(దైవప్రవక్త – సల్లం – గారి) జీవితపు చివరి రోజు
హజ్రత్ అనస్ (రజి) గారి ఉల్లేఖనం ఇది: “సోమవారం రోజు ముస్లిములంతా ఫజ్ర్ నమాజులో నిలబడి ఉన్నారు. అబూ బక్ర్ (రజి) వారికి నమాజు చేయిస్తున్నారు. హఠాత్తుగా మహాప్రవక్త (సల్లం) హజ్రత్ ఆయిషా (రజి)గారి గుమ్మంపై వేసి ఉన్న పరదాను తొలగించి, బారులు తీరి నిలబడి ఉన్న సహాబా (రజి)లపై ఓ దృష్టిని సారించి మందహాసం చేశారు. ఇటు అబూ బక్ర్ (రజి) వెనుకకు జరిగి వరుసలోనికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆయన (రజి), మహాప్రవక్త (సల్లం) నమాజుకు వస్తున్నారేమో అని అనుకున్నారేమో. (దైవప్రవక్త – సల్లం – హఠాత్తుగా ప్రత్యక్షం అయినందున) ముస్లింలు ఆనందం పట్టలేక నమాజును కూడా భంగపరిచేటంత పని చేస్తారనిపించింది (అంటే ఆయన్ను పరామర్శించడానికి నమాజును భంగపరుస్తారని అనిపించింది అని అర్థం). కాని మహాప్రవక్త (సల్లం) తమ చేత్తో మీ నమాజును పూర్తి చేసుకోండని సైగ చేసి తిరిగి తన హుజ్రా గుమ్మంపై పరదా పడవేసి లోనికి వెళ్ళిపోయారు.”ఆ తరువాత అంతిమ దైవప్రవక్త (సల్లం)కు మరో నమాజు చేసే సమయమే చిక్కలేదు.
(ఇప్పుడు దైవప్రవక్త (సల్లం) మనస్సు శాంతీ సంతృప్తులతో నిండిపోయింది. తనపై విశ్వప్రభువు మోపిన బరువు బాధ్యతలు తీరిపోయినందుకు ఆయన (సల్లం) పరమానంద భరితులయ్యారు.)
ప్రొద్దు ఎక్కిన తర్వాత (చాష్త్ సమయం) ఆయన (సల్లం) తన ముద్దుల పట్టి ఫాతిమా (రజి)ను పిలువనంపారు. ఆమెతో గుసగుసలాడగా ఆమె ఏడ్వనారంభించారు. తిరిగి ఆమెను పిలిచి చెవిలో ఏదో చెప్పగా ఆమె (రజి) నవ్వనారంభించారు. హజ్రత్ ఆయిషా (రజి)గారి కథనం ప్రకారం, మేము ఆమెను పిలిచి విషయం ఏమిటి? అని అడగగా, ఆమె ఇలా చెప్పారు అని ఉంది: “మొదటిసారి దైవప్రవక్త (సల్లం) నాతో గుసగుసలాడి చెప్పింది, ఆయన (సల్లం) ఈ వ్యాధితోనే చనిపోతారనే విషయం. దానికి నేను దుఃఖం ఆపుకోలేక ఏడ్చాను. తదుపరి పిలిచి నా చెవిలో, ఆయన (సల్లం)గారి కుటుంబంలో మొట్టమొదటగా వచ్చి కలిసేదాన్ని నేనే అని చెప్పగా ఆనందం పట్టలేక నవ్వాను” అన్నారు.
(↑ ఈ ఉల్లేఖనం వేరొక సీరత్ కితాబ్ ప్రకారం ↓)
{హజ్రత్ ఫాతిమా (రజి) దైవసందేశహరుని (సల్లం) ముద్దుల కూతురు. తండ్రి అస్వస్థులయిన దగ్గర్నుంచి ఆమె రోజూ ఆయన్ని చూడటానికి వస్తుండేవారు. కూతుర్ని చూడగానే దైవప్రవక్త (సల్లం) లేచి ఆమెకు ఎదురుపోయి ఆమెపై ప్రేమామృతం కురిపించేవారు. ఆ తర్వాత పడకపై తన పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పేవారు.
