ఈదుల్‌ ఫిత్ర్‌ చేయవలసినవి చేయకూడనివి

చేయవలసినవి
 ఉదయం పెందలాడే తలంటు స్నానం చేసి, ఉన్నంతలోనే మంచి దుస్తులు, కొత్త బట్టలు తొడుక్కుని ఈద్‌గాహ్‌ వైపు సాగిపోవాలి. ఇది ప్రవక్త (స) వారి సంప్రదాయం.
   వీలైనంతవరకు మంచి సువాసన పూసుకోవాలి. ఇల్లూ వాకిలిని కూడా శుభ్రంగా ఉంచాలి.
   ఈద్‌గాహ్‌కు వెళ్ళేముందు అల్పాహారం తీసుకోవాలి. దైవప్రవక్త (స) ఈదుల్‌ ఫిత్ర్‌ నాడు బేసి సంఖ్యలో ఖర్జూరపండ్లు ఆరగించేవారు.
   ఈద్‌గాహ్‌కు ఒక దారి గుండా వెళ్ళి మరో దారి గుండా తిరిగి రావాలి.
   ఈద్‌గాహ్‌కు నడచివెళ్ళటం చాలా మంచిది. దారిలో తక్బీర్లు పలుకుతూ ఈద్‌గాహ్‌కు వెళ్ళటం అభిలషణీయం. సంస్కారం ఉట్టిపడే రీతిలో ఈద్‌గాహ్‌కు రావాలి.
   పండుగ నమాజుకు స్త్రీలను కూడా పిలుచుకువెళ్ళటం సంప్రదాయం. అయితే బహిష్టు అయివున్న స్త్రీలు నమాజు మాత్రం చేయకూడదు. దుఆలో పాల్గొనవచ్చు. ప్రసంగం వినవచ్చు.
పండుగ నమాజు అనంతరం ధర్మసమ్మతమైన క్రీడా విన్యాసాలు చేయటం వాంఛనీయం.
   పండుగ నమాజు అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవటం కూడా వాంఛనీయమే. ప్రవక్త ప్రియ సహచరులు ఈ శుభ సందర్భంగా ‘తకబ్బలల్లాహు మిన్నా వ మిన్‌క’ అంటూ శుభాకాంక్షలందజేసుకునేవారు.
  పండుగనాడు సమాజంలోని పేద ప్రజలను, అవసరార్థులను, బంధువులను వాకబు చేయాలి. అగత్యపరులను ఆదుకోవాలి.
చేయకూడనివి
 అసభ్యకరమైన దుస్తులు ధరించి గర్విష్టుల్లా సంచరించకూడదు.
   వస్త్రధారణలోగానీ, ఇతరత్రా విషయాలలోగానీ అవధులు మీరిపోయి సాటి ప్రజలను ఇరకాటంలో పెట్టకూడదు.
   ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని బలిగొనే వ్యర్థ వ్యసనాలకు లోనవరాదు. పందాలు కాయకూడదు. జూదమాడకూడదు. అందరూ ఒకే చోట ప్రోగై ట్రాఫిక్‌ జాం చేయకూడదు.
పండుగ దినాన స్త్రీలను షరీయతు ఆమోదించని విధంగా – విచ్చలవిడిగా – వదలి పెట్టకూడదు.
   అవధులు మీరిన ఆనందంతో పిచ్చి పిచ్చి నినాదాలు ఇవ్వరాదు అశ్లీలపరాచికాలాడకూడదు. అహంకారంతో విర్రవీగుతూ నడవకూడదు.
 సభ్యతా సంస్కృతులకు కళంకం తెచ్చే ఆటపాటల్లో, అపసవ్యమైన ప్రహేళికలలో పాల్గొనరాదు.
 శుభాకాంక్షలు తెలిపే నెపంతో పర పురుషులు పర స్త్రీలను ఏకాంతంలో పలకరించటంగానీ, కరచాలనం చేయటంగానీ ధర్మ సమ్మతం కాదు.
   ఫిత్రా దానం చెల్లించనంతవరకూ ఈద్‌గాహ్‌ాకు రాకూడదు. ఫిత్రా పండుగ నమాజుకు ముందే చెల్లించాలి. నమాజు తర్వాత చెల్లించేది ‘ఫిత్రా’ అనబడదు. అది మామూలు సదఖాయే.
 పండుగ నమాజుకు ముందుగానీ, తరువాతగానీ ఏ (సున్నతు, నఫిల్‌)  నమాజూ చేయకూడదు.

Related Post