చీమలను సామాజిక జీవులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి గ్రామం, నగరం, అడవులు, పొలాలు, చెట్లు, పుట్టలు ఇలా ప్రతిచోటా కనిపిస్తాయి. చీమలు పుట్ట రూపంలో ఒక ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అందులో జీవిస్తాయి. ఇందులో రాణి చీమ, మగ చీమ, అనేక ఆడ చీమలు ఉంటాయి. మగ చీమలకు రెక్కలు ఉండగా, ఆడ చీమలకు మాత్రం ఉండవు. అలాగే చీమలకు కళ్ళు ఉంటాయనేది చాలా మందికి తెలియని విషయం.
అంటార్కిటికా మినహా ప్రపంచంలోని ప్రతి మూలలో చీమలు కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీమలు బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి. తుపాకీ బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయినట్లుగా, ఆ చీమలు మనిషిపై దాడి చేస్తాయట. చీమలు గురించి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఎక్కువ కాలం జీవించే కీటకాల వర్గంలోకి చీమలు కూడా వస్తాయట. ప్రపంచంలో కొన్ని కీటకాలు కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాయి. అందుకు విరుద్ధంగా, ఒక నిర్దిష్ట జాతి ‘పోగోనోమైమెక్స్ అహి’ అని పిలువబడ రాణి చీమ 30 సంవత్సరాలు జీవిస్తుంది. చీమలనే ఈ చిట్టి ప్రాణుల గురించి కుర్ఆన్ ఇలా అంటుంది:
‘సులైమాన్ కోసం మానవులు, జిన్నా తులు, సైన్యాలు సమకూర్చబడ్డాయి. అవన్నీ పూర్తి క్రమశిక్షణలో ఉంచబడుతుండేవి. (ఒకసారి అతను వారితో కలిసి ప్రయాణం చేస్తూ) చివరికి వారంతా ఓ చీమల లోయ లోకి ప్రవేశించారు. అప్పుడు ఒక చీమ (వారిని చూసి), ‘చీమల్లారా! (తొందరగా) మీరు మీ నివాసాల్లోకి (పుట్టల్లోకి) దూరండి. లేకుంటే సులైమాన్, అతని సైనికులు తమకు తెలియకుండానే మనల్ని తొక్కి నలిపేస్తారు’ అన్నది. (నమల్: 17,18).
అల్లాహ్ చీమల ఈ సంఘటనను పేర్కొన దానికి గల కారణం ఏమిటంటే మనిషి నీతిని సాటి మనుషుల ద్వారానేకాక పశుపక్ష్యాదులు, క్రిమికీటకాల ద్వారా సైతం గ్రహించాలి అన్నదే. అవును, మనిషి తాను ఏ రంగంలో వున్నా ‘జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా’ అన్న కాన్ఫడెన్స్ ఉండాలి. ఆపద వచ్చినప్పుడు, ఆప్తులు కరువైనప్పుడు “ఉందిలే మంచికాలం ముందూ ముందునా’ లాంటి ఆత్మ విశ్వాసంతో, ఆశాభావంతో ఉండాలి. కష్టం వచ్చిందని కన్నీళ్ళు పెట్టుకో కూడదు. తాను చేపట్టిన కార్యం చిన్నదైనా జాగ్రత్తగా చేయాలి. సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలి. దిక్సూచిలో ముల్లు ఎల్లవేళలా ఉత్తర దిక్కు వైపు చూపి నట్లుగా మనిషి లక్ష్యం ఎల్లవేళలా విజయం వైపే గురి చేసి ఉండాలి.
చీమల ఫిలాసఫీలో మనిషి జీవితాన్ని చక్కదిద్దగలిగే ఆరు చిట్కాలు
1) ఆహారాన్ని పసిగట్టడం (Identifying the Food)
2) ప్రయత్నం విరమించక పోవడం (Never Giveup)
3) క్రమశిక్షణ (Discipline)
4) ముందు చూపు, కార్య ప్రణాళిక (Fore-sight)
5) ఆత్మ విశ్వాసం (Self Confidence) 6) అనూహ్య విజయం (Great Success)
ఈ ఆరు సూత్రాలు ప్రతి ఒక్కరికీ ఆచర ణీయం అవ్వాలి. ప్రతీ వ్యక్తి వీటిని అనుసరించాలి.
