దైవప్రవక్త (సల్లం), గజ్వయె బద్రెసాని (రెండవ బద్ర్ యుద్ధం) ముగించుకొని మదీనాకు వచ్చేశారు. మదీనాలో ఎల్లెడల శాంతి వాతావరణం నెలకొని ఉంది. పూర్తి ఇస్లామీయ సామ్రాజ్యంలో ఓ విధమైన స్థిమితం ఏర్పడింది. ఇప్పుడు మహాప్రవక్త (సల్లం)కు అరేబియా చివరి సరిహద్దుల వైపు దృష్టిని సారించే అవకాశం లభించింది. అలా చేయడం కూడా అవసరమే మరి. ఎందుకంటే, పరిస్థితులపై ముస్లిములకు అదుపు ఉండాలి మరియు మిత్రులు, శత్రువులు దీన్ని గమనించవలసిన తరుణం కాబట్టి.
ఈ గజ్వా తరువాత ఆరు నెలల వరకు ఎలాంటి చీకూచింతా లేకుండా మహాప్రవక్త (సల్లం) మదీనాలో గడిపారు. ఆ తరువాత సిరియా దాపున దూమాతుల్ జందల్ అనే ప్రదేశం చుట్టుపట్ల నివసిస్తున్న తెగలు, వచ్చిపోయే బిడారాలను దోచుకుంటున్నాయనీ ఆ మార్గాన వెళ్ళే వారి సామాగ్రినంతా దోచుకుంటున్నాయనే వార్త మహాప్రవక్త (సల్లం)కు అందింది. అంతేకాదు, వారు మదీనాపై దండెత్తడానికి ఓ పెద్ద సైన్యాన్ని కూడా సమీకరిస్తున్నారనీ తెలిసింది.
↑ వేరొక సీరత్ కితాబ్ ప్రకారం ఈ వృత్తాంతంలోని మరింత వివరణ ↓
హిజ్రీ శకం – 5వ సంవత్సరం, రబీ ఉల్ అవ్వల్ నెలలో సిరియా సరిహద్దులోని ‘దుమాతుల్ జందల్’ ప్రాంతపు క్రైస్తవరాజు ‘అకీదర్ బిన్ మలిక్’ మదీనా మీద దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని దైవప్రవక్త (సల్లం)కు తెలిసింది. అదీగాక ఆ రాజు అరబ్బు బాటసారులపై, వాణిజ్య బిడరాలపై దాడులు చేస్తూ దోచుకుంటున్నాడని కూడా తెలిసింది.
అందువల్ల దైవప్రవక్త (సల్లం) అనుచరులతో సంప్రదింపులు జరిపిన తర్వాత అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లోనే వేయి మంది ముజాహిద్ లు సమకూరారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం), ‘సబా బిన్ అరఫ్తా గఫ్ఫారీ (రజి)’ని మదీనా గవర్నర్ గా నియమించి సైన్యాన్ని తీసుకొని దుమాతుల్ జందల్ కు బయలుదేరారు. (దారి చూపడానికి ‘మజ్ కూర్’ పేరుగల ఓ వ్యక్తిని వెంటబెట్టుకొని వెళ్ళడం జరిగింది.)
ఈ దండయాత్ర గురించి శత్రువుకు తెలియకుండా ఉండేందుకు ఆయన (సల్లం) రాత్రివేళల్లో మాత్రమే ప్రయాణం చేయసాగారు. ఇలా కొన్నాళ్ళు ప్రయాణంచేసి ఓ రోజు రాత్రి పండువెన్నెల్లో సువిశాలమైన ఒక పచ్చిక బీడులో ప్రవేశించారు. అక్కడ పశువుల కాపర్లపై దాడిచేసి వారి పశువుల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ ప్రాంతం నుంచి దుమాతుల్ జందల్ పట్టణం చాలా దగ్గర్లోనే ఉంది. అందువల్ల పట్టణంలోని క్రైస్తవ సైనికులు తమపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారని ముస్లిం యోధులు భావించారు. కాని తీరా చూస్తే అక్కడ సైనిక కోలాహలం మచ్చుకైనా లేదు. అంతేకాదు, ఆ పట్టణం నుంచి జనసామాన్యం కూడా ఎవరూ బయటకు వస్తున్నట్లు సూచనలు కనిపించడం లేదు. పట్టణం సమీపిస్తున్న కొద్దీ ఆ ప్రాంతమంతా స్మశాన వాతావరణాన్ని తలపింపజేస్తోంది.
