ఇస్లామీయ ఆరాథనలు పుస్తకం నుండి
‘తయమ్ముమ్’ అంటే సంకల్పించటం అని అర్ధం. షరీఅత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే ప్రయాణంలో ఉన్నప్పుడుగాని స్థానికంగా గాని, వుజూ గుసుల్లో మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్నీ, చేతులనూ స్పర్శించుకోవటం అని అర్ధం. తయమ్ముమ్ గురించి దేవుడు ఇలా అంటున్నాడు:”మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి వుంటే లేక మీరు మీ స్త్రీలను తాకి వుంటే (వారితో సంభోగించి ఉంటే), మీకు నీరు లభ్యంకాని పక్షంలో, పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి, దానితో మీ ముఖాలను, చేతుల్ని స్పర్శించుకోండి.” (ఖుర్‌ఆన్ 4:43)
తయమ్ముమ్ వుజూ మరియు గుసుల్ రెండింటికీ ప్రత్యామ్నాయం కాగలదు.
తయమ్ముమ్ అనుమతించబడే పరిస్థితులు
1. అసలు నీళ్ళు ఎక్కడా లభ్యం కానప్పుడు తయమ్ముమ్
చేయటానికి అనుమతించబడుతుంది. (బుఖారీ-ముస్లిం)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: పది సంవత్సరాల దాకా నీళ్ళు లభ్యం కాకపోయినా మనిషి కొరకు పరిశుభ్రమైన మట్టి- అతని వుజూ, గుసుళ్ళుకు ప్రత్యామ్నాయం కాగలదు. (అబూదావూద్, తిర్మిజీ)
2. వ్యాధిగ్రస్తునికి తన వ్యాధి తీవ్రమవుతుందేమోనన్న భయం ఉన్నప్పుడు. (అబూదావూద్, ఇబ్నెమాజా)
3. నీళ్ళు ఉపయోగించటం వల్ల ఏదయినా నష్టం జరుగుతుందేమోనన్న భయం ఉన్నప్పుడు. అంటే నీరు చాలా చల్లగా ఉండి దాంతో వుజూగాని లేక గుసుల్‌గాని చేస్తే, వ్యాధికి గురయ్యే ప్రమాదముందనుకుంటే, ఆ సమయంలో తయమ్ముమ్ చేసుకోవచ్చు. (అబూదావూద్, ఇబ్నెమాజా)
4. నీరు సమీపంలో ఉన్నా, దాన్ని తీసుకురావటానికి వెళితే ధన మాన ప్రాణ నష్టం కలుగుతుందన్న భయముంటే లేదా బావి నుండి తోడుకునే సాధనమేదీ లభించనప్పుడు తయమ్ముమ్ చేసుకోవటం ధర్మ సమ్మతం అవుతుంది.
5. తమ దగ్గర నీరు చాలా తక్కువగా ఉండి దాన్ని వుజూ గుసుల్ కోసం ఉపయోగించుకుంటే, తర్వాత ఏదైనా తినటానికి గాని ఇతర అవసరాలకు గాని నీరు లభించదన్న భయమున్నప్పుడు తయమ్ముమ్ చేసుకోవచ్చు.
ఏ వస్తువుతో తయమ్ముమ్ చేయవచ్చు?
”మీరు పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి” (ఖుర్‌ఆన్ 5:6)
పై సూక్తిలో (అరబీలో) ‘సయీద్’ అనే పదం వాడబడింది. సయీద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి అయినా కావచ్చు లేదా మట్టిలాంటి ఇతర వస్తువులేవయినా కావచ్చు.
తయమ్ముమ్ చేసుకునే పద్ధతి
1. పరిశుద్ధతను పొందే ఉద్దేశ్యంతో ‘బిస్మిల్లాహ్‌ా’ అని పలకాలి.
2. రెండు చేతుల్నీ పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి.
3.చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించు కోవాలి.
4. తర్వాత చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి.
5. చివర్లో వుజూ చేసిన తర్వాత పఠించే ప్రార్థన వాక్యాలే తయమ్ముమ్ తర్వాత కూడా పఠించాలి. (బుఖారీ- ముస్లిం)
తయమ్ముమ్‌ని భంగపరిచే విషయాలు
ఏ కారణాలవల్ల వుజూ భంగమవుతుందో వాటివల్ల తయమ్ముమ్ కూడా భంగమవుతుంది.(అబూదావూద్, నసాయి)
వ్యాధి లేక ఏదైనా అనివార్య కారణం వల్ల తయమ్ముమ్ చేసి వుంటే, ఆ పరిస్థితి తొలగిపోగానే తయమ్ముమ్ భంగమవుతుంది. నీరు దొరకని కారణంగా తయమ్ముమ్ చేసి ఉంటే ఆ తరువాత నీటిని చూడగానే తయమ్ముమ్ భంగమవుతుంది.