యధాప్రకారం ఆ రోజు కూడా హజ్రత్ ఫాతిమా (రజి) పరామర్శించడానికి తన తండ్రి ఇంటికి వచ్చారు. దైవప్రవక్త (సల్లం) కూతుర్ని చూసి లేవలేకపోయారు. అప్పుడు స్వయంగా ఫాతిమా (రజి)యే తండ్రి దగ్గరికెళ్ళి, ఆయన నుదుటిపై ముద్దాడి పక్కన కూర్చున్నారు.
ఆరోజు ఆ తండ్రీకూతుళ్ళు ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నారు. మాటల సందర్భంలో దైవప్రవక్త (సల్లం) కూతురి చెవిలో ఏదో చెప్పారు. అది విని హజ్రత్ ఫాతిమా (రజి) భోరున విలపించారు. దైవప్రవక్త (సల్లం) కూతురి చెవిలో ఏదో రహస్యంగా మళ్ళీ చెప్పారు. ఆ మాట విని ఆమె (రజి) చిరునవ్వు నవ్వారు.
ఈ సన్నివేశం చూసిన హజ్రత్ ఆయిషా (రజి)కు విషయం ఏమిటో అర్థం కాలేదు.
“ఫాతిమా! ఏమిటీ విశేషం? మొదట ఏడ్చావు, అంతలోనే మళ్ళీ నవ్వావు. నాన్నగారు ఏం చెప్పారేమిటి?” అని అడిగారు ఆమె కుతూహలంతో.
“దైవప్రవక్త (సల్లం) నాకో రహస్యం చెప్పారు. ఈ రహస్యాన్ని నేనెలా (అప్పుడే) బయటపెట్టనూ?” అన్నారు హజ్రత్ ఫాతిమా (రజి).
తరువాత కొన్నాళ్ళకు హజ్రత్ ఫాతిమా (రజి) ఈ రహస్యాన్ని హజ్రత్ ఆయిషా (రజి)కు ఇలా తెలియజేశారు:
ఆరోజు దైవప్రవక్త (సల్లం) ఆమెతో “అమ్మా! నేనిక ఎంతోకాలం బ్రతకను. నన్ను ప్రభాతవేళ (ఆరిపోయే) దీపంగా మాత్రమే భావించమ్మా!” అన్నారు.
అది విని హజ్రత్ ఫాతిమా (రజి)కు దుఃఖం పొర్లుకొచ్చింది. ఆ వెనువెంటనే దైవప్రవక్త (సల్లం) కూతురి చెవిలో “నేను వెళ్ళాక నా దగ్గరికి అందరికంటే ముందు నువ్వే వస్తావమ్మా!” అని చెప్పారు. అప్పుడు ఆమె ముఖం మందార పువ్వులా విచ్చుకుంది….}
మహాప్రవక్త (సల్లం) హజ్రత్ ఫాతిమా (రజి)కు, “నీవు ప్రపంచ స్త్రీలకు సయ్యిదా (నాయకురాలు)వి.” అనే శుభవార్త కూడా ఇచ్చారు.★
ఆ సమయాన మహాప్రవక్త (సల్లం) తీవ్రమైన బాధకు గురియై ఉన్నారు. ఆ పరిస్థితిని చూసి హజ్రత్ ఫాతిమా (రజి), “అయ్యో! నాన్నగారి బాధ!” అని తల్లడిల్లిపోయారు. అది విన్న దైవప్రవక్త (సల్లం) ఆమె (రజి)తో, “అమ్మా! నీ తండ్రికి ఈ రోజు తరువాత మరే బాధ ఉండదు” అని సెలవిచ్చారు.
దైవప్రవక్త (సల్లం) తమ ముద్దుల మనుమలు హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుసైన్ (రజి)లను పిలిపించి వారిని ముద్దాడారు. వారి ఎడల మేలుగా ప్రవర్తించమని వసీయ్యత్ చేశారు. తమ సతీమణులను పిలిచి వారికి హితబోధగావించారు.
ఇటు క్షణక్షణానికి బాధ పెరుగుతూనేపోతోంది. ఖైబర్ లో ఆయన (సల్లం)కు తినిపించబడిన విషప్రభావం కూడా బయటపడింది. మహాప్రవక్త (సల్లం) హజ్రత్ ఆయిషా (రజి)తో, “ఓ ఆయిషా (రజి)! ఖైబర్ లో ఏ ఆహారాన్నయితే భుజించానో దాని బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ విషప్రభావం వల్ల నా ప్రాణం తెగిపోతుందని అనిపిస్తోంది” అని చెప్పారు.
