ఆత్మ వాస్తవికత / వారు ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. “ఈ ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. (దీన్ని మీరు గ్రహించలేరని,) మీకు పరిమిత జ్ఞానం ప్రసాదించబడింద”ని చెప్పు. (బనీ ఇస్రాయీల్: 86)
ఆత్మ పరిచయం :
ఆత్మ ప్రకాశమానమైనది. ఉచ్చ స్థితిలో ఉంటుంది, జీవం గలది, చైతన్యం గలది, సూక్ష్మమైనది. గులాబీలలో నీటి ప్రవాహంలా , ఆలివ్‌లలో నూనె ప్రవాహంలా, బొగ్గులో నిప్పులా – ఆత్మ అవయవాల ప్రధాన భాగాల్లో, నరనరాల్లో మమేకమయి ఉంటుంది.
ఆత్మ అనే పదం ఖురాన్ లో 21 సార్లు వేర్వేరు అర్థాల్లో వచ్చింది.
ఖురాన్ అన్న అర్థంలో:
ప్రవక్తా! అలాగే మేము ఆత్మ (ఖురాన్) ద్వారా నీవద్దకు మా ఆజ్ఞల్ని పంపుతున్నాం. ఇంతకు ముందు నీకు గ్రంథం అంటే ఏమిటో తెలియనే తెలియదు. కాని ఆ తరువాత ఈ దివ్యావిష్కృతిని ఒక జ్యోతిగా చేసి మేము కోరిన మా దాసునికి రుజుమార్గం చూపుతున్నాం. నిస్సందేహంగా నీవు ప్రజలను సన్మార్గం వైపుకు నడిపిస్తున్నావు. (షూరా : 52-53)
వహీ (దివ్యావిష్కృతి) అన్న అర్థంలో:
ఆయన (అల్లాహ్) మహోన్నతమైన హోదా, అంతస్తులు కలవాడు, (సర్వాధికార) అర్ష్ అధీశుడు. ఆయన తన దాసులలో తాను తలచుకున్న వారిపై తన దివ్యావిష్కృతి (వహీ) అవతరింపజేస్తున్నాడు. వారు పరలోక సమావేశం రోజు గురించి హెచ్చరించాలన్నదే దీని ఉద్దేశ్యం.(మోమిన్: 15)
దైవ దూతల నాయకులు జిబ్రయీల్ (అ) అన్న అర్థంలో:
ముహమ్మద్ (స)! ఈ గ్రంథంలో మర్యం వృత్తాంతం ప్రస్తావించు. ఆమె ప్రజల నుండి వేరయి, తూర్పు వైపున ఏకాంత కుహరంలోకి వెళ్ళి తెరవేసుకొని కూర్చున్నది. అప్పుడు మేము ఆమె దగ్గరికి మా ఆత్మ (జిబ్రయీల్)ను పంపాము. అతను పరిపూర్ణ మానవాకారంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. (మర్యమ్: 16-17)
శక్తి, సహాయం, నిలకడ అన్న అర్థంలో:
అల్లాహ్ వారి హృదయాల్లో విశ్వాసాన్ని దృఢంగా పాదుకొల్పాడు. పైగా తన దగ్గర నుండి స్ఫూర్తి ప్రసాదించి వారికి మరింత (ఆత్మ) బలం చేకూర్చాడు. (ముజాడలః – 20)
మర్యమ్ (అ) కుమారులు ప్రవక్త ఈసా (అ) అన్న అర్థంలో:
