ప్ర: అల్లాహ్ తన అంతిమ ప్రవక్త(స)కు ప్రసాదించిన ఔన్నత్యాన్ని కొనియాడటంలో మనం హద్దు మీరి పోవటం సమంజసమేనా?
జ: మహనీయ ముహమ్మద్(స) సృష్టిశ్రేష్ఠులు, మానవోత్తములు. మానవ మహోపకారి. ఇందులో సందేహానికి ఆస్కారమే లేదు. అయితే ఆయన్ని(స) ప్రస్తుతిస్తున్నప్పుడు మనం అతిశయిల్లటం మాత్రం సమంజసం కాదు. క్రైస్తవులు మర్యం కుమారుడగు ఈసా (యేసు-అ) విషయంలో మితిమీరి పోయినట్లుగా మనం మితిమీరి పోవటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఇలాంటి ‘అతి’ నుండి మహా ప్రవక్త (స) మనల్ని వారించారు. ఆయన (స) ఇలా అన్నారు: ”నన్ను పొగడటంలో అతిశయిల్లకండి (హద్దుమీరకండి) క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసాను పొగుడుతూ మితిమీరి పోయినట్లుగా మీరు మాత్రం చేయరాదు సుమా! నేను అల్లాహ్ దాసుడను. కాబట్టి మీరు నన్ను అల్లాహ్ దాసుడు(అబ్దుల్లాహ్) దైవప్రవక్త(రసూల్) అని అనండి.” (బుఖారీ)
ప్ర: భయం (ఖౌఫ్) ఎన్ని రకాలు ?
జ: 1) తప్పనిసరి భయం:- ఇది అల్లాహ్కు భయపడాల్సినది. ఎందుకంటే విశ్వాసానికి(ఈమాన్కు) మూల సూత్రాలు రెండు. ఒకి: పరిపూర్ణమైనప్రేమ. రెండవది: పరిపూర్ణమైన భయ భక్తులు.
2) భాగస్వామ్య భయం:- అంటే ముష్రిక్కుల మిథ్యాదేవుళ్ళకు ఊరకే భయపడిపోవటం, వారు తమకు ఎక్కడ కీడు తలపెడతా రోనని ఆందోళన చెందటం.
3) అధర్మమైన భయం:- అంటే జనులకు భయపడి విధిగా చేయవలసిన పనులను వదలి పెట్టడం లేదా అధర్మమైన పనులు చేయటం.
4) ధర్మసమ్మతమైన భయం:- స్వాభావికంగా ఏదైనా క్రూర మృగాల్ని భయంకరమైన జంతువును చూసి భయపడటం.
ప్ర: తవక్కుల్ (భరోసా,భారం, నమ్మకం) ఎన్ని రకాలు?
జ: తవక్కుల్ మూడు రకాలు.
1) వాజిబ్: అన్ని విషయాలలోనూ – అంటే ప్రయోజనకరమైన వాటిని పొందాలనుకున్నా, నష్టకరమైన వాటిని దూరం చేయాల నుకున్నా అల్లాహ్ పైనే భరోసా చేయాలి. ఆయన్నే నమ్ముకోవాలి.
2) హరామ్: ఇది రెండు రకాలు: మొదిది: షిర్కె అక్బర్- అంటే వస్తు కారకాలను పూర్తిగా నమ్ముకుని లాభం కలిగినా, నష్టం వాటిల్లినా వీటి వల్లనే సాధ్యం అని భావించటం. రెండవది: షిర్కె అస్గర్ – ఉపాధి విషయంలో ఎవరయినా ఒక వ్యక్తిని పూర్తిగా నమ్ముకోవటం. ముంచినా తేల్చినా ఇక అతనే అని మనసులో పెట్టుకుని అదేపనిగా ఆలోచిస్తూ ఉండటం.
3) ధర్మసమ్మతం: ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఏదేని కార్యంపై తన ప్రతినిధిగా నియమించటం, ఆ వ్యవహారాన్ని అతను చక్కబెడతాడని నమ్మటం, క్రియవిక్రయాలలో సంబంధించి వేరొక వ్యక్తిపై భరోసా చేయటం.