నిన్ను నువ్వు గెలవడమే ఉపవాస లక్ష్యం – ప్రపంచంలో ముస్లింలు ఏ మూలన నివసించేవారైనా అరబ్బులైనా, అమెరికన్లయినా, ఆఫ్రికన్లయినా, ఆర్యులైనా, ద్రావిడులయినా, రష్యన్లయినా, చైనీ యులైనా, శ్రీమంతులైనా, నిరుపేదలైనా, స్త్రీలైనా, పురుషులైనా, పాలకులైనా, పాలితులైనా, రాజులైనా, సామాన్యులైనా – సర్వజనులూ విధిగా పాటించవలసిన మత ధర్మం ఉపవాసం. దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ విధించిన నియమానుసారం ప్రతి సంవత్సరం రమజాన్ నెల సాంతం ఆచరించవలసిన విధానం ఉపవాసం. ఈ ఉపవాసాన్ని పార్సి భాషలో ‘రోజా’ అని అరబీలో ‘సౌమ్’ అని, ఇంగ్లీషులో ‘ఫాస్ట్’ అని, తెలుగులో ఉపవాసం, వ్రతం, నోము అని అంటారు.
ఇస్లామ్ ప్రతిపాదించే ఆరాధనా భావన విస్తృతమయింది ఇందులో పూజా భావంకన్నా విధేయతా భావానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. స్వామికి స్తోత్రగానం చెయ్యడంతోపాటు ఆయన ఆజ్ఞాపాలన, అప్పగించిన సేవల నిర్వహణ, అప్పజెప్పిన సంబంధాల పరిరక్షణ ఇస్లామీయ ఆరాధనా భావంలో అంతర్భాగమయి వుంటాయి. అంటే సర్వసంగ పరిత్యాగం చేసి, ప్రపంచాన్ని దాని మానాన వదలిపెట్టి తపో సాధన చేసి సాధించేదేమీ లేదు. ప్రపంచ కార్యకలాపాల్లో నిమగ్నమయి, ప్రాపంచిక జీవితపు సమస్త బాధ్యతలను సక్రమంగా, సవ్యంగా నిర్వహించి దైవాజ్ఞ బద్ధంగా, దైవశాసన పాలన చెయ్యడం. దైవసంస్మరణకు దూరం చేసే ప్రపంచంలోనే మునిగి, దైవాన్ని విస్మరించకుండా అనునిత్యం దైవాన్ని సంస్మరిస్తూ జీవితం గడపడం- అదే ఆరాధన. అదే నిజమయిన పూజా భావం, అదే యదార్ధ ధ్యాన నిమగ్నత. అదే వాస్తవ తపస్సు, అదే అసలయిన ఆరాధన! ఇస్లామీయ ఆరాధానాభావం ఉద్దేశం మానవ జీవితమంతా దైవదాస్య దర్పణం కావాలన్నది.
దానికి అది సాధనా రూపాలను ప్రతిపాదిస్తుంది. అలాంటి ఓ సాధనే ఉపవాసం. రమజాన్ నెలలో ఇస్లామ్ అనుయాయులు పాటించే ప్రముఖ ఆరాధనా రూపం, రోజా-ఉపవాస వ్రతం. ఇస్లామ్- దైవవిధేయతా ధర్మం, మానవుని ఆది ధర్మం, సనాతన ధర్మమయినట్లే రోజా వ్రతం కూడా ఆది నుండీ ధర్మంలో అంతర్భాగంగా భాసిల్లుతూ ఉంటూ వచ్చింది. దాని నియమాలు ఆయా కాలాల్లో వేర్వేరుగా ఉన్నప్పటికీ అది సకల దైవ శాసనాంగాల్లోనూ విడదీయరాని అంశంగా అలరారుతూ వచ్చింది. ప్రవక్తలందరూ బోధించిన ధర్మంలో తప్పనిసరి విధిగానే విరాజిల్లింది. దివ్యఖుర్ఆన్ ఇస్లామీయ సముదాయానికి ఉపవాసవ్రతాన్ని విధిస్తూ ఈ సత్యాన్ని ఇలా ప్రకటించింది: ఏ విధంగానయితే గతించిన సముదాయాల ప్రజలకు ‘రోజా’ విధిగా నియమించబడిందో అదే విధంగా మీకూ విధిగా ఏర్పరచడం జరిగింది. (అల్‌ఖర: 183)
