Main Menu
قناة الجامع لعلوم القرآن - Al-Jami' Channel for Quranic Sciences

తల్లిదండ్రుల సేవలో తరిద్దాం రండి!

మీరు అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయనకు (దైవత్వంలో) ఎవరినీ సాటి కల్పించ కండి. తల్లిదండ్రుల పట్ల సద్వర్తనంతో వ్యవహరించండి. బంధువులు, అనాథలు, నిరు పేదలతో మంచిగా మసలుకోండి. ఇరుగుపొరుగు బంధువులకు, పరిచయంలేని పొరుగువారికి, (మీ దైనందిన కార్యకలాపాలలో) తారసపడే మిత్రులకు, బాటసారులకు, మీ అధీనంలో వున్న బానిసలకు మేలు చేయండి. అల్లాహ్  అహంకారుల్ని, ప్రగల్భాలు పలికేవారిని ఎన్నటికీ ప్రేమించడు. (అన్-నిసా: 36)

అమ్మానాన్నలంటే ఓ అనుబంధం…. అమ్మానాన్నలంటే  ఓ అనురాగం…ఓ  ఆత్మీయత. సృష్టిలో అమ్మానాన్న లను  మించిన అమృతమూర్తులు లేరు. ‘జగమే మరిపింపజేయునది కన్న తల్లి ప్రేమ…..శిశువైనా, పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే… జననీ అను మాటలోనే తరయించు మనిషి జన్మ’ అన్నాడు ఓ కవి. ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు. కానీ అమ్మానాన్నల ప్రేమ మారదు. బోసినవ్వుల తమ గారాల పట్టిని, ముద్దుల కొడుకుని  పెంచి, పోషించి ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తమ ధనప్రాణాలను, తమ సుఖసంతోషాలను తృణప్రాయంగా త్యాగం చేస్తారు. పిల్లవాడు ముద్దుముద్దుగా, బొద్దుబొద్దుగా, నవ్వుతూ, తుళ్ళుతూ బుడిబుడి అడుగులు వేస్తుంటే  వారు తమ కష్టాలన్నింటినీ మరిచిపోతారు. హృదయపు లోతుల నుండి అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్నారి కలకాలం ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ, సంతోషంగా జీవితం గడపాలని  వినమ్రంగా వేడుకుంటారు. మనకు ఏ మాత్రం బాధ కలిగినా మొదట గుర్తుకొచ్చేది అమ్మానాన్నలే. మనకు ఏమాత్రం సుస్తీ చేసిదంటే చాలు విలవిల్లాడిపోతూ, నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్టమీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ వళ్లు కాలిపోతుందంటూ ఆ మాత్రానికే చేయని ప్రార్థనలు ఉండవు.  నిజమైన ప్రేమకు ఋజువైన రూపాలు అమ్మానాన్నలు.  మనల్ని  కనిపెట్టిన రూపం అమ్మ, మనల్ని నడిపించే దీపం నాన్న. నాన్నంటే భయం కాదు, అభయం, అది తెలుసుకుంటే  విజయం మనదే.

ఇక్కడో ముఖ్యమైన విషయం గమనించాలి. పై  ఆయత్ గురించి ఇలా చెప్పబడింది: “మూడు ఆయతులు అవిభాజ్యాలుగా  అవతరించాయి. అంటే వాటిలో ఒక్కదానిని  దాని జత లేకుండా స్వీకరించడం జరుగదు.

మొదటిది: అల్లాహ్  అన్నాడు:  పార్థనా వ్యవస్థ నెలకొల్పండి. పేదల ఆర్థికహక్కు (జకాత్‌) చెల్లిస్తూ ఉండండి. (అల్-బఖరహ్: 43) కాబట్టి  ఒక వ్యక్తి శ్రద్ధగా, భక్తిప్రపత్తులతో నమాజ్ చేస్తున్నాడు  కానీ జకాత్ ఇవ్వడం లేదు అంటే అతని నమాజ్ అంగీకరించబడదు.

రెండవది: వారికి (ఈ సంగతి కూడా) చెప్పు: “అల్లాహ్ కు విధేయత, దైవప్రవక్తకు విధేయులై ఉండండి. (అన్-నూర్: 54) ఈ ఆయతు దృష్ట్యా  ఎవరయితే  అల్లాహ్‌కు విధేయత చూపి ప్రవక్తకు (స) వారికి  విధేయత చూపరో, వారి ఆ విధేయత అంగీకరించబడదు.

మూడవది: (అందువల్ల మేమతనికి ఇలా ఉపదేశించాం:) “నాపట్ల కృతజ్ఞుడవయి ఉండు. నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞతాభావంతో మసలుకో. (లుఖ్_మాన్: 14) ఈ వాచం వెలుగులో ఎవరయితే  అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలకుగాను  కృతజ్ఞత చూపి,  తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపకపోతే — అతని ఆ  కృతజ్ఞత అంగీకరించబడదు.”

అల్లాహ్ తరువాత అన్నిటికన్నా గొప్ప హక్కు తల్లిదండ్రులదే

అల్లాహ్ ఏకత్వం, ఆయన ఔన్నత్యం,ఆరాధన తరువాత తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన, వారిపట్ల గౌరవం, విధేయతలకు సంబంధించి పవిత్ర ఖుర్ఆన్ ఎంతో ప్రభావవంతంగా,  హృదయాలను కదిలించే విధంగా స్పష్టమైన హితవులు చేసింది, పవిత్ర ఖుర్ఆన్ లో  దైవాదేశం ఇలా ఉంది: 

నీ ప్రభువు తన ఆజ్ఞలు ఇలా జారీ చేస్తున్నాడు: మీరు ఒక్క (నిజ) దేవుడ్ని తప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మసలుకోండి. మీ ముందు వారిద్దరిలో ఎవరైనా వృద్ధులైఉంటే వారిని ‘ఉఫ్‌’ అని కూడా విసుక్కోకండి. కసురుకుంటూ విదిలించి మాట్లాడకండి. వారితో గౌరవంగా మాట్లాడండి; దయార్ద్ర హృదయంతో, వినయంతో వారి ముందు తలవంచిఉండండి. (వారిపట్ల గౌరవాదరణలతో) “ప్రభూ! వీరు నన్ను చిన్నతనంలో ఎలా కరుణతో, వాత్సల్యంతో పెంచిపోషించారో అలా నీవు వీరిని కరుణించు” అని ప్రార్థించండి.  మీ హృదయంలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సజ్జనులై ఉంటే, (పశ్చాత్తాపంతో) తనవైపు మరలేవారందర్నీ ఆయన క్షమిస్తాడు. (బనీ_ఇస్రాయీల్: 23-25)

