రమజాన్‌ అను నేను…

 

ప్రియ సోదరులారా! గడిచిన 11మాసాల్ని ఒక సారి నెమరు వేసుకోండి. పుణ్యాలు ఎక్కువున్నాయో? పాపాల చిట్టా పెద్దదిగా ఉందో సమీక్షించుకోండి. పాపం పాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. సమయం గడిచే కొద్దీ మార్పు వచ్చినట్లు, పాత బడిన కొద్దీ వస్తువు పాడయినట్లు రమజాను మాసపు పుణ్య కాలం దూరమయిన కొద్దీ బహుశా మనం ఇలా తయారయ్యామేమో. ఏది ఏమయినా ఈ మహా అతిథి మరొక్కమారు మమ్మల్ని ప్రేమ పూర్వకంగా పలుకరించడానికి, మన జీవితాల్ని పునీతం చెయ్యడానికి మన చెంతకు వచ్చింది. వరించిన వరం వలె అది మనల్ని దీవించాలనుకోంంది. రండి! అది ఇస్తున్న ప్రేమైక పిలుపును శ్రవణానందంగా విని శ్రద్ధాసక్తులతో పాటించే ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేద్దాం! రమజాన్‌ అను నేను…

సమయం గడిచే కొద్దీ మార్పు వచ్చినట్లు, పాత బడిన కొద్దీ వస్తువు పాడయినట్లు రమజాను మాసపు పుణ్య కాలం దూరమయిన కొద్దీ బహుశా మనం ఇలా తయారయ్యామేమో.

రమజాను అను నేను మీరందరూ ఎంతో ప్రేమించే మాసాన్ని. నా రాకతో స్వర్గ ద్వారాలు తెరవ బడతాయి. నరక ద్వారాలు మూసి వేయ బడతాయి. దుష్టులయిన షైతానులను బంధించడం జరుగుతుంది. విస్వాసుల హృదయాలు పులకిస్తాయి, తఖ్యా లేమితో బీటలు వారిన వారి మనో సీమలు చిగురిస్తాయి. వాడిపోయిన వారి మనసు మందారాలు తిరిగి వికసిస్తాయి. నా మొదటి దశకం కారుణ్యం, నా రెండవదశకం క్షమాభిక్ష, నా చివరి దశకం నరకాగ్ని నుండి ముక్తి. ప్రపంచమంతా ప్రజల్లో ప్రేమ పుష్పాలు ఫూయించే పునీత కాలాన్ని నేను. నన్ను నాలా ఆదరించి, గౌరవించిన వారే ధన్యులు. నా కాను కలను ఖాతరు చెయ్యనివారే సిసలయిన దౌర్భాగ్యులు.

నేను వ్యాపారు వ్యాపారాన్ని పెంచే మాసాన్ని కాను. పండుగ, పబ్బాల పేరుతో నెల సాంతం షాపింగ్‌ మాల్లో గడిపేసే మాసాన్ని కాను. మిమ్మలి మీ ప్రాపంచిక జీవితానికి దూరం చేసి సన్యాసులుగా, సర్వ సంఘ పరిత్యాగులుగా చెయ్యడం నా ఉద్దేశ్యం కానే కాదు. మీరూ ప్రాపంచి జీవితంలోని మీ వాను పూర్తిగా తీసుకోవడంతో పాటు పరలోకం కోసం సయితం కావాల్సిన సరంజామాను, అవసర మయిన సామగ్రిని సమకూర్చుకోవాలన్నదే నా కోరిక.

మిమ్మల్ని ఆకలి దాహాలకు గురి చెయ్యడానికి నేను రాలేదు, మీలో అత్యుత్తమ స్థాయి దైవభీతిని, నైతిక రీతిని నూరి పోయడానికే నేను వచ్చాను. నా రాక శుభప్రదం, నేను ఉన్నన్నాళ్ళు శుభాలు వెల్లువలా మీ జీవితాల్లో ప్రవహిస్తూనే ఉంటాయి. నాలోని ఒక్కో ఘడియ వెయ్యి ఘడియలతో సమానం. నాకు ప్రసాదించ బడిన గౌరవాదరణలు అసమానం.
నేను సియామ్‌, ఖియామ్‌ల మాసాన్నే గానీ, రియా, నిఫాఖ్‌ల మాసాన్ని కాను. జకాత్‌, పేరుతో మీకు పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టడానికి నేను రాలేదు. మీరు సహరీ, ఇఫ్తార్‌లలో అవసరానికి మించిన ఆహార పదార్థాలతో అనర్థం పాలవ్వడం సుతరామూ నాకు ఇష్టం లేదు. షైతాన్‌ సోదరులుగా మీరు మిగిలి పోరాదు అన్నదే నా తపనంతా. అల్లాహ్‌ దుబారా ఖర్చు చేసేవారిని ఇష్ట పడడు అని మీకూ తెలిసిందే.

