మస్జిదె నబవీని సందర్శించని హజ్జ్‌ నాసిరకపు హజ్జ్‌గా మిగిలిపోతుందా?

మస్జిదె నబవీని సందర్శించని హజ్జ్‌ నాసిరకపు హజ్జ్‌గా మిగిలిపోతుందా?

మస్జిదె నబవీని సందర్శించని హజ్జ్‌ నాసిరకపు హజ్జ్‌గా మిగిలిపోతుందా?

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

ప్రశ్న: మస్జిదె నబవీ (ప్రవక్త మస్జిదు)ని సందర్శించనంతవరకు తమ హజ్జ్‌ నాసిరకపు హజ్జ్‌గానే పరిగణించబడుతుందని కొంత మంది హాజీలు భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం?
జవాబు: మస్జిదె నబవీ సందర్శన (జియారత్‌) సున్నత్‌, వాజిబ్‌ (తప్పనిసరి) కాదు. హజ్జ్‌ యాత్రలో, హజ్జ్‌ క్రియలలో ఇది అంతర్భాగం కూడా కాదు. కాకపోతే ప్రవక్త మస్జిదును సందర్శించటం అభిలషణీయం. ఏటేటా ఈ మస్జిద్‌ను దర్శించటం సున్నత్‌. అంతేగాని ఈ విషయాన్ని హజ్జ్‌ క్రియల (మనాసికె హజ్జ్‌)తో ముడిపెట్ట కూడదు. ఎందుకంటే ప్రవక్త మహనీయులు (స) ఇలా ప్రవచించారు:
”మూడు మస్జిద్‌లు తప్ప మరే స్థలానికీ ”పుణ్యార్జన” (సందర్శన, మహత్మ్యం) ఉద్దేశ్యంతో ప్రయాణమవకూడదు – 1) మస్జిదె హరామ్‌ వైపునకు, 2) నా ఈ మస్జిద్‌ వైపునకు, 3) మస్జిదె అక్సా వైపునకు”. (ముత్తఫఖున్‌ అలైహి)
ఆయన (స) ఇంకా ఇలా అన్నారు: ”నా ఈ మస్జిద్‌లో చేసే ఒక నమాజ్‌ – మస్జిదె హరామ్‌ మినహా – వేరితరచోట్ల చేసే వేయి నమాజులకన్నా శ్రేష్ఠమైనది”. (ముత్తఫఖున్‌ అలైహి)

ఇకపోతే, ప్రవక్త మస్జిదును సమదర్శించినవారు మస్జిదులోని ‘రియాజుల్‌ జన్నహ్‌ా’ అనే స్థలంలో రెండు రకాతుల నఫిల్‌ నమాజు చేయటం నియమం. ఆ తరువాత దైవప్రవక్త (స)పై, ఆయన ప్రియ సహచరులైన అబూ బక్ర్‌, ఉమర్‌ (ర అన్‌హుమ్‌)లపై సలాం పఠించాలి. జన్నతుల్‌ బఖీని సందర్శించి, అక్కడ ఖననమై ఉన్న మహనీయులకు, తదితరులకు సలాం పంపినట్లే ఇది కూడా. ప్రవక్త మహనీయులు (స) సయితం సమాధులను సందర్శించినప్పుడు దుఆ చేసేవారు, ఈ విధంగా చేయమని తన సహవాసులకు నేర్పారాయన (స).
”అస్సలాము అలైకుమ్‌ అహ్లద్దియారి మినల్‌ మోమినీన్‌ వల్‌ ముస్లిమీన్‌ – వ ఇన్నా ఇన్షాఅల్లాహు బికుమ్‌ లాహిఖూన్‌ – నస్‌అలుల్లాహ లనా వలకుముల్‌ ఆఫియహ్‌”.
(విశ్వాసుల, ముస్లింలకు చెందిన పరివార సదస్సులారా! మీకు శాంతి కలుగుగాక! దైవ చిత్తమైతే మేము కూడా మిమ్మల్ని కలుసుకుంటాము. మేము మా కోసం, మీ కోసం కూడా అల్లాహ్‌ా నుండి క్షేమాన్ని అర్థిస్తున్నాము)
మస్జిదె నబవీని సందర్శించిన వారు మస్జిదె ఖుబాను కూడా దర్శించి, అక్కడ కూడా రెండు రకతుల నమాజు చేయటం నియమం. ఎందుకంటే దైవప్రవక్త (స) సాధారణంగా ప్రతి
శనివారంనాడు మస్జిదె ఖుబాకు వెళ్ళి, రెండు రకాతుల నమాజు సలిపేవారు. ఆయన (స) ఇంకా ఇలా వక్కాణించారు: ”ఎవరయినా తన ఇంట్లో చక్కగా తహారత్‌ చేసి, ఈ మస్జిద్‌ (మస్జిదె ఖుబా)కు వచ్చి అందులో రెండు రకాతులు నమాజ్‌ చేస్తే అది ఒక విధంగా ఉమ్రా (చేయటం) వంటిదేె”.