గ్రంథప్రజలారా! మీరు మీధర్మం విషయంలో అతిశయానికి పోయి హద్దులు మీర కండి. సత్యం తప్ప అల్లాహ్ కు మరే విషయాన్నీ ఆపాదించకండి. మర్యం కుమారుడు ఈసా మసీహ్ అల్లాహ్ ప్రవక్తలలో ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. కాకపోతే ఆయన “మర్యం దగ్గరకు దేవుడు పంపిన ఒక ఆజ్ఞ; దేవుని దగ్గరనుండి (మర్యంకు) పంపబడిన ఒక ఆత్మ మాత్రమే.” (ఈ ఆజ్ఞ, ఆత్మలే మర్యం గర్భంలో బిడ్డరూపం సంతరించుకున్నాయి.) కనుక మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తల్ని విశ్వసించండి. ముగ్గురు (దేవుళ్ళు) అనకండి. అలా అనడం మానేస్తే అది మీకే క్షేమం. నిజానికి అల్లాహ్ ఒక్కడే. ఆయనకు కుమారుడున్నాడని అనడం తగదు. అలాంటి బలహీనతలకు అల్లాహ్ అతీతుడు, ఎంతో పరిశుద్ధుడు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం అల్లాహ్ దే. అన్నిటికీ ఆయనే స్వామి, యజమాని. వాటి సంరక్షణ, నిర్వహణలకు ఆయన ఒక్కడే చాలు. (171)
మానవ జీవితం అన్న అర్థంలో:
వారు ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. “ఈ ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. (దీన్ని మీరు గ్రహించలేరని,) మీకు పరిమిత జ్ఞానం ప్రసాదించబడింద”ని చెప్పు. (బనీ ఇస్రాయీల్: 85)
అల్లాహ్ కారుణ్యం అన్న అర్థంలో:
నాయనలారా! వెళ్ళి యూసుఫ్ గురించి, అతని తమ్ముడ్ని గురించి ఆరాతీయండి. అల్లాహ్ కారుణ్యం (రౌహ్) పట్ల నిరాశచెందకండి. అల్లాహ్ కారుణ్యం (రౌహ్) పట్ల అవిశ్వాసులు మాత్రమే నిరాశ చెందుతారు”అన్నాడు యాఖుబ్. (యూసుఫ్: 86-87)
ఆత్మ అంటే ఏమిటి?
ఆత్మ అనేది శరీరం కాదు. శరీరం విధిని అంగీకరిస్తుంద. ఆత్మ భౌతిక దేహానికి భిన్నమైనది.
శరీరం అంతరిస్తుంది కానీ, ఆత్మకు అంతం లేదు నిజమేనా?
పండితులు ఏకాభిప్రాయం ప్రకారం ఆత్మ కూడా సృష్టియే. శరీరం అంతరిస్తుంది కానీ, మానవ ఆత్మకు అంతం లేదు. అంటే, సృష్టి రాసులకన్ని అంతం ఉన్నట్లే, ఆత్మలు కూడా నశిస్తాయి. మానవుల, జిన్నాతుల, దైవ దూతల ఆత్మలకు అల్లాహ్ తరపు నుండి ఒకింత మినహాయింపు ఉంటుంది.
ఆత్మ రకాలు
ఆత్మ మూడు రకాలు, చెట్టు చేమల ఆత్మ, జంతు ఆత్మ, మానవుల, జిన్నాతుల, దైవ దైవ దూతల ఆత్మ.
ఈ మూడింటిని సమానంగా పరిగణించ లేము. వీటిలో, నిజ జీవితానికి మరియు సమగ్ర పరిపూర్ణతలకు అర్హత గలది మానవుల ఆత్మ మాత్రమే. పైగా మానవాత్మకు అల్లాహ్ ప్రసాదించిన శ్రేష్ఠత రీత్యా ఒకింత ఆధిక్యత ఉంటుంది. ఎందుకంటే సృష్టి శ్రేష్ఠుడు మనిషి గనక.
మిగిలిన జంతువులు మరియు వృక్ష ఆత్మలు కూడా ఒక రకమైన జీవితాన్ని కలిగి ఉంటాయి. కానీ అవి మానవ ఆత్మతో సమానం కాదు. ఈ ఆత్మలు కొన్ని ప్రత్యేక లక్షణాలలో మానవ ఆత్మను పోలి ఉండవచ్చు. కానీ మనిషిలో మరియు వాటి మధ్య బాహ్య వ్యత్యాసం ఉన్నట్లే, ఆధ్యాత్మిక వ్యత్యాసమూ ఉంది.
