ముహర్రం – సాంప్రదాయాలు, దురాచారాలు

muharram
అబ్దుర్రహ్మాన్

“ముహర్రముల్ హరామ్” ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం మొదటి మాసం. ప్రతి సంవత్సరం ఈ మాసం వచ్చి- నప్పుడు ప్రవక్త జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం గుర్తుకు వస్తుంది. అదే ‘హిజ్రత్’ (మక్కా నుండి మదీనాకు వలసపోవుట). హిజ్రత్ తరువాతనే ఇస్లాం ధర్మం బల పడింది. ఇతర ప్రాంతాలకు అతి వేగంగా పాకింది. ఇస్లాం దర్మాన్ని కాపాడుటకొనుటకు స్వదేశాన్ని వీడిపోయే సందర్భం వచ్చినా నేను సిద్ధం అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ ముహర్రం మాసం.
ఇస్లామీయ పన్నెండు మాసాల్లో నాలుగు మాసాలు చాలా గౌరవనీయమైనవి. (ఖుర్ఆన్ 9:36). అందులో ఒకటి ఇది కూడాను. ప్రవక్త సల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః
“పన్నెండు నెలలది ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవనీయమైనవి. మూడు క్రమంగా ఉన్నాయి; జుల్ ఖాద, జుల్ హిజ్జ, ముహర్రమ్. నాల్గవది; జుమాద మరియు షఅబాన్ మధ్యలోని రజబ్”. (బుఖారి 3197).
పై ఆయతు మరియు హదీసు ద్వారా తెలిసిందేమిటంటే ఈ పవిత్ర మాసములో ముస్లిములు ఇతర మాసాలకంటే ఎక్కువగా పాపాలకు దూరంగా ఉండాలి. ఇస్లాం వ్యాప్తికై, దాని ప్రాభల్యానికై నిరంతరం కృషి చేయాలి. సమాజంలో అన్ని రకాల చెడుల రూపు మాపడానికి ప్రయత్నం చేయాలి. ఎల్లవేలల్లో అల్లాహ్ భయబీతి (తఖ్వా) పాటించాలి. అప్పుడే అల్లాహ్ మనతో ఉండి మన ప్రతి కార్యానికి సహాయపడతాడు.

ఈ పవిత్ర మాసము ఘనత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః “రమజాను మాసంలోని విధి ఉపవాసాల తరువాత ఉత్తమమైన ఉపవాసాలు అల్లాహ్ మాసము ముహర్రమ్ యొక్క ఉపవాసాలు”. (ముస్లిం 1163). స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు. తమ సహచరులకు దీని గురించి ప్రోత్సహించేవారు. రుబయ్యిఅ బిన్తె ముఅవ్విజ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త కాలంలో సహచరులు వారి పిల్లవాళ్ళు కూడా ఈ మాసంలో ఉపవాసాలుండేవారు. (బుఖారి 1960, ముస్లిం 1136). రమజాను ఉపవాసాలు విధికాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండింది. మరియు అదే రోజు కాబాపై క్రొత్త వస్త్రం వేయబడేది. (బుఖారి 1592). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నగరానికి వలస వచ్చిన తరువాత యూదులు కూడా ఆషూరా రోజు ఉపవాసం పాటించడాన్ని చూసి, వారిని అడిగితే వారు చెప్పారుః ‘ఈ రోజు సుదినం. ఈ దినమే అల్లాహ్ ఇస్రాయీల్ సంతతిని వారి శత్రువుల బారి నుండి విముక్తి కలిగించాడు. అందుకు హజ్రత్ మూసా అలైహిస్సలాం ఈ రోజు ఉపవాసం పాటించారు’. అప్పడు ప్రవక్త ఇలా ప్రవచించారుః “మూసా అనుకరణ హక్కు మాకు మీ కంటే ఎక్కువ ఉంది”. ఆ తరువాత ప్రవక్త ఉపవాసం పాటించారు, తమ సహచరులకు దీని ఆదేశమిచ్చారు. (బుఖారి 2004).

ఆషూరా రోజు ఉపవాసం ఘనతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“ఆషూరా రోజు ఉపవాసం గురించి అడిగినప్పుడు చెప్పారుః “అందువల్ల గత ఒక సంవత్ససరపు పాపాలు మన్నించబడతాయి”. (ముస్లిం 1162).
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరతో పాటు తొమ్మిదవ తేదిన ఉపవాసం పాటిస్తానని ఉద్దేశించారు. అంటే 9, 10 రెండు రోజులు. (ముస్లిం 1134). అయితే 10, 11 రెండు రోజులు లేదా 9,10,11 మూడు రోజులు కూడా ఉపవాసముండవచ్చని కొందరు పండితులు చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు బలహీనంగా ఉన్నాయి. ఇవి ముహర్రం మాసములోని ధర్మాలు.

ప్రవక్తశ్రీ సల్లల్లాహు అలైహి వసల్లంతో రుజువు కాని, ధర్మంగా భావిస్తూ చేస్తున్న పనులను విడనాడాలి. ఉదాహరణకుః పీరీల పండుగలు. ఈ పండుగలు చేయాలని మనకు ఖుర్ఆనులో గాని లేదా ప్రవక్తశ్రీ గారి సహీ హదీసుల్లో గాని ఏదైనా ఆధారం గలదా? కనీసం హజ్రత్ హుసైన్ రజియల్లాహు అన్హు ఇలా చేయాలని ఏదైనా ఆదేశం ఇచ్చారా? మరి కొందరు ఈ పవిత్ర మాసాన్ని అపశకునంగా భావిస్తారు. అంటే వివాహము వంటి ఏదైనా శుభకార్యం ఇందులో చేయరాదని భావిస్తారు. దీనికి ఏ ఆధారమూ మన ఇస్లామ్ ధర్మంలో లేదు. ఇవి ప్రజల మూఢనమ్మకాలు మాత్రమే. ఇంకొందరు నల్లటి దుస్తులు ధరించి శోక వ్రతం అని పాటి-స్తారు. దీనికి కూడా ఇస్లాంలో ఏ మాత్రం అనుమతి లేదు. మరి కొందరు ఈ మాసంలో ఇమాం హుసైన్ రజియల్లాహు అన్హు పేరున మ్రొక్కుబడులు చేస్తారు. మ్రొక్కుబడి ‘ఇబాదత్’ (ఆరాధన), ఇది అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట ఎంతమాత్రం యోగ్యం కాదు.
అల్లాహ్ మనందరిని ఇస్లాంపై స్థిరంగా ఉంచుగాకా! దురాచారాల నుండి దూరముంచి, ప్రవక్త సహీ సాంప్ర దాయాలను అనుసరించే భాగ్యం నొసంగుగాకా!

Related Post