మీరు పాక్షిక విభేదాల్లో పడి సువర్ణవకాశాన్ని చేజార్చుకోవడం; ఇందు కోసం నేను రాలేదు. ‘బిందు బిందువు మహా సింధువవుతుంది’ అన్న మాట పుణ్యం విషయంలో ఎంత సత్యమో, పాపం విషయంలో సయితం అంతే సత్యం. నేను మీ వద్దకు కదలి వచ్చిన కరుణాకరుడి కారుణ్య కడలిని. కడవ, కడవగా నన్ను ఒడిసి పట్టుకొని భద్ర పరచుకోండి. నేను ప్రేమ పవనమయి వీస్తాను, నేను వరాల వానయి కురుస్తాను. నా ప్రతి చినుకు స్వాతి చినుకే, మీరు ఆల్చిప్ప అయి నన్ను ముత్యంలా మార్చుకోవాలి. తామరాకు స్వభావుల్ని సయితం నేను వరిస్తాను, కాని తళుక్కున మెరిసి వారిలో వచ్చిన మార్పు మాయమయి పోతుంది.

ఉపవాసం ఉండి పగలంతా పడక మీదే గడిపేయండి, ఇందు కోసం నేను రాలేదు. ఇప్తార్‌ చేసి ఇషా తరావీహ్‌లను సయితం విస్మరించండి, ఇందు కోసం నేను రాలేదు. అల్లాహ్‌ కోసం మీరుండే ఒక్క రోజు ఉప వాసం మిమ్మల్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాలంతి దూరం చేస్తుంది అన్న ప్రవక్త (స) వారి మాట మీ చెవిన పడే ఉంటుంది. మీ గత పాపాల్ని ప్రక్షాళించేంతటి శక్తి గల ఉపవాసం పట్ల మీరు కనబరుస్తున్న ఈ సవితి వైఖరి ఏమంత బాగో లేదు. నేను మీ మధ్య బహు కొద్ది రోజలు మాత్రమే ఉంటాను. నేను ఒక సారి వెళ్ళి పోయానంటే మళ్ళీ రావడానికి 11 నెలలు పడుతుంది. సమయం ఎంత సుదీర్ఘమ యినా నేను వస్తానన్నది గ్యారంటీ. కానీ మీరుంటారన్న గ్యారంటీ లేదు.

నేను దైవగ్రంథాలు అవతరించిన పవిత్ర మాసాన్ని. నేను మీ జీవిత పుస్తాన్ని మీ కుడి చేతిలో ఇప్పించే మాసాన్ని. నేను నిత్య చైతన్య సుధా ఝరిని. నాలో ఖుర్‌ఆన్‌ పారాయణాలు, శ్రవణానంద పఠనాలు నిత్యం ఉంటాయి. భక్తి పరులకు అదే ఆహారం, అదే వారి మనో వసంతం, అదే వారి ఆత్మ జ్యోతి, ఆదే వారి చింతలకు చికిత్స, అదే వారి దుఃఖాల కు దివ్య ఔషధి. అదే మోడు వారిన వారి జీవితాలకు జీవ జలం. అట్టి మహిమాన్విత గ్రంథాన్ని వీడి వింత విచిత్ర పరికరాలతో విలువయిన సమయాన్ని వృధా పర్చుకుంటున్న ఈ వింత జీవులు ఎవరు? జీవితం లో ఆట విడుపు ఉండాలి, కానీ జీవితాన్నే ఆటగా మార్చుకున్న ఈ విచిత్ర ప్రాణులు ఎవరు? వీరు నా వారా? కాని వారా?

