సుభిక్షం – దుర్భిక్షం రెండవ భాగం

సుభిక్షం – దుర్భిక్షం రెండవ భాగం / వీరు కాదు, వృత్తిగా అడిగేవారి విషయంలో కాదు, విధి లేక ఆడిగేవారి సంగతే ఆలోచించాలి. కాల చక్రభ్రమణంలో పడి, కత్తెర బోనులాంటి అవస్థ వచ్చినప్పుడు, గత్యంతరం లేక నోరు విడిచి ఒకరిని అడగవలసి వచ్చిన వాళ్ళ సంగతే పరిశీలించాలి. పూటకు గుప్పెడు మెతుకులు లేక త్రాగడానికి సయితం గుక్కెడు నీళ్ళు కరువై కాలే కడుపులతోనే కాలం గడిపి గతిలేక, ప్రాణం నిలుపుకునేందుకు హరామ్ అని తెలిసి కూడా చచ్చిన గాడిద మాంసాన్ని అసహ్యించుకుంటూనే తిని ప్రాణాలు నిలపుకునే ఆత్మాభిమాన కుటుంబాల గురించే విచారించాలి. పిల్లలు భరించలేని ఆకలితో ‘అమ్మా బువ్వ’ అని అలమటించిపోతుంటే చూడలేక, చూసి తాళలేక, మర్యాదగా కాలం గడుపుతూ, సిగ్గు వదలి చేయి చాచే వ్యక్తి సంగతే పరిశోధించాలి. అంటే, వీరు కష్టాలకు భయపడి ఇలా చేస్తున్నారని కాదు, మానసం గల ప్రతివాడూ, మర్యాదగా బతికే ప్రతి వాడూ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాడు; సాధ్యం కాదు. ఇతరుల సాయం ఆవశ్యకం అవుతుంది. అడగక తీరదు, అంటే; ఆత్మహత్య అన్న ఒక్క దారి తప్పు, అలాంటప్పుడు అడుగుతారే వాళ్ళ గురించి ఆలోచించాలి. అట్టి ఆత్మాభిమాని అడగటానికి సాహసించాడంటే అతను కనబరచిన త్యాగం అపారం. ఆ అవస్థ దుర్బరం, ఆ స్థితి సంఘంలో ఉండటం అవమానకరం. మానవజాతికే అది లజ్జాకారణం.

దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “కొందరు దుమ్ముకొట్టుకుని (చూడటానికి అసహ్యంగా) కనబడతారు. వారిని గుమ్మం ఆవల నుంచే కసరి కొట్టడం జరుగుతుంది. కాని వారు గనక అల్లాహ్ పై ప్రమాణం చేస్తే అల్లాహ్ వారి ప్రమాణాన్ని తప్పకుండా నిజం చేస్తాడు”. (ముస్లిం)

దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “కొందరు దుమ్ముకొట్టుకుని (చూడటానికి అసహ్యంగా) కనబడతారు. వారిని గుమ్మం ఆవల నుంచే కసరి కొట్టడం జరుగుతుంది. కాని వారు గనక అల్లాహ్ పై ప్రమాణం చేస్తే అల్లాహ్ వారి ప్రమాణాన్ని తప్పకుండా నిజం చేస్తాడు”. (ముస్లిం)
మరో హదీసులో ఇలా ఉంది: “ఓ ఆదం పుత్రుడా! నీ దగ్గర మిగిలిపోయిన ధనాన్ని నువ్వు (మంచికై) ఖర్చు పెడితే అది నీకే మంచిది. దాన్ని ఎవరికి ఇవ్వకుండా ఆపుకుంటే దానివల్ల నీకే నష్టం. అవసరాలకు సరిపోయేటంత ధనాన్ని కూడబెట్టుకున్న పక్షంలో నీవు నిందారుడవు కావు”. (ముస్లిం)

