కువైట్ లో రమజాను వేడుకలు

కువైట్ లో రమజాను వేడుకలు – ఇప్పుడు సిరులు పొంగుతున్న జీవ గడ్డ కువైట్ ఒకప్పుడు (250 సంవత్సరాల క్రితం) బీద దేశం. చాలా కాలం వరకు భారతీయ కరెన్సీ ఇక్కడి కరెన్సీగా ఉండేది. పూర్వ పరాల్లోకెళితే – కువైత్  అరబ్బీ: دولة الكويت Dawlat al-Kuwait,  ” స్టేట్ ఆఫ్ కువైత్ ” పశ్చిమాసియా దేశాలలో ఒక దేశం. ఇది తూర్పు అరేబియా సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఉంది. దేశ సరిహద్దులో ఇరాక్ మరియు సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి. 2014 గణాంకాలు అనుసరించి కువైత్ జనసంఖ్య 4.2 మిలియన్లు. వీరిలో 1.3 మిలియన్లు కువైత్ ప్రజలు ఉండగా 2.9 మిలియన్లు ప్రవాస ప్రజలు ఉన్నారు . 1938లో కువైత్‌లో చమురు  నిలువలు వెలువడ్డాయి.  చమురు నిలువల కారణంగా కువైత్ ” అత్యున్నత ఆర్ధికాభివృద్ధి చెందిన దేశంగా ” అభివృద్ధి చెందింది. కువైత్ దీనార్ ప్రపంచంలో అత్యంత విలువైన కరెంసీలలో ఒకటిగా గుర్తించబడుతుంది వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం అనుసరించి కువైత్ తలసరి జి.డి.పి. అంతర్జాతీయస్థాయిలో 4వ స్థానంలో ఉంది. ఈ దేశం సామాజిక కార్య కలాపాల్లో, సేవా సంబంధిత విషయాల్లో చాలా చురుకుగా పాల్గొంటుంది. ఈ దేశపు సహాయ నిధులు చేరని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ కారణంగానే ఇక్కడి రాజుకి లభించిన బిరుదు ”మానవత్వానికి తలమానికం – నాయకుడు’ అన్నది. కువైత్ మొత్తం జన సంఖ్యలో ప్రవాస  ప్రజలు 70% ఉన్నారు. కువైత్ ప్రజలలో 60% అరేబియన్లు (ప్రవాస  అరేబియన్లతో సహా) ఉన్నారు.  విదేశీ ప్రజలలో భారతీయులు, ఈజిప్షియన్లు అధిక సంఖ్యలో ఉన్నారు.  ఇక్కడా రమజాను మాసం ఎలా గడుపుతారు అన్న విషయాన్ని ముక్తసరిగా తెలుసుకుందాము.

రమజాను నెల చివరి పది రోజుల్లోనైతే ఇక్కడి వాతావరణం అనిర్వచనీయం. వివిధ మంతఖాల్లోని కువైతీలు  జకాత్‌ ఛారిటీ సంఘాల వారు  పేదవారిని వెతికి వెతికి మరీ ఫిత్రా దానాలు ఇస్తారు. రమజాన్‌ పండుగ జరుపుకోవటానికి అవసరమైన వస్తుసామగ్రిని పెద్ద ఎత్తున పంపిణీ చేస్తారు. ఇక పండుగ దినాన ఇచ్చిపుచ్చుకునే కానుకల, ఈదియాల సందడి గురించి వేరుగా చెప్పనవసరం లేదు.

కువైట్‌లో రమజాను నెల సన్నాహాలు షాబాన్‌ నెల నుంచే ఆరంభమవుతాయి. శుభాలను ఆర్జించడం కోసం ప్రవక్త (స) షాబాన్ మాసంలో సూచించిన నఫిల్  ఉపవాసాలు పాటిస్తారు. ఎంతో ఆసక్తిగా రోజు రోజూ గుర్తు చేసుకుంటూ రమజాన్‌ తొలి దినం కోసం ఎదురు చూస్తారు. ఈ విధంగా నింగిలో రమజాన్‌ మాసపు నెలవంకను చూడటం జరిగిందన్న ప్రకటన అధికారికంగా వినగానే  అల్లాహ్‌కు కృతజ్ఞతలు, ప్రజలకు శుభాకాంక్షలు  తెలుపుకుంటూ భక్తీవిశ్వాసాలతో అందరూ తరావేహ్ నమాజు మరియు రోజాను మొదలెడతారు. ఈ నెలలో ఎక్కువగా ఖుర్‌ఆన్‌ పారాయణం చేయడం, వినడం, దానధర్మాలు చేయడం చేస్తారు. ఉద్యోగస్తులకు పని వేళలను తగ్గిస్తారు.అ అంటే ఎనిమిది గంటలకి బదులు ఆరు గంటలు మాత్రమె డ్యూటి ఉంటుంది. ఇక  ఎండలో పని చేసేవారికి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమె. దానికి మించి పని చేయిపిస్తూ చట్ట దృష్టిలో వస్తే జరిమానా ఉంటుంది.

