ప్రశ్నోత్తరాలు మూడవ భాగం – అల్హందులిల్లాహ్ – సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే. మేము ఆయన్ను ప్రశంసిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము, మనలోని ప్రతి చెడు మరియు దుష్ట పనుల నుండి ఆయన శరణు వేడుకుంటాము. అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ సన్మార్గం నుండి తప్పించలేరు మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలి వేసిన వారికి మరెవ్వరూ దారి చూపలేరు. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యుడు లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అనీ. తరుచుగా ముస్లిమేతరులు ఇస్లాం మరియు ముస్లింల గురించి అడిగే ప్రశ్నలు ఇక్కడ చర్చించబడినాయి.
దీనిని చదివే ప్రతి పాఠకుడు అల్లాహ్ తలిస్తే క్రింది అనేక విషయాలు మరియు అంశాల గురించి స్పష్టమైన మరియు సంతృప్తికరమైన అవగాహన పొందుతాడు.
21- ముస్లింలు ఎలాంటి దుస్తులు ధరించాలి?
సచ్ఛీలత, పాతివ్రత్యముల గురించి ఇస్లాం ధర్మం నొక్కి వక్కాణిస్తున్నది. ఏ వ్యక్తినైనా సెక్స్ వస్తువుగా భావించడం తగదు. స్త్రీపురుషులు ఉభయుల దుస్తుల విషయంలో కొన్ని నిర్ణీత మార్గదర్శక నియమాలు ఉన్నాయి. అవి మరీ పలుచగా లేదా మరీ బిగుతుగా ఉండి వారి శరీర ఆకారాన్ని బయట పెట్టే విధంగా ఉండకూడదు. పురుషుల దుస్తులు కనీసం మోకాళ్ళ క్రింది భాగం అంటే కాలి పిక్కల నుండి నాభి వరకు కప్పి ఉంచాలి. స్త్రీల దుస్తులు వారి మొత్తం శరీరాన్ని కప్పి ఉంచాలి.
22- ఇస్లాం ధర్మంలోని ఆహారపదార్థాల నిషేధాలు ఏమి?
పందిమాంసం లేదా పందికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు, అల్లాహ్ పేరు మీద ఖుర్బానీ చేయకముందే చనిపోయిన జంతువుల మరియు క్రూరమృగాల మాసం తినకూడదని, వాటి రక్తం త్రాగకూడదని, మత్తునిచ్చే మద్యపానం, డ్రగ్స్ వంటివి వాడకూడదని ఖుర్ఆన్ ముస్లింలను స్పష్టంగా ఆదేశిస్తున్నది.
23- జిహాద్ అంటే ఏమిటి ?
“జిహాద్” అనే అరబీ పదానికి అర్థం శ్రమించడం, ప్రయాస పడటం. ఇస్లామీయ పరిభాషలో దీని అర్థం అల్లాహ్ మార్గంలో శ్రమించడం, ప్రయాస పడటం. అనుదిన జీవితంలో అల్లాహ్ మెప్పు కోసం చిత్తశుద్ధితో మనం చేసే ప్రతి పనీ జిహాద్ గానే పరిగణించబడుతుంది. మహోన్నతమైన జిహాద్ ఏదంటే, దౌర్జన్యపరుడైన రాజు అత్యాచారాలకు వ్యతిరేకంగా నిలబడటం మరియు అతడి ఎదుట సత్యం పలుకడం. చెడు ఆలోచనల నుండి చెడుపనుల నుండి స్వయంగా నియంత్రించుకోవడం కూడా గొప్ప జిహాద్ క్రిందకే వస్తుంది. ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం లేదా శత్రుదాడి నుండి ఇస్లామీయ రాజ్యాన్ని కాపాడటం కోసం చేసే సాయుధ పోరాటం కూడా జిహాద్ క్రిందకే వస్తుంది. అయితే ఇలాంటి జిహాద్ యుద్థాన్ని ఇస్లామీయ ధార్మిక నాయకత్వం లేదా ఖుర్ఆన్ మరియు సున్నతులను అనుసరించి పాలిస్తున్న ఇస్లామీయ దేశం యొక్క రాజు లేదా నాయకుడు ప్రకటించవలసి ఉంటుంది లేదా అనుమతించ వలసి ఉంటుంది.
24- ఇస్లామీయ క్యాలెండర్ అంటే ఏమిటి ?