ఈ ఆయతులో అల్లాహ్ తన ఆరాధన తరువాత, తల్లిదండ్రుల యెడల మంచిగా మెలగటాన్ని రెండో స్థానంలో ఉంచాడు. దీన్నిబట్టి తల్లిదండ్రుల విధేయత, వారి సేవ, వారి గౌరవ మర్యాదలు ఎంత ముఖ్యమైనవో విదితమవుతోంది. దైవదాస్యం కోరే ప్రధానాంశాలను నెరవేర్చటం ఎంత అవసరమో, ఆ తర్వాత మాతాపితల విధేయతలో ఇమిడి ఉన్న ముఖ్యాంశాలను నెరవేర్చటం కూడా అంతే అవసరం. ముఖ్యంగా మాతాపితలు ముసలివారుగా ఉన్నప్పుడు వారి ముందు విసుగును, చిరాకును ప్రదర్శించకూడదు. వారిని కసురుకోకూడదు. ఎందుకంటే ముసలితనంలో వారు బలహీనులు, నిస్సహాయులు, దిక్కు తోచనివారై ఉంటారు. అదే సమయంలో వారి పిల్లలు యుక్తవయస్కులై ఉంటారు. సంపాదనాపరులై ఉంటారు. భావాలు భావనల రీత్యా తల్లిదండ్రులకు – పిల్లలకు మధ్య ఎంతో వైరుద్ధ్యం ఉంటుంది. పరువం ఉరకలు వేసే వయసులో పిల్లలు తమ ముసలి తల్లిదండ్రుల అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా మసలుకోవటమన్నది కించిత్ కష్టమైనపనే కావచ్చు. కాని ఈమాత్రం ఓపికను, సేవానిరతిని కనబరచినవాడే దైవసన్నిధిలో ప్రీతిపాత్రుడవుతాడు.

హజ్రత్ అబూహురైరా(ర) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు. ‘ఆ మనిషి పాడుగాను…. ఆ మనిషి పాడుగాను…. అతను అవమానం పాలుగాను.” అని దైవప్రవక్త(స) ముమ్మారు పలికారు. అది విని, “దైవప్రవక్తా! ఎవరతను?” అని సహచరులు అడిగారు.“ఎవరైతే తన తల్లిదండ్రులను, ఒకరినిగాని లేక ఇద్దరినిగాని వృద్ధదశలో పొంది కూడా స్వర్గంలోకి వెళ్ళనివాడు” అని దైవప్రవక్త(స) సెలవిచ్చారు.

పక్షి తన పసిపిల్లలను తన వాత్సల్యభరితమైన నీడలోకి తీసుకోదలచినప్పుడు తన రెక్కలతో వాటిని కప్పేస్తుంది. వెచ్చని తన కౌగిలిలో ఆశ్రయాన్ని కల్పిస్తుంది. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులతో అదేవిధంగా దయాభావంతో మెలగాలి. వారు మిమ్ము పసితనంలో పోషించినట్లుగానే మీరు వారిని పోషించాలి. పక్షి ఆకాశంలో ఎగిరి పోయేటప్పుడు తన రెక్కల్ని చాచుతుంది. నేల మీదికి దిగేటప్పుడు తన రెక్కలను  ముడుచుకుంటుంది. అలాగే మీరు మీ తల్లిదండ్రుల ముందు వినయవినమ్రతలు చూపాలంటే మీలో కాస్తంత అణకువ ఉండాలి.

తల్లిదండ్రుల ఋణం తీర్చసాధ్యం కానిది

అమృతాన్ని పంచేది అమ్మ.. అనురాగాన్ని అందించేది నాన్న. తల్లిదండ్రులు పంచే ఆప్యాయత భూప్రపంచం లోనే వెలకట్టలేనిది. మమతానురాగాలకు ప్రతిరూపాలు తల్లిదండ్రులు మన జీవితంలో తల్లితండ్రి రుణం తీర్చుకోలేనిది., వారి ప్రేమ, సేవలు వెలకట్టలేనివి… ప్రపంచంలో అత్యంత ఆత్మీయ సంబంధం తల్లి తండ్రి సంబంధమే..బిడ్డకు జన్మని ఇవ్వడంతోనే ముగిసిపోదు.. నిజానికి అప్పుడే మొదలవుతుంది. ఎంతో శ్రమ పడాలి. ఎన్నో సేవలు చేయాలి. ఇంకేన్నో త్యాగాలు చేయాలి.. పిల్లలు తల్లిదండ్రుల మీద కలకాలం ఆధార పడతారు. ముఖ్యంగా తల్లి సేవను వెలకట్టలేము..పిల్లలు స్వతంత్రంగా ఎదిగిన తర్వాత, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. తల్లి తండ్రి మనల్ని ఎంత అల్లారుముద్దుగా పెంచారో, అచ్చం అలాగే అంత ప్రేమగా, ఆత్మీయంగా చూసుకోవాలి. వయసు పైబడి, తమ పనులు తాము చేసుకోలేకపోతే, పిల్లలు తప్పకుండా ఆ పనులు చేయాలి.. అది కూడా విసుక్కోకుండా, అసహనం లేకుండా, ఈసడించుకోకుండా ప్రేమగా చేయాలి. మన చిన్నతనం నుండి పెద్దయ్యే వరకి ఎంత ప్రేమగా, ఆప్యాయతగా పెంచారో అదే ప్రేమ వారి వయసు మల్లుతున్న సమయంలోనూ మరియు ముఖ్యంగా వృద్దాప్యంలో వారికి తోడుండాలి, వారికి సమయం ఇవ్వాలి, ప్రేమగా మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి,. తల్లి తండ్రులకు కంటనీరు పెట్టించిన వారు ఎంత దురదృష్టవంతులో ఆనంద భాష్పాలు తెప్పించిన వారు అంతటి అదృష్టవంతులు.  

మరింత ప్రేమనివ్వండి మరింత సమయం ఇవ్వండి

సజ్జన పూర్వీకుల్లోని ఒకరు తన బాల్యపు స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ, తెలిసి తెలియని ఆ వయసు తానూ తన తండ్రి పట్ల వ్యవహరించిన  దురుసు తీరు గురించి ఇలా అన్నారు. అప్పుడు నేను చిన్నవాడిని – ఇంటికి వెళుతూ  ఒక సంచిలో కొంత పండిన ఖర్జూరం (రుతబ్‌) తీసుకొచ్చాను. ఆ సంచి పైభాగం కొంచెం తెరిచి ఉంది. ఇంటి తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు నాన్న బయటకు వచ్చి నన్ను చూసి బాబూ! “ఇది ఏమిటి?” అడిగారు. నేను ఆయన్ను అదోలా చూస్తూ – “కనబడట్లేదా, ఖర్జూరం కదా!”  అని చాలా అమర్యాదగా సమాధానం ఇచ్చాను. నాన్న తన పని మీద   బయలుదేరిపోయారు. నేను మాత్రం ఏమీ జరగనట్టు  ఇంట్లోకి వెళ్లిపోయాను. కొంతసేపటి తర్వాత నాన్న తిరిగి వచ్చి నన్ను పిలిచి, దగ్గర కూర్చోబెట్టుకుని  నాతో మృదువుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన అన్నారు: చూడు బాబూ! “అల్లాహ్ తన  ప్రవక్త మూసాను ఉద్దేశించి ఇలా అడిగాడు కదా!  ‘ఓ మూసా! నీ కుడిచేతిలో ఉన్నది ఏమిటి?’  (తాహా: 17)  అల్లాహ్‌ కు  తెలియదా,  మూసా  (అ) చేతిలో ఉన్నది చేతికర్ర  అని?” నేను అన్నాను: అవును, “తెలుసు కదా!”

