చాడీలు చెప్పడం

chadilu
– ఆస్క్ ఇస్లాం పీడియా

పరిచయం

ఇస్లాంలో చాడీలు చెప్పడం మహా పాపం. ముస్లిం తన నోటిని అదుపులో పెట్టుకొని నిషేధించబడిన వాటికి దూరంగా ఉండవలెను. సాధారణంగా నిషేధించబడిన వాటిని ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటారు. చాడీలకు పాల్పడినవాడు పశ్చాత్తాపం చెందడం చాలా అవసరం.

అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించారు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు – “చాడీలు చెప్పడం అంటే ఏంటో మీకు తెలుసా?” అని సహాబా (సహవాసుల)ను అడిగారు. దానికి వారు “అల్లాహ్ కు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కు తెలుసు అని సమాధానమిచ్చారు.” అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం “మీ సోదరుని గురించి అతనికి నచ్చని విషయం మాట్లాడడం” అని సెలవిచ్చారు. దానికి సహాబా (సహవాసులు) “అతని గురించి చెప్పింది నిజమైతే?” అని అడిగారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు, “మీరు చెప్పింది నిజమైతే అది చాడీలో వస్తుంది, అదే అది అబద్దమైతే అది అపనింద అవుతుంది.” సహీహ్ ముస్లిం 1183, 6265 మరియు అబూ దావూద్ 4856

ఖుర్ఆన్ వెలుగులో

అల్లాహ్ సెలవిచ్చాడు, “ ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా! కూపీలు లాగకండి. మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా (చాడీలు) చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడుతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వికరించేవాడు, కరుణించేవాడూను.” ఖుర్ఆన్ సూరా హుజురాత్ 49:12

చాడీల వల్ల నరకంలో లభించే శిక్ష

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ఉపదేశించారు : నన్ను స్వర్గ నరకాలకు తీసుకెళ్ళినప్పుడు నేను నరకంలో కొందరిని వెండి చేతి గోళ్ళతో తమ ముఖాలను మరియు ఛాతీలను రక్కడం చూశాను. అప్పుడు “వీరెవరు” అని జిబ్రయీల్ అలైహిస్సలాంను అడిగాను. దానికి ఆయన ఇలా జవాబిచ్చారు, “వీరు చాడీలు చెప్పేవారు మరియు ఇతరుల గౌరవాన్ని కించపరిచేవారు.” సునన్ అబూ దావూద్ 4860

అనుమతించబడిన చాడీల రకాలు

ధార్మికంగా ఏదైనా లాభం ఉన్నప్పుడు, వేరే దారి లేని పరిస్థితిలో చాడీలు చెప్పే అనుమతి ఉంది. అవి ఏమిటంటే:

1. “ఎవరైనా అన్యాయం చేస్తే వారి గురించి అక్కడి పాలకుడు, న్యాయమూర్తి మొదలైన వారికి ఫిర్యాదు చేయవచ్చు. “అతని వల్ల నాకు ఫలానా విషయంలో అన్యాయం జరిగింది””అని చెప్పవచ్చు.

2. తిరస్కరించే వాడిని, తప్పుచేసే వాడిని సరిదిద్దటానికి చాడీలు చెప్పడం సమ్మతమే. అతను తప్పు చేస్తున్నాడు, కాస్త వాడిని సరిదిద్దండి. అతడిని తప్పు చేయకుండా ఆపడమే, చెప్పే వాడి ఉద్దేశ్యం కావాలి. అలా కాని పక్షంలో అది హరాం (నిషేధించబడినది) అవుతుంది.

3. ఏదైనా ధార్మిక విషయమై తీర్పు తీసుకోవలసి వచ్చినప్పుడు. మతపెద్ద లేదా మతవిద్వాంసుని ముందు తన గోడు ఈ విధంగా మొరపెట్టుకోవచ్చు, “నా తండ్రి, సోదరుడు లేదా ఫలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడు. ఇలా చేయడం సమంజసమా? ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడగలను? నాకు న్యాయం ఎలా దొరుకుతుంది?” ఇలాంటి విషయంలో తీర్పు కోసం వీపు వెనుక (చాడీలు) చెప్పడం అనుమతించబడింది.

4. ముస్లింలను తప్పుడు చేష్టల నుండి ఆపడానికి మరియు వారికి సలహా ఇవ్వడానికి చాడీలు చెప్పడం సమ్మతమే. ఇది ఇజ్మా (ధార్మిక విద్వాoసుల ఏకగ్రీవ నిర్ణయం). అంతేకాదు, ఇది తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే దీని ప్రతిఫలం మనకు కళ్ళకు కట్టినట్టుగా కానవస్తుంది. పెళ్లి విషయాల్లో లేదా వ్యాపార లావాదేవీల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో ఎదుటివాడి గురించి ఏ విషయమూ దాచకూడదు. ఎదుటి వాడి తప్పుడు లక్షణాలు తెలియజేయడం కేవలం వినేవాడి శ్రేయస్సు కొరకై ఉండాలి.