అయితే మనసు సహజంగానే మనిషిని తన అదుపులో ఉంచుకుంటుంది అంటారు అనుభవజ్ఞులు కొందరు. మనసు కదులుతూ, మనిషిని కదలకుండా నిర్వీర్యుణ్ణి చేస్తుంది. మనిషి ఏ కార్యం తలపెట్టినా ‘అది నీతో అయ్యే పని కాదు’, ‘నువ్వు చెయ్య లేవు’ లాంటి నెగెటివ్ (నకారాత్మక) సజెషన్లు ఇస్తుంటుంది. దాంతో మనిషి చతికిల పడతాడు. ‘చింతకు లోనవుతాడు. చివరకు ‘సమాధి’కి దగ్గరవుతాడు. ఈ వాస్తవాన్ని ఖుర్ఆన్ ఇలా పేర్కొంటుంది:
“మేము తలచుకుంటే అతనికి (మా) సూక్తుల ద్వారా ఉన్నతిని ప్రసాదించి ఉండే వారం. కానీ అతను ప్రపంచం వైపుకే మొగ్గి మనోవాంఛలకు బానిసయిపోయాడు.” (ఆరాఫ్:175,176)
“(అలాంటి వ్యక్తి) ఆకాశం నుండి అమాంతంగా అథఃపాతాళంలోకి పడిపోయినట్లే. ఇక అతడ్ని పక్షులైనా పొడుచుకొని తింటాయి. లేదా గాలి అయినా ఎత్తి దూరంగా విసరి పడేస్తుంది.” (హజ్:31)
(కనుక) మీరు మీధర్మంలో సత్యానికి వ్యతిరేకంగా హద్దుమీరి ప్రవర్తించకండి. మీకు పూర్వం స్వయంగా మార్గభ్రష్టులయి, ఇతరుల్ని కూడా అనేక మందిని మార్గభ్రష్టులుగా చేసినవారి అడుగుజాడల్లో నడవకండి. వారు రుజుమార్గం నుండి పూర్తిగా తప్పిపోయారు.” (మాయిదహ్: 77)
పై వచనాల్లో అల్లాహ్ ‘మనోవాంఛల దాస్యానికి దూరంగా ఉండండని, మనసు చెప్పే ప్రతి మాటకు వత్తాసు పలుకవద్దని, అలా చేసేవారి సహచర్యాన్ని సైతం స్వస్తి పలకండి’ అని పిలుపునిస్తున్నాడు. కాబట్టి మనసుని కదలకుండా పడేసి మనిషిని కదిలేలా చేసే మ్యాజిక్ని నేర్చుకోవాలి.
నేడు నవ నాగరికత మోజు వెర్రితలలు వేస్తున్న ప్రభావంతో సమాజంలో ఆడంబరాలు పెరిగాయి. నైతిక విలువలు, మగువల వలువలు తగ్గాయి. ఆత్మీయతలు అంతరిస్తున్నాయి. బంధువుల మధ్య సంబంధ బాంధవ్యాలు కరువయ్యాయి. భార్యాభర్తల మధ్య కావాల్సిన అన్యోన్యత కనుమరుగై పోతుంది. విడాకులు, వీధి పాలయిన కుటుంబాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. పిల్లల్లో శిక్షణాలేమి, అభద్రతాభావం, నైరాశ్యం అధికమవు తోంది. ఇవి, ఇలాంటి అనన్య రుగ్మతల వల్ల శారీరక, మానసిక, కుటుంబ సమస్యలు పెల్లుబిక్కుతున్నాయి. అన్యాయం, అక్రమం, – అనైతికం, అశ్లీలం వరద నీరు వలే ప్రగతికి ప్రతిరూపాలైన పల్లె సీమల్లోకి సైతం దూసుకువస్తోంది. అజ్ఞానాన్ని, అంధకారాన్ని, అంటరానితనాన్ని, నిమ్నోన్నత భావాలను సమరభేరి మొగించి సమిష్టిగా నిర్మూలించే విద్యాలయాలు, సరస్వతీ నిలయాలు అధిక మవ్వాల్సింది పోయి- వర్ణ, వర్గ, కుల, మత అన్న వివక్ష లేకుండా రోగులందరితో నిలువు దోపిడికి పాల్పడే వైద్యాలయాలు పుట్ట గొడుగుల్లా, కలుపు మొక్కల్లా పుట్టుకొస్తున్నాయి.