మరి హజ్రత్ మూసా (అ) ఎలా బదులిచ్చారో ఒక్కసారి గమనించు. దానికి మూసా “ఇది నా చేతికర్ర. దీన్ని నేను ఊతగా చేసుకొని నడుస్తాను. దీంతో నా మేకల కోసం చెట్ల నుండి ఆకులు రాల్చుతాను. దీంతో నేను ఇంకా ఎన్నో పనులు చేస్తాను” అన్నాడు. “మూసా! దాన్ని క్రింద పడవెయ్యి” అన్నాడు దేవుడు. మూసా దాన్ని క్రింద పడవేశాడు. అంతే, అది ఎకాఎకిన పాముగా మారి పరుగెత్తసాగింది. (తాహా: 18). అల్లాహ్ అడిగింది కేవలం నీ చేతిలో ఏముందని? అంతే. కానీ అల్లాహ్ తో సంభాషించే సువర్ణవకాశాన్ని చేజార్చుకోకూడదని ఆయన మాట పొడిగించి సమాధానమిచ్చారు. ఎందుకంటే, ఎవరికయినా తనకిష్టమయిన  వ్యక్తితో మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది.

అలాగే  నాకు కూడా నీ చేతిలో ఖర్జూరం ఉందని తెలుసు. కానీ నేను నిన్ను అడిగింది నీతో  మాట్లాడటానికి, నీతో సంభాషించాలనిపించింది అందుకే.” అని నాన్న తన మాటను పూర్తి చేశారు. ఆ సంఘటన  జరిగింది మొదలు నేనెప్పుడూ నాన్నతోగానీ, అమ్మతోగానీ, అమ్మమ్మతోగానీ, మరే పెద్ద వ్యక్తితోగాని దురుసుగా ప్రవర్తించలేదు. ఎందుకంటే, బాణం చేసే గాయం కన్నా మాట చేసే గాయం చాలా లోతుగా, బాధాకరంగా ఉంటుంది అని ఆ రోజు నాకు తెలిసింది.

తల్లిదండ్రుల పట్ల విధేయత అంటే కేవలం డబ్బు ఇవ్వడం లేదా భోజనం పెట్టడం మాత్రమే కాదు, కూడు, గూడు, గుడ్డ సమకూర్చి పెట్టడమే కాదు. ప్రేమ, కరుణ, మమకారం, మంచితనంతో వారితో సమయం గడపడం. వారిని  ప్రేమతో చూసే చూపులు కావాలి. వెట్టి చాకిరీ చేసి వాడిపోయిన వారి పెదాలపై చిరునవ్వులు తెప్పించే  మృదువైన నాలుగు మాటలు కావాలి.  గౌరవాదరణలతోపాటు , ఆప్యాయతతో ఆలింగనం చేసుకునే బాహులు కావాలి. మడతలు పడిన వారి చేతులు-కాళ్లను మమకారంతో ముద్దాడే పెదాలు కావాలి.

ఒకవేళ తల్లిదండ్రులు “మాకు ఏమీ వద్దు” బేటా, అని చెబితే వారి మాట నమ్మకండి.  వారు అలా చెప్పేది లజ్జతో, మీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, లేదా మర్యాదతో మాత్రమే. కాబట్టి వారు అడగకపోయినా, ఏది కోరకపోయినా, స్వయంగా తరచూ కానుకలు యిస్తూ ఉండండి.  వారికి మనసయినవి ఏవో తెలుసుకొని చిన్ని చిన్ని కోరికలే అయినా తీర్చి వారిని సంతోషపెట్టండి. చాలా మందిలా  కాటికి కాళ్ళు జాపిన కురూపి వృద్ధజీవులు కదా అని చిన్న చూపు చూడకండి. మీ తల్లికి  అక్షరాస్యత లేదని ఎగతాళి చెయ్యకండి.  ఎందుకంటే వారు పెద్దవారయినా వారి హృదయంలో ఇంకా ఒక చిన్నారి ఉంది, ఆ చిన్నారి మీ ప్రేమ, శ్రద్ధ,  దయ,  సేవ  కోసం తహతహలాడుతోంది అని తెలుసుకోండి.

ఓ తల్లి మొబైల్ షాపుకెళ్లి – బాబూ! ఈ ఫోన్ చేడిపోయింది ఏమో కాస్త చూస్తావా?  ఓ మాసం అయిపొయింది … నా కొడుకు ఫోన్ రాలేదు…! చెడిపోయింది ఫోన్ కాదు.. తన కొడుకే అన్న విషయం ఆ ముసలి తల్లికి తెలియదు పాపం! ఒకవేళ ఎదురైతే మీరు చెప్పకండి.. లేదంటే తలులకి కొడుకులంటే నమ్మకం పోతుంది! మనం మన అమ్మానాన్నలతో ఎంత  సమయం గడిపాము అన్నది క్కాడు ఎలా గడిపాము  అన్నది చాలా ముఖ్యం.

ఆర్ధిక సహాయానికి తోలి హక్కుదారులు తల్లిదండ్రులు

అదృష్టవంతులైన సంతానం బాధ్యత ఏమిటంటే, శారీరక సేవలు చేసే అవకాశం వస్తే దాన్ని తమ అదృష్టంగా భావించి సంతోషంగా తల్లిదండ్రులు సేవచేయాలి. ఒకవేళ వారి కోసం ధన వ్యయం చేయాల్సి వచ్చినా అది కూడా తమ అదృష్టమనే భావిస్తూ, సంతోషంగా వారికోసం ధనం ఖర్చుబెట్టాలి. పవిత్ర ఖుర్ఆన్ఆ ఇలా ఉంది:

వారు (దైవమార్గంలో) సంపద ఏ విధంగా ఖర్చుచేయాలని అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు: “మీరు ఖర్చుచేయ దలచుకున్నది మీ తల్లిదండ్రులు, బంధువులు, అనాథలు, అగత్యపరులు, బాటసారుల శ్రేయస్సు కోసం ఖర్చుచేయండి. ఎవరు ఏ సత్కార్యం చేసినా దాన్ని గురించి అల్లాహ్ కు  బాగా తెలుసు. (అల్-బఖరహ్ : 215)

ఖుర్ఆన్, సున్నత్లలో సేవ, విధేయత, సత్ప్రవర్తనల గురించి ఏవిధంగా ఉపదేశించబడిందో సరిగ్గా అదే విధంగా తల్లిదండ్రుల కోసం ఖర్చుపెట్టేటప్పుడు గీసి గీసి, పిసినారితనంగా వ్యవహరించకూడదని కూడా ఆదేశించ బడింది. పిల్లల సంపదకు మొట్టమొదటి హక్కుదారులు వారి తల్లిదండ్రులే. వారి అవసరాలు తీర్చకపోవడం, వారి కోసం ఖర్చుపెట్టాల్సి వచ్చినప్పుడు దాచి ఉంచడం సత్సంతానం చేసేపనికాదు. వారి అవసరాలు అంటే, బత్తెం ఖర్చులూ కావచ్చు, మందు మాకూ ఖర్చూ కావచ్చు.