నమాజ్ ప్రతి రోజూ అయిదు పూటలా మనిషిని, నీవు అల్లాహ్ దాసుడవు, దైవాజ్ఞాపాలన నీ విధి అని గుర్తు చేస్తూ ఉంటే తాను దైవ దాసుడన్న చేతన మనిషిలో సదా పునరుజ్జీవిస్తూ ఉంటుంది. అలా బాధ్యతా భావంతో మెలిగేవానిగా మనిషి రూపొందుతూ ఉంటాడు. అయితే రోజా వ్రతం రమజాన్ నెల సాంతం, ప్రతి క్షణం మనిషిలో ఈ చేతనను, ఈ స్పృహను, సక్రియగా, సజీవంగా సముద్ధరిస్తూ ఉంటుంది. పైన పేర్కొన్న ఆయత్ లో రోజా వ్రతాన్ని విధిగా నిర్ణయించిన చోటనే రోజా వ్రతం ఉద్దేశ్యాన్ని ఖుర్ఆన్ ఇలా ప్రస్పుట పరుస్తుంది: “తద్వారా మీరు తఖ్వా (ధర్మనిష్ఠ) గుణం గలవారుగా రూపొందాలన్నది ఉద్దేశ్యం. (అల్ బఖర: 183)
అంటే రోజా వ్రతం ఉద్దేశ్యం మనిషిని కేవలం ఆకలిదప్పులకు గురి చేయడం కాదు, మనిషి తన సహజ వాంఛల్ని చంపుకుని సన్యాసిగా రూపొందాలన్నది కూడా కాదు, ప్రపంచానికి దూరంగా అడవుల్లోనో, కొండగుహల్లోనో ధ్యాన నిమగ్ను డవడం అంతకన్నా కాదు; అసలు ఉద్దేశ్యం తఖ్వా గుణం పొందడం. మరి తఖ్వా అంటే ఏమిటి? సర్వ సంగ పరిత్యాగం కాదు, ఆకస్మాత్తుగా జ్ఞానోదయమయి, భార్యాపిల్లల్ని శయన మందిరంలో వదలి, సాంసారిక, సామాజిక బాధ్యతలకు చరమగీతం పాడి, భవబంధాలకు కటువుగా విడాకులివ్వడం కాదు, ఆధ్యాత్మిక వికాస సాధనకు భౌతిక వికాసాన్ని కాలదన్ని, శరీరాన్ని బాధలకు, యాతనలకు గురిచెయ్యడం శుష్కింపజేయడం అంతకన్నా కాదు.
మనిషి నడుస్తున్న జీవితపు ఈ బాటలో ఇరువైపులా ఎన్నెన్నో అతివాదాలు, కోర్కెలు, ఆకాంక్షలు, ఆశంకలు, ప్రేరణలు, మార్గవిహీనతలు, అవిధేయతలు, అతిక్రమణల ముళ్ళ పొదలు ముసురుకుని ఉంటాయి. ఈ దారిలో ఈ రకరకాల పరికి కంపల నుండి తప్పించుకుని నడవడం, విధేయతా పథాన ముందుకు సాగడమే తఖ్వా , ధర్మనిష్ఠ. ప్రపంచంలోనే జీవిస్తూ దైవం మోపిన బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూ, సాంసారిక కష్టసుఖాలను సమభావంతో అనుభవిస్తూ, సుఖదు:ఖాల మధ్య, ప్రాపంచిక లాలసల మధ్య, ఆశానిరాశల మధ్య, పేరాశ అత్యాశల మధ్య, కలిమిలేముల మధ్య, ఆకర్షణలు వికర్షణల మధ్య, గెలుపోటముల మధ్య, జీవితాన్ని ఏ ఒక్క వైపునకూ మొగ్గకుండా కాపాడుకుంటూ, ప్రాపంచిక భోగభాగ్యాలను ఆస్వాదిస్తూనే లోకాన్ని అంటీ ముట్టనట్టుగా దైవవిధేయతా మార్గాన నడవడమే ధర్మనిష్ఠ! ఈ ధర్మనిష్ఠను సృజించడానికే పరమ ప్రభువు రోజా వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు .
మానవ జీవితం దైవ దాస్యానికి ప్రతీకగా నిలవాలంటే ఎంతో శిక్షణ, సంస్కరణలు అవసరం. దీనికే ప్రతి దినం అయిదు పూటలా నమాజ్, సంవత్సరం మొత్తాన నెల రోజుల పాటు నిర్ణీతకాలంలో ఉపవాసవ్రతం విధిగా ఏర్పరచడం జరిగింది. ఒక విధంగా ఉపవాస వ్రతం నిర్బంధ శిక్షణ వంటిదే. మత్తుగొన్న మనసును, శరీరాన్ని తట్టి లేపి వేళకానివేళ నిర్దిష్ట కాలపరిమితిలో ఏవయినా అన్నపానీయాలు పుచ్చుకుని ‘సహిరీ’ నెరపమనడం క్రమశిక్షణకు ప్రారంభం. ఆ తరువాత సూర్యాస్తమయం వరకు ఉదర ఆవశ్యకతల్ని, ఇంద్రియ కాంక్షల్ని కేవలం దైవాజ్ఞాపాలన కొరకు నిగ్రహించుకొని నిర్ణీత సమయం రాగానే దైవ విధేయతను ప్రతిఫలించేలా ఉపవాస వ్రతాన్ని విరమించడం, అదీ ఒక నెల కాలం పాటు ప్రతి రోజూ క్రమం తప్పకుండా దీన్ని పాటించడం ఉన్నత స్థాయి క్రమ శిక్షణను అలవరుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనల్ని ఎలా గెలవాలి నేర్పించడమే ఉపావాసల్ లక్ష్యం. అదెలాగో తెలుసుకుందాం!
హృదయ ఉపవాసం
హృదయానికి మార్గదర్శకం లభించడం మామూలు విషయం కాదు. అది సకల మార్గదర్శకాలకు మూలం. సర్వ సాఫల్యాలకు జీవం. మనిషి మూట కట్టుకునే సత్కార్యాల సుందర సౌధానికి అది మొట్ట మొదటి ఆధారం. ప్రాపంచిక జీవితం అతని ప్రతి కదలికకూ కారణం, ప్రేరణం హృదయ మార్గదర్శనమే. “శరీరంలో ఓ మాంసపు ముద్ద ఉంది. అది సక్రమంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఆది గనక రోగగ్రస్తమైతే పూర్తి శరీరం రోగగ్రస్తవ ఎవుతుంది. ఆది మరేదో కాదు మనిషి హృదయమే ” అని బోధించారు మానవ మహోపకారి ముహమ్మద్ (స). (ముస్లిం హదీసు గ్రంథం)
ప్రతి ప్రాణికీ హృదయముంటుంది. అందులో రెండు పార్శ్యాలు ఉంటాయి. ఒక పార్శ్యం విశ్వాసం వెలుగుతో, సచేతనంగా నిండుగా స్పందిస్తూ ఉంటుంది. పూర్తిగా దైవానికి లోబడి, నిత్యం దైవధ్యానంతో నిండి ఉంటుంది. ” దైవభీతి ఇక్కడున్నది, దైవభీతి ఇక్కడున్నది, దైవభీతి ఇక్కడున్నది ” (ముసనాడ్ అహ్మద్) అని దైవ ప్రవక్త (స) గారు చెప్పింది ఈ పార్శాన్ని ఉద్దేశించే. “హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్ధగా ఆలకించి సావధానంగా మసలుకునే ప్రతివ్యక్తికీ ఇందులో (ఖుర్ఆన్) హితబోధ గలదు ” (ఖాఫ్: 37) అని అల్లాహ్ సెలవిచ్చింది కూడా ఈ పార్శ్యాం గురించే.
