Originally posted 2013-04-22 16:45:11.
నేడు ముస్లిం సమాజం ఇస్లాం మూలగ్రంథమైన ఖుర్‌ఆన్ విషయం లో ఏమరుపాటు వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకుని, ఆచరిస్తూ ఇతరులకు అందించక పోవడం, ఖుర్‌ఆన్ నిజ బోధనలను అందిపుచ్చుకుని జీవితాలను తీర్చిదిద్దుకోవడం మాను కొని మనోవాంఛల దాస్యం చేయడం, ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకో కుండా పఠించడం, ఖుర్‌ఆన్ అసలు లక్ష్యమైన హితబోధనను గ్రహిం చకుండా జీవితం గడపడం సర్వసామాన్యమయిపోయింది. ఇది అత్యంత శోచనీయమైన విషయం. ఈ వైఖరి మానుకొని తమను తాము సంస్కరించుకొనని యెడల ఇటు ఇహలోకంలో అటు పర లోకంలో తీవ్ర పర్యవసానం చవిచూడవలసి ఉంటుంది. ఇకనైనా మేల్కొని దివ్యఖుర్‌ఆన్ పట్ల బాధ్యతలను నిర్వహించడానికి ప్రయ త్నిస్తే అల్లాహ్ కారుణ్యానికి, శాశ్వత స్వర్గ సుఖాలకు అర్హత సంపా దించుకోటానికి వీలు కుదురుతుంది.
ఖుర్‌ఆన్ మానవుల కోసం ఎన్నో శుభాలను తెచ్చింది. త్రికరణ శుద్ధిగా ఖుర్‌ఆన్ ఆదేశాలను స్వీకరించి ఆచరించినప్పుడే ఈ శుభాలు లభిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాని షైతాన్ పన్నా గాలు, కొన్ని దుష్ట శక్తులు ఖుర్‌ఆన్ నుండి మనుషుల్ని దూరం చేయ డానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.
మానవ మనోమస్తిష్కాలపై అలుముకున్న కటిక చీకట్లను తొలగించి, వారి జీవన విధానాన్ని, సంస్కరించి సమస్త మానవులను సన్మార్గంపై నడిపించే శక్తి ఖుర్‌ఆన్‌కు మాత్రమే ఉంది. ఖుర్‌ఆన్ గురించి ఎంత చెప్పినా, ఎంత రాసినా ఖుర్‌ఆన్ సందేశం వర్ణనాతీతం. ఖుర్‌ఆన్ గురించి ఖుర్‌ఆన్ మాటల్లోనే తెలుసుకుందాం..!
మార్గకర్శిని – కారుణ్య ప్రదాయిని
”ఇది అల్లాహ్‌ా గ్రంథం ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం”. (ఖుర్‌ఆన్:2:2)
”మేము ప్రతి విషయాన్నీ స్పష్టంగా విశదీకరించే (ఖుర్‌ఆన్) గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. ఈ గ్రంథం మాకు విధేయుల యిన వారి కోసం చక్కటి మార్గదర్శిగా, కారుణ్య ప్రదాయినిగా, శుభ వార్తగా అవతరించింది”. (ఖుర్‌ఆన్ 16:89)
”మేము ఈ ఖుర్‌ఆన్‌ను హితబోధకై సులభతరం చేశాము. ఇక హిత బోధను స్వీకరించే వాడెవడైనా ఉన్నాడా?” (ఖుర్‌ఆన్ 54:32)
”మానవులారా! మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి హితోపదేశం వచ్చేసింది. అది హృదయాల వ్యాధులకు స్వస్థత, దానిని స్వీకరించే వారికి అది మార్గదర్శకత్వం, కారుణ్యం”. (ఖుర్‌ఆన్ 10:57)
”వహీ ద్వారా నీ దగ్గరకు పంపబడిన ఈ గ్రంథాన్ని ధృడంగా పట్టుకో. నిస్సందేహంగా నీవు సన్మార్గంలో ఉన్నావు. ఈ గ్రంథం (ఖుర్‌ఆన్) నీకు, నీ జాతి ప్రజలకు గొప్ప హితబోధ, త్వరలోనే మీరంతా దీని (ఖుర్‌ఆన్) విషయములో సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది”. (ఖుర్‌ఆన్ 43:43-44)
”ప్రజలు ఖుర్‌ఆన్ గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్‌ా వద్ద నుండి గాక మరెవరి వద్ద నుండో వచ్చి ఉంటే ఇందులో ఎంతో వైరుధ్యం ఉండేది”. (ఖుర్‌ఆన్ 4:82)
”ఓ ముహమ్మద్ (స) నువ్వు మానవాళిని, అల్లాహ్‌ా తిరస్కారం, బహు దైవారాధన వంటి అంధకారాల నుంచి వెలికి తీసి కాంతివైపునకు తీసు కు రావటానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపునకు పంపాము”. (ఖుర్‌ఆన్ 14:1)
సమస్త మానవాళికి సందేశం
”సర్వ మానవులకు ఇదొక సందేశం. వారిని హెచ్చరించాలనీ, యథార్థం గా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలనీ, బుద్ధి ఉన్నవారు గ్రహించాలనీ ఇది పంపబడినది”. (ఖుర్‌ఆన్ 14:52)
”పవిత్ర ఖుర్‌ఆన్ అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గదర్శకం. ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరు పరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి”. (ఖుర్‌ఆన్ 2:185)
”ప్రవక్తా! నీ ప్రభువు తరపునుండి నీపై అవతరించిన దానిని ప్రజలకు అందజెయ్యి. ఒకవేళ నీవు ఆ విధంగా చెయ్యకపోతే, ఆయన ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వహించనట్లే”. ( ఖుర్‌ఆన్ 5:67)
”మేము ఈ ఖుర్‌ఆనులో ప్రజలకు పలు విధాలుగా హితవు గరిపాము. కాని మానవుడు పరమ జగడాలమారి. వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, దానిని స్వీకరించకుండా, తమ ప్రభువు సన్నిదానంలో క్షమాభిక్షను కోరకుండా, అసలు వారిని ఏ విషయం వారించింది?” (ఖుర్‌ఆన్ 18:54,55)
”నీ ప్రభువు నీపై అవతరింపజేసిన ఈ గ్రంథం సత్యమని గ్రహించిన వ్యక్తి, ఈ యదార్థం పట్ల అంధుడైన వ్యక్తి – వారు ఉభయులూ ఎలా సమానులు కాగలరు? హితబోధను వివేకవంతులు మాత్రమే స్వీకరి స్తారు”. (ఖుర్‌ఆన్ 13:19)
”అల్లాహ్‌ా వైపునకు పిలిచి మంచి పనులు చేసి తాను ముస్లింను (విశ్వాసి) అని ప్రకటించే వ్యక్తి మాటకంటే మంచి మాట మరెవరిది కాగలదు”. (ఖుర్‌ఆన్ 41:33)