మానవతా విలువలు మంట కలిసిపోతున్న ఈ తరుణంలో- సమాజ సంస్కరణ కోసం, ప్రజా శ్రేయం కోసం, దేశాభివృద్ధి కోసం కంకణం కట్టుకుని సిద్ధమయ్యేవారు ముందు తమను తాము గెలవాలి. తమ మనస్సుని అదుపులోకి తెచ్చుకోవాలి. మనసుని మచ్చిక చేసుకుని, మనం చెప్పే విధంగా ప్రవర్తించేలా శిక్షణ మనకు మనమే ఇచ్చుకోవాలి. ‘ఇంట గెలిచి రచ్చ గెలువు న్నట్టు’ ముందు మనల్ని మనం గెలవాలి. కేవలం కొందరు కంకణం కట్టుకుంటే సరిపోతుందా? కొందరు ప్రయత్నించిన మాత్రాన సమాజం బాగుపడుతుందా?? అన్న సంశయం, సందేహం గలవారు పెద్దలు చెప్పిన ఈ మాటను మర్చిపోకూడదు. “Even thousand miles joumey stars with one singles step’
అవును- ఈ ప్రపంచంలో మనుషులు రెండు రకాలు. Active, Passive (చేసేవారు. చూసేవారు). Activeలో Proactive వారు 20% మంది మాత్రమే. ఆ కొందరే మొత్తం అద్భుతాలు చేసి ప్రపంచాన్ని నడిపిస్తారు. మిగతా 80 శాతం మందికి మార్గదర్శకాలవు తారు. వారే ప్రపంచాన్ని కుదుపుతారు. కదిలిస్తారు. మేల్కొనేలా చేస్తారు. సమాజ బాధ్య తలను తీసుకుంటారు. ఎటువంటి త్యాగానికి, రిస్క్ అయినా సిద్ధంగా ఉంటారు. తమ ఆచంచల విశ్వాసం, అనంత ఆత్మ బలంతో ఇతరులకు ప్రేరణనిస్తారు. చివరకు ఇతరుల భవిష్యత్తుని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఈ విషయాన్నే ఖుర్ఆన్ ఇలా పేర్కొంటుంది. అటువంటి ప్రతిభావంతులు 10 శాతం వున్నా సరిపోతారు అంటుంది. “మీలో ఇరవై మంది స్థిరంగా నిలబడే వారుంటే వారు 200 మందిని జయించగలరు. అలాంటి యోధులు (అలుపెరగని సైనికులు) వందమంది ఉంటే వారు వేయి మంది సత్య విద్రోహులపై విజయ ఢంకాను మోగించగలరు.” (అల్-అన్ఫాల్ :65, 66)
ఇలా స్థిరంగా నిలబడి, సమస్యలకు తలొగ్గకుండా, పరిస్థితుల ప్రభావానికి పరిసరాల ప్రలోభాలకు భయపడకుండా ధైర్యంగా బాణంలా ముందుకు దూసుకుపోయే వారికే దేవుడు తోడుగా ఉంటాడని తర్వాతి సూక్తిలో సెలవియ్యడం జరిగింది.
సత్యాసత్యాల మధ్య సమరశంఖం ఆనాదిగా పూరించబడుతూనే ఉంది. ఈ సమర క్షేత్రంలో సత్యం నిలదొక్కుకోవాలంటే నిరంతర సాధన తప్పదు. బద్ధకం, వాయిదాల ‘వ్యాధిని విడిచిపెట్టాలి. ఎటువంటి అవాంతరాలొచ్చినా, ఆపదలు ఎదురైనా మన లక్ష్యాన్ని వదలకూడదు, అలసిపోయామని ఆగితే వెనుక వారు మనల్ని తోసేసి ముందుకు పోవడం తథ్యం. అలాగే విజయ అవకాశాలు ప్రాప్తించాయని వెర్రిగా ప్రవర్తించకూడదు. గర్వాన్ని, అహంభావానికి అస్సలు లోనుకాకూడదు. విజయాన్ని శాశ్వతం అని కూడా అనుకో కూడదు. విజయం అనేది గమ్యం కాదు. అదొక నిరంతర ప్రయాణం. ధర్మ మార్గంలో ఆగకుండా నడుస్తూ ఉండటమే మనిషి జీవిత పరమార్ధం. మనం నడుస్తున్న ఈ మార్గం దైవమార్గం. ఈ దారిలోవున్న అడుగుల తాలూకు ముద్రలు స్పష్టంగా ఉండాలి. ఇదే ఆలోచన మనం ఏ పని చేసేటప్పుడైనా అవసరం. ఆవశ్యం, నిత్యవసరం.
1) ఆహారాన్ని పసిగట్టడం:
పనీ పాట లేకుండా సోమరిపోట్లు కావు అవి. పంటలు పండించే భూములా వాటికి లేవు. అయినా అవి ధాన్యం సమకూరుస్తాయి. పొలాలన్నీ తిరిగి తిరిగి అవి ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తాయి. ఇట్లాంటి కష్టమైన బతుకు బాట వాటికి ఎవరు నేర్పారు? ఈ తెలివితేటలు, ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారు? ఇట్లాంటి క్రమశిక్షణ మనిషికి గనుక ఉంటే దారిద్య్రం అసలే ఉండదు కదా!
బలపం పట్టకుండా ఏ బడికెళ్ళి చదువకుండానే ఈ విద్యఅవెట్లా నేర్చాయి? మనుషులమైన మనం ఎన్నెన్ని చదువులు చదివినా ఆ చదువులన్ని ఈ కూటి కోసమే కదా!
మనం ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో పోతాము. కాని కండ్ల ముందు తిరిగే చీమ వంటి గొప్ప సృష్టిని చూసి నేర్చుకోం కదా! మనం చీమలని తేలిగ్గా తీసుకుంటాం. కాని చీమలనుంచి మనం నేర్చుకునేది చాలా ఉంది. మన ప్రపంచంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, దేవుడు అన్ని జీవులకు ముఖ్యమైన బాధ్యతలను ఇచ్చాడు. ఈ జీవులలో చీమ కూడా ఒకటి.
బెల్లం, పంచదార వంటి తీపి పదార్థాలున్న చోటికి క్షణాల్లో చీమలు చేరుకుంటాయి. మేడలోవున్నా, ఓడలో వున్నా, విమానంలో వున్నా, గాలిలో వున్నా పుట్టుకొచ్చినంత వింతగా తీపి పదార్థాల చుట్టూ చేరతాయి. అదే విధంగా మనం సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని ఇతరులకు పరిచయం చేయాలనుకున్నప్పుడు. ఖుర్ఆన్, హదీసులను బాగా స్టడీ చేయాలి. అవసరార్ధం ఆయతులను ఉదాహరించే ప్రజ్ఞతను పెంచుకోవాలి. ధర్మ పరిచయం కోసం పట్టణం, పల్లెసీమ అన్న కృత్రిమమైన గీతల్ని చెరిపేయాలి. ప్రతి చోటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని పలకరించాలి. అలా ఎవర్ని కలిసినా నవ్వుతూ పలుకరించాలి. నవ్వటం. నేర్చుకోవాలి. రాదంటే ఈ ప్రపంచంలో ఏ పనులు సాగవు. మహాప్రవక్త ముహమ్మద్ (స) ఒక్కో ఇంటి దగ్గరికి 70సార్లు వెళ్ళేవారు. వారు ఎన్ని చివాట్లు పెట్టినా భరించి మరుసటి రోజు మళ్ళీ అదే శ్రేయం కూడిన నవ్వుతో వారి ముందు ప్రత్యక్షమయ్యేవారన్న విషయాన్ని సదా దృష్టిలో ఉంచుకోవాలి. చిన్నపాటి చిరునవ్వుతో పలుకరిస్తే మీరు చేరవేసిన సత్యాన్ని నేడు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా స్వీకరిస్తారు. లేదా మీకు అండగా నిలుస్తారు. అలా ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ ఎక్కడికక్కడ జనస్రవంతిలలో కలిసి పోవాలి. అలాగే మనం నివసించే ప్రాంతపు ప్రజల ఆచార వ్యవహారాల అవగాహన సైతం ఎంతో అవసరం. ముఖ్యంగా వారు పవి త్రంగా భావించే గ్రంథాలు, స్థలాలు, వాటి పూర్వ పరాలను కూలంకషంగా అధ్యయనం చేసి బాగా ఆకళింపు చేసుకోవాలి. ఇరుగు పొరుగు వారికి ఉపయోగపడే నిత్యవసర వస్తువుల్ని, (ఉప్పు, మిరప, సబ్బు, పప్పు) ఉంటే కాదన కుండా అందజేయాలి. ఎవరైనా రోగబారిన పడితే వెళ్ళి పరామర్శించి రావాలి. -అగత్యపరులు, అనాధలు, వితంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబర్చాలి. వారి కోసం పాటు పడే సంస్థల్లో చేరాలి. ఆపద వచ్చినప్పుడు, ఆపద్భాంధవుల్లా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి కోవాలి. అందుకు కొంత దూరం ప్రయాణించాల్సి వచ్చినా వెనుకడుగు వేయ కూడదు. మనం మన సమయాన్ని ప్రజలకిస్తే వారు వారి సమయాన్ని మనకిస్తారు.