మరొక పార్శ్యం రోగస్త్రమయి, అచేతనావస్థలో సకల మాలిన్యాలతో కలుషితమయి ఉంటుంది. ” వారి హృయాలలో రోగం ఉంది ” (బఖరః – 10) అని, “ వారి హృద యాలపై తాళాలు పడి ఉన్నాయా? ఖుర్ఆన్ గురించి వారు లోతుగా పరిశీలన ఎందుకు చేయడం లేదు ” (ముహమ్మద్: 24) అని. “వారి చర్మ చక్షువులకు అంధత్వం లేదు, వారి హృదయ చక్షువులకు అంధత్వం ఆవహించి ఉంది ” (హజ్జ్అ: 46) అ ని, ” వారికి హృదయాలు ఉన్నాయి కాని వారు వాటితో అర్థం చేసుకోరు ” (ఆరాఫ్: 179) అని అల్లాహ్ చెప్పింది ఈ చెడు పార్శ్యం గురించే. “మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయి” (బఖరః : 88) అని , ” నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలో ఉన్నాయి ” (ఫుస్సిలత్ని: 5) అని సత్య తిరస్కారులు తెలియజేస్తున్నదీ ఆ హృదయ స్థితే. ఈ హృదయం నుండే దైవప్రవక్త (స) అల్లాహ్ శరణు వేడుకున్నారు ” ఓ అల్లాహ్ విష్ప్రయోజనకరమైన విద్య నుండి, భక్తిరహిత హృదయం మండి, స్వీకృతికి నోచుకోని ప్రార్థన నుండి నేను నీ శరణు కోరుతున్నాను”. (నసాయి)
రమజాను నెలలోగాని, ఇతర నెలలలోగాని ఒక విశ్వాసి హృదయం ఉపవాసం పాటిస్తూ ఉంటుంది. హృదయ ఉపవాసం అంటే హృదయాన్ని నాస్తికత్వం, బహు దైవారాధన, విద్రోహ భావన వంటి మనోమాలిన్యాల నుండి కాపాడుకోవాలి. మనసు నిండా తౌహీద్ సుగంధాలు పరిమళిస్తూ ఉండాలి. సకారాత్మక ఆలోచనలకు మన మది సుమవంతంగా మారాలి. అందులో ప్రేమపూలు, మానవత్వపు మందారాలు, కరుణ కమలాలు, జాలి జాజులు, సద్గుణ సంపెంగలు, త్యాగ తామర కలువలు విరబూయాలి. అల్లాహ్ నామస్మరణతో అది నిత్య చైతన్య ధాత్రిగా విరాజిల్లాలి.
ఉపవాస వ్రతంలో అన్నపానీయాలను, లైంగిక కాంక్షల్ని నిర్ణీత కాలవ్యవధిలో విసర్జించడం మాత్రమే కాదు, నోటి ద్వారా, కంటి ద్వారా, చెవుల ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా కూడా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అంటే చెడు మాటలు పలకడం, చెడు చూపులు చూడటం, చెడు విషయాలు వినటం, చెడు పనులు చేయటం, చెడు స్థానాలకు వెళ్ళడం, మానుకోవాలి. దీనివల్ల ఉద్రేకాలు, ఆవేశాలు నెమ్మదిస్తాయి. భావాల్లో సంతులనం ప్రాప్తమవుతుంది, మానసిక ప్రశాంతత లభ్యమవుతుంది. ఆగ్రహంలో నిగ్రహం, సంభాషణలో మార్దవం, ప్రవర్తనలో సహనభావం, తగవులకు, జగడాలకు, పరుష వచనాలకు దూరంగా మెలగడం అలవడుతాయి. మంచిపట్ల మొగ్గుదల, చెడుపట్ల ఏవగింపు పుడతాయి.
