మహానాడు అరఫా మహత్తు – హజ్డ్ మాసంలో అడుగు పెట్టాము. నేల నాలుగు చెరగుల నుంచీ అశేష జనవాహిని హజ్ విధిని నెరవేర్చే సంకల్పంతో తరలివస్తోంది. తమ ప్రభువు ఆజ్ఞాపాలనకు ప్రతిరూపమైన ప్రతిష్టాలయానికి, దైవ సింహాసనం ఛాయ ఆవరించివున్న పవిత్ర స్థలానికి, సత్యామృతం జాలువారిన మూల స్థానానికి, ఏకేశ్వరోపాసనకు కేంద్ర బిందువు అయిన ప్రదేశానికి, ఇబ్రాహీం (అలైహి) త్యాగానికి పరాకాష్ఠగా ప్రతీతి చెందిన పుణ్య క్షేత్రానికి, తనయుని కోసం తల్లడిల్లిన మనసుతో మహా తల్లి హాజిరా పరుగులు తీసిన పర్వత శ్రేణులకు, అంతిమ దైవ గ్రంథం అవతరించిన పుణ్యభూమికి, అంతిమ దైవప్రవక్త (సఅసం) పుట్టి పెరిగిన పల్లెల తల్లి (ఉమ్ముల్ ఖురా) మక్కాకు కదలి వస్తోంది.
అడంబరాలకు, అట్టహాసాలకు అతి దూరంగా ఆరు ఖండాల నుంచి వచ్చిన భక్తులంతా నిరాడంబరంగా ఒకే చోట, ఒకే విధమైన జీవనశైలికి, ఒకే కార్యక్రమానికి కట్టుబడి ‘హజ్’ అనే మహా యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నారు. చెదిరిన జుత్తుతో, ఇహ్రామ్ దుస్తుల్లో కటిక కొండల మధ్య కఠోర సాధనకు ఉపక్రమించారు. చూడబోతే వారి జాతులు వేరు, వారి రంగులు రూపు రేఖలు వేరు. వారి దేశాలు వేరు, వేషభాషలు వేరు. అలవాట్లు అభిరుచులు వేరు. వారిలో అరబ్బులతోపాటు అరబ్బేతరులూ ఉన్నారు. ఆర్యులతో పాటు ద్రావిడులు కూడా ఉన్నారు. ప్రాచ్యులే కాదు, పాశ్చాత్యులూ ఉన్నారు. నల్లవారే కాదు, తెల్లవారు కూడా ఉన్నారు. కాని కాబా గృహాన్ని సమీపించిన ఈ విభిన్న జాతుల సముదాయంలో ఎలాంటి భిన్నత్వంగానీ, సంకుచిత భావంగానీ కానరాదు. జాతి విచక్షణ గానీ, వర్ల వివక్షగానీ అసలే లేదు. భాషాభేదమూ లేదు, భేషజాలూ లేవు. ఇప్పుడు వారందరి లక్ష్యం ఒక్కటే. వారి వేషధారణ కూడా ఒక్కటేరెండు తెల్లటి దుప్పట్లు! దివి నుండి భువికి దిగివచ్చిన దైవదూతల మాదిరిగా వారు ముందుకు కదలుతున్నారు – ఇప్పుడు వారు మాట్లాడే భాష కూడా ఒక్కటే! వారి అధరాలు ఆలాపించే స్తుతి గీతిక కూడా ఒక్కటే – “లబ్బైకల్లాహుమ్మ లభ్ఫైక్. లబ్బైక లా షరీక లక లబైక్. ఇన్నల్ హష్టు వన్నీ’మత లక వల్ ముల్క్ లా షరీక లక్.” (హాజరయ్యాను దేవా! నేను హాజరయ్యాను. సాటిలేని ప్రభువా! నేను హాజరయ్యాను. స్తోత్రములు నీకే తగునయా! అనుగ్రహాలన్నీ నీవు వొసగినవేనయా! సార్వభౌమాధికారం కూడా నీకే శోభాయమానమయా! నీకు సాటి ఎవరూ లేరయా!)
అవును. హజ్ ఏకత్వానికి, ఏకాంశానికి ప్రతిరూపం. ‘హజ్’ ఓ మహా సమ్మేళనం. అదొక మహా యజ్ఞం. అందులో సంకుచిత భావాలన్నీ సమిధలైపోతాయి. ఆ వాతావరణమంతా మానవ సమానత్వానికి, విశ్వజనీన సౌభ్రాతృత్వానికి అద్దం పడుతుంది. అందరూ ఏక కాలంలో తమ సృష్టికర్త సన్నిధిలో సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఒకే సారథిని అనుసరిస్తారు. ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో విడిది చేస్తారు. దుష్టశక్తుల పై తిరుగుబాటుకు సంకేతంగా అందరూ నిర్ణీత స్తంభాలపై రాళ్లు రువ్వుతారు.
అందరినీ ఒకే లక్ష్యం వైపుకు ఆకర్షించి, అందరినీ మధుర భావాల సుమమాలలో కూర్చిన హజ్ కేవలం లాంఛన ప్రాయమైన మతాచారం కాదు. అది ఏక కాలంలో ప్రపంచ మానవుల కర్తవ్యాన్ని గుర్తు చేసే కీలక విధి! జీవితం అవిభాజ్యమైన ఏకాంకమని నమ్మి నడుచుకునే ప్రజాబాహుళ్యానికి సరైన దిశా నిర్దేశం చేసి ఒకే తాటిపై నడిపించే గొప్ప అంతర్జాతీయ సదస్సు!! అజ్ఞాన కాలపు అహంభావాలను అణచివేసి సదాచరణ ప్రాతిపదికపై గౌరవాదరణలను నిర్ధారించే విశ్వజనీన సమ్మేళనం!!!