(దైవప్రవక్త – సల్లం – గారి మరణానికి) నాల్గు రోజులకు ముందు
మరణానికి నాల్గు రోజుల ముందు గురవారం రోజున దైవప్రవక్త (సల్లం) వ్యాధి బాధతో కొట్టుమిట్టాడుతూ, “మీకు నేను ఓ పత్రం రాసి ఇస్తాను. దాని తరువాత మీరు ఎప్పుడూ మార్గభ్రష్టులు కారు” అన్నారు.
ఆ సమయాన ఇంట్లో చాలా మంది ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా అక్కడే ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) గారి పరిస్థితిని చూసి ఆయన వారితో, “చూస్తున్నారుగా ఆయన బాధ. మీ వద్ద దివ్య గ్రంథం ఖుర్ఆన్ ఉంది. అల్లాహ్ గ్రంథం మీ కోసం చాలు” అన్నారు.
హజ్రత్ ఉమర్ (రజి) మాటలు విన్న వారు పరస్పరం విభేదించి కయ్యానికి దిగారు. దైవప్రవక్త (సల్లం) గారి చేత ఆ పత్రం రాయిద్దాం అని కొందరంటే, లేదు ఉమర్ (రజి) గారు చెప్పినట్లే వినుకుందాం అని కొందరు వాదనకు దిగారు. ఇలా పెద్దగా కేకలేసుకోవడం, విభేదించడం చూసి మహాప్రవక్త (సల్లం) వారిని అక్కడి నుండి వెళ్ళిపొమ్మని ఆదేశించారు.
ఆ రోజే ఆయన (సల్లం) మూడు విషయాలను గురించి వసీయ్యత్ చేశారు. ఒకటి; యూదులు, క్రైస్తవులు మరియు ముష్రిక్ లను అరేబియా ద్వీపం నుండి వెళ్ళగొట్టడం. రెండు; ప్రతినిధి వర్గాలకు, తాము ఆహ్వానించినట్లుగానే ఆహ్వానించడం. అయితే మూడో వసీయ్యత్ ఏమిటో ఉల్లేఖుడికి గుర్తులేదు. బహుశా ఈ వసీయ్యత్ దైవగ్రంథం మరియు ప్రవక్త (సల్లం)గారి సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకొని ఉండే వసీయ్యత్ అయి ఉండవచ్చు. లేదా ఉసామా (రజి) సైన్యాన్ని పంపే విషయమో లేదా నమాజును స్థాపించడం మరియు మీకు క్రిందివారు అంటే బానిసల ఎడల సత్ప్రవర్తన కలిగి ఉండే వసీయ్యత్ అయి ఉండవచ్చు.
మహాప్రవక్త (సల్లం) వ్యాధి ముదిరిపోయినప్పటికీ, ఆ రోజు వరకు అంటే మరణానికి నాలుగు రోజుల (గురువారం) వరకు అన్ని నమాజులు తామే చేయించేవారు. ఆ రోజు కూడా మగ్రిబ్ నమాజు ఆయనే చేయించారు. ఆ నమాజులో ‘వల్ ముర్సలాత్ ఉర్ఫా’ అనే సూరాను పఠించారు.
కాని ఇషా నమాజుకు మస్జిద్ కు వెళ్ళలేని బలహీనత వచ్చేసింది. హజ్రత్ ఆయిషా (రజి) గారి కథనం ఇలా ఉంది: “అందరు నమాజు చేశారా?” అని (దైవప్రవక్త – సల్లం) అడగగా, “లేదు దైవప్రవక్తా! మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని మేమన్నాము.”
“నా కోసం పెద్ద పళ్ళెంలో నీరు ఉంచండి” అని ఆదేశించారు. మేము అలా చేయగా ఆయన (సల్లం) గుస్ల్ చేశారు. ఆ తరువాత నిలబడ(టానికి) ప్రయత్నించగా స్పృహ తప్పింది. స్పృహలోనికి వచ్చిన తరువాత “నమాజు చేశారా అందరూ?” అని అడిగారు.”లేదు దైవప్రవక్తా! వారు మీ కోసమే ఎదురు చూస్తున్నారు” అన్నాము మేము. తిరిగి రెండోసారి, మూడోసారి కూడా మొదటిసారి జరిగినట్లే జరిగింది. అదే ఆయన స్నానం చేయడం, తిరిగి స్పృహ కోల్పోవడం లాంటి పరిస్థితి.
చివరకు ఆయన (సల్లం) అబూ బక్ర్ (రజి)కు నమాజు చేయించమని కబురు పంపించారు. ఆ తరువాత హజ్రత్ అబూ బక్ర్ (రజి) గారే నమాజు చేయించారు. ప్రవక్త (సల్లం) జీవితంలో ఆయన (రజి) చేయించిన నమాజుల సంఖ్య మొత్తం 17.
వేరొక సీరత్ కితాబ్ లో ఇక్కడ జరిగిన సంఘటన వివరణ కోసం తెలుసుకుందాం.
(“అబూ బక్ర్ (రజి)తో నమాజు చేయించమని చెప్పండి” అని ఆదేశించారు దైవప్రవక్త (సల్లం) తన అనుచరులను, “కాని, దైవప్రవక్తా! ఆయన (రజి) స్వర శబ్దం చాలా బలహీనమైనది. ఖుర్ఆన్ పఠిస్తూ ఆయన దుఃఖిస్తారు. ప్రజలు ఆయన స్వరం సరిగా వినలేరు” అన్నారు ప్రవక్త సతీమణి ఆయిషా (రజి).
“నమాజు చేయించమని అబూ బక్ర్ (రజి)కు చెప్పండి” అన్నారు ఆయన (సల్లం) తిరిగి.