నోటి ఉపవాపం:
” ఓ ప్రవక్తా! నా దాసులతో, వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. ఎందుకంటే షైతాన్ వారి మధ్య కలతలు రేపుతాడు. విశ్చయంగా షైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు ” (ఇస్రా: 53) అని అల్లాహ్ సెలవిచ్చినా, “ తన మాటల ద్వారా, చేతల ద్వారా ఇతర ముస్లింలకు హాని కలిగించనివాడే ముస్లిం ” (ముత్తఫఖున్ అలైహి) ఆని మహాప్రవక్త (స) గారు నొక్కి వక్కాణించినా అది నోటి ఉపవాస గురించే. రమజాను కానివ్వండి ఇతర మాసం కానివ్వండి విశ్వాసి నోటిని అదుపులో పెట్టుకోవాలి. మనసు గృహమైతే నోరు గుమ్మం వంటిది. కాబట్టే ‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది’ అన్నారు పెద్దలు. పాముకాటుకీ, నిప్పు వాతలకు మనిషి తట్టుకోగలడేమోగాని నోటి కాటుకి, మాటల తూటలకు మనిషి నిలువునా దహించుకుపోతాడు. ‘కోతలరాయుళ్ళ నాలుకలు కోసిన కోతలే నరకవాసులు’ (తిర్మిజీ) అని ప్రవక్త (స) చెప్పింది ఇందుకే. ఈ యదార్థం తెలిసిన అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ తన నాలుక నుద్దేశించి ” ఓ నాలుకా! నాలుగు మంచి మాటలు మాట్లాడి మూట కట్టుకో, కుదరకపోతే కనీసం దుర్భాషకు దూరంగా మసలుకో. ఆ విధంగానయినా నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో ” అనేవారు.
“రేపు ప్రళయ దినాన నీతులు చెప్పి నీచంగా బ్రతికేవారి నాలుకలు అగ్గితో చేయబడిన కత్తెరలతో కత్తిరించడం జరుగుతుంది ” (ముస్నద్ అహ్మద్అ) అని మహాప్రవక్త (స) గారు హెచ్చరించారంటే ఎముక లేని ఈ నాలుక ఎన్ని అనర్థాలకు దారి తీయగలదో అర్థమవుతోంది. కనుక విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి. అవసరమయినప్పుడు అవసరమయినంత, అవసరమయిన రీతిలో, అవసరమున్నవారితో మాత్రమే మాట్లాడాలి. ‘నోటి నుండి వెలువడిన మాట విల్లునుండి వెలువడిన బాణం తిరిగిరాదని’ మన పెద్దల నానుడి. నోరు ఉంది కదా అని పారేసుకుంటే గూబ పగిలిపోతుంది జాగ్రత్తా! అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు: “మనిషి నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు దాన్ని నమోదు చేయడానికి సిద్ధంగా ఉంటాడు”. (ఖాఫ్: 18) దైవప్రవక్త (స) ఇలా తెలిపారు: “ఎవరైతే ఉపవాసం ఉండి కుడా అబద్దాలాడటం, అబద్ధాల ఆధారంగా బ్రతకడం మానుకోడో అటువంటి వ్యక్తి ఆకలిదాహాల పట్ల అల్లాహ్ కు ఎటువంటి ఆసక్తి లేదు”. (బుఖారీ) కాబట్టి సోదరులారా! నాలుకను అదుపులో పెట్టుకోవడంకంటే ఎక్కువ యోగ్యమైన విషయం ఏదీ లేదు. మన నాలుకే మన పాలిట నాకమూ కాగలదు, నరకమూ కాగలదు.
కంటి ఉపవాసం:
