ఓ మానవుడా!

12200032777wFESJ
 అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో
ఓ మానవుడా!
  పరమ దాత ఆయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే ఒక రేతస్సు బిందువుతో నిన్ను సృష్టించాడు. ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు. తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలచాడు. ఆయనే నీకు చూడటానికి రెండు కళ్ళూ ప్రసాదించాడు. మాట్లాడటానికి ఒక నాలుకా, రెండు పెదవులూ అనుగ్రహించాడు. ఆయనే నిన్ను వినేవాడుగా చేశాడు. ఆయనే నీలో ఆలోచించే, అర్థం చేసుకునే మనస్సు కూడా ఇచ్చాడు. కాని నీవు ఆయన మేళ్ళను మరచి కృతఘ్నుడుగా మారావు.
  ఆ దైవమే భూమిని పాన్పుగా చేశాడు. అందులో పర్వతాలను మేకులుగా పాతాడు. ఆయనే రేయిని తెరగా, పగటిని ఉపాధి సాధనంగా చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా ధాన్యం, కూరగాయలు, దట్టమైన తోటలు ఇంకా రకరకాల పండ్లను పండించాడు. ఆయనే నీకు నిద్ర ద్వారా సుఖం కలుగజేశాడు. ఆ ప్రభువే ఆడ- మగ జంటను సృష్టించి, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను సృజింపజేశాడు. అయితే ఇన్ని అనుగ్రహాలు ప్రసాదించిన దైవానికి నీవు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నావా? కరుణామయుడైన దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకో. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటే నీకే లాభదాయకం. కృతఘ్నతకు పాల్పడితే నీవే నష్టపోతావు. కృతఘ్నులను దైవం ఎన్నడూ సహించడు.
  మహోన్నతుడైన ప్రభువుని కాదని కనీసం ఒక్క ఈగనైననూ సృష్టించలేని జీవులను నీవు దైవంగా నమ్మావు. నీకు ఏ విధమైన లాభంగానీ నష్టంగానీ కలిగించలేని నిర్జీవమైన వస్తువులపై నీవు ఆశలు పెట్టుకున్నావు. నీ మొరలను వినలేని, నీ స్థితిగతులను చూడలేని, నీకు ఏ లాభాన్ని చేకూర్చలేని విగ్రహాలను, పటాలను నీవు ఆశ్రయించావు. వాటిని పూజిస్తున్నావు. చేతులు చాచి వాటిని మొర పెట్టుకుంటున్నావు. వాటి ముందు సాగిలపడి అర్థిస్తున్నావు. సకల లోకాలకు ఏకైక సృష్టికర్త, ప్రభువు అల్లాహ్‌ా మాత్రమే. ఆయనే తూర్పు పడమరలకు స్వామి, ఆరాధ్య దైవం. నీ మొరలను ఆలకించే వాడు. నీ కష్టాలను దూరం చేసేవాడు. నీకు సంతానం ప్రసాదించేవాడు. నీకు ఉపాధినిచ్చేవాడు. అన్ని విధాల నీకు ఆశ్రయాన్ని కల్పించేవాడు. ఆయన తప్ప నీకు వేరే ఆరాధ్య దైవం లేడు.
అల్లాహ్‌ సకల లోకాలకు ఏకైక ప్రభువు. సాటిలేని స్వామి. ఆయనను ఎవరూ కనలేదు. ఆయన కూడా ఎవర్నీ కనలేదు. ఆయన ఆది మధ్యాంతరహితుడు. ఆయనను పోలినదేది లేదు. ఆయన ఏ అవసరమూ అక్కరా లేనివాడు. ఆయనకు కునుకూ రాదు, నిదుర పోనివాడు ఆయన. భూమ్యాకాశాల పరిరక్షణ ఆయనకు అలసట కలిగించదు.
  మానవులందరూ అల్లాహ్‌ా దాసులే. ఒకే తల్లిదండ్రుల బిడ్డలు. పరస్పరం సోదరులు. సర్వ మానవులను ఆయన సమాన దృష్టితో చూస్తాడు. అయితే అమితంగా ఆయన్ను ప్రేమిస్తూ, ఆయన అసహ్యించుకునే పనుల జోలికి వెళ్ళకుండా పరిశుద్ధమైన జీవితం గడిపేవారే ఆయన సన్నిధిలో అత్యంత ఆదరణీయులు, గౌరవనీయులు.
  కనుక నిజప్రభువు వైపునకే మరలు. ఆయనపైనే ఆశలు పెట్టుకో. ఆయన ఇష్టప్రకారమే నడుచుకో. ఆయన ఆజ్ఞలకు కట్టుబడి జీవించు. ఆనందాన్ని ఆత్మ సంతృప్తిని పొందుతావు. ఆయనకు ఇష్టంలేని పనులు చేసి ఆయనకు కోపం తెప్పించకు. అన్ని విధాలా నష్టపోతావు. ప్రాపంచిక జీవిత వాస్తవమేమిటో తెలుసా? ఇక్కడి ధనం, ఆస్తి ఐశ్వర్యాలు, సంతానమూ కేవలం తాత్కాలిక అలంకారాలు మాత్రమే. ప్రాపంచిక జీవితం  క్షణభంగురం, నీటి బుడగలాంటిది. ఇక్కడ ఎంత కాలం ఉన్నా ఒకరోజు తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, అక్కాచెల్లెళ్ళను, అన్నదమ్ములను, బంధుమిత్రులను, అందరినీ వదలి శాశ్వతంగా వెళ్ళిపోవలసి ఉంటుంది. జీవితపు చివరి ఘడియల్లో నీ వారిని కళ్ళార్పకుండా నీవు చూస్తూ ఉన్నప్పటికీ వారు నిన్ను మృత్యు వాత నుండి కాపాడలేరు. ధర్మాధర్మాలను కాదని నీవు సంపాదించిన డబ్బు, ఆస్తి అంతస్తుల్లో ఏదీ నీ వెంట రాదు. కనుక పరుల కోసం నీ ప్రభువును తిరస్కరించకు. ధనం వెంటబడి ధర్మాన్ని త్యజించకు. క్షణభంగురమైన సుఖాల కోసం పరలోక శాశ్వత సౌఖ్యాలను కోల్పోకు.
  పరమ పవిత్రుడైన నీ ప్రభువు నిన్ను వృధాగా పుట్టించలేదు. నీ ప్రభువును ఆరాధించడమే నీ పుట్టుక లక్ష్యం. ఆయనకు దాసుడిగా మసలుకోవడమే నీ కర్తవ్యం. అందులోనే మోక్షం ఉంది.     ఈ ప్రపంచంలో నీవు శాశ్వతంగా ఉండవు. నీ ప్రభువు నీకు మరణాన్నిచ్చి సమాధికి చేర్చి, మళ్ళీ తాను తలచినప్పుడు నిన్ను రెండోసారి బ్రతికిస్తాడు. ఈ విధంగా నీవు నీ ప్రభువు వైపునకే మరలిపోతావు. ఆయన న్యాయస్థానంలో హాజరు చేయ బడతావు. ఈ విశ్వం ఇందులో ఉన్న సమస్తమూ ఒక రోజున అంతమొందించటం జరుగుతుంది. అదే తీర్పు దినం. కర్మల విచారణ జరిగే రోజు.
  ఆ రోజు నీ ప్రభువు దగ్గర నీవు ఏదీ దాచలేవు. ఆయన పట్టు నుంచి తప్పించుకుని ఎక్కడికీ పారిపోలేవు. తీర్పు దినాన నీ తల్లిదండ్రులూ, నీ భార్యాబిడ్డలూ, నీ సోదరులూ, నీ మిత్రులూ ఎవరూ నిన్ను పలకరించరు. ఏ విధమైన సహాయమూ చేయలేరు. నీవు చేసిన సత్కార్యాలూ, దుష్కార్యాలూ అన్నీ  ఆ రోజూ నీకు జ్ఞాపకం వస్తాయి. తీర్పు దినాన హద్దులు మీరి ప్రవర్తించి, ప్రాపంచిక జీవితానికి ప్రాముఖ్యత ఇచ్చినవాడికి నరకమే నివాసమవుతుంది. తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి, తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తి యొక్క నివాసం స్వర్గమవుతుంది.
  కనుక నీవు నీ ప్రభువునే ఆరాధించు. ఆయన  ఇష్ట ప్రకారమే జీవించు. ఆయన ఆగ్రహానికి భయపడుతూ తాను వారించిన పనుల జోలికి వెళ్ళకు. తల్ల్లిదండ్రుల పట్ల సద్భావనతో మెలుగు. వారికి విధేయుడివై మసలుకో. వారు ముసలివారైతే వారిని మృదువుగా పలకరించు. వారి పట్ల గౌరవంగా మసలుకో. వారి కొరకు దైవంతో ఇలా ప్రార్ధిస్తూ ఉండు: ఓ ప్రభూ! నా తల్లిదండ్రులపై కరుణ జూపు- బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు. ఇంకా భార్యాబిడ్డల హక్కులను గుర్తించు. వారి బాగోగుల గురించి శ్రద్ధ చూపు. వారికి ఉత్తమ శిక్షణ ఇవ్వు.