ఇస్లాం మానవాత్మకు ఇచ్చే గౌరవం
“ఎవరైనా ప్రతీకార హత్య(శిక్ష)గా లేక ధరణిపై కల్లోలం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషినైనా చంపితే అతను యావత్తు మానవాళిని చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళిని కాపాడినట్లే.” (మాయిదహ్: 32)
అకాల మరణం చెందిన ఆత్మలు దెయ్యాలవుతాయా?
ఇస్లాంలో అకాల వర్షాలు, అకాల మరణాలు అనే భావనకు చోటు లేదు. ప్రతిదీ నిర్ణీత సమయానికే సంభవిస్తుంది.
మేము ప్రసాదించిన ఉపాధి నుండి (మామార్గంలో) ఖర్చుపెట్టండి. మీలో ఎవరికైనా మరణసమయం ఆసన్నమయి “ప్రభూ! నాకు మరికొంత గడువియ్యలేదే? ఇస్తే నేను దానధర్మాలు చేసి సజ్జనుల్లో చేరిపోతాను కదా?” అని అతను అనవచ్చు. అలాంటి దుస్థితి దాపురించక ముందే ఈ సత్కార్యం చేయండి.
ఎవరికైనా ఆచరణ గడువు ముగిసే సమయం వస్తే, ఇక అతనికి అల్లాహ్ ఏమాత్రం అవకాశం ఇవ్వడు. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. (మునాఫిఖూన్ : 9-11)
ప్రతి జాతికీ ఒక గడువు నిర్ణయించబడింది. ఆ గడువు ముగిస్తే మాత్రం ఇక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయడంగాని, వాయిదా వేయడంగాని జరగదు. (ఆరాఫ్ : 33-34)
అకాల మరణమే లేనప్పుడు ఆత్మలు దెయ్యాలవుతాయి అనడం హాస్యాస్పదం.
ఇక ఆత్మలు తిరిగి వస్తాయా? అంటే,
మానవుడు మరణించినా, మానవుడుని జంతువులు తిన్నా, మానవుడుని అగ్నికి ఆహుతి చేసినా, మానవుడు బూడిదగా మారినా మరణించిన వారు బర్జఖ్ లో ఉంటారు. ఇహాలోకంలోకి తిరిగి రావడం అనేది జరగదు. ఇది అల్లాహ్ సున్నత్ కి విరుద్ధం. చాలామందికి మృతుడు చనిపోతే ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలియదు. వాస్తవం ఏమిటంటే, మృతుడు చనిపోయిన వెంటనే బర్జఖ్ లో బంధించబడతాడు.
ఖురాన్ ఇలా అంటోంది:
గుడ్డివాడు, కళ్ళున్నవాడు ఒకటి కాదు. చీకటి వెలుగులు సమానం కాలేవు. చల్లని నీడ మండుటెండ లాంటిది కాదు. జీవులు, మృతులు ఒకటి కాదు. అల్లాహ్ తాను కోరిన వారికి (తన సూక్తులు) విన్పిస్తాడు. (కనుక ప్రవక్తా!) సమాధుల్లో ఉన్నవారికి నీవు (ఏ మాటా) విన్పించలేవు. (ఖుర్’ఆన్ – 35 : 22)
చివరికి వారిలో ఎవరికైనా చావు మూడి నప్పుడు అతను (పశ్చాత్తాపంతో) “ప్రభూ! నేను వదలి వచ్చిన ప్రపంచానికి నన్ను మరో సారి పంపించు. నేనిప్పుడు (నా ప్రవర్తన మార్చుకొని) సత్కార్యాలు చేస్తాను” అంటాడు. అలా ఎన్నటికీ జరగదు. అతను పనికిమాలిన మాటలు వదరుతున్నాడు.