సహాబా (రజి)కు వసీయ్యత్ చేస్తూ, “అస్సలాత్, అస్సలాత్ వమా మలకత్ అయి మానుకుం” (నమాజు, నమాజు. మీ ఆధీనంలో ఉన్న బానిసలు) అంటూ ఈ పదాలను పదే పదే వల్లించారు.
దైవప్రవక్త (సల్లం)గారి తుదిశ్వాస
ఆ తర్వాత తుది శ్వాసలు ఆరంభమయ్యాయి. హజ్రత్ ఆయిషా (రజి), ఆయన (సల్లం)ను తనపై వాల్చుకొని ఆధారంగా కూర్చున్నారు. ఆమె (రజి)గారి కథనం ఇలా ఉంది:
{“నాపై అల్లాహ్ కారుణ్యాలలో ఓ కారుణ్యం ఏదంటే, మహాప్రవక్త (సల్లం) నా ఇంట, నా వంతు రోజున, నా వక్షస్థలంపై తలవాల్చి పరమపదించడం. ఆయన (సల్లం) మరణ సమయాన అల్లాహ్ నా ఉమ్మిని ఆయన ఉమ్మితో కలిపాడు.
జరిగినదేమిటంటే, హాజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ బక్ర్ (రజి), ఆయన (సల్లం) వద్దకు ఓ మిస్వాక్ (పళ్ళ పుల్ల)తో సహా వచ్చారు. అప్పుడు నేను దైవప్రవక్త (సల్లం)కు ఆధారంగా కూర్చుని ఉన్నాను. ఆయన (సల్లం) ఆ మిస్వాక్ వైపు తదేకంగా చూడడం గమనించాను. ఆ మిస్వాక్ తో పళ్ళను తోముకోవాలని అనుకుంటున్నారని గమనించి, “మీ కోసం ఈ దీన్ని (మిస్వాక్ ని) తీసుకోనా?” అని అడిగాను. ఆయన (సల్లం), అవును అన్నట్లు తల పంకించారు. నేను ఆ మిస్వాక్ పుల్లను తీసుకొని ఆయనకు ఇవ్వగా అది నమలడానికి వీలులేనంత గట్టిగా ఉంది. “దాన్ని మెత్తగా చేసి ఇవ్వనా?” అని అడగగా, ఆయన (సల్లం), అవును అన్నట్లు తల ఊపారు. నేను ఆ మిస్వాక్ ను నమిలి మెత్తగా చేసి ఇచ్చాను. దైవప్రవక్త (సల్లం) దానితో తనివితీరా దంతధావనం చేశారు. ఆయన (సల్లం) ముందు ఓ పాత్రలో నీళ్ళున్నాయి. ఆయన తన రెండు చేతుల్ని ఆ పాత్రలో ముంచి తన ముఖం పై చల్లుకొని తుడుచుకోనారంభించారు. అలా తుడుచుకుంటూనే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప మరే పూజ్యుడు లేడు), “మరణంతో యాతన ఉంది” అని పలుకనారంభించారు.”}
మిస్వాక్ చేయడం పూర్తికాగానే ఆయన తన చేతిని లేదా తన చూపుడు వ్రేలిని పైకి లేపారు. చూపు ఇంటి పైకప్పు పై నిలిచింది. రెండు పెదాలు ఏదో చెబుతున్నట్లుగా కదిలాయి. హజ్రత్ ఆయిషా (రజి) ఆ పలుకులేమిటో విందామని చెవిని ఆయన (సల్లం) దగ్గరకు చేర్చారు. అపుడు మహాప్రవక్త (సల్లం) చెప్పిన తుది పలుకులు ఇలా ఉన్నాయి:
“ఓ అల్లాహ్! ఏ ప్రవక్తలు, సిద్దీఖులు (సత్యసంధులు), ఏ షుహదా (అమరగతినొందిన వారు), మరే సాలిహీన్ (సత్పురుషులు) లను నీవు బహుకరించావో అలానే నాకు కుడా బహుకరించు. ఓ ప్రభూ! నాకు నీ మన్నింపును ప్రసాదించు. నన్ను కరుణించు. నన్ను నీ ఆప్తుల్లో చేర్చుకో. ఓ అల్లాహ్! ఓ రఫీకె ఆలా! (పరమ ఆప్తుడా!)”