2) ప్రయత్నం విరమించక పోవటం:
మనం తలబెట్టిన ఏ పనైనా ముందుకు దూసుకు పోవాల్సిందే. మధ్యలో అడ్డంకులు వస్తాయి. శాంతి విఘాతకుల త్రీశూలాలు మీ కుత్తుకల్ని రాల్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఏది జరిగినా నిరాశ పడక ముందుకు పోవాలి తప్ప వెనుకంజవేయకూడదు. మీ ధైర్య సాహసాలను నీరుగార్చే ప్రతిపక్షాలు ఉంటాయి. మీరు ‘అనుకున్నది సాధించలేరు’ అని, ‘అప్పుడెప్పుడో శిథిలమైపోయిన ఈ వ్యవస్థ మళ్ళీ జీవం పోసుకోవడం అనేది ఒట్టి కల, గతంలో అనేకులు ప్రయత్నించి చతి కిల పడ్డారని’, బూజుపట్టిన ఆ వ్యవస్థ నేడు ఏ విధంగాను పనికి రాదని’ తూలనాడుతూ నిరుత్సాహపర్చవచ్చు. అందులో కొందరు మన శ్రేయాభిలాషులున్నప్పటికీ అటువంటి – సందర్భంలో మనం వెనుకంజ వేయకూడదు. మనం నడిచే మార్గం పూర్తి రుజుమార్గం అని మనందరికీ తెలుసు. లోకులు విసిరే చలోక్తు లకి, చెప్పే లోకోక్తులకి, వదిలే వదంతులకు, విమర్శ,వ్యంగ్యాస్త్రాలకి ప్రభావితులైతే, కేవలం పాత్రధారులు కాగలమేగాని, సూత్రధారులు ‘Active’లో ‘Proctive’ కాలేము. ‘ఇస్లాం’ అన్నదే శాంతి. ఈ శాంతిని లోకానికి అందించి లోకకళ్యాణం జరగాలంటే ‘ముస్లిం’ అనబడే ప్రతి వ్యక్తి ముందు ‘విశ్రాంతి’ అనే వ్యసనానికి స్వస్తి పలకాలి.
2) క్రమశిక్షణ:
చీమలు ఇంత చక్కగ వరుసకట్టి ఎక్కడికి పోతున్నాయి? ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికతో పోతున్నాయి. ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మనమే ఇంత సమర్థంగా నడువలేము. అట్లాంటిది అవి ఇంత చక్కగా, క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా చిత్రంగా ఉంటుంది. ఇంత వరుసగా వాటిని నడిపే తెలివిగల గొప్ప శక్తి ఎవరు?
మీరెప్పుడైనా చీమల బారుని చూశారా? చీము వెనుక చీమ ఒక ఆర్డర్లో ర వెళ్తాయి. చీమల్లో క్యూబ్రేక్ చేసే తత్వం లేదు. చీమల్లో రెండు క్యూలు ఉండవు. నా ఒక్కటే ఉంటుంది. అవి ఎంత దూరం వెళ్ళినా తమ నివాసాన్ని మరువవు. తన వారు, పరాయి వారు అన్న విచక్షణా జ్ఞానం వాటికి ఉంటుంది. ఒకవేళ అవి అనుకోని కారణం వల్ల విడిపోయినా, కలిసిన మరు క్షణమే తమ వారిని గుర్తిస్తాయి. వాటిలో ఏ ఒక్క చీమ మరణించినా అన్ని చీమలు కలిసి మోసుకెళ్ళి మరీ అంత్యక్రియలు జరుపుతాయి. తమతో కలిసి పని చెయ్యని చీమల్ని బహిష్కరిస్తాయి. ఇటువంటి సమైక్య తనే దేవుడు మనలో చూడగోరుతున్నాడు. “మీరంతా కలసి అల్లాహ్ త్రాటిని (ధర్మాన్ని) దృఢంగా పట్టుకోండి.” (అలి ఇమ్రాన్:103) “పరస్పరం కలహించుకోకండి. (విభేదాల్లో పడి చీలిపోకండి. అలా చేస్తే మీలో ధైర్యం. సన్నగిల్లి మీ శక్తి నిర్వీర్యమయిపోతుంది. సహనం, సంయమనాలతో వ్యవహరిం చండి. సహనం వహించే వారికి అల్లాహ్ తప్ప కుండా తోడుగా ఉంటాడు.” (అన్ఫాలా:46) అంతర్విభేదాల వల్ల అనైక్యత, పిరికితనాలు సహజంగానే చోటు చేసుకుంటాయి. వాటి మూలంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం సాధ్యం.
కాబట్టి మనం చేపట్టిన ఏ మంచి పనైనా దానిపట్ల ఎంతో క్రమశిక్షణతో ముందుకు సాగాలి. మధ్యలో మరో వైపు చూసినా మన గోల్ (స్వర్గం పొందాలన్న ఆశయం) పని గోల్మాలే. ఓ సందర్భాన దైవప్రవక్త (స) తన సహచరుల్ని హితవు చేస్తూ ఇసుక నేలపై కొన్ని రేఖల్ని గీశారు.
తర్వాత ఇలా అన్నారు: “చూడండి! మధ్యలో ఉన్న ఈ సరళరేఖ స్వర్గానికి గొనిపోయే రుజుమార్గం. ఇరువైపుల కనిపిస్తున్నవన్నీ అడ్డదారులు. అందులోని ప్రతి మార్గంలో ఓ షైతాన్ ఉంటాడు. అతను ఎంతో లౌక్యంతో తన మార్గభ్రష్టత్వం వైపునకు అందమైన నివాదాలతో ఆహ్వానిస్తుంటాడు. ఎవరైతే అతని మాటలు వినక నేరుగా రుజు ముని మార్గాన సాగిపోతారో వారే నిజ సాఫల్యులు. మరెవరైతే అతని ప్రలోభాలకు లోనవుతారో మార్గం తప్పుతారు. అలా తమ వినాశనాన్ని స్వయంగా తామే కొని తెచ్చుకుంటారు.
అందుకే- ప్రవక్త ఆదం (అలై) అయినా, తన నూహ్ (అలై) అయినా, ఇబ్రాహీమ్ (అలై) జ్ఞానం అయినా, మూసా (అలై) అయినా, ఈసా మెకోని (అలై) అయినా, అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అయినా ధర్మమార్గాన విజయం సాధించారంటే ఆయన జీవితాల్లో క్రమశిక్షణే అన్న వాస్తవం అందరూ గ్రహించాలి. మనం చేపట్టే ఏ ధర్మకార్యం అయినా దానిపై మనసా, వాచా, కర్మణా – త్రికరణ శుద్ధిగా మనసుపెట్టి ముందుకు సాగాలి. అప్పుడు విజయం మీ చిరునామా తెలుసుకుని వచ్చి మీ ముంగిట వాలుతుంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు. “జబూర్లో మేము హితోపదేశం చేసిన తర్వాత, మా పుణ్యదాసులు భూమికి వారసులవుతారని వ్రాశాము. భక్తిపరులకు ఇందులో గొప్ప సందేశం ఉంది.” (అంబియా:105,106)
3) ముందు చూపు:
ఇది చాలా ముఖ్యం. చీమలు వేసవి కాలంలో బయట తిరిగి ఆహారాన్ని సంపాదించి దాచు కుంటాయి. వర్షాకాలంలో బయటకు రావటం కష్టం. అందుకని అవి సంపాదించుకున్న ఆహారాన్ని తమ గుట్టల్లో, పుట్టల్లో దాచుకొని హాయిగా గడిపేస్తాయి. అలా సమయస్పూర్తితో వ్యవహరించని చీమలు వర్షాకాలంలో బయ టకు వచ్చి, అష్టకష్టాలు పడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయి. అదే విధంగా ధర్మమార్గంలో మనందరికీ ముందు చూపు ఎంతో అవసరం. ఉదాహ రణకు- మనం ఉండే ప్రాంతంలో చాలా మందే ముస్లింలు ఉండొచ్చు. వారిలోని చాలా మందికి అసలు ‘ఇస్లాం’ అంటేనే తెలీదు. మనం మనకున్న సంబంధాల ద్వారా, బంధువులు, మిత్రుల ద్వారా వారిని సమావేశపర్చి ఇస్లాం వాస్తవికతను, ధర్మాన్ని పాటించడం వల్ల కలిగే లాభాన్ని చెప్పాలి. అలా కనీసం వచ్చిన ఆ వంద మందిలో 10 మంది అయినా ధర్మాన్ని పూర్తిగా గ్రహించడానికి ప్రయత్నించవచ్చు. అలా వారి ద్వారా మంచి వ్యాపింపజేయాలి. అలాగే వివిధ పాఠశాలల్లో, కాలేజీల్లో అనుమతి తీసుకుని ‘ఇస్లాం’ను పరిచయం చేసే, అపోహల్ని దూరం చేసే, అపార్థాల్ని తొలగించే గంట, అరగంట సభలు నిర్వహించాలి. అలా విన్నవారు సత్యాన్ని స్వీకరించే ధైర్యం చేయక పోయినా, ఇస్లాంను ఓ తెరిచిన పుస్తకంలా చూడగలుగుతారు. ఆ పైన సన్మార్గం చూపడం ఆ సత్య స్వరూపుడి చేతిలో ఉంటుంది.
ఈ విషయాన్ని ఖుర్ఆన్ ఇలా పేర్కొంటుంది: “ప్రవక్తా! నీవు మటుకు హితబోధ చేస్తూనే ఉండు. నీ పని హితబోధ చేయడమే. అంతే గాని, వారిని బలవంతంగా దారికి తీసుకొచ్చే బాధ్యత నీ మీద లేదు.” (అల్ గాషియా:21,22)
“నీవు ప్రజలు విశ్వసించనంతవరకు వారిని అసహ్యించుకుంటుంటావా? (తస్మాత్ జాగ్రత్త! అలా చేయకూడదు సుమా..!!)”. (యూనుస్:99)
“ప్రజలందరితో (ఎలాంటి వివక్షను పాటించకుండా) చిరునవ్వుతో, మంచి మాటలు పలకండి.” (బఖర:83)
4) ఆత్మ విశ్వాసం:
చీమలు ఆహారం సంపాదించే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగవు. ఎంత బరువైనా -మోయగలవు. బలమైన పాముని కూడా చీమలు ఐకమత్యంతో చంపగలవు. తాము అనుకున్నది, లక్ష్యంగా ఎన్నుకున్నది సాధించే వరకు పగలు రాత్రి కృషి చేస్తాయి.