హజ్రత్ ఆయిషా (రజి) ప్రాధేయపడుతూ తిరిగి అవే మాటలు పలికారు.
“అబూ బక్ర్ (రజి)కు చెప్పండి నమాజు చేయించమని” అన్నారు మళ్ళీ దైవప్రవక్త (సల్లం) చిరు కోపంతో.
అప్పుడు ఆయన ఆదేశానుసారమే హజ్రత్ అబూ బక్ర్ (రజి) నమాజు చేయించారు. ఆ రోజు నుంచి ఆయనే నమాజు చేయడం ప్రారంభించారు.)
హజ్రత్ ఆయిషా (రజి) దైవప్రవక్త (సల్లం)తో మూడు నాల్గు సార్లు, ఇమామత్ బాధ్యతను హజ్రత్ అబూ బక్ర్ (రజి)కు బదులు మరెవ్వరికైనా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆమె అనుకున్నది, ప్రజలు అబూ బక్ర్ (రజి) గురించి అపశకునాలకు లోనుకాకూడదనే. కాని దైవప్రవక్త (సల్లం) ప్రతీసారి ఆమె సలహాలను త్రోసిపుచ్చుతూ, “మీరంతా యూసుఫ్ స్త్రీల లాంటివారు.★ అబూ బక్ర్ (రజి)కు నమాజు చేయించమని ఆదేశించండి” అని చెప్పడం జరిగింది.
(★→ యూసుఫ్ (అలైహి) విషయంలో ఏ స్త్రీలైతే అజీజె మిస్ర్ (ఈజిప్టు రాజు) భార్యను తూలనాడుతూవచ్చారో అది ప్రత్యక్షంగా అగుపడే దాన్ని గురించే. కాని యూసుఫ్ (అలైహి)ను చూసి వారు తమ వ్రేళ్ళను తెగ కోసుకోవడాన్ని చూస్తే, వారు స్వయంగా లోలోన్నే ఆయన అందానికి బానిసలైపోయి ఉన్నవారే అనే విషయం బహిర్గతమైంది. అంటే నోటితో చెప్పే మాట ఒకటైతే మనసులోని మాట వేరన్నమాట.
ఈ పరిస్థితే ఇక్కడ కూడా ఏర్పడింది. పైకి మాత్రం, అబూ బక్ర్ (రజి) సున్నిత మనస్కులని, ప్రవక్త (సల్లం)గారి స్థానంలో ఆయన నిలబడి నమాజు చేయించేటప్పుడు రోదించడం వలన గ్రంథపఠనాన్ని సరిగా చేయలేరని చెప్పడం. కాని మనస్సులో మాత్రం, దైవప్రవక్త (సల్లం)గారే పరమపదిస్తే ప్రజలు అబూ బక్ర్ (రజి)ను అపశకునంగా తలుస్తారని, ఇదే భావన వారి మనస్సుల్లో వ్రేళ్ళూనుకుంటుందని భావించడం.
హజ్రత్ ఆయిషా (రజి)గారి విన్నపంలో ఇతర భార్యామణులు కూడా చేరి ఉండడం మూలంగా, “మీరంతా యూసుఫ్ స్త్రీల లాంటివారు” (అంటే మీ మనస్సులోని మాట ఒకటయితే మీరు పైకి చెప్పేది మరొకటి) అని సెలవిచ్చారు.)
(దైవప్రవక్త – సల్లం – గారి మరణానికి) ఒకటి లేదా రెండు రోజుల ముందు
శనివారం లేదా ఆదివారం నాడు దైవప్రవక్త (సల్లం) గారి వ్యాధి కొంత తగ్గినట్లనిపించింది. ఆయన ఇద్దరు వ్యక్తులను ఆధారంగా చేసుకొని జొహ్ర్ నమాజు కోసం మస్జిద్ లోనికి వచ్చారు. అప్పుడు అబూ బక్ర్ (రజి) సహాబా (రజి)కు నమాజు చేయిస్తున్నారు. ప్రవక్త (సల్లం)ను చూసి ఆయన (రజి) వెనక్కు జరగనారంభించారు. వెనక్కు రావద్దని సైగతో ఆయన్ను వారించారు. (దైవప్రవక్త – సల్లం,) తమను తీసుకొని వచ్చినవారితో “నన్ను ఆయన ప్రక్కన కూర్చోబెట్టండి” అని చెప్పగా, వారు ప్రవక్త (సల్లం)ను అబూ బక్ర్ (రజి)కు ఎడమ ప్రక్కగా కూర్చోబెట్టారు. ఆ తరువాత అబూ బక్ర్ (రజి) దైవప్రవక్త (సల్లం)గారి నాయకత్వంలో నమాజు చేశారు. సహాబా (రజి)కు ప్రవక్త చెప్పిన తక్బీర్ ను వినిపించనారంభించారు.
(దైవప్రవక్త – సల్లం – మరణానికి) ఒక రోజు ముందు
మరణానికి ఒక రోజు ముందు ఆదివారంనాడు దైవప్రవక్త (సల్లం) తన దగ్గర ఉన్న బానిసలందరిని స్వతంత్రులుగా చేశారు. దగ్గరున్న ఏడు దీనారాలను దానం చేశారు. తన ఆయుధాలను ముస్లింలకు ఇచ్చేశారు. ఆ రాత్రి దీపం వెలిగించడానికి హజ్రత్ ఆయిషా (రజి) తన పొరుగున ఉన్న స్త్రీ దగ్గర నుండి నూనెను అరువుగా తీసుకున్నారు. ఆయన (సల్లం) జిరహ్ (కవచం) ఓ యూదుని వద్ద ముప్పై సాఆల ఓట్ల (అంటే 75 కిలోల ఓట్లు) క్రింద తాకట్టులో ఉంది.