ఇమామ్ బుఖారీ (రహ్మా) – సహీహ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (ర) హిజ్రీ శకం 194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్య కోసం ముస్లిం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యాకేంద్రాలన్నీ పర్యటించారు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యా పారంగతులు ఇమామ్ దాఖలీ (ర) గారి పాఠశాలలో చేరారు.
ఒక రోజు ఇమామ్ దాఖలీ (ర) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ ”సుఫ్యాన్ అన్ అబీ జుబైర్ అన్ ఇబ్రాహీం” అని అన్నారు. అప్పుడు ఇమాం బుఖారీ(ర) కల్పించుకుని ”ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూ జుబైర్ ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించ లేదు” అని అన్నారు.
అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పు బట్టడంతో గురువు గారు ఉలిక్కి పడ్డారు. ఆయన కోపంతో కొర కొర చూశారు. ఇమామ్ బుఖారీ(ర) గురువు గారి పట్ల ఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ – ‘మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓ సారి చూసుకోండి’ అని ప్రశాంతంగా అన్నారు. ఇమామ్ దాఖలీ (ర) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి ఇమామ్ బుఖారీ(ర) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు. ఆయన తిరిగి వచ్చి ”అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?” అని అడిగారు. ఇమామ్ బుఖారీ (ర) తక్షణమే సమాధానమిస్తూ ‘సుఫ్యాన్ అనిజ్జుబైరి వహువ వబ్ను అదియ్యి అన్ ఇబ్రాహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహ్మలై- ఉల్లేఖించారు; అబూజుబైర్ అనడం సరికాదు)’ అని అన్నారు.
అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పద కొండేండ్లు కూడా నిండలేదు. పదహారు సంవత్సరాల వయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ముబారక్(ర), ఇమామ్ వకీ(ర)లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు. 18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించనారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారు చెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన దైవప్రవక్త (స) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో రాశారు.
ఇమామ్ బుఖారీ (ర) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేధా సంపన్నులు. ఎంత పెద్ద హదీసయినా సరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయిపోయేది – ఏక సంతాగ్రాహి. ఇమాం బుఖారీ (ర) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్ ఇస్మాయీల్ ఇలా తెలియజేస్తున్నారు: ”ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు. ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈ విధంగా 16 రోజులు గడచిపోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ ”ఈ పదహారు రోజుల కాలంలో నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నినీ నేను చూడకుండా చదువుతాను విను” అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా హదీసుల్ని ఒక్క పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా మేము అనేక చోట్ల మా రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించుకోవలసి వచ్చింది.
ఇమామ్ బుఖారీ (ర) గారి జ్ఞాపకశక్తి గాధలు దశ దిశలా వ్యాపించిపోయాయి. ఆయన ఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతలు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన జ్ఞాపకశక్తి పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపక శక్తికి ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించేవారు. ఆ కాలంలోనే షేఖ్ అబూ జరా (ర) అబూ హాతిం (ర) ముహమ్మద్ బిన్ నస్ర్ (ర), ఇబ్ను ఖుజైమా (ర), ఇమామ్ తిర్మిజి(ర), ఇమామ్ ముస్లిం (ర)లు ఆయనకు శిష్యులయిపోయారు.
ఇమాం బుఖారీ (ర) ని ప్రశంసిస్తూ కొంద రు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వినండి: ‘బుఖారీ (ర) హదీసు విద్యలో నా కంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి గల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే బుఖా రీని మించిన వారు లేరు.’ (ఇమామ్ దారమి (ర))
‘ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (ర) లాంటి మహోన్నత వ్యక్తి మరొకరు జన్మించ లేదు.’ (ఇమామ్ అహ్మద్(ర) )
‘స్వయంగా ఇమామ్ బుఖారీ(ర) కూడా తన లాంటి వ్యక్తిని చూడలేదు.’ (ఇబ్నుల్ మదీనీ(ర) )
ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (ర) ఓ సారి ఇమామ్ బుఖారీ (ర) సన్నిధికి వెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ తరువాత ఆయన ‘గురువులకు గురువూ! హదీసువేత్తల నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని అన్నారు.’ (అహమ్మద్ బిన్ హమ్దాన్(ర))
‘ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (ర)ని మించిన హదీసు పండితుడు, పొరంగతుడు మరొకరు లేరు.’ (ఇబ్ను ఖుజైమా(ర) )
ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది. ఆయన తన జీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దోషించ లేదు, బాధించనూ లేదు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ”పరలోక విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదని నేను ఆశిస్తున్నాను” అని అప్పుడప్పుడు అంటుండేవారు.
ఇమామ్ బుఖారీ (ర) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి ఉమర్ బిన్ హఫ్స్(ర) ఇలా తెలియజేస్తున్నారు: ”బస్రాలోని హదీసు పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహ విద్యార్థులుగా ఉండేవాళ్ళం. ఒక రోజు ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి బయికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందువల్ల ఆయన ఆ రోజు ఇంి నుంచి బయికే రాలేదు. ఆ తరువాత మేము ఆయన కోసం బట్టలు సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాి నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించారు.
ఇమామ్ బుఖారీ(ర) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండేవారు. అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ(ర)కి విజ్ఞప్తి చేశాడు. దాంతో పాటు, ఇతరు లెవరూ పాల్గొనకుండా ఉండే ఓ ప్రత్యేక సమావేశంలో తన పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ ని కోరాడు. ఇమామ్ ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ ”విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి ఉంటుంది. నా సమావేశంలో ధనికుడు – పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడి కొచ్చి హదీసు విద్య నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరికీ హక్కుంది” అని సమాధానిమిచ్చారు.
ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ ఆగ్రహోదగ్రుడ య్యాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగి పోయింది. గవర్నర్ ఇమామ్ బుఖారీ(ర) మీద పగ బూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో ఇమామ్ బుఖారీ(ర) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికి వెళ్ళి తల దాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. చివరికి హిజ్రీ శకం 256లో ఈదుల్ఫిత్ర్ నాడు 62 సంవత్సరాల వయస్సులో ఆయన తనువు చాలించారు. – రహ్మతుల్లాహి అలై. అల్లాహ్ కృపానుగ్రహాలు ఆయన పై కురుయు గాక!