అలాగే మనం కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక, అది సాధించే వరకు బద్ద కాన్ని విడిచిపెట్టాలి. వాయిదాల వ్యాధి నుండి బయటపడాలి. ఆత్మనూన్యతా భావాన్ని చరమ గీతం పాడాలి. అవి అసాధ్య- మైన విషయం ఎంతమాత్రం కాదు. ఖుర్ఆన్లో ఇలా ఉంది:
“అల్లాహ్ వైపు ప్రజలను పిలిచి, సత్కా ర్యాలు చేసి, తాను దైవవిధేయుణ్ణని (పూర్తి ఆత్మవిశ్వాసంతో పలికిన వాని మాటకంటే శ్రేష్ఠమైన మాట మరెవరిది కాగలదు?” (హమీమ్:33)
“ప్రవక్తా! మంచీ చెడూ ఒకటి కాజాలవు. కనుక నీవు అత్యంత శ్రేష్ఠమైన ‘మంచి’ ద్వారా చెడును నిర్మూలించు. అప్పుడు నీ గర్భ శత్రువు కూడా నీకు ప్రాణ మిత్రుడయి పోవడం నీవు చూస్తావు. ఈ సద్గుణం సహన శీలురకు తప్ప మరెవ్వరికీ అబ్బదు. ఈ భాగ్యం అదృష్టవంతులకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తం కాదు.” (హమీమ్:34,35)
సత్యప్రచారం అన్నాక ఒడిదుడుగులు తప్పవు. ప్రత్యర్థుల పోటీలు, లూటీలు ఉండనే ఉంటాయి. మనోబలాన్ని పెంచు కోవాలి. ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించు కోవాలి. అన్నిటినీ మించి నిరుత్సాహపడ కూడదు. ముందుకు సాగటమే విశ్వాసి లక్షణం. ఒక్కొ సందర్భంలో మీ విజయాన్ని చూసి ఓర్వలేని ప్రత్యర్థులు దాడి చేయటం, దుష్ప్రచారం చేయడం లాంటివి కూడా జరగవచ్చు. అసూయతో అటువంటి ఆగడాలు అన్ని రంగాల్లోనూ సహజమే. చూడండి…!
నేడు మనం గనక మానవీయ విలువల రక్షణకై సన్నద్ధులవ్వకపోతే ‘ఫలానా’ అని చెప్పుకోవడానికి పుట్టగతులుండవు. చరిత్ర కూడా మనల్ని క్షమించదు. ప్రవక్తలు అన్నారు, వక్తలు చెప్పారు, ప్రసంగాలు జరిగాయి, పుస్తకాలు రచించబడ్డాయి, సభలు నిర్వహించబడ్డాయి. కాని ఎవరి మాటను ఎక్కడాను వినని మనం కనీసం ఈ చీమ పిలుపునైనా విని ఐక్యమవుదాం!
“విశ్వాసుల్లారా! (భవిష్యత్తులో) మీరు ధన ప్రాణాల విషయంలో అనేక కఠిన పరీక్షలకు గురికావలసి వస్తుంది. అదీగాక మీరు గ్రంథ ప్రజల నుండి, బహుదైవారాధకుల నుండి కూడా మనస్సు నొప్పించే మాటలు అనేకం వినవలసి వస్తుంది. కనుక అలాంటి స్థితిలో మీరు సహనం వహించి, భయభక్తులతో కూడిన జీవితం గడుపుతూ ధర్మమార్గంలో స్థిరంగా ఉండాలి. నిజంగా ఇది ఎంతో సాహసోపేతమైన కార్యం.” (ఆలి ఇమ్రాన్:186)
కనుక వాటన్నింటికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ నీరుగారిపోకూడదు. నిరు త్సాహపడ కూడదు. ఎందుకంటే నిరు త్సాహపడటం విశ్వాసి లక్షణం కాదు. అది అవిశ్వాసి లక్షణం. “అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్ కారుణ్యం పట్ల అవిశ్వాసులు మాత్రమే నిరాశ చెందుతారు.” (యూసుఫ్:87)
5) అనూహ్య విజయాలు:
చీమలు ఒక్కొక్క ఇసుక రేణువును మోసుకెళ్తూ పుట్టను కడతాయి. ‘కడవ కడవే కడలివుతుంది’ అన్నట్టు అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనం చూసే ఉంటాము. కొన్ని కోట్ల రేణువు లను పోగుచేసి అవి గుట్టగా పేర్చి ఎన్నో అంతస్థుల మేడలు కడతాయి. అంత పెద్ద చీమల పుట్టలో లక్షలాది చీమలు నివాస ముంటాయి.