వృత్తి, సామాజిక, ఆర్థిక పరంగా అనే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ జీవిత చరమాంకంలో తల్లిదండ్రుల పట్ల ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలి. వృద్ధాప్యంలో ఒక తోడు కోసం.. ఓ తియ్యని పలుకు కోసం అల్లాడిపోయ్యే తల్లిదండ్రులకు ఆప్యాయతను పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భార్య చెప్పిందనో.. ఆమె బాధపడుతుందనో, కుటుంబ స్థితిగతులు బాగలేవనో ఇలా అనేక కారణాలతో తల్లిదండ్రులను దూరం చేసుకుంటే భవిష్యత్‌లో తమ పిల్లలు కూడా తమను అలాగే చూస్తారన్న విషయాన్ని గుర్తించుకోవాలి. దయనీయ స్థితిలో ఉన్న తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలిగినప్పుడే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. జన్మనిచ్చి, పెంచి పోషించి, ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను చివరిచరమాంకంలో కంటికి రెప్పలా సంరక్షించాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉంది. ఇది అందరి నైతిక బాధ్యత కూడా.

తల్లిదండ్రుల సేవ ఒక ఆరాధన.

ఈ ప్రపంచానికి మనం పరిచయమవడానికి కారణం తల్లిదండ్రులు. వారి సేవను మించిన పవిత్ర కార్యం వేరేదీ లేదు. కన్నవారిని ఆవేదనకు, అశాంతికి గురిచేస్తే అంతకు మించిన పాపం మరొకటి ఉండదు. సాక్షాత్తు అల్లాహ్ తన తర్వాత   తొలిప్రాధాన్యం తల్లిదండ్రులకే ఇచ్చాడు. ‘తల్లిదండ్రులను దుఃఖపెట్టేవారి ఆధ్యాత్మిక సాధనలు ఫలించవు. కన్నవారు సంతృప్తిగా ఉన్నప్పుడే మన ప్రార్థనలు, హజ్ ఉమ్రా  యాత్రలు సార్థకమవుతాయి.  పిల్లలు తల్లిదండ్రులను దుర్భాషలాడటం, అవమానించడం, బాధ కలిగించటం, నిందారోపణలు చేయడం మంచిది కాదు. జన్మనిచ్చినవారిని అవమానించి అగౌరవపరిచిన వారికి ఎన్నటికీ మేలు జరగదు అన్నది  ధర్మ తీర్పు.

కన్నవారిని సేవించడానికి  సాక్షాత్ సత్య ప్రవక్త ముహమ్మద్ (స) వారి దివ్య దర్శనాన్ని, ఆ దర్శనం ద్వారా సహాబీ స్థాయిని పొందే గొప్ప అవకాశాన్ని వదులుకున్న ఉవైస్ కర్ణీ (రహ్మ)  పాత్రను ప్రపంచ ఆధ్యాత్మిక సారస్వతంలో ఎక్కడా దర్శించలేం. కేవలం ఈ ఒక్క ‘సేవ’ అతడి జన్మను ధన్యం చేసింది. ఆయనకున్న కుష్టు రోగం పూర్తిగా నయం అయింది. ఉవైస్ కర్ణీ (రహ్మ) అడుగుజాడల్లో నడుస్తూ కన్నవారిని కంటికిరెప్పలా కాపాడుకొంటున్న బిడ్డలు గురించి సామాజిక మాధ్యమాల్లో తరచూ చూస్తుంటాం. అలాంటి వారు ప్రతిఒక్కరికీ స్ఫూర్తిప్రదాతలు. చైతన్య కరదీపికలు.

“ఇహ్  సోచ్ కె మా బాప్ కి ఖిద్మత్ మే లగా హూన్,

ఇస్ పేడ్ కా సాయా మేరే బచ్చోన్ కో మిలేగా.”

‘తల్లిదండ్రులే మీ స్వర్గం, తల్లిదండ్రులే మీ నరకం’ అని ప్రవచించారు దైవప్రవక్త (స). వారి పట్ల సత్ప్రవర్తన కలిగి, వారి సేవలో తరిస్తే స్వర్గానికి అర్హులవుతారు. వారి పట్ల అవిధేయత కనబరిచి, వారిని పట్టించుకోకపోతే నరకానికి ఆహుతి అవుతారు అని అర్థం. ఎవరైతే కన్నవారి మనసు కష్టపెట్టకుండా, వారి సేవ చేస్తారో, అలాంటి సంతానానికి స్వర్గం లభిస్తుంది, వారి ఆయుష్షు పెరుగుతుంది… అని ముహమ్మద్ ప్రవక్త (స) సెలవిచ్చారు.

పరలోకంలో దైవప్రీతికి పాత్రులై స్వర్గం లభించాలంటే తల్లిదండ్రులను గౌరవించడం తప్పనిసరి. తల్లిదండ్రుల సంతోషంలోనే దైవసంతోషం ఇమిడి ఉంది. తల్లిదండ్రులను గౌరవించకుండా, దైవప్రసన్నతను పొందడం అసాధ్యం. కళ్ల ముందు కనబడే తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి అవసరాలు తీర్చకుండా, వారిని సంతోషపెట్టకుండా, దైవప్రసన్నతను పొందాలనుకోవడం దుస్సాహసం. వృద్ధ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోకుండా; వృద్ధాశ్రమాలకు, అనాధాశ్రమాలకు విరాళాలిచ్చి పుణ్యం సంపాదించుకున్నాను అనుకోవడం అవివేకం. తల్లిదండ్రుల్ని కాదని ఎంత గొప్ప సత్కార్యం చేసినా అది ఏ విధంగానూ ఉపకరించదు.

(మూసా! నీవు ప్రేమపాత్రుడయ్యేందుకు) నేను నావైపు నుండి నీ మీద మమతా మమకారాలు ఆవరింపజేశాను. నీవు నా పర్యవేక్షణలో పోషించబడేలా ప్రత్యేక ఏర్పాటు చేశాను. (తాహా: 39)

తల్లిపేగు తెంపుకుని బయటకు వచ్చే బిడ్డ, నాన్న చేయి పట్టుకుని తప్పటడుగులు నుంచి ఎదిగే బిడ్డ..పెరిగి పెద్దయి ప్రయోజకుడై పిల్లలకు తండ్రయి …తన తల్లిదండ్రులను మాత్రం వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే…ఆ తల్లిదండ్రులకు ఎంత గుండెకోత…ఇది బిడ్డల వెన్నుపోటా? కత్తిపోటా? అమ్మానాన్నలు అనాథలుగా మారుతున్నారు. అవసాన దశలో అండగా ఉండాల్సిన బిడ్డలు వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకోర్చి బిడ్డల కోసం తమ ఆర్జితాన్ని ధారపోసి చివరికి దిక్కులేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. కనిపెంచడంతోపాటు బిడ్డల భవిష్యత్‌ కోసం అహర్నిశలు శ్రమించే నిత్య కార్మికులైన తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్నారు.