చిన్న పిల్లలు ఉపవాసం ఉండలేరని వదిలి వేయకుండా రోజా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇఫ్తార్‌కు, సహ్‌రీకి వారి కోసం చల్లని పానీయాలు, పదార్థాలు, తీపి వంట కలు, సూప్‌లు వండి రోజా కోసం పురి కల్పుతారు. పుణ్యం కోసం బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు రమజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతతూ ఒకరినొకరు కలవటం, కానుకలు ఇవ్వటం చేస్తారు. భోజనాలు వండి బందు మిత్రుల ఇండ్లకు ఇఫ్తార్ కోసం పంపడం ఆనవాయితీ. అలాగే మస్జిద్‌లకు ఇఫ్తార్‌ నిమిత్తం భోజనాలు పంపిస్తారు. ప్రభుత్వం, మరియు స్వచ్చంద సంస్థల తరఫున దాదాపు అన్నీ పెద్ద మసీదుల్లో ఇఫ్తార్ ఏర్పాటు ఉంటుంది. రోజంతా ఉపవాసం ఉన్నా మితంగా ఇఫ్తార్‌ చేసి మగ్రిబ్ , ఇషా, తరావీహ్‌ నమాజుకి బయలుదేరుతారు. నమాజుని ప్రవాస ప్రజలు సల్లి అంటారు.

 

గమనిక: కువైట్ లేదా గల్ఫ్ దేశాల గురించి ఓక అపప్రద ప్రాచారంలో ఉంది. అదేమంటే ఇక్కడ రమజాను మాసంలో ఉపవాసం ఉండని వారికి చంపేస్తారని, కాల్చేస్తారని. ఇది కొందరు తమ స్వయం ప్రయోజనాల కోసం చేసిన, చేసుకుంటున్న దుష్ప్రచారం తప్ప మరేమీ కాదు. హా … రమజాను మాసం గౌరవం విశిష్టత రీత్యా  పగటి పూట  బహిరంగ ప్రదేశాల్లో తినడం త్రాగటం చట్ట రీత్యా నేరం. కాబట్టి దాదాపు హోటళ్లు బంధు ఉంటాయి. అలాగే రమజాను మాసంలో సైతం ఉపవాసం నుండి మినహాయించ బడిన ముస్లింలు – ఉదాహరణకు – గర్భిణీ స్త్రీలు, బహిష్టు, పురిటి రక్త దినాలలో ఉండే స్త్రీలు, యవ్వనస్తులు కానీ బాల బాలికలు, మరీ వృద్ధులయినా స్త్రీ పురుషులు, రోగ గ్రస్తులయిన స్త్రీ పురుషులు,  ప్రయాణికులు మొదలైన వారు. ధర్మం ఉపవాసం నుండి మినహాయించిన వీరికి సయితం   పై ఆదేశం వర్తిస్తుంది. అలాంటిది ఒక ముస్లిం కానీ వ్యక్తి, అదీ తన ఇంట్లో తింటే అతన్ని చంపుతారు, శిక్షిస్తారు అనడం దుర్మార్గం.