ఉపవాసం ఉండి ఘనకార్యం చేశాము అన్న భ్రాంతి నుండి బయట పడండి. ఈ సద్బుద్ధిని, అటువిం సదవకాశాన్ని మీకనుగ్రహించిన అల్లాహ్‌కు వేన వేల కృతజ్ఞతలు తెలుపుకోండి. ఉపవాసానికి బదులు అల్లాహ్‌ మీ నోటి నుండి వచ్చే దుర్వాసను కస్తూరీ సువాసకన్నా ఘన స్థాయి ప్రసాదించాడని మరువకండి. ఉపవాసం ఉండి మీరేదో మేలు చేశారనుకొందురు, వాస్తవంగా విశ్వాస భాగ్యంతోపాటు ఉపవాసం పాటించుకునే వేసులుబాటును ఇచ్చి అల్లాహ్‌ చేసిన మేలు అసలు మేలు అని గుర్తుంచుకోండి. రేపు ప్రళయ దినాన మీరు చేసిన నిర్వా కాలకు బదులు మీ సత్కర్మలన్నీ బాధితుల్లో పంచేయ బడతాయి. అప్పుడు మీ వద్ద ఒక్క ఉపవాసం మాత్రమే ఉండి పోతుంది. మీ నిర్వాక వాతన పడిన బాధితులు ఇంకా ఎంతో మంది మిగిలున్నా ఒక్క ఉపవాస కారణంగా వారందరి బాధ్యత స్వతహాగా అల్లాహ్‌ తీసుకొని మిమ్మల్ని ‘రయ్యాన్‌’ అనే తలుపు గుండా సగౌరవంగా స్వర్గంలో ప్రవేశింపజేసే అల్లాహ్‌ మేలు ఘనమయినది. గొప్పలు పోవడం మాని అల్లాహ్‌ గొప్పలు చెప్పుకోండి, ఆయన ఘనతా ఔన్నత్యాలను వేనోళ్లా కొనియాడండి.

ప్రియమయిన యువకుల్లారా! ”శక్తి స్థోమత ఉండే వ్యక్తి వివాహం చేసుకోవాలి. లేదంటే ఉపవాసాన్ని ఆశ్రయించాలి. అది చూపును రక్షిస్తుంది, మర్మాగాన్ని కాపాడుతుంది” (ముస్లిం) అని ప్రవక్త (స) వారు చెప్పిన మాట మీకు గుర్తే ఉంటుంది. నేను ఉపవాసాల మాసాన్ని, ఉపవాసం డాలు వండిది. అది మిమ్మల్ని సకల విధాల చెడు వ్యసనాల నుండి కాపాడుతుంది. హరామ్‌ అనేది ఎప్పుడూ హరామే. నాకు పూర్వం కూడా హరామే, నేను నిష్క్రమించినా హరామే. అలాంటిది నేనుండగా, ఉపవాసముండి కూడా మీరు అశ్లీల విషయాలను పరిత్యజించడం లేదు, అసభ్య పరాచికాలను వదలడం లేదు, ప్రియురాలితో పిచ్చి సంభాషణలు మానుకోవడం లేదు. అయ్యో! మీకేమయింది, రమజాను మాసంలో సయితం మీరు సంగీత వాయిద్యాలను ఆశ్రయిస్తున్నారే, అశ్లీల దృశ్వాలను చూస్తూనే ఉన్నారే. కంపు అయిన ఇవి ఇంకనూ మీకు ఇంపుగానే వినసొంపు గానే ఉన్నాయే. అల్లాహ్ మీ తప్పిదాలను మన్నించుగాక! మీకు సత్క ర్మలు చేసుకునే సద్బుద్ధిని అనుగ్రహించు గాక!

