ఇస్లాం మూల స్తంభాలు

Muslim Kids 120

 

 ఇస్లాం కట్టడం అయిదు స్తంభాలపై ఆధారపడి ఉంది.

(1) ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌, ముహమ్మదుర్రసూలుల్లాహ్‌” అని సాక్ష్యమివ్వటం.  (2) నమాజును స్థాపించటం.

(3) జకాత్‌ ఇవ్వటం (4) రమజాన్‌ నెల ఉపవాసాలు ఉండటం.  (5) స్థోమత ఉంటే హజ్జ్‌ చేయటం.

ž ఒక వ్యక్తి ఈ మూల సూత్రాలను అంగీకరించి, మనస్ఫూర్తిగా ఆచరించనంత వరకూ ముస్లిం కాలేడు.

ž హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్‌ (స) ఇలా ప్రవచించారు: ”ఇస్లాం అయిదు అంశాలపై నిలబడి ఉంది – (1) అల్లాహ్‌ ఏకత్వం (తౌహీద్‌), (2) నమాజును నెలకొల్పటం (3) జకాత్‌ ఇవ్వటం, (4) అల్లాహ్‌ గృహాన్ని సందర్శించి హజ్జ్‌ చేయటం (5) రమజాన్‌ మాసంలోని ఉపవాసాలను విధిగా పాటించటం. (బుఖారీ, ముస్లిం)

ఇస్లాం మూల సూత్రాలు – ఒక చూపులో

1. షహాదతైన్‌ : ”అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ వ అష్‌హదు అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్‌”.

లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అని సాక్ష్యమివ్వటం:

అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడని సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే అల్లాహ్‌యే అందరి సృష్టికర్త. పోషకుడు. ఆయన సాటిలేని వాడు. ఆయనకు సంతానం లేదు. ఆయనకు తల్లిదండ్రులు కూడా లేరు. ఆయన అద్వితీయుడు. ఆయన అస్తిత్వంలోగానీ, గుణగణాలలోగానీ, అధికారాలలో గానీ, ఆయన ఔన్నత్యంలో గానీ ఆయనకు పోలినవారు ఎవరూ లేరు. ఆయనకు భాగస్వాములు లేరు. సకల స్తోత్రాలకు, ఆరాధనలకు ఆయనే అర్హుడు. కనుక ఆయనకే భయపడాలి. ఆయనపైనే ఆశ కలిగి ఉండాలి. ఆయన్నే నమ్ముకోవాలి. సహాయం కొరకు ఆయన్నే అర్థించాలి. ఆయన్నే వేడుకోవాలి. ఆయన సన్నిధిలోనే వంగాలి. సాష్టాంగ ప్రణామం ఆయనకు మాత్రమే చేయాలి.

ఆయనే నిజ ఆరాధ్యుడు. ఆయన్ని కాదని ప్రార్థించే ఇతర దేవుళ్ళు దేనినీ సృష్టించ లేదు. లాభంగానీ, నష్టంగానీ చేకూర్చే శక్తి వాటికి లేదు. వాటికి అగోచర విషయాల జ్ఞానం లేదు. అవన్నీ బూటకపు దైవాలు. ఉదాహరణకు:- రాయి రప్పలు, చెట్టు పుట్టలు, సూర్యచంద్రులు, మనుషులు, గోవులు ఇత్యాదివి.

ఈ విధంగా సాక్ష్య వచనంలో సకారాత్మక, నకారాత్మక అంశాలు రెండూ వచ్చేస్తాయి. (1) అంటే నిజదైవాన్ని అంగీకరించాలి. బూటకపు దైవాలను తిరస్కరించాలి. (2) మన ఆరాధనలు, ఉపాసనలు అన్నీ నిజదైవానికే చెందాలి. మన ధర్మాన్ని నిజదైవానికే ప్రత్యేకించుకోవాలి.

