ఈ మార్పుకి మనం సిద్ధమేనా?

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
”నిజాయితీగా బ్రతుకు…నిన్ను చూసి లోకం గర్వపడేలా బ్రతుకు…హితం కోసం పని చేయి…సాటి వ్యక్తుల యెడల దయ, క్షమ కలిగి ఉండు… దారిన పడివున్న హానికర వస్తువును తొలగించు… తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించు… పెద్దల్ని గౌర వించు… పిల్లల్ని ప్రేమించు..” అంటూ సజ్జనులైన మన పూర్వీకులు ఉగ్గుపాలతో పిల్లలకి రంగరించి ఇచ్చేవారు. ప్రస్తుతం ఇటువంటి మంచి మాటలు చెప్పేవారు, తప్పు చేస్తూ ఉండగా చూసి దండించేవారు, దండిస్తే సహించేవారు అరుదు. ఉన్న సమయమంతా కలల సౌధాలు నిర్మించుకోవడానికి, సొంత సౌఖ్యాలకే సరిపోతుంటే ఇక సమాజ సేవ శ్రేయోకామన, విలువల సంరక్షణ ఎక్కడ? ఎటు చూసినా ద్వంద్వ ప్రవృత్తి ప్రబలు తుంది. ‘లోపల ఒక విధంగా బయట మరో విధంగా’ అన్న చందాన వ్యవహరిస్తున్నారు.
  సామాజిక రుగ్మతలపై గంటల తరబడి ఊక దంపుడు ఉపన్యాసాలిచ్చే ఉత్తములు తమ విషయానికి వచ్చేసరికి నీతి నిజాయితీల్ని మర్చిపోతున్నారు. ”ఈ కాలం కుర్రాళ్ళకి గురువు పట్ల గౌరవభావమే లేదు. అదే మా కాలంలో అలా ఉంటే, తోలు వలిచేవారు” అంటాడు తన ట్యూషన్‌ కుర్రాళ్ళకి ఎక్కువ మార్కులేసే ఒక ఉపాధ్యాయుడు. ”ఈ దేశం లో కుళ్ళు రాజకీయాలు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు” అంటాడు బస్సులో ప్రయాణం చేస్తూ ‘పొగ త్రాగరాదు’ అన్న బోర్డు క్రింద నిలబడి సిగరెట్‌ కాల్చే కుర్ర ప్రయాణికుడు. ”ఈ కాలం అమ్మాయిల్ని చూస్తుంటే వీళ్ళకి అసలు శీలం పట్ల నమ్మకం ఉందా అనే అనుమానం కలుగుతుంది” అం టుంది అందాల పొటీలకు అధ్యక్షురాలైన ఆడ పడచు.”పై ప్లాటు వారు మా ఇంటి పేరట్లోకి తొక్కు విసిరేస్తారు. వారికి సివిక్సెన్స్‌ లేదు, పశువులు” అంటాడు వీధిలో చెత్త     పడేసే  క్రిందివాడు. చిత్రం ఏమిటంటే సమాజం పాడయిపోయిందని, ప్రజలు భ్రష్టు పట్టి పోయారని, విలువలు వలువలు   వీడుతున్నా  యని, మంచికి కాలం లేదని వీరు తెగ బాధ పడిపోతుంటారు కూడా. ఒక్క క్షణం తాము కూడా ఆ సమాజం అంతర్భాగమేనన్న నిజాన్ని వీరు గ్రహించరు. ఇలా ప్రతి వ్యక్తీ సమాజం పాడయిపోయింది అని విమర్శిస్తూ ఉంటాడే తప్ప, తనలోని లోపాన్ని తెలుసు కోడు. ఈ లోకంలో చాలా మంది ఎదుటి వారిలో ఎన్ని లోపాలున్నాయో చక్కగా చెప్ప గలరు. కానీ తమలోని లోపాలను తెలుసు కోవడానికి ఇష్టపడరు. చెప్పినా వినరు. పైగా వాటిని సమర్థించుకునేందుకు వీర ప్రయత్నం చేస్తారు.