మదీనాలో సందర్శించవలసిన స్థలాలివే. మరికొన్ని స్థలాలను – ఉదాహరణకు:- ఏడు మస్జిద్‌లు, మస్జిదె ఖిబ్లతైన్‌, ఇంకా ఇలాంటి మరికొన్ని స్థలాల గురించి కూడా కొంత మంది రచయితలు పేర్కొంటూ, వాటిని ముఖ్యమైన క్రియలలో భాగంగా నొక్కి చెబుతుంటారు కాని దానికి మూలాలేమీ లేవు. విశ్వాసి అయినవాడు బిద్‌అత్‌ వాసన వచ్చే ప్రతి దానినీ వదలి పెట్టి సున్నత్‌ (పవక్త విధానము)ను అనుసరించాలి… సద్బుద్ధినిచ్చేవాడు అల్లాహ్‌ా మాత్రమే.
తల్లిదండ్రుల తరఫున హజ్జ్‌ చేయాలని ఉంది
ప్రశ్న: నా పసితనంలోనే అమ్మ పోయింది. నేను ఒక వ్యక్తికి హజ్‌ ఖర్చులిచ్చి నా తల్లి తరఫున హజ్‌ చేయించాను. తరువాత నా తండ్రి కూడా మరణించారు. ఇప్పుడు నేను వారిద్దరి తరఫున హజ్‌ చేయటమో లేక ఎవరినయినా ఈ విధి నిర్వహణ కోసం నియమించటమో చేయాలనుకుంటున్నాను. ఈ రెండింటిలో ఏది సరైనది?
జవాబు: ఒకవేళ మీరే మీ తల్లిదండ్రుల తరఫున హజ్జ్‌ చేసి, హజ్‌ క్రియలను, ఆదేశాలను సజావుగా నెరవేర్చగలిగినట్లయితే – ఇదే మీ కొరకు ఉత్తమం. ఒకవేళ ధర్మావగాహన ఉన్న విశ్వసనీయత గల వ్యక్తిని ఈ విధి నిర్వహణ కోసం పంపినా ఫరవాలేదు. కాని మీరు మీ తల్లిదండ్రుల తరఫున ఈ కర్తవ్యాన్ని నెరవేర్చటమే మంచిది. కారణాంతరాలవల్ల ఇది సాధ్యం కాకపోతే ఈ పని కోసం ఎవరినయినా మీ తరఫున నియమించి, ఇది మీ తల్లిదండ్రుల తరఫున నెరవేరుస్తున్న హజ్‌ విధి అని అతనికి స్పష్టపరచాలి. ఇది మీ తరఫున వారికి జరిగే మేలు అని కూడా విడమరచి చెప్పాలి. అల్లాహ్‌ా ఆమోదించుగాక!

Related Post