ముస్లిం యోధులు మధ్యాహ్నం వేళకు దుమాతుల్ జందల్ పట్టణంలోకి ప్రవేశించారు. కాని అక్కడి పరిస్థితి చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. పట్టణం వీధులన్నీ చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక్క పురుగూ లేదు. ఇళ్ళు, దుకాణాలు కూడా ఖాళీగా పడి ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ కొన్ని కుక్కలు మాత్రం మొరుగుతున్నాయి.
ముస్లిం సైనికులు పట్టణ వీధుల్లో తిరుగుతూ తలుపులు బార్లా తెరచి ఖాళీగా పడి ఉన్న ఇళ్ళ వైపు విస్తుబోయి చూస్తున్నారు. పట్టణం వదిలి ఈ జనం ఎక్కడికి పోయారో వారికి అర్థం కాలేదు. ఒకచోట ఒక ఇంటి కిటికీ నుంచి మాత్రం ఓ మనిషి తొంగిచూస్తున్నట్లు కనిపించాడు. వెంటనే ఓ సైనికుడు ఆ ఇంట్లో జొరబడి ఆ మనిషిని బయటికి లాక్కొచ్చాడు. పాపం ఆ మనిషి ముస్లిం సైనికుల్ని చూసి గజగజ వణికిపోసాగాడు.
“భయపడకు. చెప్పు మీ రాజు ఎక్కడికి పోయాడు?” అడిగారు దైవప్రవక్త (సల్లం).
“మీరు వస్తున్నారని తెలిసి మా రాజు డెమాస్కస్ కు పారిపోయాడు.” అన్నాడు ఆ వ్యక్తి కొంచెం భయపడుతూనే.
“అంటే మేము వస్తున్న సంగతి మీ రాజుకు ముందే తెలిసిందన్నమాట!” అన్నారు ప్రవక్త (సల్లం).
“ఆ…. తెలిసింది. మీరు వస్తున్నట్లు గూఢచారులు కొన్నాళ్ళకు ముందే మా రాజుకు సమాచారం అందజేశారు. అందువల్ల ఆయన ముందుగా పట్టణాన్ని ఖాళీ చేయించి ప్రజల్ని వేరేచోటికి పంపించాడు. పట్టణంలో మా రాజు, ఆయన సైనికులు మాత్రమే ఉండిపోయారు. కాని నిన్న రాత్రి ఇద్దరు పశువుల కాపర్లు వచ్చి ముస్లింల చక్రవర్తి వస్తున్నాడని చెప్పగానే మా రాజు కూడా సైన్యాన్ని తీసుకొని నిన్న రాత్రే డెమాస్కస్ కు పారిపోయాడు.” అన్నాడు ఆ వ్యక్తి.
“మరి నువ్వు ఎందుకు పారిపోలేదు?” అని అడిగారు మహాప్రవక్త (సల్లం).
“నాకు పారిపోవడానికి అవకాశం దొరకలేదు.” అన్నాడు ఆ క్రైస్తవుడు.
“సరే, మేము నిన్ను విడిచిపెడుతున్నాం. నువ్వు స్వేచ్ఛగా నీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళవచ్చు.” అన్నారు దైవప్రవక్త (సల్లం).
ఈ మాట విని ఆ క్రైస్తవుడు సంతోషిస్తూ దైవప్రవక్త (సల్లం)కు కృతజ్ఞతలు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత ముస్లిం సైనికులు ఆ ఇళ్ళలోని ధాన్యం, పనికొచ్చే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ముస్లింలను ఎదిరించడానికి ఒక్క శత్రువు కూడా కనిపించలేదు. అందరూ ముస్లిం సైనికులకు భయపడి పారిపోయారు.
ఈ గజ్వా సందర్భంగానే ‘యుయైనా బిన్ హసన్’తో సంధి కూడా కుదుర్చుకోవడం జరిగింది. (దూమతుల్ జందల్, సిరియా సరిహద్దులోని ఓ పట్టణం. ఇక్కడి నుండి డెమాస్కస్ ఐదు రాత్రుల ప్రయాణ దూరంలోనూ, మదీనా పదిహేను రాత్రుల ప్రయాణ దూరంలోనూ ఉంది.)