నేనున్నాను అన్న భరోసాతో చెబుతున్నాను: పశ్చాత్తాపం చెందిన మనస్సుతో, అశ్రువులు నిండిన కళ్ళతో మీ ప్రభువు సన్నిధిన మోకరి ల్లండి. పూర్తి ఏకాగ్రతతో ఆయన వైపునకు మరలండి. రమాజను మాసంలోని ప్రతీ రాత్రి అనేకానేక మందిని నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదించే ఆ మోక్ష ప్రదాత, ప్రతి రోజు యేడాది సాంతం ‘రాత్రి తప్పు చేసిన వారున్నారా! రండి నేను మీ తప్పులను మన్నిస్తాను, ఉదయం తప్పు చేసిన వారున్నారా? రండి నేను మీ తప్పులను మన్నిస్తాను’ అని క్షమాశీలి మీకిస్తున్న పిలుపు ఇది: ”తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న ఓ నా దాసులారా! నా కారుణ్యం యెడల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ సకల పాపాలను మన్నిస్తాడు. నిస్సందేహంగా ఆయన పరమ క్షమాశీలి, అపార దయా నిధి”. (జుమర్‌; 53)
నేను మీ ప్రాంగణంలో లైలతుల్‌ ఖద్ర్‌ శుభాలతో పాదం మోపుతాను. లైలతుల్‌ ఖద్ర్‌ రాత్రి ఒక్క ఘడియ 30 వేల ఘడియల కంటే విలువయినదిగా మారి పోతుంది. నాలోని క్షణక్షణం క్షమా వర్షం కురుస్తూనే ఉంటుంది. నాలో కురిసే క్షమను మీరు కోరుకున్నట్లే, మీ నుండి మీ తల్లిదండ్రులు, భార్య పిల్లలు, బంధు మిత్రులు, ఆప్తులు, సహుద్యోగులు, స్నేహితులు, మీ వద్ద పని చేసే వారు సయితం కోరుకుంటారు. వారిని క్షమించడం అలవాటు చేసుకోండి. కోపాన్ని ద్రిగ మింగండి, అందరి యెడల ఉదార వైఖరి కలిగి వ్యవహరించండి. విశ్వాసం తర్వాత స్వర్గానికి అర్హుల్ని చేసేది మీ ఉత్తమ నడక, నడవడికే అని గుర్తించండి. ”బంధుత్వాన్ని బల పర్చేవారిని నేను బల పరుస్తాను, దాన్ని విచ్ఛిన్న పరచిన వారిని నేను విచ్ఛిన్న పరుస్తాను” అని స్వయం అల్లాహ్‌ా మాిచ్చాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

నేను మీ ముంగిట వాలిన దైవ అతిథిని. నన్ను మీరు సత్కరించా లంటే, సహరీ, ఇఫ్తార్‌ వేళల్లో షడ్రుచులు మేళవించిన ఆహార పదా ర్థాలు పేర్చడం వల్ల కుదరదు. నిజంగా మీరు నన్ను సత్కరించాలంటే, ఖుర్‌ఆన్‌ పారాయణాల ద్వారా,తరావీహ్‌ నమజుల ద్వారా, దాన ధర్మాల ద్వారా, ఏతికాఫ్‌, లైలతుల్‌ ఖద్ర్‌ అన్వేషణ ద్వారా, నిరతం అల్లాహ్‌ నామ స్మరణ చెయ్యడం ద్వారా మాత్రమే కుదురుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను సత్కరించడం అంటే మీ సత్కారానికి, ప్రభువు మీకు చేసే సన్మానానికి మార్గం సుగమం చేసుకోవడమే. నన్ను మీరు ఎంతగా సత్కరిస్తారో అల్లాహ్‌ మీ యెడల అంతకు మించి ప్రసన్నుడవుతాడు. ఈ ప్రపంచానిదేముంది,ఇదో మాయా వస్తువు, మోసం, ఆట విడుపు అంతే. అసలు జీవితం పరలోక జీవితం. అసలు సంతోషం పరలోక సంతోషం, అసలు విజయం పరలోక విజయం. అవును, ‘ఎవరు నరకాగ్ని నుండి కాపాడ బడి స్వర్గంలో ప్రవేశం కల్పించ బడ్డారో వారే మహోన్నత విజయాన్ని సొంతం చేసుకున్న వారు”. (ఆల్‌ ఇమ్రాన్‌;185)

నేను దుఆల మాసాన్ని కూడా. లేవండి! అల్లాహ్‌తో మీ బాధల్ని చెప్పు కోండి. మీరు పడ్డ కష్టాల్ని, నష్టాల్ని ఆయనతో షేర్‌ చేసుకోండి. మీ మొరలను ఆలకించేవాడు ఆయన, మీ అక్కరలను తీర్చేవాడు ఆయన. బర్మాలో జరుగుతున్న దాష్టికాన్ని, ఫలస్తీనాలో సాగుతున్న పైశాచికాన్ని, సిరియాలో రగులుతున్న మారణ హోమాన్ని, ఇరాక్‌లో సాగుతున్న కీచక క్రీడను, యమన్‌లో రాజేయబడిన నిప్పు కుంపిని, జాతీయ స్థాయిలో జరుగుతున్న దౌర్జన్యాన్ని, అంతర్జాతీయ స్థాయిలో జోరు మీదున్న దుష్ప్ర చారాన్ని – అంతా అల్లాహ్‌తో చెప్పుకొని ఏడ్వండి. అంతా వినేవాడు, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఇచ్చేవాడు ఆయనే. ఆయన అందరికన్నా అధిక ప్రేమ గలవాడు, అందరికన్నా అధిక కరుణ గలవాడు, అందరి కన్నా అధిక క్షమ గలవాడు, అందరికన్నా ఎక్కువగా మనల్ని రక్ష్షించే వాడు, అందరికన్నా ఎక్కువగా మనల్ని అనుగ్రహించే వాడు. అందరి కన్నా గొప్ప ఉపాధి ప్రదాత, విధి విధాత, మహోన్నత ఆర్ష్‌కి యజమాని.