ఈ నెలలో పనివాళ్ళకు ఎక్కువ పని ఉన్నా ఉపవాసాన్ని  బరువుగా భావించక సహనంతో, సంతోషంతో ఉపవాసాన్ని పూర్తీ చేస్తారు. కొన్ని ప్రాంతాల్ని మినహాయించి దాదాపు ప్రాంతాలలో సేవ చేసేవారికి అదనపు వెతనాన్ని ఇస్తారు. చివరి పది రోజులూ నరకాగ్ని నుండి విముక్తి కోసం అడుగడుగునా అల్లాహ్‌ను క్షమాపణ వేడుకుంటూ వెయ్యి నెలలకంటే శ్రేష్ఠమైన రాత్రిని పొందుటకు సుఖ నిద్రను మానుకొని రాత్రి పూట జాగారం చేస్తారు. ప్రతి మంతఖా (ప్రాంతం)లోని పెద్ద మసీదులో రాత్రీ ప్రత్యెక ప్రార్థనలు నిర్వహించ బడతాయి.  ఈ మ్మధ్య కాలంలో దేశ రక్షణ, ప్రజా ప్రాణ రక్షణ నిమిత్తం కొన్ని ఆక్షలు ఉన్నాయి కానీ, లేదంటే కువైట్ లో మస్జిద్ ఎ కబీర్ లో తరావీహ నమాజు చదివే వారి సంఖ్య లక్షకు మించి ఉండేది. అక్కడ నమాజు చదవడానికి వచ్చే వారికి నీళ్ళు, జ్యూస్తో పాటు స్నాక్స్ కూడా ఎంతో గౌరవప్రదంగా అందజేస్తారు.  మంచి ఖురాన్ సుస్వరకర్తలను నియమించి ప్రార్తనలు జరుగుతాయి. వారిలో షైక్ మిషారీ అల్ అఫాసీ గారు బాగా ప్రసిద్ధి. అలా ఈ మాసంలో రాత్రి వేళ తరావీహ్‌, తహజ్జుద్‌ నమాజుల్లో సుదీర్ఘమైన, చక్కటి స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ ఉంటే రోజంతా పని చేసి అలసిపోయినా ఉల్లాసంగానే ఉంటుంది.

రమజాను మాసంలో కొంత సమయం వరకు అన్నపానీయాలకు, కోర్కెలకు దూరంగా ఉండటం వలన మనోనిగ్రహం, ఓపిక, సహనం జనిస్తాయి. శరీర అవయవాల పనితీరు చక్కబడుతుంది. సమయానికి అన్నపానీయాలు లభించని పేదవారి స్థితిని అర్థం చేసుకోగలరు. ఎక్కువ సమయం నమాజుల్లో నిలబడటం వలన గర్వం నశించి సేవాభావం అలవడుతుంది. కలవారు లేనివారి అవసరాలు తీర్చడానికి సమాయత్తం అవుతారు. కువైటీలలో ఈ దాతృస్వభావం ఎక్కువగా ఉంది. రమజాను నెల చివరి పది రోజుల్లోనైతే ఇక్కడి వాతావరణం అనిర్వచనీయం. వివిధ మంతఖాల్లోని కువైతీలు  జకాత్‌ ఛారిటీ సంఘాల వారు  పేదవారిని వెతికి వెతికి మరీ ఫిత్రా దానాలు ఇస్తారు. రమజాన్‌ పండుగ జరుపుకోవటానికి అవసరమైన వస్తుసామగ్రిని పెద్ద ఎత్తున పంపిణీ చేస్తారు. ఇక పండుగ దినాన ఇచ్చిపుచ్చుకునే కానుకల, ఈదియాల సందడి గురించి వేరుగా చెప్పనవసరం లేదు.

 

కొసమెరుపు ఏమిటంటే, ఇక్కడ ప్రవాస ప్రజలకు వారి భాషలో జుమా   ప్రసంగం, నమాజు చేసుకునే వేసులుబాటుని ఇక్కడి ఔఖాఫ్  కల్పించడమే కాక, వక్తలకు వెతన  రూపంలో చిన్న పాటి కానుక  కూడా ఇస్తుంది. అలాగే పండుగ నమాజు జరుపుకునే అనుమతి అన్నీ భాషస్తులకు, అన్నీ దేశస్తులకు ఇవ్వబడుతుంది. అందులో మన తెలుగు భాషకు అవకాశం దక్కడం అల్లాహ్ గొప్ప వరమే అనాలి. అల్హమ్దు లిల్లాః  కువైట్ లాంటి చిన్న దేశంలో రెండు మస్జిద్లలో తెలుగులో జుమా ప్రసంగం అధికారికంగా గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించ బడుతోంది అల్హందు లిల్లాః.   పండుగ దినాన తెలుగు ప్రజలు సకుమ్తుంబ సపరివారి సమేతంగా ఒక చోట ప్రోగయి  ఆరాధనలు, ఆటల పోటీలు,  సాంస్కృతిక పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం బహుశా మన దేశంలో సయితం బహు అరుదుగా కంపించే దృశ్యం. అల్లాహ్ ఈ రాజ్యాని, ఈ రాజ్యంతోపాటు అన్నీ రాజ్యాలను సుభిక్షంగా ఉంచాలని దీనాతిదీనంగా వేడుకుమ్తున్నాము. ఆమీన్!

Related Post