కాలం పరిణామశీలం

new-year

కాలమనే కడలిలో మరో కెరటం లేచింది. మానవ చరిత్ర మరో మైలు రాయి దాటింది. చరిత్రలో ఏ సంవత్సరానికా సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కొత్తదనం అంటే చిత్తానికి ఎప్పుడూ ఉత్తేజమే. పాత జ్ఞాపకల స్థానంలో రానున్న భవిష్యత్తును ఊహించుకుంటూ రాబోయే సమయం సంతోషంగా గడవాలని కోరుకుంటాడు మనిషి. ఉషాకాంతుల వంటి పసిడి కలలతో మిసిమి భవితవ్యానికి సుస్వాసగం పలికే సంప్రదాయం వెనుకున్న రహస్యం – మనిషి నిత్య ఆశావాది కావడమే! ఆ ఆశావాదమే అడవి మనిషిని అణు అధికారిగా మార్చింది. ఎదురుదెబ్బలెన్ని ఎదురైనా అదరక, బెదరక సమస్యల సునామీలకు ఎదురేగి మరీ దూసుకుపోయే సుగుణమే మనిషిని ఇతర జీవరాసులలో శ్రేష్ఠుణ్ణి చేసింది. శిశిరం వస్తుంది, పోతుంది, మళ్లీ వస్తుంది. అయినా వసంత పవన తాకిడికే పరవశించిపోతుంది కోయిల. మధు మాసం రాగానే మావి చిగురు కొమ్మ మీద చేరి రాగాలాపన చేస్తుంది. అలాగే గత అనుభవాలు ఎలా ఉన్నా – రాబోయే కాలమంతా సర్వే జనా సుఖినోభవంతు, సర్వ జనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించడం ఒక్క మనిషికే చెల్లింది. అయితే 2013లో ఈ మనిషి చేసిందేమిటి? అంటే, ‘పతనంతో పోరాటం’ అనక మానదు.

పోరాటం – అది అరబ్బు ప్రపంచంలో నియంతలపై సాగిన ఆగ్రహ జ్వాలలే కావచ్చు. మళ్ళి నిరాయుధ ప్రజలను గురి పెట్టి చూసిన కరకు మర తుపాకులే కావచ్చు. మళ్లీ మళ్ళీ శాంతి కపోతాల రక్తాన్ని చవి చూసిన ఇనుప మూతి కాకులే కావచ్చు. ఐరోపాలో ఆర్థిక సంకోభంపై సమరమే కావచ్చు. భారత దేశంలోనిర్భయ నిరసనలే కావచ్చు. రూపిణి పతనావస్థకు గురి చేసిన పరిస్తుతులే కావచ్చు.సామ్రాజ్యవాదులను సమస్యల్లోకి, సామాన్యులను కష్టాల్లోకి నెట్టిన, ముంచుతున్న ఆర్థిక సంకోభమే కావచ్చు. వెరసి 2014 వీటికి ఓ పెను సవాల్‌!

ఏది ఏమైనా, కాలం – దాని విలువ అమూల్యం. అది కలిమితో కొనలేనిది, బలిమితో వశపర్చుకోలేనిది. ఒక్కసారి చేజారితే తిరిగి సంపాదించుకోలేనిది. మ్రొక్కి పట్టుకోలేనిది, వెతికి వెనక్కి తెచ్చుకోలేనిది. నియతి తప్పక నడితే ఆ కాలం మనిషికిచ్చే సందేశం – శిశిరంలో సయితం వసంతాన్నే కలగనమని. గతి తప్పిన చోటు నుంచే మతి మార్చుకుని మసలుకోమని. మానవ జాతికి ఊపిరి స్వాతంత్య్రం – అది జ్యోతిగా వెలిగే చైెతన్యం – ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యం అని. శిఖరంలా ప్రతి మనిషీ శిరసెత్తిన నాడే, అవనీ ఆకాశం, సూర్య చంద్ర నకత్రాల్లా ఆ సర్వేశ్వరుడికి తల వంచిన నాడే, జల నిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయం అని. అది గతాన్ని సింహావలోకనం చేసుకుని బంగారు భవిష్యత్తుకు దైవవిధేయతా పునాదులు వేసుకోవడంతోనే సాధ్యమని.
”కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు”. (అల్‌ అస్ర్‌: 1-3)

Related Post