తన బిడ్డల ప్రతి కష్టాన్నీ తీర్చినప్పుడు తెలియదు  రేపు తాము కష్టంలో ఉంటె  ఏ కష్టాన్నీ వారు  తీర్చరని. జోల పాడి నిద్ర పుచ్చినప్పుడు తెలియదు వారికే  నిద్ర లేకుండా చేస్తారని.  నడక నేర్పినప్పుడు తెలియదు అది నేర్చుకునే ఇంతకి బరితెగిస్తారని.  చీరకొంగు పట్టుకుని తిరిగినప్పుడు తెలియదు చీర కూడా కొనకుండా వదిలేస్తారని.  కళ్ళలో పెట్టుకొని చూసినప్పుడు తెలియదు వారి  కంటికి కనిపించనంత దూరం వెళ్తాపోతారని.  బాధల్లో ఓదార్చినప్పుడు తెలియదు వారి బాధలకు కారణం వీరే  అవుతారని.  అందరిలో గొప్పోళ్ళుగా  చూడాలను కున్నారు ఇప్పుడు వారే వీరిని నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు.

తల్లిదండ్రుల సేవకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు

మొదటి స్థితి: తండ్రి పాపాకార్యాలకు, చెడు అలవాట్లకు బానిసయి, అశ్లీల ఊబిలో పీకల్లోతుకు  కూరుకుపోయినవాడయినా  సరే, ఆటను ఎంతటి పాపి అయినా సరే, అతనిపై బిడ్డలుగా మనకున్న  విధేయత  హక్కు ఎప్పుడూ రద్దు కాదనే నియమం గమనించాలి. ఒకవేళ తండ్రి కాఫిర్, అవిశ్వాసి, నాస్తికుడు, మార్గభ్రష్టుడు అయినా కూడా. అల్లాహ్ ఇలా  అన్నాడు: అయితే నీకు తెలియనిదాన్ని నాకు సాటి కల్పించ మని వత్తిడిచేస్తే మటుకు నీవు వారిమాట ఎన్నటికీ వినకు. ప్రపంచంలో వారి పట్ల సత్ప్రవర్తన కలిగిఉండు. అనుసరణ విషయంలో మాత్రం నావైపు మరలినవారి మార్గాన్నే అనుసరించు. చివరికి మీరంతా నా దగ్గరికే తిరిగిరావలసి ఉంది. అప్పుడు నేను మీరు (ఐహిక జీవితంలో) ఎలా నడచుకునేవారో మీకు తెలియజేస్తాను.”  (సూరా లూక్మాన్: 15)

కాఫిర్ తండ్రి హక్కు కాపాడమని అల్లాహ్ ఆదేశించినప్పుడు, ఒక పాపి అయిన  తండ్రికి ఇంకా ఎక్కువ హక్కు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కొడుకు తన తండ్రికి సేవ చేయాలి, మంచి విషయాలలో అతని మాట వినాలి, సున్నితంగా సలహా ఇవ్వాలి, సహనం చూపాలి. కానీ అతని పాపంలో భాగస్వామి కాకూడదు, పాపం విషయాలలో విధేయత చూపకూడదు, అతని లోపాలను బహిరంగపరచకూడదు.  ఇబ్ను తైమియ్యా (రహ్మ)  ఇలా అన్నారు: “తల్లిదండ్రులు పాపులు అయినా సరే, పాపం కాని విషయాల్లో వారికి విధేయత చూపడం తప్పనిసరి. ఇది ఇమామ్ అహ్మద్ అభిప్రాయం ప్రకారం కూడా స్పష్టంగా ఉంది. కానీ అది వారికి ఉపయోగపడేది కావాలి, హానికరమైనదయి  ఉండకూడదు.”

“అల్-ఫవాకిహ్ అద్దవానీ” అనే గ్రంథంలో ఉంది: “ప్రతి ముస్లింకీ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండటం ఫర్జ్ (తప్పనిసరి). వారు పాపులు అయినా, కాఫిర్ అయినా, ఎందుకంటే హక్కులు పాపం వలన లేదా మతభేదం వలన రద్దు కావు.”

అలాగే, ఒకవేళ  తల్లి అలాంటి చేదు నడత, నడక గల స్త్రీ అయి ఉంటే, ఆమెపట్ల కూడా సహనం చూపాలి, ఆమెతో  మంచిగా వ్యవహరించాలి, ఆమె దోషాలను దాచాలి, చెడు పనుల నుండి ఆమెను  ఆప్ ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేయాలి. ఇబ్ను తైమియ్యా అన్నారు: “ఆమెను బంధువులు ఏవో కొన్ని సాకులతో విస్మరించకూడదు. కానీ చెడులో పడకుండా తమ శక్తి మేరకు అడ్డుకోవాలి. ఆమెకు ఆహారం, వస్త్రం అవసరం అయితే అందించాలి.”

రెండవ స్థితి: తండ్రి అన్యాయపరుడు. దౌర్జన్యంగా  కొడుకుకు హక్కులను దోచుకుంటూ, బాండ బూతులు తిడుతూ, దూషిస్తూ, వారి జీవితాల్ని  దుర్భరంగా  మార్చి ఉంటే — అలాంటి దిక్కుమాలిన తండ్రిపట్ల కూడా కొడుకు సహనం చూపాలి. అతనిపై దయ చూపాలి, వీలయినంతగా మేలు చేయాలి, సానుభూతితో వ్యవహరించాలి, ఎలాంటి  తగువులాటకు దిగకూడదు. అతని హితానికై  అల్లాహ్ ను వేడుకోవాలి. (ఓ అల్లాహ్! ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించు, ఆయన చెడుల నుండి మమ్మల్ని కాపాడు స్వామీ! అని ప్రార్థించాలి. అయితే ఎప్పుడూ తల్లిదండ్రులకు శాపనార్థాలు పెట్టకూడదు.

ఇబ్ను అబ్బాస్ (రజి ) అన్నారు: “ఎవరికయినా  తల్లిదండ్రులు ఉండి, అతను ఉదయాన్నే వారిని సంతోషపరుస్తూ లేస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో రెండు తలుపులు తెరుస్తాడు. వారిని బాధ పెడితే నరకంలోని రెండు తలుపులు తెరుస్తాడు.” అక్కడున్నవారు అడిగారు: “వారు అన్యాయం చేసినా కూడా?” అని. దానికి ఆయన: “అవును, వారు అన్యాయం చేసినా, దౌర్జన్యానికి పాల్పడినా కూడా.”

మూడవ స్థితి: తండ్రి తల్లిని విడాకులు ఇచ్చిన సందర్భంలో కొంతమంది పిల్లలు తండ్రిపై కోపం పెంచుకుంటారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, పూర్తి సంబంధమే  తెగత్రెంపులు చేసుకుంటారు, జీవితాంతం నాన్న ముఖం చూడమని భీష్మించి కూర్చుంటారు.  ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే తండ్రి యొక్క హక్కు విడాకుల వలన రద్దు కాదు.

ప్రవక్త (స) అన్నారు: “ఎవడైనా తన తండ్రిని బానిసగా పొంది  కొనుగోలు చేసి విముక్తి ఇచ్చేవరకు, తండ్రికి చేసిన ఉపకారానికి ప్రతిఫలం ఇవ్వలేడు.” (సహీహ్ ముస్లిం)

వాస్తవానికి, విడాకులు కూడా అల్లాహ్ నిర్ణయించిన ఒక పరిణామం మాత్రమే. అల్లాహ్ అన్నాడు:  ఒకవేళ దంపతులిరువురూ విడిపోవడానికే నిర్ణయించుకుంటే అల్లాహ్  తన అపార శక్తియుక్తులతో వారిని ఒకరిపై మరొకరు ఏమాత్రం ఆధారపడని వారిగా చేయగలడు. అల్లాహ్  సర్వోపగతుడు, ఎంతో వివేచనాపరుడు. (సూరా అన్నిసా: 130) అందువలన, పిల్లలు పాత గాయాలను తిరగదోడటం మాని, తండ్రిని చేరి, మళ్లీ సత్సంబంధం కొనసాగించాలి. ఎందుకంటే – కన్నతండ్రితో సంబంధం తెంచడం  మహా  పెద్ద ఆపారాధం. ప్రవక్త (స) అన్నారు: “మీకు ఘోర  పాపాలు ఏవో చెప్పనా? అవి మూడు: అల్లాహ్‌తో షిర్క్ చేయడం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, మరియు అబద్ధ సాక్ష్యం ఇవ్వడం.” (ముత్తఫఖ్ అలైహ్)

అలాగే తండ్రితోగానీ, తల్లితోగానీ ఒకే ఊరులో  ఒకే పట్టణంలో ఉంటూ, సంవత్సరాల తరబడి కలవకపోవడం కూడా ఒక అధర్మ  చర్యగానే పరిగణించబడుతుంది. ప్రవక్త (స) అన్నారు: “మూడు రోజులకు మించి ఎవ్వరికీ తన ముస్లిం సోదరుడిని దూరంగా ఉంచడం ధర్మసమ్మతం  కాదు. వారిలో ఉత్తముడు ముందుగా సలామ్ చెప్పేవాడు.” (ముత్తఫఖ్ అలైహ్)  ఇది సాధారణ ముస్లింకే  వర్తిస్తే, ఇక తండ్రి పట్ల అయితే మరింత గౌరవభావం  అవసరం.

నాల్గవ స్థితి: కొడుకు ధనవంతుడు, కానీ అతని తండ్రి పేదరికంతో బాధపడుతూ అప్పుల భారం క్రింద నలిగిపోతున్నాడు. . అయినప్పటికీ కొడుకు సహాయం చేయడు, అతని అవసరాలను పట్టించుకోడు. ఇది కూడా అల్లాహ్ వద్ద చాలా పెద్ద పాపం.

ఇదే కాకుండా కొంతమంది పిల్లలు ఆరాధన, జ్ఞానసముపార్జనలో నిమగ్నమై, హజ్ ఉమ్రాలు చేస్తూ  తల్లిదండ్రులు సహాయం కోరుతున్నప్పటికీ పట్టించుకోరు. ప్రవక్త (స) ఇలా అన్నారు: “ఒక మనిషి వచ్చి, ‘నేను జిహాద్‌కు వెళ్లాలనుకుంటున్నాను’ అన్నప్పుడు, ప్రవక్త అడిగారు: ‘నీ తల్లిదండ్రులు బతికున్నారా?’ ‘అవును.’ ఆ వ్యక్తి చెప్పగా – ప్రవక్త అన్నారు: ‘అయితే వారికి  సేవ చేయు — అదే నీ జిహాద్.’” (సహీహ్ బుఖారీ)

సుఫ్యాన్ అత్తౌరీ (రహ్మ) అన్నారు: “నా తండ్రి పిలిచినప్పుడు, నేను ఫర్డ్ కాని నమాజ్‌లో ఉన్నా దాన్ని విడిచి ఆయన వద్దకు వెళ్ళేవాణ్ణి.”  తండ్రి పనులు చూసుకోవడం, ఆయన్ను  లోకసంబంధమైన కష్టాల నుండి ఉపశమనం కలిగించడం, ఆయనకు  సౌకర్యంగా జీవించేందుకు సహాయం చేయడం. బిడ్డలుగా మనందరి బాధ్యత. ఇదే విష్యం తల్లి విషయంలో కూడా వర్తిస్తుంది.

ముఆవియా బిన్ కుర్రా (రహ్మ) గారిని అడిగారు: “నీ కొడుకు నీతో ఎలా ఉంటాడు?” అని. దానికాయన – “అతను మంచి కొడుకు-  నా ప్రాపంచిక పనులన్నీ చూసుకుంటాడు, దాంతో నేను పరలోకానికి సిద్ధం కావడానికి సమయం దొరుకుతుంది.”

హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్(రజి) తండ్రి హజ్రత్ జుబైర్(రజి) గొప్ప ధనవంతులు. ఒక ధనవంతుడు మరణించినప్పుడు, అతను విడిచివెళ్ళిన ఆస్తిపాస్తుల పంపకం త్వరగా జరగాలని, అవి త్వరగా తమ అధీనంలోకి వచ్చేయాలని వారసులు భావిస్తారు. కాని హజ్రత్ అబ్దుల్లా(రజి) ఆలోచన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ (రజి), తండ్రి మరణానంతరం ముందుగా ఆయన అప్పులు తీర్చేశారు. తరువాత వారసులందరినీ సమావేశపరిచి, అల్లాహ్ మనందరికీ మన అవసరాలకంటే ఎక్కువే ఇచ్చాడు. మరి మనం ఓ నాలుగేళ్ళ వరకూ ఈ వారసత్వ సంపదను పంచుకోకుండా ఉంటే నష్టమేమిటి? నేను ప్రతి ఏడూ హజ్ సందర్భంలో ఈ విషయం ప్రకటిస్తూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా ‘నీ తండ్రి నాకు బాకీ వున్నారు’ అని ముందుకొస్తే అతని అప్పును తీర్చేసి తరువాతనే మనం పంచుకుందాం అని చెప్పారు. దీనికి వారుసులంతా సమ్మతించారు. హజ్రత్ అబ్దుల్లా(రజి) ప్రతి ఏడూ ప్రకటిస్తూనే ఉన్నారు. నా తండ్రి హజ్రత్ జుబైర్(రజి) ఎవరికైనా బాకీ ఉన్నట్లయితే వారు నా దగ్గర ఆ బాకీని వసూలు చేసుకోవచ్చు అని. నాకు బాకీ ఉందని ఎవరూ ముందుకైతే రాలేదుకానీ, ఈ పేరుతో హజ్రత్ అబ్దుల్లా(రజి) వేలాదిమందికి తన తండ్రిని గుర్తుచేస్తూ, వారితో తండ్రికోసం ప్రార్థనలు (దుఆ) చేయిస్తూ పొయ్యారు. నేటి పరిస్థితి ఎలా ఉందంటే, తండ్రి మరణించి చెల్లి, తల్లి బతికున్నా  వారికి వారసత్వపు హక్కు ఇవ్వడం లేదు. తల్లి మరణం కోసం ఆస్తి పంపకాలను ఆపి ఉంచుతున్నారు. నాటి ఆ ఉత్తమ తరం ఎక్కడ? నేటి ఈ ఉత్తుత్తి తరం ఎక్కడ?

