనప్పటికీ నిత్యజీవుడయిన అల్లాహ్ ని ఆరాధన మాత్రం నిరంతరం కొనసాగాలన్న వాస్తవాన్ని గ్రహించారు. ఈ భావనే వారికి సహనాన్ని, స్థయిర్యాన్ని ఇచ్చింది.
హజ్రత్ ఉమర్ (రజి) ఈ ప్రసంగం వినగానే కళ్ళుతిరిగి క్రింద పడిపోయారు. తర్వాత వెంటనే స్పృహలోకి వచ్చి, “దైవప్రవక్త (సల్లం) దివంగతులయ్యారనడంలో ఇక నాకెలాంటి సందేహం లేదు” అని భావించారు మనసులో.}
అప్పటివరకు శోకపరితప్త హృదయాలతో ఎటూ పాలుపోకుండా ఉన్న సహాబా (రజి)కు, హజ్రత్ అబూ బక్ర్ (రజి) గారి ఈ ప్రసంగం విని నిజంగానే దైవప్రవక్త (సల్లం) పరమపదించారనే నమ్మకం కుదిరింది.
హజ్రత్ అబ్బాస్ (రజి) ఈ సన్నివేశాన్ని ఆయన మాటల్లో ఇలా వివరిస్తున్నారు:
“దైవసాక్షి! ప్రజలకు ఈ ఆయత్ అవతరించిందన్నదే తెలియదన్నట్లుగా ఉంది అప్పుడు. చివరికి హజ్రత్ అబూ బక్ర్ (రజి) ఈ ఆయత్ ను పఠించాగానే ప్రజల దృష్టి దాని వైపునకు మరలింది. ఎవరి నోట విన్నా ఈ ఆయత్ నే పఠిస్తున్నారు.”
హజ్రత్ సయీద్ బిన్ ముసయ్యిబ్ (రజి), హజ్రత్ ఉమర్ (రజి) ఇలా చెబుతూ ఉండగా నేను విన్నానని తెలిపారు:
“దైవసాక్షి! అబూ బక్ర్ (రజి) ఈ ఆయత్ ను పఠించగా విన్నంతనే నేను, మట్టి కొట్టుకుపోయానా అన్నట్లనిపించింది (లేదా నా నడ్డి విరిగినట్లనిపించింది). నా కాళ్ళు నన్ను పైకి లేవనీయలేదు. అలా కూర్చుని ఉన్నవాడినల్లా ఆ ఆయత్ విని దైవప్రవక్త (సల్లం) నిజంగానే మరణించారని తెలిసి అక్కడనే కుప్పకూలి పడిపోయాను.”
శవ సంస్కారాలు (స్నాన ఖననాలు)
ఇటు మహాప్రవక్త (సల్లం)ను ఖననం చేయనేలేదు. అటు ఆయన (సల్లం) నాయకత్వ బాధ్యత విషయంలో మత భేదాలు తలెత్తాయి. ‘సకీఫా బనీ సాయిదా’లో ముహాజిర్లు మరియు అన్సారుల నడుమ అభిప్రాయభేదం ఏర్పడి వారు వాగ్వివాదాలకు దిగారు. చివరకు ఏకాభిప్రాయంతో హజ్రత్ అబూ బక్ర్ (రజి)గారే ఆయన (సల్లం) ప్రతినిధిగా ఖలీఫా కావాలనే నిర్ణయానికి వచ్చారంతా. ఈ వాదోపవాదాల నడుమ సోమవారం రోజంతా గడిచిపోయింది. ఆ రాత్రి గడిచి తెల్లవారిపోయింది. ఈ రోజు మంగళవారం. అప్పటి వరకు మహాప్రవక్త (సల్లం) భౌతికకాయం చారల అంచుగల ఓ యమనీ దుప్పటితోనే కప్పబడి ఆయన పడకపైన్నే ఉంది. ఇంటివారు తలుపు మూసేసి బయట నుండి గడియ పెట్టేశారు.
