Originally posted 2013-07-08 08:54:56.
‘సమ్యక్ ప్రదానం సంప్రదాయం’ – గతమంతా సంప్రదాయం కాదు, గతంలోని మంచి మాత్రమే సంప్రదాయం. వేల సంవత్స రాల పూర్వం ఆవిర్భవించినది ఇస్లామీయ అపురూప సంప్ర దాయం. ఆ వేల సంవత్సరాలలో వేనవేల ప్రవక్తలు ప్రభవింప జేయబడ్డారు. నాటి నుండి రకరకాల ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంఘీక, రాజకీయ ప్రతికూల పవనాల ధాటికి తట్టుకుని నేటికీ నిలబడిన ప్రవక్తల సంప్రదాయాలు బహు స్వల్పం. కాలం విధిం చిన అగ్ని పరీక్షలకు ఆగి, సలసల కాగి ఈ నాటికీ ఆదర్శ నీయాలుగా, ఉత్తమ శ్రేణికి చెందిన సంప్రదాయాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రజా జీవితాల్లో అణువణువునా జీర్ణించుకు పోయిన ఆ మధుర ఘట్టాల కోసమైనా, ఆ పేరెన్నికగన్న కొందరు ధీర శాంతుల కోసమైనా మనం ప్రాచీన చరిత్రను పఠించవలసి ఉంది. ఆ ప్రవక్తోత్తములు ప్రతిపాదించిన సంప్ర దాయాల, ఆదర్శాల, ప్రవేశపెట్టిన సిద్ధాంతాల పునాదుల మీదనే సరికొత్త ప్రణాళికలు, వజ్ర సౌధాలు నిర్మించుకోవలసి ఉంది. గతంలోగానీ, వర్తమానంలోగాని, భవిష్యత్తులోగాని వారి సంప్ర దాయాలను కాదని కీర్తి శిఖర అంబరాలకు చేరుకోవడం అసాధ్యం, అసంభవమూను. అయితే అలా చేయాలని, కీర్తి శిఖర శిరస్సుకి చేరుకోవాలని దుస్సాహసం చేెసిన ఔత్సాహికులు లేకపోలేదు. కాని ఏమి లాభం? ఎగిరిన మరుక్షణంలోనే చతికిల పడ్డారు పాపం!
యుగయుగాల ప్రవక్తల చరిత్రను హేతువు దృష్టితో, పక్షిపాత రహిత సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే తెలుస్తుంది. ఈనాటికీ ప్రవక్తో త్తములు (ఊలుల్ అజ్మ్ మినర్రుసుల్)గా నీరాజనాలందు కుంటున్న ఆ పురుషోత్తముల వెనక ఏ ఘనాఘనుడి హస్తం ఉందో. ప్రకృతి రమణీయతను పుడిసిలించుకున్న ఆదం, ఆదం ఆధ్యాత్మిక చింతనను ఆకళింపు చేసుకున్న నూహ్, నూహ్ కమనీయతను జీర్ణించుకున్న ఇబ్రాహీమ్, ఇబ్రాహీమ్ త్యాగశీలత ను ఒంటబట్టించుకున్న మూసా, మూసా ధర్మ శాస్త్రాన్ని అనుస రించిన ఈసా, ఈసాను మహిమ పరచి, ఆ సనాతన ధర్మాన్ని పరిపూర్ణం గావించిన ముహమ్మద్ (స)- వారందరి శాంత ప్రవచనాలు ఎంత పటిష్టంగా ఉంటాయో అభిజ్ఞులకు తెలిసిందే.
ఈ ఐదుగురు (నూహ్, ఇబ్రాహీమ్, మూసా, ఈసా, ముహమ్మద్ (తి) ప్రవక్తలు విభిన్న కాలాల్లో, వేర్వెరు ప్రాంతాల్లో వచ్చారు. ఐదుగురి తీరుతెన్నులూ వేర్వేరు. కానీ వారందరూ సమకాలీన సమాజాన్నీ, ఆ తరువాతి తరాలనూ ప్రభావితం చేశారు. ఒక విశిష్ట లక్షణం ఈ ఐదుగురిని, ఈ ఐదుగురితో పాటు 1 లక్షా 24 వేల ప్రవక్తలను ఏక సూత్రంలో ముడి వేసింది. అదే తౌహీద్. ఈ ఐదుగురూ తౌహీద్ విశిష్ఠతను విశద పర్చినవారే. దేవుని ఔన్నత్యాన్ని చాటినవారే, ఏకేశ్వరోపాసనా భావాన్ని తమ మనోవాక్కర్మల ద్వారా, ప్రబోధనాల ద్వారా దీపింపజేసినవారే. మానవ జాతి తరతరాలకూ చెప్పుకోగలిగే, ఆచరించగలిగే ఉత్తమోత్తమ ప్రబోధనలు చేసినవారే.