క్రీ.శ. 622లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనా పట్టణానికి వలస వెళ్ళినప్పటి నుండి ముస్లింల హిజ్రీ క్యాలెండరు ప్రారంభమవుతుంది. ఇది చంద్రమాన క్యాలెండరు, దీనిలో 354 దినాలు ఉంటాయి. ఈ ఇస్లామీయ క్యాలెండరు యొక్క మొట్టమొదటి నెల ముహర్రం. ఇంగ్లీషు క్యాలెండరులోని క్రీ. శ. 2015వ సంత్సరం హిజ్రీ క్యాలెండరులోని 1436వ సంవత్సరానికి సమానం.
25- ముఖ్యమైన ఇస్లామీయ పండుగలు ఏవి?
ఈదుల్ ఫిత్ర్ పండుగ ప్రతి సంవత్సరం రమదాన్ ఉపవాసాల నెల పూర్తవగానే జరుపుకోబడుతుంది. ప్రత్యేక సామూహిక ఈద్ నమాజు, సేమ్యాలనబడే పాయసం మరియు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పేదలకు ఫిత్రాదానం ఇవ్వడం మొదలైనవి ఈ పండుగలో భాగం. ఈదుల్ అద్హా (బక్రీద్) పండుగ ప్రతి సంవత్సరం దిల్ హజ్ నెల పదవ తేదీన జరుగుతుంది. ప్రత్యేక సామూహిక ఈద్ నమాజు, తగిన ఆర్ధిక స్తోమత ఉన్నవాళ్ళు ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగలో భాగం. అల్లాహ్ ఆదేశన్ని శిరసావహిస్తూ విధేయతాపూర్వకంగా ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన కుమారుడు ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాంను బలి ఇవ్వడానికి సిద్ధపడిన అపూర్వ సంఘటనకు గుర్తుగా ఒక మేక, గొర్రె, ఆవు లేదా ఒంటెలను ఖుర్బానీ ఇచ్చి, దాని మాంసంలో కొంత భాగం పేదవాళ్ళకు మరియు బంధువులకు పంచి పెట్టడం, మరికొంత భాగంతో స్వయంగా విందుభోజనం తయారు చేసుకుంటారు. వడం మొదలైనవి ఈ పండుగలో భాగం.
26- ఇస్లామీయ షరిఅహ్ అంటే ఏమిటి ?
షరిఅహ్ అనేది క్రింది రెండు మూలాధారాల నుండి గ్రహించబడిన ఒక సమగ్రహమైన ఇస్లామీయ చట్టం:
a) ఖుర్ఆన్ గ్రంథం
b) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులు.
షరిఅహ్ మన జీవితంలోని ప్రతి విషయాన్ని సంబోధిస్తున్నది. జీవితం, సంపద, రాజకీయ మరియు ధార్మిక స్వేచ్ఛ, స్త్రీల మరియు అల్పసంఖ్యాకుల హక్కులు కాపాడటం మొదలైన ప్రాథమిక మానవ హక్కులను కాపాడటమే ఇస్లామీయ షరిఅహ్ చట్టాల ముఖ్యోద్దేశం. ఇస్లామీయ షరిఅహ్ చట్టాలను అమలులో పెట్టడం వలననే ఇస్లామీయ దేశాలలో నేరాల సంఖ్య తక్కువగా ఉన్నది[2].
27- ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించిందా?
ఎన్నడూ కాదు. ఖుర్ఆన్ ప్రకారం, , “ఇస్లాం ధర్మంలో బలవంతం లేదు” (2:256), కాబట్టి, ముస్లింగా మారమని ఎవ్వరినీ బలవంతం చేయకూడదు.
ప్రజలను మరియు ప్రాంతాలను వారి దౌర్జన్యపరులైన రాజులు మరియు చక్రవర్తుల నుండి విముక్తి చేసి, వారికి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ప్రసాదించేందుకు ఇస్లామీయ సైన్యాలు ఖడ్గాన్ని ఉపయోగించిన మాట నిజమే. ఎందుకంటే ఆనాడు యుద్ధరంగంలో ప్రధానంగా ఖడ్గం వాడబడేది. ఏదేమైనా, ఇస్లాం ధర్మం ఎన్నడూ ఖడ్గం ద్వారా వ్యాపించలేదు. ఎందుకంటే ఇస్లామీయ సైన్యాలు కాలుమోపిన ఆధారాలేమీ లేని ఇండోనేషియా, చైనా మరియు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో నేటికీ ముస్లింలు ఉన్నారు. ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించిందని అనడం ఎలా ఉంటుందంటే క్రైస్తవ ధర్మం ఆటోమేటిక్ మషిన్ గన్లు, F-16లు, అటామిక్ బాంబులు మొదలైన వాటి ద్వారా వ్యాపించింది అనడం వంటింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. క్రైస్తవ ధర్మం క్రైస్తవ మిషనరీల ద్వారా వ్యాపించింది. అరబ్ ప్రాంతంలోని పది శాతం ప్రజలు నేటికీ క్రైస్తవులుగా జీవిస్తున్నారు. మరి “ఇస్లామీయ ఖడ్గం” ముస్లిం దేశాలలో నివసిస్తున్న ముస్లిమేతర అల్పసంఖ్యాకులను ఇస్లాం ధర్మంలోనికి ఎందుకు మార్చలేక పోయింది. 700 సంవత్సరాల పాటు ముస్లింలు పరిపాలించిన భారతదేశంలో నేటికీ ముస్లింలు అల్పసంఖ్యలోనే మిగిలి ఉన్నారు. అమెరికాలో, ఇస్లామీయ ధర్మం చాలా వేగంగా వ్యాపిస్తున్నది మరియు ఎలాంటి ఖడ్గం ప్రసక్తే లేకుండా అక్కడ ముస్లింల సంఖ్య దాదాపు 6 మిలియన్లకు చేరుకున్నది.
28- ఇస్లాం ధర్మం హింస మరియు ఉగ్రవాదాన్ని, ఆతంకవాదాన్ని ప్రోత్సహిస్తున్నదా?
అస్సలు కాదు. ఇస్లాం ధర్మం శాంతి, దైవసమర్పణ, మానమర్యాదలు, ప్రేమాభిమానాలు, దయ మొదలైన ఉత్తమ నైతిక విలువలు కలిగిన ఒక సత్యధర్మం. మానవ జీవితాల భద్రత నొక్కి వక్కాణిస్తుంది.
ఖుర్ఆన్ ప్రకటిస్తున్నది, [5వ అధ్యాయం, 32వ వచనం], “ఎవరైనా ఒక ప్రాణాన్ని కాపాడితే, అతడు మొత్తం మానవజాతిని కాపాడినట్లే మరియు అకారణంగా ఎవరైనా ఒక వ్యక్తిని హత్యచేస్తే, అతడు మొత్తం మానవజాతిని హత్య చేసినట్లే.” క్రూసేడు దాడులు, స్పెయిన్ మరియు రెండవ ప్రపంచ యుద్ధంలోని హింస లేదా బోస్నియాలో క్రైస్తవ సెర్బులు ఒడిగట్టిన ముస్లింల ఊచకూతలు లేదా రెవరండ్ జిమ్ జోన్స్, డేవిడ్ కొరేష్, డాక్టర్ బరుచ్ గోల్డ్ స్మిత్ వంటి దౌర్జన్యపరుల దాడులు మొదలైన అన్ని రకాల హింసలను మరియు దౌర్జన్యాలను ఇస్లాం పూర్తిగా ఖండిస్తున్నది. హింస, దౌర్జన్యాలను ప్రోత్సహించే వారెవరైనా సరే, అలాంటి వారు తమ ధర్మోపదేశాలను అస్సలు అనుసరించడం లేదు. ఎందుకంటే ఏ ధర్మమూ వాటిని ప్రోత్సహించదు.
అయితే, ఒక్కోసారి ఫాలస్తీను పౌరుల వలే అణచివేతకు గురవుతున్న ప్రజల వద్ద తిరుగుబాటు తప్ప వేరే మార్గం ఉండక పోవచ్చు. ఇది తప్పు అయినప్పటికీ, ఇతర దేశాల దృష్టిని ఆకర్షించేందుకు ఇదొక్కటే మార్గమని వారు భావిస్తూ ఉండ వచ్చు. అయితే కొందరు ఇస్లాం వలనే ఇలాంటి తిరుగుబాటు జరుగుతుందని భావిస్తున్నారు. మరి ఇస్లాం ఉనికి లేని అనేక ప్రాంతాలలో కూడా ఎంతో తీవ్రమైన టెర్రరిజం మరియు హింస జరుగుతున్నది కదా. మరి దానికేమంటారు ?