హఠాత్తుగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, వివేచనతో కూడిన ఈ చర్యల ద్వారా మహాప్రవక్త (సల్లం), ఇస్లామీయ సామ్రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో, పరిస్థితులను అదుపులోనికి తేవడంలోనూ కృతకృత్యులయ్యారు. ఆయన (సల్లం) ఆ పరిస్థితిని ముస్లింలకు అనుకూలంగా మలుచుకొని తమను ఎల్లవేళల చికాకుపరిచే మదీనా అంతర్గత విరోధుల వల్ల మరియు వెలుపలి నుండి వచ్చిపడే కష్టాలను తగ్గించడంలో విజయం సాధించినట్లయింది. మహాప్రవక్త (సల్లం) అనుసరిస్తున్న ఈ వ్యూహాల వల్ల వంచకులు ఎటూ పాలుపోకుండా మిన్నకుండిపోయారు. యూదులకు చెందిన ఓ తెగ దేశ బహిష్కరణకు గురి అయిపోయింది. ఇతర తెగలు కూడా ముస్లింలతో సత్సంబంధాలు పెట్టుకునేందుకు వివశులైపోయారు. బద్దూలు మరియు మక్కా ఖురైష్ ల బలం సన్నగిల్లిపోయింది. ఇలా ముస్లిములకు, ఇస్లాం ధర్మ ప్రచారం చేయడానికి, సృష్టికర్త అందించిన సందేశాన్ని అరేబియాలో వ్యాపింపజేయడానికి అవకాశాలు లభించాయి.
దూమతుల్ జందల్ పట్టణం నుంచి తిరుగుముఖం పట్టిన ఇస్లామీయ సైన్యం
దైవప్రవక్త (సల్లం) ఆ పట్టణంలో నాలుగైదు రోజులు ఉండి, శత్రువులు ఎవరూ రాకపోవడంతో సైన్యాన్ని తీసుకొని మదీనా తిరుగుముఖం పట్టారు.
ముస్లిం యోధులు కొన్నాళ్ళు ప్రయాణం చేసిన తరువాత దారిలో ఓ పచ్చిక మైదానంలో విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడు ఒక అపరిచిత వ్యక్తి వచ్చి దైవప్రవక్త (సల్లం)కు సలాం చేసి ఓ పక్కన కూర్చున్నాడు.
దైవప్రవక్త (సల్లం) అతడ్ని చూసి, “ఎవరు నీవు? నీ పేరేమిటి?” అని అడిగారు.
“అయ్యా! నా పేరు ఐనియా. నా తండ్రి పేరు హుసైన్. నేను నా తెగకు నాయకుడ్ని. నా దగ్గర వేల సంఖ్యలో పశువులు ఉన్నాయి. మేకలు, గొర్రెలు, గుర్రాలు, ఒంటెలు కూడా ఎన్నో ఉన్నాయి. అపారమైన ఈ పశుసంపద కారణంగా నన్ను ఈ ప్రాంతంలో జనం ‘పశువుల రాజు’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. పశువులకు మేత సమృద్ధిగా లభిస్తుంది. కాని ఈ యేడు వర్షాలు పడలేదు. పచ్చిక బయళ్ళు దాదాపు ఎండిపోయాయి. పశువులకు మేత కరువైపోయింది.” అన్నాడు ఐనియా.
“అయితే ఇప్పుడు మా నుండి నువ్వేం కోరుతున్నావు?” అడిగారు దైవప్రవక్త (సల్లం).
“మదీనాలో ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయని విన్నాను. పచ్చిక కూడా విస్తారంగా దొరుకుతుందని తెలిసింది. మీరు దయచేసి మదీనా పచ్చికబయళ్ళలో నా పశువుల్ని మేపుకోవడానికి అనుమతిస్తే, స్తోమతను బట్టి ప్రతిఫలం కూడా సమర్పించుకుంటానని విన్నవించుకుంటున్నాను.” అన్నాడు ఆ పశుపతి అతివినయం ఒలకబోస్తూ.
“ప్రతిఫలం ఏమీ అక్కర్లేదు. నీ పశువులన్నిటినీ తెచ్చుకొని మేపుకో. నిన్ను ఎవరూ అభ్యంతరం పెట్టరు.” అన్నారు దైవప్రవక్త (సల్లం) చిరునవ్వు నవ్వుతూ.
ఈ మాట వినగానే ఐనియా సంతోషంతో దైవప్రవక్త (సల్లం)కు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు.
కాస్సేపటి తర్వాత దైవప్రవక్త (సల్లం) కూడా సైనికులతో సహా మదీనా బయలుదేరారు.
పశుపతి ఐనియా నాలుగైదు రోజుల తర్వాత తన పశువుల్ని, పశుకాపర్లను తీసుకొని మదీనా వెళ్ళాడు. పశువుల్ని మదీనా పచ్చిక మైదానాల్లో మేపుకుంటూ అక్కడే స్థిరపడిపోయాడు.