Originally posted 2013-05-01 14:43:09.
అనంతకాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండిన సమయం ఏదైనా అతనిపై గడిచిందా? మేము మానవుణ్ణి పరీక్షించటాన్ని అతనికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. (76:1,2)
మేము మానవుణ్ణి కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో సృష్టించాము. దీనికి పూర్వం జిన్నాతులను మేము తీవ్రమైన ఉష్ణజ్వాలతో సృష్టించి ఉన్నాము. నీ ప్రభువు దైవ దూతలతో ఇలా అన్న సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో: ”నేను కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో ఒక మానవుణ్ణి సృష్టిస్తున్నాను. నేను అతణ్ణి పూర్తిగా తయారు చేసి, అతనిలో నా ఆత్మను కొద్దిగా ఊదినప్పుడు, మీరంతా అతని ముందు సాష్టాంగ పడాలి”. (15: 26-29)
మేము ఆదం సంతతికి పెద్దరికాన్ని ప్రసాదించాము. వారికి నేలపై, నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము. వారికి పరిశుద్ధమైన వస్తువులను ఆహారంగా ఇచ్చాము. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము. ఇదంతా మా అనుగ్రహం. (17: 70)
ఓ మానవులారా! ఒకవేళ మీకు మరణానంతర జీవితం గురించి ఏదైనా సందేహం ఉంటే, మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి – (అదేమంటే) మేము మిమ్మల్ని మట్టితో, ఆ తర్వాత నెత్తుటి గడ్డతో, ఆపైన మాంసపు కండతో, అది రూపం కలదిగానూ, రూపం లేనిదిగానూ ఉంటుంది. మీకు యదార్ధమేమిటో స్పష్టం చేయాలని (మేము ఈ విషయాన్ని తెలుపుతున్నాము). మేము కోరిన దానిని ఒక ప్రత్యేక కాలం వరకు మాతృగర్భాలలో నిలిపి ఉంచుతాము. తరువాత మిమ్మల్ని ఒక శిశువు రూపంలో బయటికి తీస్తాము – మీరు నిండు యౌవన థకు చేరటానికి. మీలో ఒకడు ముందుగానే వెనుకకు పిలుచుకోబడతాడు. మరొకడు అతి నికృష్టమైన వయస్సు వైపునకు మరలింపబడతాడు – అంతా తెలిసిన తర్వాత కూడా ఏమీ తెలియకుండా ఉండటానికి. ఎండిపోయిన నేలను మీరు చూస్తున్నారు. తర్వాత మేము దానిపై వర్షం కురిపించగానే అకస్మాత్తుగా అది పులకిస్తుంది, ఉబుకుతుంది. ఇంకా అది అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తించటం ప్రారంభిస్తుంది. (22:5)
మేము మానవుణ్ణి అద్భుతమైన ఆకృతిలో సృజించాము. తరువాత మేమతన్ని వెనక్కి త్రిప్పి నీచాతి నీచుడిగా మార్చివేశాము. అయితే విశ్వసించి, మంచి పనులు చేసిన వారు మాత్రం అలాంటి వారు కారు. వారికి ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. (95: 4-6)