 ”చెప్పేందుకే నీతులు పాటించేందుకు కావు” అని నమ్మే ఇటువంటి వారిని ఉద్దేశించి దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్వారు: ”ప్రజలు నాశనమై పోయారు, ప్రజలు భ్రష్టుపట్టి పోయారు  అన్న వ్యక్తి నాశనమయ్యేవారిలో తానే అగ్రగణ్యుడు” అన్న విషయాన్ని తెలుసు కోవాలి. (ముస్లిం)
  సమాజం మారాలని కోరుకోవడం, సమాజ సంస్కరణ కోసం పాటుపడటం మంచిదే, మెచ్చుకోదగ్గదే. కానీ సమాజం మారేంత వరకూ మనం ఆగాలా? లేదా ముందు మనం మారేందుకు ప్రయత్నించాలా? అన్న ప్రశ్న ఎవరికి వారు వేెసుకోవాలి. ఏది సులభం? మనం మారడమా? సమాజాన్ని మార్చడమా? ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
 ”ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశి స్తారు, కానీ మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథ పారాయణం చేస్తా రాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?” (అల్‌ బఖరా: 44)
 సమాజం బాగుండాలంటే దానికి మూలమైన మనం బాగుండాలి. మన లాంటి   అందరూ  బాగుండాలి. అలా జరగాలి అంటే, దైవ విధేయతా మార్గాన్ని అనుసరించాలి. ఏమిటి దాని ప్రత్యేకత అంటారా?
  అది దైవభక్తికి, మానవ ప్రేమకు పెద్ద పీట వేస్తుంది. దైవం యెడల భయాన్ని, భక్తిని, దాసుల యెడల దయను, క్షమను జనింప జేస్తుంది. ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుం డానే మనిషి నైతిక నియమాలు నిర్వర్తించేలా ప్రేరేపిస్తుంది.
  అది శుభాలన్నింటినీ, మేళ్ళన్నింటినీ  పునాదులుగా తీసుకుని, అశాంతి, అలజడి, అశుభాలకి, చెడులకి అతీతమైన ఆదర్శ జీవన విధానాన్ని ప్రతిపాదిస్తుంది. ధర్మంపై నడవడమే కాదు, ధర్మ సంస్థాపనార్థం మాన వాళిని ప్రేరేపించి అధర్మాన్ని అంతమొం దిస్తుంది. అది లాంఛనప్రాయమైన ఆచా రాలకు కట్టుబాట్లకు కట్టుబడి ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది.
  స్వార్థంతో కూడుకున్న అహంభావం, దౌర్జన్యం, మార్గవిహీనత, క్రమ శిక్షణా     రాహిత్యం వంటి తామసిక గుణాల్ని ఆత్మ నుండి తొలగించి మనసును పరిశుద్ధ పరుస్తుంది. అది తన ఆశయాలకు అంకిత మైనవారిని – విశ్వాసమూర్తులుగా, శాంతి కాముకులుగా, నిరాడంబరులుగా, సాహస వంతులుగా, ఆదర్శప్రాయులుగా, అసత్యం పట్ల ఎన్నటికీ రాజీ పడని వారిగా, పరలోక భీతి, స్వర్గ ప్రీతి గలవారిగా తీర్చిదిద్దుతుంది.
  అది మనషిలో నైతిక బాధ్యతను జనింప జేస్తుంది. ఆత్మ నిగ్రహాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ విమర్శను పెంచు తుంది. అన్ని సమ యాల్లోనూ సకల సృష్టి తాల పట్ల సమ తౌల్య ప్రవర్తనను, సాత్విక ప్రేమను, కరుణను, దయను, క్షమను సృజి స్తుంది. నిస్వార్థ భావం, నిష్కల్మష న్యాయం, నిర్మల మనస్తత్వం వంటి మంచిని మాత్రమే అందజేసే మహోన్నత సుగుణాలను మనిషిలో పెంపొందిస్తుంది. ఇంతకీ ఆ మార్గమేమి టంటారా? అదే ఇస్లాం.

Related Post