ఈ చివరి పదం “ఓ రఫీకె ఆలా” (ఓ పరమ ఆప్తుడా) అనే పదం మూడుమార్లు వల్లించారు. అప్పుడే ఆయన పైకెత్తిన చెయ్యి క్రిందికి వాలిపోయింది. కనుగుడ్లు అలాగే నిలిచిపోయాయి. శరీరం చల్లబడిపోయింది. అశాశ్వతమైన మట్టిముద్దలో అరవై మూడేండ్లు కాపురముండిన ఓ దివ్యతేజం నేడు దైవ సన్నిధికేగింది. ఆయన (సల్లం) “రఫీకె ఆలా”ను కలుసుకున్నారు.
“ఇన్నాలిల్లాహి వ ఇన్నా రాజిఊన్”
దాంతో అనుచరుల గుండెలు పగిలిపోయాయి. మొత్తం ప్రపంచమే వారికి అంధకారమయినట్లు అనిపించింది. ఈ విషాదవార్త విన్న ప్రతి ముస్లిం ఎక్కడ నిల్చున్నవాడక్కడ నోరు తెరచి కొయ్యబారిపోయాడు.
ఈ సంఘటన హిజ్రీ శకం 11 వ సంవత్సరం, రబీఉల్ అవ్వల్ నెల 12 వ తేదీన సోమవారం నాడు పొద్దు బాగా ఎక్కి ఎండ ముదిరిన తరువాత సంభవించింది. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వయస్సు అరవై మూడు సంవత్సరాల నాలుగు రోజులు.
శోక సముద్రంలో మునిగిపోయిన సహాబా (రజి)
హృదయాలను గాయపరచే ఈ వార్త వెంటనే దాహనలంలా వ్యాపించిపోయింది. మదీనావాసులపై దుఃఖ మేఘాలు అలుముకున్నాయి. ఎటు చూసినా అంధకారమే కానవస్తోంది వారికి. హజ్రత్ అనస్ (రజి) గారి ఉల్లేఖనం ఇలా ఉంది:
“మహాప్రవక్త (సల్లం) మా వద్దకు (హిజ్రత్ చేసి) వచ్చిన ఆ మహోజ్వలమైన రోజును నేను మరెప్పుడూ చూడలేదు. అలాగే, అంతిమ దైవప్రవక్త (సల్లం) ఏ రోజు అయితే పరమపదించారో అలాంటి చెడ్డది మరియు అంధకార బంధురమైనది అయిన రోజును కూడా నేనెప్పుడూ చూడలేదు.”
దైవప్రవక్త (సల్లం) మరణించిన తరువాత హజ్రత్ ఫాతిమా (రజి) తమ దుఃఖాన్ని ఆపుకోలేక, “ప్రభువు పిలుపును శిరసావహించిన ఓ నా తండ్రీ! ఫిర్’దౌస్ అనే స్వర్గంలో స్థానం పొందిన నాన్నగారు!! మీ మరణవార్తను జిబ్రీల్ (అలైహి)కు తెలియజేస్తాము” అని చెబుతూ విలపించనారంభించారు.
హజ్రత్ ఉమర్ (రజి)గారి తీరు
మరణవార్త వినగానే హజ్రత్ ఉమర్ (రజి)గారు తమ వివేకాన్ని పోగొట్టుకున్నారు. ఆయన నిలబడి, “కొందరు మునాఫిక్ లు దైవప్రవక్త (సల్లం) మరణించారని అనుకుంటున్నారేమో! హజ్రత్ మూసా (అలైహి), తన జాతిని వదిలి నలభై రోజులు మాయమై తిరిగి వచ్చినట్లుగా వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేముందు ఆయన జాతి వారు చనిపోయారనే అనుకున్నారు. నిజం చెప్పాలంటే దైవప్రవక్త (సల్లం) పరమపదించలేదు. దైవసాక్షి! మహాప్రవక్త (సల్లం) మళ్ళీ తిరిగివస్తారు. ఎవరైతే ఆయన చనిపోయారని భావిస్తున్నారో వారి కాళ్ళు చేతులు నరికేస్తారు జాగ్రత్త” అని చ్చరించనారంభించారు.