అత్యున్నత విధేయత:

ఒకవేళ తండ్రి తప్పు మార్గంలో ఉంటే, అవిశ్వాసిగానో, నాస్తికునిగానో, పాపిష్టిగానో ఉంటె ఆయన్ను సున్నతు మరియు తౌహీద్‌ మార్గంలోకి ప్రేమతో, మృదువుగా ఆహ్వానించాలీ.ఇబ్రాహీం (అ)   విగ్రహారాధకుడయినా తన తండ్రితో ఎంతో  మృదువుగా, మర్యాదగా  మాట్లాడారు:

“నాన్నా! మీరు వినలేని, చూడలేని వాటిని పూజిస్తున్నారేమిటీ? అవి మీకు ఏవిధం గాను తోడ్పడలేవు కదా? నాన్నా! మీ దగ్గర లేనటువంటి (దివ్య)జ్ఞానం నా దగ్గరుంది. కనుక మీరు నన్ను అనుసరించండి; నేను మీకు రుజుమార్గం చూపుతాను. నాన్నా! మీరు షైతాన్‌ని ఆరాధించకండి. షైతాన్‌ కరుణామయుడ్ని తిరస్కరించిన అహంకారి. నాన్నా! (మీ ధోరణి చూస్తుంటే) మీరు కరుణామయుని శిక్షకు గురయి, ఆ తరువాత షైతాన్‌కు సహచరులయి పోతారేమోనని నాకు భయంగా ఉంది.” (అల్-మర్యం: 41-45)

ప్రతిగా తండ్రి కోపంతో ఊగిపోతూ అనరాని మాటలు అన్నా ఆయన మాత్రం ఎంతో హుందాగా, చాలా మర్యాద పృథివీకంగానే సమాధానమిచ్చారు; దానికి తండ్రి (మండిపడుతూ) “ఇబ్రాహీం! నీవు మన దేవతలకు విముఖుడై పోయావా? నీ ధోరణి మార్చుకోకపోతే నేను నిన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తాను. (వెళ్ళిపో) నానుండి శాశ్వతంగా వేరయిపో” అన్నాడు. “మీకు శాంతి కల్గుగాక! మిమ్మల్ని క్షమించమని నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. ఆయన నాపట్ల అమిత దయగలవాడు. నేను మిమ్మల్ని, దేవుడ్ని కాదని మీరు ప్రార్థి స్తున్న మీ మిధ్యాదైవాల్ని వదిలేసి వెళ్తున్నాను. నేను నా ప్రభువునే ప్రార్థిస్తాను. నా ప్రభువుని ప్రార్థించి నేను వైఫల్యం చెందనని ఆశిస్తున్నాను” అన్నాడు ఇబ్రహీం. (అల్-మర్యమ్: 46-48)  కాబట్టి, ఎవరికైనా ఖుర్ఆన్ మరియు హదీసుకి అనుగుణంగా నడుచుకునే  తల్లిదండ్రులు ఉన్నారంటే – వారు నిండు హృదయంతో  అల్లాహ్‌కు వేనవేల కృతజ్ఞతలు తెలపుకోవాలి.  ఎందుకంటే ఇది అనేకమంది మహామహులు  లభించని మహాద్భుత వరం.

తల్లిదండ్రుల పట్ల విధేయత  ప్రయోజనాలు

అల్లాహ్‌ దాసులారా! ఎవరికైనా గుండె బరువుగా  భారంగా మారిందో, జీవితం ఇరుకుగా, అసౌకర్యంగా అనిపిస్తోందో, భూమి ఏంటో విశాలమైనదయినా  తనకు తలా దాచుకునేందుకు చోటు లేదా  అనిపించే  వారందరికీ చెప్పండి! మీరు దువా స్వీకరించబడే వ్యక్తిగా దీవించబడాలనుకుంటున్నారా?  అల్లాహ్‌ మీ బాధలు, దుఃఖాలు తొలగించి, కష్ట ఘడియలు, క్లిష్ట ఘట్టాల   నుండి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నారా? మీరు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సంతోషకరమైన, సౌభాగ్యవంతమయిన  జీవితం కోరుకుంటున్నారా? మీరు సమస్యల సుడిగుండాలల్లో ఇరుక్కొని సతమతమయిన  ప్రతీ సమయంలోనూ  సరైన మార్గదర్శనాన్ని పొంది,  అల్లాహ్‌ మిమ్మల్ని సకల కష్టాల కడగండ్ల నుండి  కాపాడాలకుంటున్నారా? అయితే, తల్లిదండ్రుల పట్ల విధేయత చూపండి, కానీ ఆ విధేయత  నిర్మలమైన హృదయంతో, అల్లాహ్‌ మెప్పు కోసం మాత్రమే అయి ఉండాలి.

కష్టకాలంలో  రక్షక నౌక

ముగ్గురు వ్యక్తులు గుహలో చిక్కుకున్న గాథ మనందరికీ తెలిసిందే. ఒక పెద్ద రాయి గుహ ద్వారాన్ని  మూసేసింది. వారు అల్లాహ్‌ ను  తమ మంచి పనుల ద్వారా వేడుకున్నారు. అందులో ఒకరు ఇలా ప్రార్థించాడు; “ఓ అల్లాహ్‌! నాకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. నేను వారికన్నా ముందు నా ఆలుబిడ్డలెవరికీ పాలు ఇవ్వను. ఒకరోజు ఆలస్యమైంది, వారు నిద్రపోయారు. నేను పాలు చేతిలో పట్టుకొని వారి తలా దగ్గరే నిలబడ్డాను. వారిని లేపలేదు. ఉదయం వరకు ఎదురుచూశాను. వారు స్వతహాగా  లేచి తాగిన తర్వాత నా పిల్లలకు ఇచ్చాను, పాపం పిల్లలు నా కాళ్ళ దగ్గరే పడి  నిద్రపోయారు.  ఓ అల్లాహ్‌, నేను ఇది నీ ప్రసన్నత  కోసం మాత్రమే చేసి ఉంటె  మా మీదున్న ఈ కష్టాన్ని తొలగించు.” దాంతో ఆ  రాయి కొంత కదిలింది. ఆనక మిగతా  ఇద్దరూ తమ మంచి పనులను చెప్పి దువా చేశారు.  చివరకు రాయి పూర్తిగా తొలగిపోయింది, వారు బయటకు వచ్చారు.  (సహీహ్‌ బుఖారీ, ముస్లిం).