మీరందరూ ఆయన దాసులే. ఆయన దాసీ, దాసుల సంతానమే. మీ సకల వ్యవహారాలు ఆయన హస్తగతం అయి ఉన్నాయి. మీ విషయంలో జారి చేయాల్సిన ఆదేశాలు ఆయనెప్పుడో జారీ చేసేశాడు. మీకు సంబంధి ఆయన చేసిన ఏ తీర్పయినా సరే న్యాయ బద్ధమే. ఆయనకు చెందిన ప్రతి నామంతో మీరు ఆయన్ను అర్థించాలి. ఆ నామాన్ని స్వతహాగా ఆయన పేర్కొని ఉన్నా, సృష్టిలో ఏ ఒక్కరి ఆయన నేర్పించి ఉన్నా, లేదా తన వద్దనున్న నిగూఢ జ్ఞానంలో దాన్ని ఆయన పొందు పరచి ఉన్నా – ఆయనకు మాత్రమే చెందిన అత్యుత్త నామాల ఆధాంగా మీరు ఆయన్ను అడక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే, మీరంతా ఆయన దరికి చెందిన భిక్షగాళ్ళే. మీరంతా మార్గభ్రష్టులే ఆయన మార్గం చూపిన వారు తప్ప. మీరంతా నగ్న శరీరులే ఆయన బట్ట తొడిగించిన వారు తప్ప,మీరంతా ఆకలిగొన్న వారే ఆయన తినిపిం చిన వారు తప్ప.

మీరు దివారాత్రులు పాపాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మన్నిస్తూనే ఉంటాడు. మీరు మీకు పూర్వం ఉన్న వారు, మీ తర్వాత ప్రళయం వరకూ వచ్చే వారందరూ కలిసి ఓ గొప్ప ధర్మపరాయణుడి స్వచ్ఛమ యిన హృదయం వలే మారి పోయినా దాని వల్ల ఆయన సామ్రాజ్యాధి కారంలో ఇసుమంత పెరుగుదల జరగదు. మీరు మీకు పూర్వం ఉన్న వారు, మీ తర్వాత ప్రళయం వరకూ వచ్చే వారందరూ కలిసి ఓ నీచాతి నీచమయిన వ్యక్తి నికృష్ట హృదయం వలే మారి పోయినా దాని వల్ల ఆయన సామ్రాజ్యాధికారంలో ఇసుమంత తరుగుదల జరగదు. మీరు మీకు పూర్వం ఉన్న వారు, మీ తర్వాత ప్రళయం వరకూ వచ్చే వారం దరితోపాటు జిన్నులు కూడా వచ్చి కలిసి ఒకే మైదానంలో నిలబడి ఆయన్ను వేడుకున్నా, ఆయన అందరికి కావాల్సినవన్నీ ప్రసాదించేసినా ఆయన నిధి నిక్షేపంలో, సముద్రంలో సూది ముంచి తీస్తే ఎంత వెలితి ఏర్పడుతుందో అంత కూడా ఏర్పడు. మీరు చేసిన సత్కర్మలకు మించి ఆయన మిమ్మల్ని సన్మానిస్తాడు. మీ జీవితంలో ఏ కాసింత మేలు ఉన్నా అది ఆయన కృపాకరమే. అందుకు మీరు ఆయనకు కృతజ్ఞతాభినంద నలు తెలుపుకోవాలి. అదే ఏదయినా చెడు, కీడు జరిగితే దానికి బాధ్యులు మీరే, మిమ్మల్ని మీరే నిందించుకోవాలి.
ఫీ అమానిల్లాహ్‌!

Related Post