“వయన నైచ్యాన్ని, హృదయ హైన్యాన్ని సయితం ఆయన ఎరుగును ” (గాఫిర్: 19) నయనం హృదయ ప్రేరణం. మనసుకు చేరే మార్గం. లజ్జారహిత నేత్రాలు కళ్ళెం లేని గుర్రాలతో సమానం. వాటిని కంట్రోల్ పెట్టకపోతే కనబడిందల్లా తమదే అంటాయి. రమ్యంగా కనబడే ప్రతిదీ తమదేనన్న తలతిక్క తలపులకు తలుపులు తీస్తాయి. ఎదుటి వారి గౌరవాన్ని కాలరాచి, వారి రహస్య విషయాలను తరచి తరచి చూసే నికృష్ట నయనాలు ఘోరపాపాన్ని మూట గట్టుకుంటాయి. సాధారణంగా నేత్రాలు చెడుని మంచిగా తలంచి మోసపోతాయి. మనసులో దురుద్దేశం ఉరకలేస్తుంది. ఆ మార్గంలో దూసుకుపోవాలని పరితపిస్తాడు మనిషి. కొద్ది దూరం నడిచాక తెలుస్తుంది తాను అశ్లీల ఊబిలో దిగుబడి ఉన్నానని. బయటికి రావాలనుకున్న ప్రతిసారీ ఆ పాపపు ఊబి అతన్ని మరింత లోనికి లాక్కుంటుంది. కాబట్టి హృదయం, నోరుతోపాటు కళ్ళను కూడా నియంత్రణలో ఉంచాలి. మన కళ్ళను అశ్లీల దృశ్యాలనుండి కాపాడుకోవాలి. ”అల్లాహుమ్మ అరినల్ హఖ్ఖ హక్ఖన్ వర్జుక్నా ఇత్తిబాఅహు – వ అరినల్ బాతిల బాతిలన్ వర్జుక్నాఇజ్తినాబహు’ ఓ అల్లాహ్! మాకు సత్యాన్ని సత్యంగా చూసే సత్య దృష్టిని ప్రసాదించు, అసత్యాన్ని అసత్యంగా గుర్తించే విచక్షణా దృష్టిని అనుగ్రహించు”. (ఇబ్ను కసీర్) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు ” ఓ ప్రవక్తా! ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి వాల్చి ఉంచాలనీ, వారు తమ మర్మాంగాలను కాపాడుకోవాలని, అది వారి కొరకు శ్రేయోదాయకమని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు “. (నూర్: 30)
చెవుల ఉపవాసం:
“ నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను హృదయం వీటన్నింటి గురించి ప్రశ్నించటం జరుగుతుంది “. (ఇస్రా: 36) చెడు ఆనకు అన్నది నోరు పాటించే ఉపవాసమైతే, చెడు వివకు అన్నది చెవులు పాటించే ఉపవాసం. బూతు పదాలను, బూతు సాహిత్యాన్ని, సంగీత ధ్వనుల నుండి చెవులను కాపాడుకోవాలి. ఎందుకంటే అసత్యాలు, అశ్లీల పదాలకు అలవాటు పడ్డ చెవుల్లో రేపు ప్రళయదినాన సీసం పోయడం జరుగుతుంది. అట్టి కర్ణపుటాలకు కరుణామయుని వచనాలు సోకవు. ఫలితంగా సత్యవాణి విన్నప్పుడు వారిలో ఉండాల్సిన సహజ స్పందన ఉండదు. అల్లాహ్ అమృతవాణి వారి కర్ణపుటాలను తాకి వెనక్కి వచ్చేస్తుంది. అటువంటి వారి కర్ణశక్తి మూలంగా వారికి ఎటువంటి శుభంగానీ, ప్రయోజనంగానీ కలగదు. దీనికి భిన్నంగా విశ్వాసుల చెవులు సత్యామృతాన్ని తనివితీరా గ్రోలడమేకాక మనిషిలోని మనసు తన్మయం చెందేలా చేస్తాయి. విశ్వాసుల ఈ విశేష లక్షణం గురించి ఖుర్ఆన్ ఇలా తెలుపుతుంది. ” ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి ఆశ్రువులు జలఝరి వలె ప్రవహించటం నీవు గమనిస్తావు. వారు ఇలా అంటారు: ”ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కావున మమ్మల్ని సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాసుకో!”. (మాయిదహ్: 83)
సత్యం విన్నప్పుడు సత్యపథంలో నడుస్తున్న హృదయాలకు మరింత శక్తి, స్థిరత్వం ప్రాప్తిస్తుంది. దీనికి బిన్నంగా, అసత్యం విన్నప్పుడు దాని తాలూకు దుష్ప్రభావాలు నిర్మలమయిన హృదయంలో తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తాయి. ఆ చెడు భావాలు మరింత ముదిరితే ప్రమాదం, అల్లాహ్ అటువంటి చెవులకు సీలు వేసేస్తాడు జాగ్రత్త!.
