Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ఇమామత్‌ ఆదేశాలు

imamat - telugu
ఇస్లామీయ ఆరాథనలు పుస్తకం నుండి
నాయకుణ్ణి, పరిపాలకుణ్ణి ‘ఇమామ్‌’ అని పిలుస్తారు. కాని ఇక్కడ మాత్రం ఇమామ్‌ అంటే నమాజ్‌ చేస్తున్న వారికి సారథ్యం వహించే వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో అతని వెనుక నమాజ్‌ చేసేవారందరూ ‘ముక్తదీలు’ అనబడతారు.
ఇమామత్‌కు ఎవరెక్కువ అర్హులు?
హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: దైవగ్రంథాన్ని బాగా పారాయణం చేసే వ్యక్తి (నమాజులో) ప్రజలకు సారథ్యం వహించాలి. ఒకవేళ ప్రజలందరూ కూడా గ్రంథ పారాయణంలో సమవుజ్జీలయినప్పుడు వారిలో దైవప్రవక్త విధానం (సున్నత్‌) గురించి అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి సారథ్యం వహించాలి. ఒకవేళ సున్నత్‌ జ్ఞానంలో కూడా ప్రజలందరూ సమానులే అయితే వారిలో ప్రప్రథమంగా దైవమార్గంలో హిజ్రత్‌ చేసినవారు సారథ్యం వహించాలి. ఒకవేళ హిజ్రత్‌ చేయటంలో కూడా అందరూ సమానులయి ఉంటే, అప్పుడు వయసులో అందరికన్నా పెద్దవాడు వారికి సారథ్యం వహించాలి. ఒకరి నియమిత చోటులో అతని అనుమతి లేకుండా ఇంకొకరు ఇమామత్‌ చేయకూడదు. ఇంకొకరి ఇంట్లో వారి గౌరవాసనం మీద వారి అనుమతి లేకుండా కూర్చోకూడదు. (ముస్లిం, అహ్మద్‌)
గుడ్డివారూ నమాజుకు సారథ్యం వహించవచ్చు
దైవప్రవక్త (సల్లం) హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమ్మె మక్తూమ్‌ (రజి)ని మదీనాలో రెండుసార్లు తన ప్రతినిధిగా నియమించారు. ఆ సమయంలో ఆయన ప్రజలకు నమాజ్‌ చేయించేవారు. మరి చూడ బోతే అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమ్మె మక్తూమ్‌ అంధులు. (అహ్మద్‌, అబూ దావూద్‌)
యుక్త వయస్సుకు చేరని పిల్లవాడు ఇమామత్‌ చేయగలడు
తన తండ్రి తనతో ఇలా చెప్పారని అమ్ర్‌ బిన్‌ సలమా (రజి) తెలియజేశారు: ” నేను దైవప్రవక్త (సల్లం) సన్నిధికి హాజరై తిరిగి వస్తుండగా దైవప్రవక్త (సల్లం) నన్ను ఉద్దేశించి, ‘నమాజ్‌వేళ అవగానే మీలో ఎవరయినా ఒకరు అజాన్‌ ఇవ్వాలి. ఆ తర్వాత అందరికన్నా ఎక్కువగా ఖుర్‌ఆన్‌ జ్ఞానం కలిగివున్న వ్యక్తి నమాజ్‌కు సారథ్యం వహించాలి’ అని ఉపదేశించారు”.
అప్పుడు మా తెగవారికి ఖుర్‌ఆన్‌ గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వారెవరూ కనిపించలేదు. అంచేత వారు తమకు ఇమాముగా నన్నే ఎన్నుకున్నారు. అప్పట్లో నా వయసు ఆరేడు సంవత్సరాలు ఉండి ఉంటుంది. అంతే.  (బుఖారీ, అబూదావూద్‌)
ఇమామ్‌ ప్రజలకు భారం అనిపించని విధంగా నమాజ్‌ చేయించాలి
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: నమాజ్‌కు వచ్చేవారిలో బలహీనులు, వ్యాధిగ్రస్తులు, ముసలివారు కూడా ఉంటారు. అందువల్ల ప్రజలకు నమాజ్‌ చేయించే వ్యక్తి (ఎవరికీ భారం అనిపించకుండా) సంక్షిప్తంగా నమాజ్‌ చేయించాలి. తను ఒంటరిగా నమాజ్‌ చేసుకుంటున్నప్పుడయితే, అతను తనకిష్ట మైనంత సుదీర్ఘంగా నమాజ్‌ చేసుకోవచ్చు.  (బుఖారీ)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటుండేవారు: ”నేను సుదీర్ఘ నమాజు చేయాలన్న ఉద్దేశ్యంతో నమాజు మొదలు పెడతాను. కాని తర్వాత ఏదయినా బిడ్డ ఏడ్పు వినబడగానే, బిడ్డ ఏడ్పు వల్ల ఆ బిడ్డ తల్లి బాధపడుతుందేమోనని నేను నమాజును సంక్షిప్తం చేస్తాను”. (బుఖారీ)

Related Post