సృష్టి మొత్తం దైవ దాసులే అంటామే; ‘మొత్తం’ అన్న ఆ మాటను కనీసం ఒకే ఒక్క ప్రాంతానికైనా, జిల్లాకైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా వర్తింపజేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామా? ‘వారు వికలాంగులు, గ్రుడ్డివారు, ఏ పనీ చేయలేని వారైతే దానికి మేమేం చెయ్యాలి? అది వారి ఖర్మ’ అని కొందరు ప్రబుద్ధులు ప్రశ్నిస్తారు. సరే, వారినే చెప్పనివ్వండి! ఒక కుటుంబంలో ఉన్న వారంతా ఆరోగ్యవంతులేనా? ప్రయోజకులేనా? అప్రయోజకులు, ఎందుకూ పనికిరాని వారు కొందరు ఉంటారు కదా? వారికి సయితం తక్కిన వారిలాగా కూడు, గూడు, గుడ్డ ఎందుకిస్తాము? ‘లేదే’ అన్న కొరత వారిని లేకుండా ఎందుకు చేస్తాము? ఒక ఇంట్లో ఒక అవిటివాడో, గ్రుడ్డివాడో పుట్టాడనుకోండి. కూడు, గుడ్డ మనలాగే అతనికి పెట్టమా? అతని అన్ని అవసరాలు తీర్చడానికి మనం కష్ట పడతామే. అతనిని పోషించడం మన ధర్మంగా ఎంచుతామే. ఆ ధర్మం-సంఘం, సమాజం విషయంలోకొచ్చే సరికి ఏమయ్యింది? ఇదీ ఒక కుటుంబం కాదా! అందులో ఒకరిని అడుక్కోనివ్వడం సిగ్గుచేటు కాదా! అలా తన అవసరాన్ని ఇతరుల ముందు పెట్టేవాడికి ఏమి ఇవ్వక పోగా ‘ఛీ,ఫో’ అని కసురుకున్న వారిని ఏమనాలి? ‘యాచించే వారిని గద్దించకండి’ అని ఆ పరమప్రభువు చెబుతుంటే మనం ఇలా వ్యవహరించడం దైవధిక్కారం కాదా? “తన కోసం ఇష్టపడేదాన్నే తన తోటి సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ మీలో ఎవరూ (పరిపూర్ణ) విశ్వాసి కాజాలరు”. అని ప్రవక్త (స) హెచ్చరించి ఉంటే మనం ఇలా బిహేవ్ చెయ్యడం దైవ ప్రవక్త అవిధేయత కాదా?

‘ధర్యం చెయ్యండి బాబూ!’ అన్న అర్థన వినబడగానే దానికి మనకు తోచిన అర్ధాన్ని మనం ఇచ్చుకుంటాము. దోసెడు ధాన్యం అని కొందరు, రూపాయి-రెండు రూపాయలని కొందరు భావించుకొని దాతల సరసరన నిలబడేందుకు తాపత్రయ పడుతుంటారు. నిజంగా ఆ పిలుపుకి అర్థం అదేనా? నిజం అది కాదు. వారు సంఘాన్ని, సమాజాన్ని, అందులో స్వచ్చంద సేవా సంస్థల లేబుల్తో చెలామణి అవుతున్న వాటిని, పెద్దల్ని, కలిమి-బలిమి గల వారిని హెచ్చరిస్తున్నారు. దీన దైవదాసులైన తమ పట్ల వారు వ్యవహరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. మరుపున పడ్డ విషయాన్ని సంఘం పట్ల వారి విద్యుక్త ధర్మాన్ని, కనీస బాధ్యతను జ్ఞప్తికి తెస్తున్నారు. సాటి జనుల పట్ల మన జగుప్సారకమైన ధోరణిని, నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపుతున్నారు. సమాజంలో దట్టంగా పేరుకుపోయిన కఱపఁషన్ని కరెక్షన్ చేసి కరెక్ట్ చేయమని పిలుపునిచ్చి చెంప పెట్టు పెడుతున్నారు. కాగడా పట్టి మనలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు.

ఓ సంఘ సంస్కర్తల్లారా! ధర్మం చర అంటూనే, మీరు మీ ధర్మాన్ని మూలన పడేస్తున్నారా? సత్యం వద అంటూనే సత్యం నోరు నొక్కేస్తున్నారా? “తాము కడుపారా భోంచేసి తన పొరుగువాని ఆకలి దాహాలను పట్టించుకోని వాడు నిజమైన విశ్వాసి కాజాలడు’ అన్న ప్రవక్త ముహమ్మద్ (స) వారి మాటను అప్పుడే మర్చి పోయారా? ఇప్పుడయినా నిజాన్ని గ్రహించండి. మీరు నిర్వర్తించాల్సిన ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని ఒక మహోపన్యాసమే చేస్తున్నారు.