ఉదర ఉపవాసం :
” ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కేవలం అల్లాహ్ ను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను మాత్రమే తివండి, త్రాగండి. అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపండి “. (బఖరః – 172) మనం తినే ఆహారం మన దేహంపై, మన ప్రవర్తనపై, మన సామాజిక జీవితంపై, కుటుంబ, ఆధ్యాత్మిక జీవనంపై ప్రభావం పడుతుంది. ధర్మ సంపాదన మనిషిలో మానవత్వాన్ని మంచిని పెంచితే, అధర్మ సంపాదన సకల అనర్థాలకు ఆలవాలంగా మారుతుంది.ధర్మ సమ్మతమైన ఆహార పదార్థాలను భుజించకుండా ఓ నిర్ణీత సమయం వరకు ఉండటం రమజాను ఉపవాసమైతే అధర్మ ఆహారం నుండి ఉదరాన్ని కాపాడుకోవటం సంవత్సరపు 12 నెలలు అనునిత్యం నిరాటంకంగా, నిర్విఘ్నంగా, నిర్విరామంగా పాటించాల్సిన ఉవవాసం. అల్లాహ్ నిషేధించిన అక్రమార్జనల్లో వడ్డీ వ్యాపారం మహాపరాధం. ” ఓ విశ్వసించిన ప్రజలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు పాఫల్యం పొంటానికిగాను అల్లాహ్ కు బయపడడి “. (ఆల్ ఇమ్రాన్తం: 131) ”తండ్రి లేవి బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టలను నరకాగ్నితో వింపుకుంటున్నారు. త్వరలో వారు మండే నరకాగ్నిలో ప్రవేశిస్తారు “. (నిసా: 10) దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. • స్వహస్తాలతో సంపాదించే సంపాదనకన్నా పరిశుద్ధ మయిన ఆహారం మరొకటి లేదు, అధర్మ సంపాదనతో పోషించబడిన శరీరం వరకాగ్నికి ఎక్కువ అర్హత కలిగి ఉంటుందన్నారు .. అక్రమార్జన, లంచం గురించి ఇలా హెచ్చరించడం జరిగింది. “ ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమ రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయడం కోసం అధికారులకులంచం చెల్లించకండి. అది ధర్మం కాదన్న సంగతి మీకూ తెలిపివదే “. (బఖరః – 188)
నిజం, వరాల వసంతం రమజాను మాసంలో మానవాత్మలు, అంతరాత్మలు సచేతనంగా, సజీవంగా,సశ్యశామలంగా కమనీయ కాంతులీనుతూ ఉంటాయి. నిత్య నిర్మల మనో వసంతాన్ని తలపిస్తూ ఉంటాయి. వందేళ్ళ జీవితానుభూతుల్ని చవిచూసిన పండు వృద్ధులయినా, విద్యాసాగర సంచితాన్ని ఔపాసన పట్టిన పండిత మహాశయులయినా, సందిగ్ధంలో సద్వివేకాన్ని, సద్వర్తనుల్ని సంప్రదించి సరైన సమయంలో జీవితాన్ని అతలాకుతలం చేసే అల్లకల్లోలాల అలల మధ్య నుండి బయట పడేయగల నిర్ణయాలు తీసుకునే స్ఫూర్తి, సమయస్ఫూర్తిగా గల సామాన్యులైనా తమకు ప్రాప్తమయిన ఈ శుభ ఘడియల్లో తనివితీరా ఓలలాడేందుకు పరితపిస్తూ కనబడతారు. తూనిగల్లా ఝమ్మని బైకులేసుకు తిరిగే కుర్రాళ్లలో, రంగు రంగుల దుస్తుల్లో భువన తారకల్లా మెరిపోతూ, పారిజాతాల్లాంటి పవిత్ర దరహాసంతో తేనెలొలుకు పలుకులతో తుళ్లుతూ వీధుల నిండా విహరించే చిన్నారి బాలబాలకల్లో ఒకే స్థాయి భక్తిభావాలు తొణికిసలాడుతూ దర్శనమిస్తాయి. అయిదు పూటల నమాజు సలపడం మానేసి, బజార్లలో బాతాఖానీలో , మాటల మాంత్రికుల నిపించుకునే సరదా సాహెబులు, సారాయి రాయుళ్ళు సయితం బుద్ధిగా ప్రార్థనల్లో పాల్గొంటూ తారసపడతారు. తలను నున్నగా దువ్వుకుని సాదాసీదా బట్టలేసుకుని వీపుకి పుస్తకాల బ్యాగు తగిలించుకుని, అటూ ఇటూ దిక్కులు చూడకుమడా రోడ్డు మీద ఎక్కడా ఆగి పెత్తనాలు చేయకుండా నేరుగా పాఠశాలకు వెళ్ళే చిన్నారి విద్యార్థులు సయితం రోజా వ్రతం పాటిస్తూ ముచ్చటేస్తారు. ఎముకలుడిగిన వయసుతతో బక్కచిక్కిన ముసలివారు సయితం ఎంతో నిష్ఠగా ఉపవాసాలు పాటిస్తూ పరవశించిపోవడం ఒక రమజాను మాసంలోనే కనబడుతుంది. ఇలా రకరకలా సుభక్త జనాలతో హరివిల్లు లోని రంగులన్నీ ఒకే చోట అలరారుతున్నట్లుంటుంది వరాల వసంతం రమజాను మాసం. సమాజ హితానికి, సంఘ క్షేమానికి, వ్యక్తి సంపూర్ణతకి కావలసిన, భక్తిభావనల్ని, ప్రేమాభిమానాన్ని, నమ్మకాన్ని, వ్యక్తా వ్యక్త స్వేచ్చని, అనురాగాన్ని, అనుబంధాన్ని, త్యాగాన్ని, పరస్పర సహ కారాన్ని, సుహృద్భావాన్ని రమజాను మాసం మనలో జనింప జేస్తుంది. ఏదైనా కానీ, ఏమైనా కానీ మరణం దాకా ప్రార్థించడమే మానవ జీవితానికి అర్థం. దైవప్రేమ తోడుంటే కుత్సిత మతులు ఎన్ని కుయుక్తులు పన్నినా ధర్మోన్నతి కోసం పాటు పడటమే పరమార్థం. ప్రార్థించడం అంటే అనుకున్నంత తేలికయిన విషయం కాదు! మనల్ని మనం దైవానికి పూర్తిగా అర్పించుకోనిదే అది సాధ్యం కాదు. అనునిత్యం మనం హృదయాన్ని దైవ ప్రేమతో వెలిగించే ఉంచాలి. మిథ్యా ఆలోచనలకు తావియ్యకూడదు.
అటు అలజడి ఇటు అలజడి. ఎటు అడుగిడితే అటు కోర్కెల అలికిడి, కాంక్షల పుప్పొడి, తనువు అనువణువు భావ తలంపుల ముళ్ళ తక్కిడి.మెదడులో నీచ నిప్పు కణికల రాపిడి. మనస్సులో తమస్సు తాండవపు సడి. దైవాన్ని మనల్ని పూర్తిగా అర్పించుకో వడం అంత సులభం కాదదని తెలుస్తూనే ఉంది. అందుకనే జడివానలాంటి కన్నీటి తడితో మన మనో మాలిన్యాల్ని కడుక్కో వాలి. దైవ మహిమ ఏమిటో, ఆయన గుణవిశేషాలేమిటో, ఆయన శక్తిసామర్థ్యాలు ఏమిటో తెలిసిన వారికే స్వయంగా ఆయన్నే చూస్తున్నామన్నంత తన్మయంతో ప్రార్థించడం చేతనవుతుందని తెలిసిన మనం నిత్యం మారుతుండాలి. మన ప్రవర్తనలో పరివర్తనకై పరితపిస్తూ ఉండాలి. ఉదయం సాయంత్రం దైవకీర్తినలో ఊయలూగాలి మన హృదయం. పొద్దుపై దైవ స్తుతి గీతికలు లిఖిస్తూ ప్రకాశించే ఉదయభానుడు, పగలూరేయీ ప్రతి క్షణం అల్లాహ్ ను ప్రశంసిస్తూ మీరు+నేను=మనం…… మనం ఎప్పుడూ ఇలానే ఉండాలి. పూలలో పరిమళాలై దాగుండాలి. మన ఈ విధేయత అవిధేయతగా రూపు దాల్చకూడదు. మనలో పొంగిపొర్లే భక్తిభావ తరంగాలు భుక్తి సహిత సుడి గుండాలవ్వకూడదు. మనసు మనకు చెప్పకనే త్రోవ తప్పుతుందేమో జాగ్రత్తగా మెలకువమై ఉందాం మనం!