(చనిపోయిన) వారందరి వెనుక ఇప్పుడొక అడ్డుతెర ఉంది. పునరుత్థాన దినం దాకా వారా స్థితిలోనే ఉంటారు. తర్వాత శంఖం పూరించగానే వారి మధ్య ఎలాంటి మైత్రి-బాంధవ్యం ఉండదు. వారు పరస్పరం (మంచిసెబ్బరలు) విచారించుకోరు! (ఖుర్’ఆన్ – 23:99, 101)
రెండు వస్తువులకు మద్యనున్న అడ్డును లేక తెరను ‘బర్జఖ్’ అని అంటారు. ఇది ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి మద్య విశ్వాసులకు ‘విరామంగా’ అవిశ్వాసులకు మరియు పాపత్ములకు కఠినంగా ఉంటుంది. మరణించిన క్షణం నుంచి ప్రపంచంతో మనిషి సంబంధం తెగిపోతుంది. పరలోక జీవనం కూడా తక్షణం మెుదలవదు. ప్రళయం తర్వాత మానవులంతా తిరిగి బ్రతికించబడిన నాటి నుంచే ఈ ‘పరలోకం’ మెుదలవుతుంది. ఈ రెండు లోకాలకు మధ్యనున్న ‘అవస్థ’ ను బర్జఖ్ అవస్థ అంటారు.
మృతుడు సమాధిలో ఉన్నా, కాకులకు గద్దలకు ఆహారంగా మారినా, కాల్చివేయబడి మట్టిలో కలసిపోయిన, మరేమైనా – అది బర్జఖ్ అవస్దగానే పరగణించబడుతుంది. తుదకు అల్లాహ్ మానవులందరికీ ఓ కొత్త ఉనికిని ఇచ్చి అందరినీ మహాషర్ మైదానంలో సమావేశపరుస్తాడు.
పాపాత్ముల కర్మలు, ,ఆత్మలు మరణానంతరం ఎక్కడుంటాయి?
ముమ్మాటికీ (వారు అనుకునేది నిజం) కాదు. నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్టా ‘సిజ్జీను’లో ఉంది. (ఖుర్’ఆన్ – 83 : 7)
‘సిజ్జిన్’ అనేది ఒక చెరసాల అని కొందరు అబిప్రాయపడ్డారు. అంటే కఠిన కారాగారం మాదిరిగా అది ఎంతో ఇరుకైన, దుర్భరమైన స్ధలం అన్నమాట! మరికొంత మంది ప్రకారం ‘సిజ్జిన్’ అనేది భూమండలంలో అత్యంత అధమ స్ధానం. ఆ పాతాళ స్ధానంలో అవిశ్వాసుల, ముష్రిక్కుల, దుర్జనుల ఆత్మలు, వారి కర్మలు భద్ర పరచబడతాయి.
పుణ్యాత్ముల కర్మలు, ఆత్మలు మరణానంతరం ఎక్కడుంటాయి?
ఎన్నటికీ కాదు. నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్టా ‘ఇల్లియ్యీన్’లో ఉంది.(ఖుర్’ఆన్ – 83 : 18)
‘ఇల్లియీన్’ అనేది ‘ఉలువ్వున్’ నుండి వచ్చింది. అంటే ఉన్నతమైనదని అర్ధం. ఇది ‘సిజ్జిన్’ కు వ్యతిరేక పదం. ఇది ఊర్ధ్వలోకాలలో లేదా స్వర్గంలో లేదా సిద్రతుల్ మున్తహా వద్ద లేదా దైవసింహాసనం (ఆర్ష్) దగ్గర ఉన్న ఒక ప్రత్యేక స్ధలం. అక్కడ సజ్జనుల ఆత్మలు, వారి కర్మల పత్రాలు భద్రపరచబడ్డాయి. ధైవసాన్నిధ్యం పొందిన దైవదూతలు వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు.