మంచిని పెంచాలి చెడును తుంచాలి

manchi

‘‘మీలో కొందరు… ప్రజల్ని మంచివైపునకు పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆదేశించేవారు, చెడుపనుల నుండి వారించేవారు తప్పక ఉండాలి. ఇలాంటి వారే సాఫల్యం పొందుతారు’’ (3 – 104). పవిత్ర ఖురాన్‌లోని ఈ వాక్యంలో దైవవిశ్వాసుల ఉనికి యొక్క అసలు ఉద్దేశ్యమేమిటో, వారి జీవిత లక్ష్యమేమిటో స్పష్టంగా చెప్పడం జరిగింది.

సమాజంలోని దుర్మార్గాలను శక్తిమేర రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేయాలి. ఒకవైపు చెడుల నిర్మూలనకు కృషి చేస్తూనే, సత్కార్యాల అభివృద్ధికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం కూడా జరగాలి. దీనికోసం ధర్మం, అధర్మం, దైవభీతి, పాపభీతి, దేవుని ఏకత్వం, పరలోక విశ్వాసం, జవాబుదారీతనం లాంటి సుగుణాలనూ వారిలో జనింపచేయడానికి కృషి చేయాలి.

నేటి సమాజంలో చెడుల విస్తృతి ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. చెడులతో పోల్చుకుంటే మంచి మరుగుజ్జులా కనిపిస్తోంది. నిజానికి ‘మంచి’ అన్న మేరుపర్వతం ముందు చెడు చీడపురుగులా గోచరించవలసింది. కాని దురదృష్టవశాత్తు మంచిపై చెడే పైచేయిగా ఉందేమోననే అనుమానం కలుగుతోంది. ఈ దుస్థితి వెంటనే మారాలి. అందులోనే మానవ సాఫల్యం ఇమిడి ఉంది. పైన పేర్కొన్న ఖురాన్ వాక్యంలో కూడా ‘మీరిలా చేస్తేనే సాఫల్యం పొందుతారు’ అని చెప్పబడింది.

అనాదిగా మానవసమాజం రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. ఒకటి… ైదె వాన్ని, దైవప్రవక్తలను, దైవ గ్రంథాలను, పరలోకాన్ని విశ్వసిస్తూ భువిపై మంచిని, ధర్మాన్ని స్థాపించడానికి కృషి చేసేవర్గం. రెండు… దైవతిరస్కారుల వర్గం. అంటే ఈ విషయాలేవీ పట్టించుకోకుండా, తామే ప్రభువులై, శాసనకర్తలై, ప్రజలంతా తమకే విధేయత చూపాలని, దాసోహమనాలని తలబిరుసుతనంతో విర్రవీగే ఫిరౌన్, ఖారూన్, నమ్రాద్ లాంటి వాళ్ల వర్గమన్నమాట.

మంచికోసం, మానవ సంక్షేమం కోసం కృషి చే సినవారే విజయతీరాలకు చేరారని, ఇహపరసాఫల్యాలు సాధించారని చరిత్ర చెబుతోంది. మంచిని విస్తరించి, చెడును నిర్మూలించడం కోసం పనిచేస్తున్న క్రమంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ, ముందుకు సాగినప్పుడే ఇది సాధ్యం. దీనికోసం అచంచలమైన దైవవిశ్వాసం ఉండాలి. సమాజంలో సంభవిస్తున్న చెడులు, దుర్మార్గాల పట్ల మనసులో రోత, వెగటు, ఆవేదన కలగకపోతే, అలాంటి హృదయంలో విశ్వాసమే లేనట్లు లెక్క. అందుకే ముహమ్మద్‌ప్రవక్త ఇలా అన్నారు… ‘‘మీరు గనక చెడును చూసినట్లయితే బలప్రయోగంతోనైనా సరే దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యండి. అది సాధ్యం కాకపోతే మంచి మాటల ద్వారా, హితబోధ ద్వారా, ఏదో ఒక రకంగా దాన్ని జరగకుండా చూడండి. అది కూడా సాధ్యం కాకపోతే, మనసులోనైనా దాన్ని చెడుగా భావించండి. దాన్ని అసహ్యించుకోండి. అసహ్యం కూడా కలగకపోతే అసలు విశ్వాసమే లేనట్లు లెక్క.’’ ఈ చివరి భావన కనీసస్థాయి విశ్వాసం. కనుక మంచిని పెంచడం, చెడును నిర్మూలించడం మనందరి బాధ్యత.

 

Related Post