ఒక మనిషి రెండు వైఖరులు

ఒక మనిషి రెండు వైఖరులు
      ఈక్షణంలో అది ఒక మిశ్రమ బిందువు, మరుక్షణంలో అదొక నెత్తుటి గడ్డ, ఇంతలోనే అదొక మాంసపు ముద్ద, అంతలోనే ఓ నూతన సృష్టి – అదే మానవాత్మ, అతనే మానవుడు. మనిషి ఈ ఉనికి క్రమాన్ని మహితుడైన అల్లాహ్‌ ఇలా తెలియ జేస్తున్నాడు:
  ”నిశ్చయంగా మేము మనిషిని మట్టి సారంతో సృజించాము. తరువాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము. మరి ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము. పిదప ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటుపిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము”.  (మోమిన్: 12-14)
  అవనిపై ఓ అపరిచిత ప్రాంతంలో కళ్ళు తెరిచిన ఈ మానవుడు బాల్యం, కౌమార థల్ని దాటుకుంటూ నిండు యౌవనస్థుడై నిలుస్తాడు. విద్యాక్రీడ విన్యాసాలతో, జ్ఞానసాగర జలకాలాటలతో విజ్ఞుడవుతాడు. ప్రకృతి రీత్యా తనకు ప్రాప్తమైన ప్రతిభా పాటవాలను పదును పెట్టి ప్రగతి పథంలో జీవన రథాన్ని నడిపించి అనూహ్య విజయాల్ని సాధిస్తాడు. ఒక పట్టున క్రాంతికారుడిగా, వేరొక తట్టున కారుణ్య మూర్తిగా, తృటిలో వక్తగా, ప్రవక్తగా పద మాలికలను ముత్యాల హారంగా పొదిగి, మాటల మల్లియలతో గుభాళించె మల్లెల పందిళ్ళు వేస్తాడు. సత్య స్ఫూర్తినీ, పరలోక చింతనను కలబోసి మానవతకే వన్నె తెస్తాడు. దివ్యావిష్కృతుల సుజలంతో, మహితోక్తుల జీవ జలంతో నిర్జీవ హృదయాల్లో ప్రాణం పోస్తాడు. మేధావి, స్థిత ప్రజ్ఞుడు అయిన ఈ నరోత్తమునికి సాంఘిక దోపిడిపై తీవ్రమైన జుగుప్ప. క్షుద్రమైన మూఢ విశ్వాసాల ఊబి నుండి మనుజ జాతిని కాపాడాలన్నది అతని ప్రబల ఆకాంక్ష.   దీన   నిరుపేదలు,   అనాథలు, వితంతువులు, అభాగ్యుల పట్ల అతనో కారుణ్య దీప్తి, మానవతా మూర్తి. నిరుపమాన నిజ దేవుని శక్తిలోనూ, స్వర్గ ప్రాప్తిలోనూ, లోకశాంతిలోనూ అచంచల విశ్వాసం అతనికి. అంతు చిక్కని మనో వ్యాధుల్ని నయం చేసే నవయుగ వైతాళికుడు. మానవ ఆంతర్యంలోని చైతన్యంతోనే అతనికి చెలిమి, బలిమి, కలిమి. ”బండలు కదలవు. నీరు కదులుతుంది. కదలేది చైతన్యము. కదలనిది జడత్వము. కదిలే చైతన్యాన్ని కదలని జడత్వం అడ్డగించజాలదు” అన్నది అతను అన్న మాటే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదర్శంలో, ఆచరణలో –
అతనో ఆదం
ఒక నూహ్‌ా
ఒక ఇబ్రాహీమ్‌
ఒక మూసా
ఒక ఈసా
ఒక ముహమ్మద్‌ (స)!
ఇది మనిషికి సంబంధించిన మంచి వైఖరి.
 మనిషి మరో వైఖరిని కూడా ప్రస్తావించినట్లయితే; అది మహా కిరాతకం! నిక్కుతూ నీల్గుతూ నీతినిజాయితీల గొంతు నొక్కేయాలని చూస్తాడు. నియంతలా పెట్రేగిపోతూ, నిజం ఊపిరి తీసేయాలని యత్నిస్తాడు. భూత, వర్తమాన, భవిష్య తీర్మానాలు తన గుప్పెట్లో ఉన్నాయని బీరాలు పోతాడు. భువన గగనాల్లో తనకు మించిన దైవం లేదని విర్రవీగుతాడు. నర మేధమే సాగించి, మారణ హోమమే రగిలించి అందరిలో అగ్రగామిగా నిలవాలను కుంటాడు. అశాంతి, అలజడులకు ఆజ్యం పోస్తూనే శాంతి దూతగా మన్ననలందుకో జూస్తాడు. అసాంఘీకాలు అనేకం చేస్తూనే సాంఘీకాలు బాగానే వల్లిస్తాడు. సత్యానికి సజీవ సమాధి చేయాలనుకుంటూనే సన్మానాలు కావాలనుకుంటాడు. ”అన రబ్బుకుముల్‌ ఆలా” అన్నది అతను  చెప్పిన మాటే.   ‘సీటు    కోసం  సిద్ధాంతాల్నిమార్చుకునే పదవి లోభత్వం’ అతను ప్రవేశ పెట్టిందే. ఒక్క మాటలో చెప్పాలంటే దుర్మార్గం, దౌర్జన్యం, దమన నీతిలో, దహన కాండలో –
అతనో నమ్రూద్‌,
ఒక ఫిర్‌ఔన్‌,
ఒక హామాన్‌,
ఒక ఖారూన్‌,
ఒక అబూ లహబ్‌,
ఒక అబూ జహల్‌,
ఒక అబ్దుల్లా బిన్‌ ఉబై,
ఒక ముసైలమా,
ఒక చంగీజ్‌ ఖాన్‌,
ఒక హిట్లర్‌,
ఒక ముస్సోలినీ,
ఒక అహ్మద్‌ ఖాదియానీ,
ఒక షైతాన్‌!
  మనిషి – తానొక్కడే అయినా రెండు వేర్వేరు వైఖరులు అతనిలో ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. నేడు సైతం ఈ రెండు వైఖరులు గలవారు మన సమాజంలో ఉన్నారు. పురుషోత్తములని నీరాజనాలందు కునేవారు కొందరైతే, నరరూప రాక్షసులని అభిశాపానికి గురై అపకీర్తి మూట కట్టుకునే వారు మరికొందరు. ఒక వర్గమేమో స్వర్గానికి. మరో వర్గం మాత్రం ఖచ్చితంగా నరకానికే! అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:
  ”వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు, దైవాన్ని ప్రార్థించనూ లేదు. పైగా సత్యాన్ని ధిక్కరించాడు, వెను తిరిగిపోయాడు. మిడిసి పడుతూ, తన ఇంటివారల వైపు వెళ్ళి పోయాడు. శోచనీయం. నీ వైఖరి కడు శోచనీయం. మరి విచారకరం. నీ ధోరణి మిక్కిలి విచారకరం. ఏమిటీ, తనను (తన ఇష్టానికి) ఇట్టే వదలి పెట్టడం జరుగు తుందన్న భ్రాంతికి లోనై ఉన్నాడా మానవుడు?” (ఖియామహ్: 31-36)
  ”ధిక్కార వైఖరిని అవలంబించేవారికి ఆ రోజు వినాశనం ఖాయం. ఆ రోజు వారు మాట్లాడనూ లేరు. సంజాయిషీ ఇచ్చుకునే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు”.   (ముర్సలాత్: 34-36)

 

Related Post