 బంధువుల పట్ల నీ విధులను నిర్వర్తించు. చిన్న చిన్న విషయాలపై రచ్చకు దిగి వారితో సంబంధాలు తెంచుకోకు. పొరుగువారి పట్ల   ఉత్తమంగా    ప్రవర్తించు.  సంపాదన  విషయంలో కొలతలలో తూనికలలో మోసం చేయడం, వడ్డీ వ్యవహారాలను నిర్వహించడం, సారాయి వ్యాపారం,  మాదకద్రవ్యాల విక్రయం, లంచం పుచ్చుకోవడం, జూద మాడటం, దోపిడీ దొంగతనాలకు పాల్పడటం వంటి అధర్మ మార్గాలను ఆశ్రయించకు. సోమరితనాన్ని  విడనాడి దైవం ప్రసాదించిన శక్తీసామర్ధ్యాలను, బుద్ధీవివేకాలను ఉపయోగించి ధర్మసమ్మతమైన మార్గాలను అన్వేషించు. అంతే కాదు ధర్మ సమ్మతంగా సంపాదించిన డబ్బును వృధాగా ఖర్చు పెట్టకు. దైవం నీకు ప్రసాదించిన సంపదలో నుండి కొంత భాగం తీసి బంధువులకు, అనాథలకు, వితంతువులకు, నిరుపేదలకు సహాయం చేయి. తోటి మనిషిని ప్రేమించు. అతని ధన మాన ప్రాణాలను కాపాడు. అధికారం, అంతస్థుల కోసం, కూహనా ప్రతిష్ఠల కోసం సాటి మనిషిని బలిగొనకు. సమాజంలో కల్లోల్లాన్ని సృష్టించకు. పరాయి స్త్రీలపై కామంతో కన్ను వేయకు. వారిని వేధించకు. వారిని గౌరవించు. పేదరికానికి భయపడి నీ సంతానాన్ని హత్య చేయకు. దైవం వారి ద్వారా నీ సంపాదనలో శుభాలను ప్రసాదిస్తాడు.
  వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దు. ఈ దుష్ట కార్యం జోలికి పోతే అవమానానికి గురవుతావు. నీ కుటుంబ గౌరవమూ మంట గలుస్తుంది. జూదం, మద్యపానం లాంటి దురలవాట్లకు బానిస కావద్దు. ఫలితంగా ఆరోగ్యమూ పాడవుతుంది. ఆర్థికంగానూ దీవాలా తీస్తావు. జీవితాన్ని గొప్పగా భావించి పరిశుద్ధమైన జీవితం గడుపు. సమాజంలో నిజమైన గౌరవమర్యాదలు దక్కుతాయి. అనాథుని సొమ్ము జోలికి పోవద్దు. ఇచ్చిన మాటను నిలబెట్టుకో. భూమిపై విర్ర వీగుతూ నడవకు. ఎందుకంటే; నీవు భూమిని చీల్చనూ లేవు, పర్వతాల ఎత్తుకు చేరనూలేవు. అల్లాహ్‌ా గర్విష్టులను ఎన్నడూ ప్రేమించడని తెలుసుకో.  స్వార్ధాన్ని విడనాడి నిస్వార్ధ బుద్ధితో ప్రజా సేవ చేయడానికి ముందుకురా. ప్రజల యోగక్షేమాల గురించి శ్రద్ధ చూపు. వారు నిన్ను అమితంగా గౌరవిస్తారు. పైశాచిక  శక్తులతో    చేతులు   కలిపి సమాజంలో అరాచకాన్ని సృష్టించకు. ఇది ఘోరమైన పాపం. మానవ సమాజంలో శాంతిని న్యాయాన్ని స్థాపించడానికి, మానవత్వాన్ని పెంపొందించడానికి నడుం బిగించు. నీ జీవితం సార్ధకమవుతుంది.
 నీవు నీ ప్రభువైన అల్లాహ్‌ కారుణ్యం పట్ల  నిరాశ చెందకు. ఆయన అపార కరుణామయుడు. జరిగిన తప్పులను ఒప్పుకొని, పశ్చాత్తాప భావంతో  క్షమించమని ఆయన్ను వేడుకో. నిశ్చయంగా ఆయన నీ పాపాలన్నింటినీ  క్షమిస్తాడు. చావు రాక ముందే నీ ప్రభువు వైపునకు మరలి, ఆయనకు విధేయుడిగా మారిపో. సర్వమానవాళి కొరకు ఆయన మెచ్చిన ఇస్లాం ధర్మాన్ని అనుసరించు. ఇస్లాం ఒక మతం కాదు, అది సంపూర్ణ జీవన వ్యవస్థ. సర్వ మానవులకు ఉపయోగపడే ఆధ్యాత్మిక అవసరం అని గుర్తుంచుకో. ఇంకా ప్రళయం వరకూ వచ్చే సర్వ మానవుల కొరకు కారుణ్యమూర్తిగా చేసి అల్లాహ్‌ాతరఫు నుండి పంపబడిన అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించి, ఆయన అడుగుజాడలలోనే నడువు. అయన్ను అనుసరిస్తేనే నీ జీవితంలో అసలైన శాంతి కలుగు తుంది. నీవు ఉంటున్న సమాజంలో నిజమైన గౌరవ మర్యాదలూ, ప్రేమానురాగాలూ జనిస్తాయి. పరలోకంలో శాశ్వతమైన మోక్షం – సెలయేరులు పారే ఉద్యానవనాల రూపంలో – ప్రాప్తమవుతుంది. ఆ స్వర్గవనాలలో నీవు కలకాలం ఆనందంగా, సుఖంగా ఉంటావు.
  అల్లాహ్‌ నీకు సద్బుద్ధిని ప్రసాదించాలని, ఇహపరలోకాల మేళ్ళను అనుగ్రహించాలని మనసారా వేడుకుంటున్నాను.   (ఆమీన్)

 

Related Post