ఏమండి పండితులారా! లేని ప్రజలకు కదా ఇవ్వాలి? దీనికి మీరే మంటారు? ‘ధర్మం అంటే దానం, దానం అంటే ధర్మం’ అన్నా రే-భూదానం, గోదానం, హిరణ్యదానం, శాకదానం, కుషాంద దానం, గోగర్భ దానం, తులభార దానం – ఇన్నీ దానాల మధ్య నిజమైన దానం కానరాకుండా చేశారే! ఎవరిదీ పాపం? గతి లేక అడుక్కుతినేవారిదా? అడుక్కుతినే స్థాయికి దిగజార్చిన వారిదా? ఇట్టి వ్యక్తుల జీవితానికి సంబంధించిన అసలు కేంద్రబిందువు వారి ఆర్థిక ప్రయోజనాలు, భార్యాపిల్లలు, ఇంకా వారి ప్రాపంచిక సౌఖ్యాలు అయి ఉంటాయి. కాని ఇతరులతో సంభాషించేటప్పుడు మాత్రం పారమార్థికత ఉట్టిపడేలా తాము దైవ ధర్మానికి, సంఘ సేవకు అంకితమైనవారిలా, దర్మోన్నతే, ప్రజాహితమే తమ మతంగా, సర్వేజనః సుఖినోభవంతు అన్నదే తమ ప్రధమ కర్తవ్యమని చెబుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే- “వారు తమ హృద యాలలో లేని మాటలను తమ నోటితో పలుకుతారు”. (ఆలి ఇమ్రాన్: 167)

ఉదాహరణకు ఒక వ్యక్తి సమాజ తిరోగమనంపై, సంఘ దుస్థితి పై ఎంతో ఆర్థంగా ప్రసంగాలు, ప్రకటనలు, వ్యాస పరంపరలు, ప్రచురణలు చేస్తూ ఉంటాడు. కానీ, తన నిజ జీవితంలో సమాజ శ్రేయం కోసం, మానవాభ్యదయం కోసం ఆందోళన చెందుతూ ఒక్క రాత్రి అయినా గడిపి ఎరుగడు. తనకు పడక మీదకు చేరగానే ఒక్క నిద్ర తప్ప మరేమీ గుర్తుండదు కూడా. అశ్రుపూరిత నయనాలతో – నిశి రాత్రిన లేచి దైవ సమక్షంలో నిలబడి – ‘ఓ అల్లాహ్! ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని అభ్యుదయ బాటన నడి పించు. ఇక్కడి ప్రజల్లో సుహృద్భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించు. సకల మానవుల సమస్యలను పరిష్కరించు’ అని వేడుకోడు. అంటే ఇట్టివారికి తన జాతి, మానవ జాతి గురించిన చింతన కంటే తన స్వార్థం గురించిన చింతనే, బాధే అధికంకా వేధిస్తూ ఉంటుంది. ఇట్టివారు లాంఛనాప్రాయంగా నియమనిష్టల విషయమై చాలా భేషైన ప్రమాణాలు చూపుతూ ఉంటారు. కానీ తమ నిత్య జీవితంలో క్రియాశూన్యులుగానే దర్శనమిస్తుంటారు. ఇది తమ ఆంతర్యాల్లో లేని నీతిని తమ మాటల ద్వారా తమలో ఉందని ప్రజానికానికి నిరూపించడానికి పడుతున్న పాట్లే తప్ప మరేమి కాదు. ఖుర్ఆన్లో ఇలా ఉంది: “వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలూ ఉండదు”. (నిసా: !!4) “వారు (ఇవన్నీ) పరులకు చూపడానికే చేస్తారు. అతి సామాన్య మైన వాడుక వస్తువులను సయితం ఇవ్వడానికి నిరాకరిస్తారు”. (మావూన్: 6,7)