ఉదాహరణకు, ఐర్లాండ్, దక్షిణ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు శ్రీలంకా మొదలైన దేశాలలోని ఉగ్రవాదం. కొన్నిసార్లు హింసా దౌర్జన్యాలు, ఉగ్రవాదమనేది ఆక్రమించిన దౌర్జన్యపరుల మరియు దురాక్రమణకు గురైన నిస్సహాయుల మధ్య జరిగే పోరాటం లేదా అణచివేతకు గురవుతున్న మరియు అణచివేస్తున్న వారిరువురి మధ్య జరిగే పోరాటం కావచ్చు. ప్రజలు ఎందుకు టెర్రరిస్టులుగా మారుతున్నారో కనిపెట్టవలసిన అవసరం ఎంతో ఉన్నది. దురదృష్టవశాత్తు, తమ హక్కుల కోసం పోరాడుతున్న ఫాలస్తీనా ప్రజలు టెర్రరిస్టులని పేర్కొనబడుతుండగా, నిస్సహాయులైన ఫాలస్తీనా ప్రజలను దుర్మార్గంగా అణచి వేస్తుండటమే కాకుండా తమ స్వంత ప్రజలపై కూడా దౌర్జన్యాలు చేస్తున్న సాయుధ ఇస్రాయీలీ దురాక్రణదారులు మాత్రం టెర్రరిస్టులుగా పేర్కొనబడటం లేదు. ముస్లిమేతర టెర్రరిస్టులు చేసిన ఓక్లహామా సిటీ బాంబింగ్ కేసులో వలే అనేక చోట్ల ఎలాంటి ఆధారాలు లేకుండా మరియు అసలు విచారణ మొదలు కాకుండానే మీడియాలో ముస్లింలను దోషులుగా నిలబెడుతున్నారు. కొన్నిసార్లు శాంతిని కోరుకునేవారు మరియు శాంతిని వ్యతిరేకించేవారు ఉభయులూ ఒకే ధర్మానికి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి.
29- “ఇస్లామీయ ఫండమెంటలిజమ్” అంటే ఏమిటి?
ఇస్లాం ధర్మంలో “ఫండమెంటలిజం” అనే భావనే లేదు. ప్రాథమిక ఫండమెంటల్ ఇస్లామీయ నియమ నిబంధనల వైపు మరలే మరియు వాటికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకోవాలనుకునే ముస్లింలపై ఒక రకమైన ముద్ర వేస్తూ పాశ్చాత్య మీడియా ఈ పదాన్ని తయారు చేసింది. ఇస్లాం ధర్మం ఒక ….. ధర్మం మరియు అల్లాహ్ అంటే భయభక్తులు చూపే ధర్మం. ఒక ముస్లిం అస్సలు తీవ్రవాది లేదా ఉగ్రవాది ఎంత మాత్రమూ కాజాలడు. ఇస్లాం ధర్మం మితవాదం మరియు తీవ్రవాదానికి మధ్యలో ఉన్న మార్గం. ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క భయభక్తులు కలిగి ఉండాలని బోధిస్తున్న సజీవ ధర్మం. ఒక ముస్లిం అస్సలు తీవ్రవాది, మూఢవిశ్వాసి లేదా ఉగ్రవాది కాజాలడు.
30- ఇస్లాం లోని వివాహ వ్యవస్థ, క్రైస్తవ మతంలోని వివాహ వ్యవస్థకు మధ్య భేదమున్నదా?
అవును, భేదమున్నది. ఇస్లాం ధర్మంలో, వివాహమనేది ఒక స్త్రీ మరియు ఒక పురుషుడి మధ్య కలిసి మెలిసి బాధ్యతలు పంచుకుంటూ జీవితం సాగించేందుకు జరిగే ఒక పవిత్ర ఒడంబడిక. దీంతో పాటు, ఇస్లాం ధర్మంలోని వివాహ వ్యవస్థలో ఆచరణాత్మకంగా ఆ ఇరువురి మధ్య వారు పరస్పరం అంగీకరించిన విషయాలతో ఒక చట్టపరమైన అగ్రిమెంటు లిఖించబడుతుంది.
ఇస్లాం ధర్మంలో, పెళ్ళికూతురు లేదా పెళ్ళి కొడుకు ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేయలేరు. పెళ్ళి కుదర్చటంలో తల్లిదండ్రుల పాత్ర కేవలం కాబోయే భార్యాభర్తలకు మంచి సలహా ఇవ్వటం వరకే పరిమితం అయి ఉన్నది. అంతేగాని వారు తమ పిల్లలపై తమ నిర్ణయాన్ని రుద్దే ప్రయత్నం చేయకూడదు.