New Muslims APP

అరుదైన ఆణిముత్యం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స)

అరుదైన ఆణిముత్యం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్  (స)

ఆయా కాలాలను బట్టి వివిధ జాతుల్లో, వివిధ భాషల్లో దైవ ప్రవక్తలు వచ్చారన్న విషయం విదితమే. లోక కళ్యాణార్ధం వచ్చిన ప్రవక్తలందరూ, ప్రజలకు స్వచ్చమైన జీవన విధానాన్ని చూపించి, స్వేచ్చావాయువుల్లో విహరింపజేసే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అన్న సద్వచనం మీద మానవాళిని సమైక్యపరచడానికి ప్రయత్నించారు. అలా విశ్వ శాంతి నిమిత్తం వచ్చిన ప్రవక్తలలో ముహమ్మద్ (స ) చిట్టచివరివారు.
మేము నిన్ను శుభవార్త అందజేసేవానిగా, భయపెట్టేవానిగా చేసి సత్యాన్నిచ్చి పంపాము. ప్రతిజాతిలోనూ హెచ్చరించేవాడు ఆవిర్భవించాడు. (ఫాతిర్: 23,24)

ఆయన చేపట్టిన మహోద్యమం కారణంగా ప్రతి హృదయం జ్యోతిర్మయం అవగా, ప్రతి నేత్రం మందారం వలె విరియగా, ప్రతి వదనం సౌహార్ద ప్రతిబింబంగా వెలియగా, ప్రతి పలుకు మలయ మారుతంలా మారగా, మనో సీమల్లో మమతల మల్లెలు పూయగా, ఆత్మ బలం గుభాళింపగా విజయ ఢంకా మ్రోగించారు, హృదయాల విజేత అన్పించారు.

చరిత్రను తిరగేస్తే…… .
నాడు – హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) ప్రవక్తల పితామహుడు. మొక్కవోని సాహసమూర్తి. సహన శీలి. నాటి – ఆ సమాజం, సభ్యతాసంస్కారాలకు సమాధి కట్టి, నీతినిజాయితీలకు నిప్పు పెట్టి, దురాచారాలను ప్రవేశపెట్టి, పచ్చి నిజాలను మంటల్లో నెట్టి, జన మోసాలకు, ధన మోహాలకు, విగ్రహ వ్యామోహాలకు శ్రీకారం చుట్టి, న్యాయ శాస్త్రాలకు పాడె కట్టి, ధరలోభాలకు పట్టం కట్టి, షిర్క్ అడుసు తొక్కి, చర్మ చక్షువులకు కర్రి మబ్బుల గంతలు కట్టి, సందుల్లో, బొందుల్లో శిలాప్రతిమల్ని నిలబెట్టి, జన నమ్మకాలను కొల్లగొట్టి, హరామ్ అనే హాలాహలానికి అమృతం అన్న లేబల్ చుట్టి, చెట్టు, పుట్ట, పాము-పశువు, వాగు-వంక, సూర్యచంద్ర నక్షత్రాలకు తల వంచి, ఆత్మనే వంచించి, కటిక చీకట్లలో కొట్టుమిట్టాడే ఆ గాఢాంధకార సమాజంలో సత్య జ్యోతి వెలిగించడానికి నడుం బిగించారు ప్రవక్త ఇబ్రాహీమ్ (అ).

నిన్న- అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స ). ప్రవక్తలందరి నాయకుడు. మహా గొప్ప విప్లవకర్త, విశ్వకారుణ్యమూర్తి. నిన్నటి – ఆ సమాజంలోని- ధరావతుల, ధనాన్వితుల దారుణ హింసా చర్యలను నిరశించి, తిండిలేక ప్రజలు కొన ఊపిరితో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతుంటే, ధాన్యాగారాలను నిల్వబెట్టి, ప్రజల కళ్ళు గప్పి, వంచనలకు, లంచాలకు, చక్ర బారు వడ్డీలకు చక్రాలు తిప్పే విద్రోహ శక్తుల్ని నియంత్రించి, సత్య ధర్మాద్వేషులని, సంఘంలో నక్కిన గుంట నక్కల్ని, సమాజంలో దాగిన విష ఖడ్గాలని, పాలు పోసి మరీ పెంచబడిన భయద భయంకర సర్పాలనీ, హంతకులని, నియంతలని, స్వార్థపరులని, దుర్మార్గులని, ధూర్తులని గర్జించి, బానిసత్వ సంకెళ్ళను తెంచి, అనవసర ఆంక్షల బరువులను దించి, మంచిని పెంచి చెడును త్రుంచి, మానవ నిర్మాతయి, సౌజన్య ప్రదాతయి, సాత్విక దాతయి నిలిచారు మహా ప్రవక్త ముహమ్మద్ (స).

