మనిషికి ఏమయింది?

 
దారి చూపే వాడొకడు, వెంట నడిచేవాడొకడు. రాసేవాడొకడు, చదివేవాడొకడు. వెంపర్లాడే వాడొకడు, వెంటాడే వాడొకడు. ఇచ్చే వాడొకడు, పుచ్చుకునే వాడొకడు. శాంత హృదయుడొకడు, నసుగుతూ జీవించే వాడొకడు. వేకువై వెలిగే వాడొకడు, చీకటై బ్రతికే వాడొకడు. ప్రేమించే వాడొకడు, పొడిచి చంపే వాడొకడు. తర్కించే వాడొకడు, తలతిక్క తలపులతో తల్లడిల్లే వాడొకడు. అన్నీ ఉన్నా, ఇంకా కావాలంటూ అర్రులు చాచే వాడొకడు, ఏమీ లేకపోయినా హృదయ సంపత్తితో కాలం వెళ్ళదీసే వాడొకడు.  విర్రవీగే వాడొకడు, వినయాన్ని ప్రదర్శించే వాడొకడు. జ్ఞానినంటూ డప్పు కొట్టే వాడొకడు, అంతా తెలిసినా విద్యార్థిననే చెప్పుకునే వాడొకడు. సేవకై తపించే వాడొకడు, కీర్తికై పడి చచ్చే వాడొకడు. దైవాన్ని విశ్వసించే వాడొకడు, ధిక్కార స్వరంతో దైవ అవిధేయతకు పాల్పడే వాడొకడు. మనిషి ఒక్కడే కానీ, అతనికున్న తత్వాలు భిన్నం.
ఈ మనిషే ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ తనను సృజించిన స్వామిని గుర్తించలేక పోతున్నాడు. సృష్టికర్తను కాదని సృష్టితాలను పూజిస్తున్నాడు. వాటిని ఆశ్రయిస్తున్నాడు. తనలాంటి అసంఖ్యాక మానవులను ఆరాధ్య దైవంగా భావించి వారి ముందర తలవంచు తున్నాడు. ‘నిగ్గుదీసి అడుగు సిగ్గు లేని జనాన్ని’ అన్నట్టు అల్లాహ్‌ా ఇలా ప్రశ్నిస్తున్నాడు:  ”సృష్టించేవాడూ, అసలు ఏమీ సృష్టించని వాడూ ఉభయులూ సమానులేనా? మీరు ఈ మాత్రం అర్థం చేసుకోలేరా?”. (అన్‌ నహ్ల్:17)
 ”ప్రజలు ఆయనను కాదని కల్పించుకున్నట్టి దేవుళ్ళు ఏ వస్తువునూ సృష్టించలేరు, కాని వారే సృష్టింప బడతారు.” (అల్‌ ఫుర్‌ఖాన్:3)
 ఇంకా విచారకరమైన, బాధాకరమైన విషయం ఏమిటంటే చిత్రకారుడు గీసిన బొమ్మల్ని, శిల్పిచెక్కిన విగ్రహాలను, వడ్రంగి తయారు చేసిన ప్రతిమలను, స్వర్ణకారుడు తన నైపుణ్యాల్ని ప్రదర్శించి ఒక రూపునిచ్చి చేసిన మూర్తులను ఆరాధ్య దైవాలుగా విశ్వసిస్తాడు. వాటి పట్ల తన భక్తి భావనను ప్రదర్శిస్తాడు. వాటిని ప్రశంసిస్తూ భక్తి గీతాలు, పాడుతాడు. వాటిని సందర్శించటానికి ఎంతో తాపత్రయపడతాడు. వాటికి లక్షలు కాదు, కోట్ల్లు విలువ చేసే బంగారు వజ్రవైఢుర్యాల కిరీటాలు సమర్పించుకుంటాడు.
 ”అల్లాహ్‌ను వదలి, ప్రజలు వేడుకుంటున్న ఇతర శక్తులు ఏ వస్తువుకూ సృష్టికర్తలు కారు. వారు స్వయంగా సృష్టింప బడినవారు. నిర్జీవులే కాని సజీవులు కారు.” (అన్‌ నహ్ల్:20)
  గడచిపోయే ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం. ప్రతి దినం. ప్రతి ఘడియ, ప్రతి నిమిషం, ప్రతి శ్వాస మనిషిని మృత్యు చెంతకు చేరుస్తూ ఉంది. మనిషి వేసే ప్రతి అడుగు తన ప్రభువు సన్నిధికి తీసుకు వెళ్ళుతూ ఉంది. ”ఓ మానవుడా! నీవు భారంగా బలవంతం గా నీ ప్రభువు వైపునకు వెళుతున్నావు. ఆయనను కలుసుకో బోతున్నావు.” (అల్‌ ఇన్‌షిఖాఖ్:8)
 జీవితం మూడునాళ్ల ముచ్చట…క్షణభంగురం. జీవితం అంటే ఆచరణా వ్యవధి. మరణం తథ్యం. మరణం అంటే దైవం ప్రసాదించిన ఆచరణా వ్యవధి అంతమయిపోయింది అన్న సంకేతం. మనిషి మరణానంతరం దైవ సన్నిధిలో హాజరై తన కర్మలను గురించి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఇది ముమ్మాటికీ సత్యం.”ప్రతి ప్రాణీ మరణాన్ని రుచి చూడవలసి ఉంది. తరువాత మీరు మా వైపునకే మరలింపబడతారు”. (అల్‌ అన్‌కబూత్: 57)
 ఇది వాస్తవమయినప్పుడు – ”ఓ మానవుడా! ఉదాత్తుడయినా నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది. (యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చి దిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా అమర్చాడు. తాను కొరిన ఆకారంలో నిన్ను కూర్చాడు”. (అల్‌ ఇన్ఫితార్‌ 6-8)

గమనిక: ముస్లిం సోదరా! కొత్తగా ఇస్లాం స్వీకరించినవారు నీకు తెలిసుంటే వారికి ఈ సైట్ అడ్రస్సు ఇవ్వగలవు. 

Related Post