చీమలకు మనిషికి మించిన శక్తి ఉంటుంది. మీరు విన్నది నిజమే. మనిషి సగటున తన బరువు లో పావు వంతు బరువు ను ఎత్తడానికి కూడా కష్ట పడతాడు. అయితే చీమలు తమ శరీర బరువు కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువ బరువు ను మోయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి! ఉదాహరణకు ఆసియా నేత చీమ (asian weaver ant) అయితే, దాని స్వంత ద్రవ్యరాశి కంటే 100 రెట్లు బరువు ఎత్తగలదు.
అదే విధంగా మనకున్న శక్తి గురించి మనకు పూర్తిగా తెలియదు. ‘నేను ఇంతే చేయగలను, ఇంతకన్నా చేయలేను’ అనే భ్రమ నుండి బయటపడి పని ప్రారంభిస్తే, చివరకు మనమే వేలాది, లక్షలాది మందికి ధర్మజ్యోతిని అందించినవాళ్ళం, అజ్ఞానం అనే అంధకారం నుండి కాపాడిన వాళ్ళం అవుతాము. సలాహుద్దీన్ అయ్యూబీ, ఉమర్ ఖియామ్, షాహ్ వలియుల్లాహ్ -ముహద్దిన్ దెహ్లలవీ, సనావుల్లాహ్ అమృతసర్ (రహ్మ) లాంటి వ్యక్తులు అప్పట్లో ‘మేమేం చెయ్యలేము’ అని చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటే ఈ రోజు అంధకారంతో, అజ్ఞానంతో అవని మొత్తం అతలాకుతలమయివుండేది. ప్రపంచ చరిత్రలో పై విధంగా అద్భుతాలు చేసిన వ్యక్తులు అన్ని దేశాల్లోనూ వున్నారు. అన్ని రాష్ట్రాల్లో వున్నారు. అన్ని పట్టణాల్లో వున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు. ఒక నెహ్రూ అయితేనేమీ, గాంధీ అయితేనేమీ, మదర్ థెరిసా అయితేనేమి, సుభాష్ చంద్ర బోస్ అయితేనేమీ, అబ్దుల్ కలామ్ ఆజాద్ అయితేనేమీ, భగత్సింగ్ అయితేనేమీ, పొట్టి శ్రీరాములైతేనేమీ, ఒక అబ్దుల్ కలామ్ అయితేనేమీ వీరందరూ ప్రజాశ్రేయం . కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడిన భారత ముద్దు బిడ్డలే. అటువంటి వారు మీరున్న ప్రాంతంలో కూడా ఉన్నారు. ‘అలాంటి వారెవరూ మా ప్రాంతంలో లేరు’ అని మీరసుకుంటే ఆ అవకాశాన్ని మీరే చేజిక్కించుకోండి.
నాడు ఒక చీమ ముంచుకొచ్చే ముప్పు నుంచి తన జాతిని రక్షించడాన్ని తన శాయశక్తుల ప్రయత్నించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నేడు మనం గనక మానవీయ విలువల రక్షణకై సన్నద్ధులవ్వకపోతే ‘ఫలానా’ అని చెప్పుకోవడానికి పుట్టగతు లుండవు. చరిత్ర కూడా మనల్ని క్షమించదు. ప్రవక్తలు అన్నారు. వక్తలు చెప్పారు. ప్రసం గాలు జరిగాయి, పుస్తకాలు రచించబడ్డాయి. సభలు నిర్వహించబడ్డాయి. కాని ఎవరి మాటను ఎక్కడాను వినని మనం కనీసం ఈ చీమ పిలుపునైనా విని ఐక్యమవుదాం! అలా గనక జరిగితే దేవుడు చేసిన వాగ్దానం అక్షరాల నిజమవుతూ మన కళ్ళతో మనం చూడగలం!!
(ప్రవక్తా!) అల్లాహ్ సహాయం వచ్చి, విజయం లభించిన తరువాత ప్రజలు తండోప తండలుగా అల్లాహ్ ధర్మంలో చేరుతూ ఉండటం నీవు గమనిస్తూనే ఉన్నావు. కనుక నీ ప్రభువు ఔన్నత్యం స్తుతిస్తూ, ఆయన పవిత్రతను ప్రశంసిస్తూ ఉండు. దాంతోపాటు ఆయన సన్నిధిలో నీ పొరపాట్లకు క్షమాపణ కోరుకో. ఆయన గొప్పక్షమాశీలి. (అన్-నస్ర్: 1-3)