ముహమ్మద్‌ (స) అల్లాహ్‌ సందేశహరుడు అని సాక్ష్యమివ్వటం:

ముహమ్మద్‌ (స) అల్లాహ్‌ దాసులని, ప్రవక్తఅనీ, ఆయన ఖురైష్‌ వంశీయులని, అరబ్బు జాతీయుడని సంపూర్ణంగా విశ్వసించాలి. ఆయన అల్లాహ్‌ తరపున ప్రవక్తగా ఎన్నుకోబడ్డారని సాక్ష్యం పలకాలి. ఆయన (స) సమస్త మానవాళి కోసం గ్రంథాన్ని, షరీయత్‌ను తెచ్చారని నమ్మాలి. అన్ని విషయాలలోనూ ఆయనను అనుసరించాలి. ఆయనకు విధేయత చూపాలి. ఆయన ఇచ్చిన దానిని  సంతోషంగా పుచ్చుకోవాలి. ఆయన వారించిన విషయాలకు దూరంగా ఉండాలి.

 2. నమాజును స్థాపించటం:

ఒక దాసుడు రేయింబవళ్ళలో ఆచరించే అద్భుతమైన ఆరాధన ప్రక్రియ నమాజ్‌. దీని ద్వారా మనం మనపై కారుణ్య వర్షం కురిపించే, వరాలను ప్రసాదించే నిజదైవాన్ని స్తుతిస్తాము. ఆయన సన్నిధిలో భక్తితో, భయంతో మోకరిల్లుతాము. మన పాపాలను క్షమించమని వేడుకుంటాము. తద్వారా దైవసన్నిధిని పొందటానికి కృషి చేస్తాము. రేయింబవళ్ళలో ఒక ముస్లింపై అయిదు పూటల నమాజులు విధి (ఫర్జ్‌)గా చేయబడ్డాయి. అవి :-

   1. ఫజ్ర్‌   (2 రకతులు)   2. జుహ్ర్‌   ( 4 రకతులు)    3.అస్ర్‌  (4 రకతులు)

   4. మగ్రిబ్‌  (3 రకతులు)  5.ఇషా  (4 రకతులు)

ప్రతి శుక్రవారం (నమాజె జుమా) ముస్లింల కొరకు తప్పనిసరి. ఇది జుహ్ర్‌ నమాజ్‌కు బదులుగా ఉన్నది. నమాజె జుమా సామూహికంగా ఆచరించాలి. ఒకవేళ ఏ కారణంగానయినా జుమా నమాజు చేయలేక పోతే జుహ్ర్‌ నమాజు చేసుకోవాలి.

3. జకాత్‌ ఇవ్వటం :

షరీయత్‌లో నిర్ధారించబడిన ఆర్థిక స్థోమత కనకు ప్రాప్తమయితే మనం అల్లాహ్‌ పట్ల కృతజ్ఞతాపూర్వకంగా జకాత్‌ చెల్లించాలి. ఈ జకాత్‌ ఏడాదికి ఒకసారి విధిగా ఇవ్వబడుతుంది. జకాత్‌ పేదల, అభాగ్యుల హక్కు.

 4. రమజాన్‌ మాసంలో ఉపవాసాలు పాటించటం:

దివ్య ఖుర్‌ఆన్‌ అవతరించిన నెల రమజాన్‌. అల్లాహ్‌ తన చివరి ప్రవక్త ముహమ్మద్‌ (స) ద్వారా మనకు మార్గ దర్శక గ్రంథం – ఖుర్‌ఆన్‌ ప్రసాదించి మహోపకారం చేశాడు. అందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెలంతా ఉపవాసాలు పాటించాలి. తెల్లవారుజాము నుండి సాయింత్రం సూర్యాస్తమయం వరకు అన్నపానీ యాల నుండి, లైంగిక కోర్కెల నుండి పూర్తిగా ఆగి ఉండటమే ఉపవాసం (సౌమ్‌).

 5.హజ్‌ :

ఇస్లాం మూల సూత్రాలలో ఇది అయిదవది. ఆర్థిక స్థోమత ఉన్న ప్రతి ముస్లింపై ఇది విధిగా చేయబడింది. హజ్జ్‌ సంకల్పం చేసుకున్నవారు నిర్ణీత దినాలలో పవిత్ర మక్కాలోని కాబా గృహాన్ని సందర్శించి, ప్రవక్త (స) సూచించిన పద్ధతి ప్రకారం హజ్జ్‌ ఆచారాలను నెరవేర్చాలి.

Related Post