ఒక పెద్ద మనిషి అడిగాడు అంటే, అంత దుర్వస్థ, దుర్భిక్ష స్థితి ఇంట్లో ఉందన్న మాట. ఆయన తన మనసులో అంత యాతన అనుభవించాడన్న మాట. అడగడంలో అంత ఆయాస పడ్డాడన్న మాట. అయితే అడగడమే, భిక్షాటనే వృత్తిగా చేసుకున్నవారు ఇందులో చేరరు. ‘యాయవారం మా కుల వృత్తి’ అని చెప్పేవారు ఇందులో చేరరు. దేవుడే మమ్మల్ని అడుక్కొని బ్రతకమన్నాడని సిగ్గు వదిలి చెప్పేవారు ఇందులో జమ అవ్వరు. పంచ కేశాలు పెంచడం అనే ఆచారానికి భిన్నంగా పంచ కేశాలను క్షవరం గావించుకుని, బ్రతికుండగానే మృతులలో చేర్చబడి పచ్చని తలపాగలతో పట్టభద్రులై, నెమలి ఈకలు చేత పట్టుకుని షరీయతు ఆదేశాలేవీ తమకు వర్తించవని చెబుతూ నమాజు చదవక, రోజాలు పాటించక మాదక ద్రవ్యాలను సేవిస్తూ, గంజాయి -పీలుస్తూ సామాన్యులను సాంబ్రాణి పొగతో వంచిస్తూ అర చేతిలో స్వర్గం చూపేవారు ఇందులో చేరరు.

ఒకరి ముందు చేయి చాచడంకన్నా చావే నయం అనుకుంటూనే విషమయ పరిస్తితులకు లోనై బ్రతకలేక బ్రతికేవారినే -ఇందులో చేర్చాలి. ఆత్మ కుటుంబం అనుభవిస్తున్న బాధ, వ్యధ అన్యులకు కనబడనీయకుండా గుట్టుగా బ్రతికేందుకు ప్రయత్నిస్తున్నవారినే ఇందులో చేర్చాలి. విద్యా, బుద్ధి, బలము, ఓపికా అన్నీ ఉన్నప్పటికీ ఒకరిని అడగకుండా ఆత్మాభిమానంతోనే అనేక అవస్థలు పడుతున్నవారినే ఇందులో చేర్చాలి. సమయం కలిసొస్తే – తామే పది మందికి పెట్టగలిగినవారైనప్పటికీ ‘దుర్భిక్షం’ చేత అడగక తప్పని దుర్వస్థకు వచ్చిన వారినే ఇందులో చేర్చాలి. అటువంటి ఆత్మాభిమాన ధనులు అడిగినప్పుడు, వారు అడిగారని, అర్జించారని భావించడం తప్పు, అధర్మం. నిజంగా వారు ఎదుటి – వారికి ఒక మహదవకాశాన్ని ఇచ్చారన్న మాట గ్రహించాలి. అటువంటి ఆత్మాభిమానుల మానసం దెబ్బ తినకుండా సహాయం అందించగలిగితే వారి వల్ల లోకానికి ఎంత లాభం! వారి మేధా శక్తితో లోకానికి ఎంత ఉపకరించవచ్చును! ఎన్ని మహత్తర కార్యాలకు శ్రీకారం చుట్టవచ్చును! ఆ సమయంలోని ఆ స్వల్ప సహాయం సదుపాయం చేసినవాడిది కదా ఆ పుణ్యం, అ కీర్తి అంతానూ.

ఇటువంటి ఆత్మాభిమాన ధనుల పక్షం వహిస్తూ రేపు ప్రళయ దినాన అల్లాహ్ కలవారైన, కలిమి-బలిమి గలవారైన తన దాసులను నిలదీస్తాడు. దైవ ప్రవక్త ముహ్మద్ (స) ఇలా తెలియ జేశారు: ‘నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయ దినాన ఇలా అంటాడు: “ఓ ఆదం కుమారుడా! నేను వ్యాధికి గురయినప్పుడు నువ్వు పరామర్శించలేదేమిటి?” దానికి దాసుడు ఆశ్చర్యపోతూ, స్వామీ! నీవు సర్వలోకాలకు ప్రభువు, పరిపాలకుడవు, పరిపోషకుడవు, సంరక్షకుడవు. అలాంటప్పుడు నేను నిన్ను పరామర్శించడమేమిటి? అని విన్నవించుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతనితో – నా పలానా దాసుడు వ్యాధిగ్రస్టుడయ్యాడని తెలిసి కూడా నువ్వతన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. ఒకవేళ నువ్వెళ్లి అతన్ని పరామర్శించి ఉంటే అక్కడ నువ్వు నన్ను పొంది ఉండేవాడవన్న సంగతి నీకు తెలియదా? అని అంటాడు.

“ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం పెట్టమని అడిగితే నువ్వు నాకు అన్నం పెట్టలేదేమిటి?’ అని ప్రశ్నిస్తాడు. దానికి దాసుడు ‘ప్రభూ! సకల లోకాలకు పరిపోషకుడవు నీవు. అలాంటిది నేను నీకు అన్నం పెట్టడమేమిటి? అని విన్నవించుకుంటాడు. దానికి అల్లాహ్, ‘నా ఫలానా దాసుడు నిన్ను అన్నం (బాబూ! ధర్మం) పెట్టమని యాచించాడు. కాని (పెట్టగలిగే స్థితిలో నువ్వుండి కూడా) నువ్వతనికి అన్నం పెట్టలేదు. అప్పుడు నువ్వతనికి అన్నం పెట్టి ఉంటే దాన్ని నా దగ్గర పొంది ఉండేవాడవన్న విషయం నీకు తెలుయదా? అని అడుగుతాడు.

“ఓ ఆదం సంతానమా! నేను నిన్ను మంచి నీళ్లు అడిగాను. కాని నువ్వు నాకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదే’ అనంటాడు. దానికి దాసుడు, దేవా! నీవు సకల లోకాలకు జీవనోపాధిని ప్రసాదించే వాడవు. నేను నీకు మంచి నీళ్లు త్రాపించడమేమిటి? అని విన్న
వించుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతనితో, ‘నా ఫలానా దాసుడు నిన్ను మంచి నీళ్లు అడిగితే నువ్వతనిక మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. నువ్వతనికి మంచి నీళ్లు ఇచ్చి ఉంటే దాన్ని నువ్వు నా దగ్గర పొంది ఉండేవాడవన్న విషయం నీకు తెలి యదా? అని అంటాడు. (ముస్లిం)

మరో హదీసులో ఇలా ఉంది: ‘ఓ ఆదం కుమారుడా! నేను నగ్నంగా ఉన్నాను. నువ్వు నాకు బట్ట కప్పలేదేమిటి? అని అడుగుతాడు. అందుకు దాసుడు, ప్రభూ! నువ్వు సకల లోకాల మేలును కోరేవాడవు. అలాంటిది నేను నీకు ఆచ్చాదనం తొడిగించడమేమిటి? అని ఆశ్చర్యపోతాడు. దానికి అల్లాహ్, నా ఫలానా దాసుడు నగ్నంగా ఉన్నాడు అని నీకు తెలిసి కూడా నువ్వతనికి ఆచ్చాదనాన్ని ఇవ్వలేదు. ఒకవేళ నువ్వతనికి బట్టలు తొడిగించి ఉంటే నన్ను అక్కడ పొందేవాడవన్న విషయం తెలీదా నీకు?” అని ప్రశ్నిస్తాడు అల్లాహ్.

అదే ‘లేదు,పో’ అన్న మూడు అక్షరాల ఫలితం ఏమవుతుందో ఊహించారా? ఆ వ్యక్తి ఆత్మాభిమానంతో చచ్చిపోతాడు. ఒకసారి తస్కారం జరిగాక మళ్ళీ దానికై సాహసించడు. తన బుద్ది బలం చేతనూ, తన శక్తి చేతనూ మానవ అభ్యుదయానికి తోడు పడదగిన ఒక వ్యక్తి బలవంతంగా అసువులు బాసాడు. అతని విజ్ఞానం వల్ల లాభం, అతని కౌశలం వల్ల ఫలితం ప్రపంచానికి దక్కకుండా పోయింది. అతనికీ, అతని కుటుంబానికే కాకుండా సర్వ మానవాళికి తీరని లోటు మిగిల్చింది. జగత్తుకే ఒక మహా ఉపద్రవబం తెచ్చి పెట్టింది.

