ఆలస్యం అమృతం విషం

watabc1d3f2c75

తాహిరా తన్వీర్

 ”ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికి అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రాహీం యొక్క ప్రార్థనా స్థలం ఉన్నది. దానిలో ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. ప్రజలవై అల్లాహ్‌ాకు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తిగలవారు దాని హజ్‌ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్క రించేవాడు అల్లాహ్‌కు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి.” (ఆలి ఇమ్రాన్:96,97)
   ఆయతులో పరిశుద్ధుడైన అల్లాహ్‌ కాబా గృహాన్ని మానవులందరి కొరకు ఆరాధనా కేంద్రంగా నిర్మించబడిన ఏకైక గృహమని పేర్కొన్నాడు. ఈ గృహం ప్రపంచంలోని 150 దేశాలలో నివసించే ముస్లింల పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం  దాదాపు రెండు  కోట్ల మంది ముస్లింలకు 15 రోజులుగా ఆతిథ్యాన్నిచ్చే అపురూప నెలవు.
 ”ఈ గృహం లాంటి ఒక గృహం ‘బైతుల్‌ మామూర్‌’ – అది ఏడు ఆకాశాలవైన దైవ దూతలకు ఆరాధనా కేంద్రంగా ఉంది. ప్రతిరోజు 70 వేల మంది దూతలు ఆ గృహం చుట్టు ప్రదక్షిణ చేస్తూంటారు. ఒకసారి ప్రదక్షిణాభాగ్యం పొందిన దైవదూతకు మరొక సారి ప్రదక్షిణ చేసే అవకాశం ప్రళయం వరకూ లభించదు” అని స్వయంగా దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) చెప్పి ఉన్నారు. (బుఖారీ, ముస్లిం)
  దాని స్థానే  భూమివై  ఒక ఆరాధనా కేంద్రాన్ని విశ్వ జనుల కొరకు నిర్మించమని అల్లాహ్‌ సుబ్‌హానహు వ తఆలా  తన విధేయుడైన ఇబ్రాహీం (అ)కు ఆజ్ఞావించాడు. ఇబ్రాహిం (అ), అల్లాహ్‌ ఆజ్ఞ మరియు దూత జిబ్రయీల్‌ గారి సూచనాను సారం తన కుమారుడు ఇస్మాయీల్‌ (అ)తో కలిసి కాబా గృహన్ని భక్తీప్రపత్తులతో  నిర్మించి, దానికి ఎల్లలను సూచిం చారు.  కాబా నిర్మాణానంతరం ”వ అజ్జిన్‌ వ¦ిన్నాసి బిల్‌హజ్జ్‌” అన్న ప్రభువాజ్ఞ ప్రకారం ప్రజలకు కాబా గృహంవైపు హజ్‌ కొరకు రమ్మని విలుపునిచ్చిన ప్రథమ ప్రవక్త  ఇబ్రాహీం (అ). ఈ గృహ విశిష్ఠత గురించి ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా తెలియపరచారు:
  ”హజ్‌ ఉమ్రాకు వెళ్ళేవారు దేవుని ముఖ్య అతిథులు, వారు అల్లాహ్‌ను వేడుకుంటే అల్లాహ్‌ వారి మొరలను స్వీకరిస్తాడు, క్షమాభిక్షను అర్థిస్తే క్షమిస్తాడు. చిత్తశుద్ధితో చేసిన హజ్‌కు ప్రతిఫలం స్వర్గంకంటే తక్కువ కాజాలదు. మనో వాంఛలకు, చెడు పనులకు దూరంగా ఉంటూ దైవప్రసన్నత కోసం హజ్‌ చేసిన వ్యక్తి, ఆ రోజే  తల్లి గర్భం నుంచి  పుట్టిన  శిశువు  వలె అత్యంత పునీతుడయి తిరిగి వస్తాడు. మస్జిదె హరామ్‌లో చేసే ఒక నమాజుకు ఇతర మస్జిద్‌లలో చేసే లక్ష నమాజుల పుణ్యం
