రాజో ఋతువు రమజాన్‌

ramadan-canada
 షేఖ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఉమ్రీ    
   
శిశిర రుతువులో ఆకులన్నీ రాలిన తర్వాత వసంత రుతువు ఆగమనంతో ఎలాగైతే ప్రకృతిలో చైతన్యం నిండుతుందో, వసంత రుతువు గమనంతో ప్రకృతికాంత ఎలాగయితే పుల కించి పరవశిస్తుందో, చెట్టు చిగురించి లేలేత చిగుళ్ళతో సువాసనలు వెదజల్లుతూ ఎలాగయితే ప్రకృతిశోభను మరింత ఇనుమడింపజేస్తాయో, కోయిలలు  నూతనోత్సాహంతో మధుర గీతాలపనలతో ఎలాగయితే స్వాగతం పలుకుతాయో, తుమ్మె దలు ప్రతి పువ్వును స్పృశిస్తూ మదువును గ్రోలి ఝంకార నాదంతో ఆనందాన్ని వ్యక్త పరుస్తాయో, ఆత్మ సుగుణాల సుమ వనాలను, మానవత్వపు మలయ పవనాలను కోల్పోయి కళా హీనమయిన మానవ జీవితాల్లో రమజాను మాసం ఓ కొత్త ఊపిరిని పోస్తుంది. ఈ రాజో రుతువు రాకతో మనిషి మనో మస్తిష్కాలు పులకిస్తాయి. అతనిలోని ఆత్మ సౌందర్యం ద్విగుణీ కృతమవుతుంది. అతని హృది మందారంలా విరబూస్తుంది. అతనిలో భక్తీభావాలు ఉప్పొంగుతాయి. రమాజన్‌ మాసం అసాంతం సమాజమంతా పుణ్యాల పచ్చ తోరణాలతో కళకళ లాడుతుంది. ఇంతటి పుణ్యప్రదమైన మాసం ఒంటరిగా రాదు. అచ్చమైన దైవానుగ్రహాల్ని, స్వచ్ఛమైన దివ్యగ్రంథ పారాయణాల్ని, వేయి నెలలకన్నా ఘనతరంగా నిలిచే పండు వెన్నెల్ని వెంట బెట్టుకొస్తుంది. సుభక్తాగ్రేసరుల భక్తీప్రత్తులకు, విశ్వంలోని విశ్వాసుల సంస్కృతీ సంప్రదాయాలకు, వారి మధ్య గల సఖ్య తకు, ఐక్యతకు ఆలంబనగా నిలుస్తుంది రమజాన్‌.
రమజాన్‌ మాసం-సమస్త మానవులకు మార్గదర్శకం – దివ్యఖుర్‌ఆన్‌ అవతరించిన పవిత్ర మాసం.
రమజాన్‌ మాసం-మనిషి ఆత్మప్రక్షాళనకు, వారిలో భక్తీపారవశ్యాలు పొంగి పొర్లేందుకు సువర్ణావకాశం.
రమజాన్‌ మాసం-దైవదాసుల్లో దాతృత్వ గుణాన్ని రగుల్గొల్పి సమా జంలోని బడుగు బలహీన వర్గాల పక్షం వహించేలా తర్పీదునిచ్చే శిక్షణాలయం.
రమజాన్‌ మాసం- లైంగిక కోర్కెలకు కళ్ళెం వేసి, మనిషి శీల నిర్మా ణానికి, సత్సమాజ స్థాపనకు పునాది వేసే పుణ్యకాలం.
రమజాన్‌ మాసం-మనుషుల్లో అణుకువ, దైవభీతి, వినయ వినమ్రతల ను సృజింపజేసి వారిని శాంతి ప్రియులుగా మలిచే మేలిమి ఘట్టం.
రమజాన్‌ మాసం-మనిషిని నరకాగ్ని నుండి కాపాడి, స్వర్గ ప్రవేశానికి మార్గం సుగమంమ చేసే అద్భుత సాధనం.