5. నిషేధించబడిన లేదా కల్పిత పోకడల (బిద్ఆత్)ను బహిరంగంగా చేస్తున్న వ్యక్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చాడీలు ఆమోదయోగ్యం. బహిరంగంగా మద్యం సేవించేవాడు, తప్పుడు పనులు చేసే నాయకుడు – ఇలాంటి వారి పాపాల చిట్టా అందరికీ తెలియజేయవచ్చు.

6. ఒక మనిషిని గుర్తించడానికి అతణ్ణి మారుపేరుతో పిలవడం. ఉదాహరణకు – అల్ అమాష్ (మెల్ల కళ్ళ వాడు), అల్ ఆరాజ్ (కుంటుతూ నడిచేవాడు), అల్ అసం (చెవిటివాడు). కాని ఆ మనిషిని అవమానపరచాలనే ఉద్దేశ్యంతో పిలవడం మాత్రం నివారించబడింది. ఆ మనిషిని వేరే మంచి పేరుతొ గుర్తు పట్టే అవకాశం ఉన్న పక్షంలో అతడిని ఆ మంచి పేరుతో పిలవడమే మేలైనది.

చాడీలుచెప్పడం మంచిపద్ధతి కాదు

చాడీలు చెప్పడం అనేది చాలా అనర్థాలకు దారి తీస్తుంది. మనం చాలా మందిని చూస్తూ వుంటాము. వారు లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎవరో ఒకరి మీద ఎవరో ఒకరికి చాడీలు చెప్తూ వుంటారు. కాని అట్లాంటి వారు ఆనందంగా వుండలేరు. అలాగే మన:శాంతిని కోల్పోతారు. వాళ్ళకి లేనిది వేరే వాళ్ళకి వుందని తెగ బాధపడుతుంటారు. వాళ్ళకు లేదు అనే బాధకంటే ఇతరులకు వుందే అనే బాధే వాళ్ళలో ఎక్కువగా వుంటుంది. ఎదుటివారి మీద ఎక్కువగా చాడీలు చెప్పడా నికి ప్రయత్నిస్తుంటారు. వినేవారు వుంటే రోజంతా చెప్తూనే వుంటారు. అట్లాంటి వారిని మనం ఎవాయిడ్‌ చేయటం చాలా మంచిది. ఎందుకంటే చాడీలు చెప్పడం వల్ల ఒకరి మధ్య ఒకరికి గొడవలు జరుగుతాయి. చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఇతరుల పట్ల అసూయ కలిగిన వారే చాడీలు చెప్తూ వుంటారు. వేరొకరి పట్ల చెడు అభిప్రాయం వున్నవారికే చాడీలు చెప్పే అలవాటు వస్తుంది. మనకు చాడీలు చెప్పే అలవాటు వుంటే మాను కోవాలి. అట్లాగే వేరే వాళ్ళు చాడీలు చెప్తూవుంటే వారు చెప్పేది వినకుండా మనపని మనం చేసుకుంటూ పోతే వారు మనవద్దకు ఇంకరారు. మనకు వారు చెప్పేది వినే ఆసక్తి లేదని అర్థం చేసుకుని మనవద్ద చాడీలుచెప్పడం మానేస్తారు. ఈ చాడీలు చెప్పే అలవాటు చిన్నతనంలోనే మొదలవుతుంది. కొంత మందికి చుట్టూ వున్న పరిస్థితు లను బట్టి చాడీలు చెప్పడం అనే అలవాటు మొదలవుతుంది. ఒకవేళ మనకు చిన్నప్పటి నుండే చాడీలుచెప్పే అలవాటు వుంటే అది మానుకోవాలి. ఒక చెడ్డపని నుండి విముక్తి కల్పించుకోవటం అంటే మనల్ని మనం కాపాడుకొన్నట్లే అవుతుంది. చాడీలుచెప్తే విని విడి పోయిన కుటుంబాలు ఈ సమాజంలో చాలా వున్నాయి. చాడీలు అనేవి మనుష్యుల మధ్య కలహాలు రేపి కొన్ని కొన్నిసార్లు మనిషి మరణించడానికి కూడా దారి తీస్తాయి. మనకు ఎవరైనా ఎవరిమీదనైనా చాడీలు చెప్తేవిని ఎదుటి వారిని, నిందించటంకాని, అవమానించటం కాని, ఎదురు తిరిగి మాట్లాడటంకాని, వారిని అనుమానించటం కాని, ఇతరులు చెప్పింది విని నిజనిజాలు తెలియకుండా ఇతరు లతో గొడవపడి విడిపోవడంకాని చేయరాదు. ఎందు కంటే మనం కొన్ని కొన్ని సార్లు కళ్ళతో చూసినది కూడా నిజాలు కాకపోవచ్చు. అక్కడ జరిగింది ఒకటయితే మనం ఊహించేది వేరొక రకంగా వుంటుంది.

Related Post