‘వ ఖుల్ జాఅల్ హఖ్ఖు వ జహఖల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూఖా’ – సత్యం వచ్చేసింది. అసత్యం నిష్క్రమించింది. నిష్క్రమించటం తప్ప అసత్యానికి మార్గాంతరం లేదు. ఇది దైవ వాక్కు. యుగయుగాలుగా ప్రకృతీ, ప్రజలు అనుభవిస్తున్న సత్య వాక్కు. నిద్ర సగం మృత్యువు. జీవులకు ఇది ఏనాడూ తప్పదు, నిజమే. అంతమాత్రాన నిద్ర కాదు గెలిచేది – జాగృతి. తమస్సు కాదు నిలిచేది – ఉషస్సు. ఖుర్‌ఆన్ కాంతి (నూర్). కాంతి చైతన్య స్వరూపం. అందుకే అనుదినం చీకటి దిశలో అరుణారుణ భానుదీపం. కాంతి స్వేచ్ఛకు ప్రతిరూపం. ఖుర్‌ఆన్ అంతే. చీకటి దుప్పటి కప్పుకొని గురకపెట్టే లోకం కనులు విప్పేది దివ్యావిష్కృతి.
నాదాలు, నినాదాలు, మనిషి చేసిన మత సిద్ధాంతాలు కొందరిని కొంతకాలం మేల్కొల్పవచ్చు. రాజకీయాలు కొందరిని రగుల్గొల్పవచ్చు. విశ్వ శాంతి మార్గానికి పూబాట వేసే దైవ వచనం – సమాజాభ్యుదయం అదనెరిగిన ప్రవక్తల ప్రవచనం జాతి, భాష, కుల, ప్రాంత కృత్రిమ గీతలు దాటి అందరినీ మేల్కొల్పుతుంది. అన్ని కాలాల్లోనూ చైతన్య స్ఫూర్తిని రగుల్గొల్పు తుంది. అందుకే అన్ని విధాలా సురక్షితమైన అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్ విశ్వ జనీనం, సార్వకాలికం. అయితే రాకెట్ వేగంతో పురోగమిస్తున్న వర్తమాన చరిత్ర దృష్ట్యా, అనుక్షణం రంగులు మారుతున్న విలువల దృష్ట్యా ఈ గ్రంథ పఠనం, ప్రవక్తల ఆదర్శాల అనుశీలన అవసరం ఎంత వరకు అంటారా? ఎంతవరకంటే- ప్రతి వ్యక్తి గుండెలోంచి చిమ్ముకొచ్చే తౌహీద్ సహజ భావనను, మానవులంతా ఒకే దేవుని దాసులన్న సాత్వికాలోచనను సముచిత స్థాయిలో సమాజంలో స్థాపించేంతవరకు. విజ్ఞాన సీమలనూ, ఆలోచనా వలయాలనూ ప్రక్షాళించి మరింత విస్తృత పరిచేటంతవరకు. బిక్కవోయిన బ్రతుకులకు రెక్కలిచ్చి అనంత విశ్వంలో స్వేచ్ఛగా విహరింపజేసే మొక్కవోని ఓజస్సు (బలం-సాహసం) అందించే టంతవరకు. చెప్పదలచుకున్నది సూటిగానే కాకుండా సుంద రంగా, సుమృదు వుగా చెప్పే నైపుణ్యం సంతరింపజేసే టంతవరకు. విశ్వంలో కాంతి, విశ్వ జనుల్లో శాంతి నిండేటంత వరకు.
నేడు వైజ్ఞానికంగా మనం ఎంత పురోగమిస్తున్నా మన ఆలోచనా పరిధిపై ప్రవక్తల సంప్రదాయాల ప్రభావం భాసిస్తూనే ఉంది. ప్రవక్తల జీవితాల్లోని సుమధుర ఘట్టాలు, కొందరు సజ్జన పూర్వీకుల వ్యక్తిత్వాలు నేటి మన ఆధునికంలో సయితం ఆదర్శనీయాలుగా విరాజిల్లుతున్నాయి. నేటికీ మన దృష్టిలో విలువల వలువలు వలిచేసేవాడు షైతానే. కుతంత్రాల వ్యూహ రచనలు చేసేవాడు ఇబ్లీసే. ఫిర్‌ఔన్ కబంద హస్తాలు, నమ్రూద్ కరాళ దంష్ట్రాలు, అబూ జహల్ అహంభావాలు, అబూ లహబ్ సుప్పనాతి చేష్టలూ – ఇప్పటికీ మన దైనందిన జీవితంలో జుగుప్స కలిగించే అంశాలే. నేటి నవ యువకులు కూడా ప్రవక్తలను, పుణ్యాత్ములను, పురుషోత్తములను, ధీవరుఁలను, ధీరశాంతులను ఆధునిక యుగ విషవాయువుల్ని పారద్రోలే ప్రతీకలుగా స్వీకరించటం శుభ సూచకం. గతాన్ని గతం దృష్టిలో కాకుండా వర్తమాన స్ఫూర్తికి అనుగుణంగా మలచు కునే, భవిష్య ప్రణాళికలు రచించుకునే నూతనోత్తేజ ధోరణి ఇది.
అయితే, వారు ఎక్కడా తేెలిపోకుండా, జారిపోకుండా ఏ గాలికీ కొట్టుకుపోకుండా, ఏ వానకా గొడుగు పట్టకుండా, రాత్రికి రాత్రి దిక్కులు మార్చకుండా, దేబిరించకుండా, ఎప్పుడూ వెలితి పడకుండా, లేకి అవకుండా నిరతం సత్య సఖులై, శిఖులై నిత్య స్ఫూర్తితో చైతన్య రథసారధుల్లా ముందుకు సాగాలని ఈ నూతన హిజ్రీ సంవత్సరం శుభ సందర్భంగా మనమందరం అల్లాహ్‌ాను వేడుకుందాం!