మంగళవారం రోజున దైవప్రవక్త (సల్లం)కు ఆయన ధరించి ఉన్న దుస్తులతోనే ‘గుస్ల్’ ఇవ్వడం జరిగింది. గుస్ల్ ఇచ్చే వారిలో (స్నానం చేయించినవారిలో) హజ్రత్ అబ్బాస్, హజ్రత్ అలీ, హజ్రత్ అబ్బాస్ గారి ఇద్దరు కుమారులు ఫజ్ల్ మరియు ఖష్మ్, మహాప్రవక్త (సల్లం) స్వతంత్రులు గావించిన బానిస షక్రాన్, హజ్రత్ ఉసామా బిన్ జైద్ మరియు అవస్ బిన్ కౌలీ (రజి)లు ఉన్నారు.
హజ్రత్ అబ్బాస్, ఫజ్ల్, ఖస్మ్ లు ఆయన (సల్లం) భౌతికకాయాన్ని ప్రక్కలకు దొర్లిస్తూ ఉండగా ఉసామా మరియు షక్రాన్ లు పై నుండి నీరు పోస్తున్నారు. హజ్రత్ అలీ (రజి) ఆయనకు గుస్ల్ ఇచ్చారు. హజ్రత్ అవస్ (రజి) దైవప్రవక్త (సల్లం) భౌతికకాయాన్ని తన వక్షస్థలంపై ఆనించుకొని ఉన్నారు.
ఆ తరువాత ఆయన్ను మూడు తెల్లటి యమనీ దుప్పట్లతో ‘కఫన్’ ఇచ్చారు. వాటిలో చొక్కా మరియు పగ్డి (తలపాగా) ఏదీ లేదు. కేవలం ఆ దుప్పట్లతోనే ఆయన భౌతికకాయాన్ని చుట్టివేశారు.
దైవప్రవక్త (సల్లం)ను ఎక్కడ ఖననం చేయాలి అన్న విషయంలో సహాబా (రజి)ల సలహాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే హజ్రత్ అబూ బక్ర్ (రజి) మాత్రం ఆ విషయాన్నీ ఇలా తేల్చేశారు.
“నేను దైవప్రవక్త (సల్లం)ను, ‘ఏ ప్రవక్తనైనా ఆయన ఖననం అయిన ప్రదేశం నుండే లేపడం జరిగింది (అంటే ఏ ప్రవక్త అయినా తానూ చనిపోయిన ప్రదేశంలోనే ఖననం చేయబడ్డారు అని అర్థం).’ అని చెబుతూ ఉండగా విన్నాను” అని చెప్పారు.
ఈ తీర్పు తరువాత హజ్రత్ అబూ తల్హా (రజి) ఆయన (సల్లం) ఏ పడకపై పరమపదించారో దాన్ని అక్కడ నుండి తొలగించారు. ఆ ప్రదేశం క్రిందనే గోరి త్రవ్వడం జరిగింది. ఆ గోరి ‘లహద్’ గోరి. అంటే ‘బగ్లీ’ (క్రింది భాగంలో ప్రక్కగా శవం పట్టేటంత ప్రదేశాన్ని త్రవ్వి తీసిన గోరి అని అర్థం).
ఆ తరువాత వంతులవారీగా పదేసి మంది సహాబాలు హుజ్రా (గది)లోనికి వెళ్ళి జనాజా నమాజు చేసి బయటకు రానారంభించారు. నమాజు చేయించడానికి ఏ ఇమామ్ లేడు. అందరికంటే ముందు ఆయన ఖన్వాదా (కుటుంబం బనూ హాషిమ్) నమాజ్ చేశారు. పిదప ముహాజిర్లు, తరువాత అన్సారులు, ఆ తరువాత స్త్రీలు అందరికంటే వెనుకగా పిల్లలు ‘నమాజె జనాజా’ చేశారు.
నమాజె జనాజా చేయడంలో మంగళవారం రోజంతా గడిచిపోయింది. బుధవారం రాత్రి (అంటే మరుసటిరోజు బుధవారం అన్నమాట) వచ్చేసింది. ఆ రాత్రే ఆయన (సల్లం)గారి భౌతికకాయాన్ని మట్టిలో కలిపివేశారు. హజ్రత్ ఆయిషా (రజి) గారు, “దైవప్రవక్త (సల్లం) ఖననం ఎప్పుడు జరిగిందో మాకు తెలియనే లేదు. బుధవారం మధ్యభాగంలో పారల చప్పుళ్ళు మాత్రం మాకు వినిపించాయి” అని అన్నారు.