మనం అలా లేమే…!

 సయ్యద్  అబ్దుస్సలామ్ ఉమ్రీ 

girl

తనను ఒకరితో పోల్చుకోవడం మనిషికి బాల్యం నుండి అలవడే ఓ ప్రక్రియ. ఇది మనిషి జీవితంలో మమేకమయి ఉండటాన్ని మనం గమనించగలం. ఎవరి అస్తిత్వం వారిది. ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి జీవన విధానం వారిది. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేెసుకోని కారణంగా మనిషి తన జీవనయానంలో ప్రతి థలో ఇతరులతో పోల్చుకుంటూ సమస్యల సుడి గుండంలో తనను తాను నెట్టేసుకుంటుంటాడు. అప్పుడప్పుడు పోలిక కొన్ని పనులు చేయడానికి ఉద్దీపనంలా ఉంటుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పోల్చుకునే ఈ గుణం అన్ని వేళలా శ్రేయో దాయకం కాదు.  శైశవంలో, బాల్యంలో పోల్చుకోవడం వల్ల  అనేక విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది.  ఆ మేరకు అది ఉపయుక్తంగానే ఉంటుంది.  కానీ ఒక మనిషి వ్యక్తిత్వం రూపొందే థలో ఒకరితో  పోల్చుకునే ఈ గుణం మానుకోకపోతే తనదైన రీతి, తనదైన ముద్ర ఒకటి ఏర్పడటం కష్టం అవు తుంది. ఏతా వాతా ఇది వ్యక్తిత్వ రాహిత్యానికి దారి తీసి మనిషిని అసంతుష్టుణ్ణి చేస్తుంది. ఏదో కోల్పోయినట్లు అసహనంతో వ్యవహరిస్తుంటాడు. నిజంగా తనేమిటో తనకే తెలియని స్థితి దుర్భరం.

పోల్చుకోవడం మొదలెడితే దాని హద్దూ పద్దూ ఉండదు. చాలా మంది తమల్ని ఇతరుల ఆస్తిపాస్తు లతో, హోదా అంతస్థులతో పోల్చుకుని అవి తమకు ప్రాప్తం కాలేదని తీవ్ర అసంతృప్తికి గురవుతుం టారు. ఖచ్చితంగా తమకు ఏం కావాలో తేల్చుకోని  వారే ఇలా పోల్చుకుంటుంటారన్నది మానసిక శాస్త్రవేత్తల మాట.  ఈ పోల్చుకునే గుణం చివరికి దైవానికి సయితం పోలికలు కల్పించే స్థాయికి దిగజార్చుతుంది. ఫలితం – మనిషి  ఇహపరాలు నాశనమవుతాయి. పోతే,

‘మనం అలా లేమే’ అన్న భావం చాలా మంది స్త్రీలను కృంగదీస్తుంది. ‘నాకు అందం లేదనో, నా స్వరం బాగోలేదనో, నేను చాల పొట్టిననో, నేను ఫలానావిడలా లేననో’ అంటూ వాపోతుంటారు కొందరు. అర్హత లేని వారు అర్హతను నిరూపించుకునేందుకు పడే పాట్లు తెలియని కావు. అలాగే అందవిహీనంగా ఉన్న అమ్మాయే తొందరగా ఇతరుల ఆకర్షణకి గురవుతుంది అంటారు మానసిక శాస్త్రవేత్తలు. కారణం – తన మీద నమ్మకం కలిగించుకోవడం కోసం.అదే విధంగా ‘స్త్రీగా పుట్టడమే నేర’మని నిరతం నిరాశనిస్పృహలకు లోనయి జీవించే స్త్రీలు పురుషుల్లాంటి దుస్తులు, వారి లాంటి నడవడికను అలవర్చుకుని తాము దేనికీ తక్కువ కామని హొయలు పోతుంటారు. ఈ రెండు ధోర ణులు న్యూనతా మూలంగా చోటు చేసుకుంటాయన్నది గమనార్హం. దీనికి భిన్నంగా స్త్రీగా తన వ్యక్తి త్వాన్ని సంపాదించుకునేందుకు కృషి చేయాలి. ఒకరితో మనల్ని మనం పోల్చుకొని మనకు లేని పోలి కల కోసం పడే కష్టం, శ్రమ, మనలోని ప్రతిభాపాటవాలను ప్రగతి బాటన నడిపే విషయంలో వెచ్చించినట్లయితే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. లేదంటే సాధించిన ఆ కొద్ది ప్రగతి కూడా పోలికలతోనే గుర్తించబడుతుంది. ఈ కారణంగానే న్యూనతకు గురి చేసే ఇటువంటి వైఖరిని నిర సిస్తూ ప్రవక్త మహినీయ (స) ఇలా అభిశపించారు: ”పురుషుల వస్త్రధారణను అలవలంబించే స్త్రీలు, స్త్రీల వస్త్రధారణను అనుకరించే పురుషులు శపించబడ్డారు”. (ముస్నద్‌ అహ్మద్‌)

స్త్రీ సమస్య అనేది ఈనాటిది కాదు. ఇది సమాజికపరమైన సమస్య. అందుకని సాంఘీక విప్లవం రావాలి. సరైన ధార్మిక అవగాహనను ప్రజల్లో పెంపొందించాలి. దానికితోడు మనో ధైర్యాన్ని శక్తిలా చేసుకుని పోరాడే వ్యక్తిత్వాన్ని స్త్రీలు పెంపొందించుకోవాలి. ‘వంట ఎవరు చేెశారు? అంట్లు ఎవరు తోమారు?’ అన్నది కాదు  ముఖ్యం. దాంపత్య జీవితంలో సమ ఉజ్జీల మధ్య ఓ అవగాహనతో ఎవరు ఏ పని చేసినా తప్పు లేదు. ఇంటి పని చేయడం స్వేచ్ఛకు అవరోధం అనుకునే స్త్రీలు తమ తమ రంగాల్లో రాణించిన విశ్వాసుల మాతలు కూడా ఆ పనుల్ని ఎంతో చక్కగా నిర్వర్తించారు అని గుర్తించాలి. అలాగే ఇంటి పని, వంట పని చేయడం అవమానంగా భావించే పురుషులు అన్ని రంగాల్లో ఆదర్శంగా అందరి నీరాజనాలందుకున్న మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సయితం ఇల్లు ఊడ్చే వారు, కూరగాయలు తరిగేవారు, బట్టలు కుట్టుకునేవారు, వీలైయినంతగా ఇల్లాలికి చేదోడు వాదోడుగా ఉండేవారన్న సంగతిని విస్మరించ కూడదు.

ఎవరయినా తాను కోరుకున్న ఒక వస్తువును పొందలేనప్పుడు అసంతృప్తికి లోనవుతున్నారంటే దానికి అర్థం ఉంటుంది కానీ, ఇతరుల్ని చూసి అసూయతో రగిలిపోతూ, అసంతృప్తికి గురవ్వడం కంటే అర్థరాహిత్యమయిన అంశం మరొకటి ఉండదు. మానసిక లోకంలో మనిషి ఈ ప్రవర్తన అతని మనో వికాస పతనానికి తార్కాణం. అందుకే పోల్చుకోవడం మాని తానేమిటో తెలుసుకుని, తేల్చుకుని వ్యవహరించే వారే ప్రశాంతంగా ఉండగల్గటంతోపాటు అనుకున్నది సాధించగలుగుతారు.

Related Post