ఆయన చేపట్టిన మహోద్యమం కారణంగా ప్రతి హృదయం జ్యోతిర్మయం అవగా, ప్రతి నేత్రం మందారం వలె విరియగా, ప్రతి వదనం సౌహార్ద ప్రతిబింబంగా వెలియగా, ప్రతి పలుకు మలయ మారుతంలా మారగా, మనో సీమల్లో మమతల మల్లెలు పూయగా, ఆత్మ బలం గుభాళింపగా విజయ ఢంకా మ్రోగించారు, హృదయాల విజేత అన్పించారు.

ఫలితం – ద్వేషం మొలచిన పాదుల స్నేహ వల్లి వెల్లి విరిసింది. కక్షలు, కార్పణ్యాలు పెరిగిన తావుల కారుణ్యం కురులు విప్పింది. దౌర్జన్యం, దౌష్ట్యం మోహరించిన చోటల్లా స్వేచ్ఛా పూవు విరబూసింది. వర్గ, వర్ణ, కుల, గోత్ర, మత, ప్రాంత విభేదాలు తొలగి, వైషమ్యాలు, వైరాలు, నేరాలు, ఘోరాలు సద్దు మణిగి, బర్బరత్వం అంతరించి, మృగత్వం మెడలు వంచి, మానవత్వం జయించింది. శాంతి తంత్రి నినదించింది. దానవత్వం, దమన నీతి, దారుణత్వం అణగారింది. సాత్విక దృష్టి సౌమ్యతా మొగ్గలు తొడిగింది. శ్రమకి,
శ్రామికునికి ఫలితం సకాలంలో లభించింది. స్త్రీకి హక్కు దక్కింది. లోభం, మోహం, మోసం, క్రౌర్యం, కామం, మదం, మత్సర్యం, దురహంకారం చరమ సంధ్యలో తుది శ్వాస వదిలింది. జగమంతా కుటుంబం మనది అన్న భావన వికసించింది. జనులంతా సుందర
భాస్కర సుమనోహర కిరణాలవగా, విశ్వం మొత్తం శాంతి శ్రేయాలు వర్ధిల్లగా, అందరి కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు జలఝరి వలె రాలగా, అందరికీ వీడ్కోలు పలికి పరమపదించి పరమోన్నత మిత్రుని సన్నిధికి పయనమయ్యారు ప్రవక్త (స ).

మరి నేడు – ముస్లింలు. ప్రజా సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఉనికిలో తేబడ్డ శ్రేష్ఠ సముదాయం. కాని… ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు – అలనాటి దర్గాలు, దుర్గాలు, దురాచారాలు, దమన నీతులు నేడూ మన మధ్యనే మసలుతూ, కొత్త రంగులు పులుముకొని, అందంగా ఆకర్షణీయంగా ముస్తాబయి దర్జాగా చెలామణి అవుతున్నాయి. మానవుడు సాధించని ప్రగతి అంటూ ఏదీ లేదు నేడు. విద్యుత్ దీపాలతో నగర పల్లె వీధులు వెలిగిపోతున్నాయి. కానీ, హృదయ సీమలు సుహృద్భావ లేమితో, మానవత్వం, దైవభీతి కరువై బీటలు వారుతున్నాయి. మనసున పూసిన మందారాలు వాడిపోతున్నాయి. కరుణ, ప్రేమ, జాలి, ఆప్యాయత, అనురాగాలు కనుమరుగైపోతున్నాయి. అరచేతిలోని  అంతర్జాలం ఒక వైపు అద్భుతనాల్ని ఆవిష్కరిస్తుంటే, మరో వైపు పూడ్చ సాధ్యం కానీ అనర్థాల్ని సృష్టిస్తున్నది.  సత్యం, ధర్మం, న్యాయం కోసం సద్వినియోగించుకోవాల్సిన ఈ పరికరాలను ముఖ్యంగా యువత – అశ్లీలం, విచ్చలవిడితనం, స్వీయ నగ్న చిత్రీకరణ, నీతి  రాహిత్య సంభాషణ కోసం దారుణంగా దుర్వినియోగ పరుస్తున్నారు.  నేటి మన దుస్థితికి కారణం, కారకులు ఎవరు? మనం కాదా? ప్రజా బాహుళ్యంలో విద్యా గంధాన్ని, ప్రేమ మరిమళాన్ని వెదజల్లే బాధ్యత మన మీద లేదా? ఆత్మ స్తుతిని మాని ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన, ఆలోచించాల్సిన కర్తవ్యం మనది కాదా? ఏమిటి మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నం కాలేదా?

విశ్వాసుల హృదయాలు అల్లాహ్  ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నం కాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులై ఉన్నారు. మీరలా కాకూడదు సుమా!
వినండి! భూమి మృతప్రాయమైన తర్వాత అల్లాహ్  దానికి తిరిగి జీవం పోస్తున్నాడు. (అలాగే మృతప్రాయమైన మానవతక్కూడా ప్రవక్తల ద్వారా జీవం పోస్తున్నాడు.) మీరు విషయం గ్రహిస్తారని మాసూక్తులు మీకు విడమరచి చెబుతున్నాం. (అల్ హదీద్:16-17)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.