  ఇంతటి మహత్తరమయిన మాసం అతి త్వరలో రెక్కలు కట్టుకొని మరి వచ్చి మన ముంగిట వాలనున్నది. కనుక మనం శుభాల సరో వరమయిన, వరాల వసంతమయిన రమజాను మాసాన్ని మనః పూర్వ కంగా స్వాగతం పలకాల్సిన, దాని ఛత్ర ఛాయల్లో మన జీవితాల్ని, వ్యక్తిత్వాల్ని చక్కదిద్దుకోవాల్సిన సమయమిది. ”అల్లాహుమ్మ బారిక్‌ లనా ఫి రజబ వ షాబాన్‌ వ బల్లిగ్నా రమజాన్‌” – ‘ఓ అల్లాహ్‌! రజబ్‌, షాబాన్‌ మాసాలలో మాకు శుభాన్ని ప్రసాదించు. మేము రమజాను మాసాన్ని పొందే భాగ్యాన్ని మాకనుగ్రహించు’ అని దీనాతి దీనంగా వేడుకోవాల్సిన తరుణమిది.
ఓ నిత్యజీవుడా! మేము నిన్ను నిజ ఆరాధ్య దైవంగా నమ్మాము. సార్వ భౌమాధికారం నీదే. మేళ్ళన్నీ నీ చేతిలోనే ఉన్నాయని అంగీకరిస్తు న్నాము. నీ ఆజ్ఞల్ని పాటించడంలో మా వల్ల జరిగిన పొరపాట్లను మన్నించు. రాజో రుతువు రమజాను మాసాన్ని సద్వినియోగించేకునే టట్లు మమ్మల్ని దీవించు.
ఓ దయానిధీ! నీ అవిధేయతకు పాల్పడి మాపై మేము ఎంతో అన్యా యం చేసుకున్నాము. నువ్వు తప్ప మాకు వేరే దిక్కెవరు స్వామీ! మమ్మల్ని క్షమించు, మాపై దయుంచు.
ఓ కృపాసాగరా! సమస్త మానవాళి మార్గదర్శనార్థం నీవు అవతరింప జేసిన నీ అంతిమ గ్రంథం ఖుర్‌ఆన్‌ ఘనతను, ఔన్నత్యాన్ని గుర్తించి, అది చూపే సవ్యమయిన బాటలో నడుచుకునే సత్బుద్ధిని ప్రసాదించు. దాని దివ్య సందేశ మహత్యాన్ని ఎరుగని నీ దాసులెందరో ఈ జగాన ఉన్నారు. వారి వరకు దాని అమృత ఆదేశాల్ని చేరవేసే భాగ్యాననుగ్ర హించు.
ఓ రాజాధిరాజా! నువ్వే మా మార్గదర్శివి. నీవు మార్గం చూపిన వారికి తప్ప ఎవరికీ సత్యధర్శనం సాధ్య పడదు. మమ్మల్ని రుజుమార్గాన నడి పించు, రుజుమార్గం మీద స్థిరంగా ఉంచు, రుజుమార్గంపైనే మాకు మరణాన్ని ప్రసాదించు.
ఓ క్షమాశీలుడా! సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యం గా చేసి పంపిన నీ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి అడుగుజా డల్లో మోక్షాన్ని పొందే అదృష్టాన్ని మాకనుగ్రహించు. ఆయన (స) వారి దివ్యోపదేశాలు ఎరుగని, ఆయన ఆదర్శాలు తెలియని ఎందరో నీ దాసులు ఈ పుడమిపై నివసిస్తున్నారు. వారి వరకు ఆయన పవిత్ర ప్రవచనాలను చేరవేసే ధైర్యాన్ని, మనో స్థయిర్యాన్ని మాకు ప్రసా దించు.
ఓ కీర్తిశేఖరా! మేము బలహీనులము. మమ్మల్ని నట్టేట ముంచాలని శాపగ్రస్తుడయిన షైతాన్‌, అతని అనుచర వర్గం కుయుక్తులు పన్నుతున్నది. వారి బారి నుండి మమ్మల్ని కాపాడి నీ ప్రత్యేక అర్ష్‌ నీడలో మాకు చోటుననుగ్రహించు. మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడి స్వర్గ వనాలలో విహరింపజెయ్యి. స్వర్గంలో నీ దివ్య దర్శనా భాగ్యంతో మమ్మల్ని పునీతుల్ని చెయ్యి స్వామీ! (ఆమీన్)

Related Post