దీనంతటికి కారణం ‘కలవాడు’ లేదు పొమ్మన్నాడు’. ఒక్క రూక కాదు-నిజంగా అది ఒక ఈక. ఇవ్వడానికి సందేహించాడు. అల్ప సహాయం చేయడానికి చేతులు వచ్చాయి కావు. పైగా “ఇటువంటి వారితో అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి అని అన్నప్పుడల్లా, ఈ తిరస్కారులు విశ్వాసులతో, మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే స్వయంగా వారికి అన్నం పెట్టగలడు కదా!’ (దేవుడు తలిస్తే వారిని దరిద్రులుగా ఉంచేవాడే కాదు. అలాంటప్పుడు మేము ఈ దరిద్రులకు సహాయపడి దైవాభిమతానికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తించాలి) అని వారు పెడసరిగా జవాబిస్తారు”. (యాసీన్: 47)

ఒక పదవ వంతు కాదు, ఆ ఆత్మాభిమానధనులు అడిగినది. – తాము తమ పిల్లలు ఒక గంటలో కేవలం వినోదాల కింద ఖర్చుపెట్టిన దానిలో అణుమాత్రం కాదు ఆ నిర్భాగ్యుడుకి లేదు పొమ్మ న్నది. ఆడంబరాల కోసం, వేడుకల కోసం ప్రతి దినం తాను – వ్యయం చేస్తున్న దానిలో నూరోవంతు కాదు ఆ అవసరార్ధునికి కాదన్నది. అటువంటి నోరు, మనసు గలవాడికి మనిషి అని నామకరణం చేయడం ఎంత వరకు సబబో మనసున్నవారే నిర్ణయించాలి. పేరు కోసం, ప్రకటన కోసం అని కోట్లకి కోట్లు ఖర్చు చేసిన ఈ దాత వట్టి రోత కాడా? నిజంగా చెప్పాలంటే, అడవులు, సముద్రాలు, పర్వతశ్రేణులు – ఇవేవి భూమికి బరువు కాదు. ఇటువంటి ధనికులే భూమికి భారం.

గృహశోభ, గృహ ప్రవేశానికి, గృహశాంతికి, గృహవాస్తుకని లక్షలకిలక్షలు ఖర్చు పెట్టే మనిషి, భూత దయ కోసం, వృక్ష మోక్షం కోసం వేలకి వేలు ఖర్చు పెట్టే మనిషి, అందులోనే మోక్షం చూరగొనాలనుకుంటాడు. మూర్ఖ బుద్ది! జంతువులలోకెల్లా మహా జంతువు, సృష్టిరాసులలోకెల్లా శ్రేష్ఠుడు మనిషి; వారిలో మానసం గలవాడు మణిపూస, సోదర మానవుడు. అలాంటి ఉత్కృష్ట జీవి – అష్టకష్టాలు పడుతూ, అష్ట దారిద్రియానికి అనుభవిస్తూ, అడిగి లేదనిపించుకున్న యాతనను భరిస్తూంటే, ఇతనికి నిజంగా భూత దయ ఉందా? ఆ మాటకు, ఈ రోతకు ఎంత దూరం? ఈ ఆడంబరం అంతా పేరు కోసం ప్రాకులాడటం, మెప్పు కోసం అర్రులు చాచడం, విలాసాలు, ఖులాసాల కోసం దేవులాడటం. అంతే కాని ధర్మం ఆచరించడానికి కాదు..

ఇవన్నీ తెలిసిన అల్లాహ్ ప్రతిదాంట్లో స్వార్థాన్ని చూసే మనల్ని ఉద్దేశించి మీరు చేసే సహాయం వృధా పోయిందని బాధపడనవసరం లేదు, మీరు ఇచ్చిన ప్రతి పైసా నా దగ్గర మీరు నాకిచ్చిన రుణంగా వ్రాసుకోబడుతుందని తెలియజేస్తున్నాడు: “నిశ్చయంగా దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, అల్లాహ్ కు (చిత్తశుద్ధితో) రుణం ఇచ్చేవారు- వారు ఇచ్చినది వారి కొరకు పెంచబడుతుంది. మరి వారి కొరకు గౌరవ ప్రదమైన ప్రతిఫలం ఉంది”. (అల్ హదీద్: !8)

అంటే, ఒక్కో సత్కార్యానికి కనీసం పదింతల పుణ్యం అంతకన్నా అధికంగా 700 రెట్లు ప్రసాదించబడుతుంది. దైవ చిత్తమయితే ఈ పుణ్యం ఒక్కోసారి అంతకన్నా ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే అది ఇచ్చేవాడి చిత్తశుద్ధిపై, పుచ్చుకునే వాడి దుర్భిక్ష అగత్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే – “తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమలోని స్వార్థప్రియత్వం – (పేరాశ, పిసినారితనం) నుండి రక్షించబడినవారే కృతార్థులు”. (హష్: 9)

Related Post