    ప్రసాదించబడుతుంది” అని మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మరికొన్ని ప్రవచనాల ద్వారా రూఢీ అవుతుంది.
  ఇవేకాకుండా ప్రాపంచిక శుభాలు కూడా ఎన్నో ప్రాప్తమవుతాయి. వాటిలో సర్వ శ్రేష్ఠమైనది విశ్వ మానవ విశ్వాస బాంధవ్యం. ప్రపంచ దేశాల్లోని ముస్లిముల వేష భాషలు,  అలవాట్లు  వేరైనా, 15 రోజుల పాటు సకల ఉపాసనారీతులు ఎలాంటి విభేదం లేకుండా కలిసిమెలిసి పాటిస్తారు. వారందరి  ధ్యేయం ఒక్కటే అయి ఉంటుంది. అల్లాహ్‌ ప్రసన్నత, పరలోక సాఫల్యం, క్షమాభిక్ష.
  అక్కడ వాగ్వివాదాలకు తావు లేదు. పోట్లాటలకు ఆస్కారం ఉండదు. అందరి అధరాలపై కదలాడే సంకీర్తనం ఒకటే- ”హాజరయ్యాను ఓ అల్లాహ్‌ా నేను హాజరయ్యాను, సాటి లేని స్వామీ నేను హాజరయ్యాను. నిస్సందేహంగా సకల స్తోత్రాలు నీకే. సకల వరాలు అనుగ్రహించినదీ నీవే. సార్వభౌమత్వమూ నీదే. నీకు సమానులు, సహవర్తులు ఎవ్వరూ లేరు.”
  అక్కడకు చేరిన ప్రతి ప్రాణికి రక్షణ ఉంది. రాజైనా, పేదయినా సమయానికి అల్లాహు అక్బర్‌ అన్న విలుపుకు సమానంగా స్పందించి, ప్రతిష్ఠాలయానికి తరలి వచ్చి, కలిసి మరీ నమాజు చేస్తారు. అలాంటి శుభ వాతావరణంలో ఒక్క రోజు జీవించినా వారి జన్మ ధన్యమే.
  ఈ గృహంలోని స్పష్టమైన సూచనలు అనగా, ఇబ్రాహీమ్‌ (అ) జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క ఘట్టానికి ప్రతిరూపంగా ఉన్న అక్కడి ‘మషాయిర్‌’. మనిషి జాడ కానరాని ఎడారిలో అల్లాహ్‌ ఆరాధనకై ఇబ్రాహీం (అ) నిలబడి   కాబా గృహాన్ని నిర్మించిన ఆ స్థలమే మఖామె ఇబ్రాహీమ్‌. జీవిత సౌకర్యాలూ,  జన సంచారం లేని ప్రదేశంలో తన ఏకైక పుత్రునితో, భర్త విధేయత, మరియు అల్లాహ్‌ ఆజ్ఞాపాలనకై అక్కడ జీవించ డానికి సిద్ధపడిన  ఒక విశ్వాసురాలి నిరుపమాన విశ్వాసానికి, ధైర్యానికి, ఆత్మ స్థయిర్యానికి నిదర్శనం జమ్‌ జమ్‌ జల నిధి, సఫా మర్వాల సయీ. హష్ర్‌ మైదానాన్ని, లెక్కల ఘడియని తలపించే అరఫాత్‌ మైదానం, మినా, ముజ్దలిఫాలు – ఇవన్నీ కాలచక్రంలో నాలుగు వేల సంవత్సరాలుగా  తమ పూర్వ వైభవంతో అలరారుతూ వస్తున్న హజ్‌  ‘చిహ్నాలు’.
  అందుకే – ఆరోగ్య, ఆర్థిక స్తోమత కలిగి ఉన్న ప్రతి ముస్లిం తప్పనిసరిగా హజ్‌ చేయాలనీ, చేయక తిరస్కరించిన వారికి- అల్లాహ్‌కు మధ్య ఏ సంబంధం ఉండదని హెచ్చరించాడు అల్లాహ్‌.
     ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా అన్నారు: ”వీలైనంత త్వరగా హజ్‌ చేసుకోండి. ఎవరికి ఎప్పుడు ఏ ఆటంకం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. తాను హజ్‌ చేయాలి అని అనుకునే వ్యక్తి దాని కోసం తొందరపడాలి. ఆలస్యం చేస్తే అతను వ్యాధి బారినయినా పడవచ్చు లేదా తన వాహనాన్ని అయినా పోగొట్టు కోవచ్చు. లేదా ఇంకా ఏదయినా ఆటంకం ఏర్పడవచ్చు.”

Related Post