అమ్మానాన్నల ప్రసన్నతలో అల్లాహ్ ప్రసన్నత

ప్రవక్త ముహమ్మద్ఇ (స) ఇలా అన్నారు: “అల్లాహ్‌ ప్రసన్నత తల్లిదండ్రుల సంతోషంలోనే  ఉంది; అల్లాహ్‌ ఆగ్రహం తల్లిదండ్రుల ఆగ్రహంలో ఉంది.” (సహీహ్‌ హదీస్ – ఇబ్ను హిబ్బాన్)

ఘోర  పాపాల ప్రాయశ్చిత్తం

ఇమామ్ అహ్మద్ (రహ్) ఇలా అన్నారు: “తల్లిదండ్రుల పట్ల విధేయత పెద్ద పాపాలకు కఫారా (ప్రాయశ్చిత్తం)గా పని చేస్తుంది.”

ఇబ్ను హిబ్బాన్, హాకిమ్ ద్వారా ఉల్లేఖించబడిన  హదీస్‌లో ఉంది: ఒక మనిషి ప్రవక్త (స) వద్దకు వచ్చి ఇలా  అన్నాడు: “నేను ఒక పెద్ద పాపం చేశాను. నాకు తౌబా చేసుకునే అవకాశం ఉందా?” అని. దానికి ప్రవక్త (స) -“నీ తల్లిదండ్రులు బతికి  ఉన్నారా?” అని ప్రశ్నించారు. అతను చెప్పాడు: “లేరు.”. ప్రవక్త (స) – సరే,: “పిన్ని సజీవముగా  ఉన్నారా?” అని అడిగారు. అతను : “అవును.” అన్నాడు. ప్రవక్త (స) అన్నారు: “అయితే ఆమెకు విధేయత చూపు. ఆమె సేవలో తరించు ”

విధేయతకు ప్రతిఫలం విధేయతే.

ప్రవక్త ఇబ్రాహీం (అ)  తన తండ్రి యెడల  కరుణ, సహనంతో ప్రవర్తించారు. దాని ఫలితంగా ఆయనకు తల్లిదండ్రుల పట్ల విధేయుడైన కుమారుడు ఇస్మాయీల్ (అ) లభించారు.  ఆ బాలుడు అతనితో పాటు పరుగెత్తే వయస్సుకు చేరుకున్న తరువాత (ఓరోజు) ఇబ్రాహీం అతనితో “బాబూ! నేను నిన్ను బలి ఇస్తున్నట్లు కలగన్నాను. దీనిపై నీ అభిప్రాయం ఏమిటో చెప్పు” అన్నాడు. దానికి ఆ బాలుడు (ఏమాత్రం కంగారుపడ కుండా) “నాన్నా! మీకు దేన్ని గురించి ఆజ్ఞ ఇవ్వబడిందో దాన్ని నెరవేర్చండి. దైవచిత్త మయితే మీరు నన్ను సహనశీలిగా చూస్తారు” అని అన్నాడు. (సూరా అస్సాఫ్ఫాత్: 102)

సత్కార్యానికి ప్రతిఫలం సత్కార్యం తప్ప మరేమవుతుంది? కనుక మీ ప్రభువు సద్గుణ సంపత్తిని మీరేవిధంగా త్రోసిపుచ్చగలరు?  (సూరా అర్‌ రహ్మాన్: 60-61)

తల్లిదండ్రులు  బతికి ఉన్నప్పుడు వారి సేవ చేసుకోలేకపోయినవారి  కోసం వారి మరణానంతరం  కూడా వారి పేరా సత్కార్యాలు చేసుకొని పునీతులయ్యే అవకాశాన్ని కరుణామయుడయినా అల్లాహ్ ప్రసాదించాడు.

తల్లిదండ్రుల అప్పులు తీర్చడం

తండ్రి ఎవరికైనా అప్పు ఉన్నట్లయితే, కుమారుడు సాధ్యమైనంతవరకు ఆ అప్పును తీర్చాలి.

ఇది మరణానంతరం కూడా తండ్రికి చేయగల గొప్ప విధేయత. బుద్ధిమంతుడైన కుమారుడు తన తండ్రి ఆత్మ అప్పు కారణంగా బాధపడుతుండగా, తాను సుఖంగా ఉండడాన్ని ఎప్పటికీ అంగీకరించడు.

తల్లిదండ్రుల  బంధుమిత్రులను గౌరవించడం

అబ్దుల్లాహ్ ఇబ్ను ఉమర్ (ర.అ) ఉల్లేఖనం: ఒకసారి ఆయనకు మక్కా దారిలో ఒక పల్లెటూరి  వ్యక్తి ఎదురయ్యాడు. ఇబ్ను ఉమర్ అతనికి శుభాకాంక్షలు తెలిపి, తన గాడిదపై ఎక్కించి, తన తలపై ఉన్న పాగాను కూడా అతనికి ఇచ్చారు. అది  చూసిన  అబ్దుల్లాహ్ ఇబ్ను దీనార్ అన్నారు; “అల్లాహ్‌ మీకు మంచిచేయుగాక! వీరు సాధారణ ప్రజలు, చిన్న బహుమతితో సంతోషిస్తారు కదా! ఆ మాత్రానికే మీరు మీ తలపాగాను తీసి ఇవ్వాలా?.” ఇబ్ను ఉమర్ (ర.అ) అన్నారు:  “ఈ మనిషి తండ్రి, ఉమర్ ఇబ్ను అల్‌ఖత్తాబ్‌ (ర.అ) స్నేహితుడు. ప్రవక్త (స)  ఇలా అన్నారు: తండ్రి స్నేహితులను గౌరవించడం — తల్లిదండ్రుల పట్ల అత్యున్నత విధేయతల్లో ఒకటి.  (ముస్లిం) 

తల్లదండ్రుల  పేరు మీద దానధర్మాలు చేయడం

సంతానంలో ఎవరికయితే అల్లాహ్ సంపన్నుల్ని చేశాడో, వారు తమ తల్లిదండ్రుల పేరు  మీద  ఆగకుండా సాగే దానధర్మాలు చేయాలి. బాగా ఉన్నవారు కోటో, లక్షో చేస్తే, లేనివారు వెయ్యో, వందో, పదో తప్పక దానం చేయాలి. ఉదాహరణకు మస్జిద్‌ నిర్మాణం, బావి త్రవ్వడం, పాఠశాల నిర్మాణంలో పీపాలు పంచుకోవడం  మొదలైనవి.

ఇబ్ను అబ్బాస్ (ర.అ)  ఉల్లేఖనం: సఆడ్  ఇబ్ను ఉబాదా (ర.అ) తల్లి మరణించగా, ఆయన ప్రవక్త (స)  వద్దకు వచ్చి అడిగారు “ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నా తల్లి మరణించింది, నేను ఆ సమయంలో ఆమె వద్ద లేను. నేను ఆమె తరపున దానం చేస్తే ఆమెకు లాభం ఉంటుందా?” అని.దానికి ప్రవక్త ﷺ అన్నారు: “అవును – ఉంటుంది”. అది విన్న ఆయన  “అయితే, నా తోట (అల్‌ మిఖ్రాఫ్‌)ను ఆమె తరపున దానంగా అల్లాహ్ మార్గ్మలో  అర్పిస్తున్నాను.” అని ఆనందంగా తెలియజేశారు.  (సహీహ్‌ బుఖారీ)

తల్లిదండ్రుల కోసం ప్రార్థన, ఇస్తిగ్ఫార్, క్షమాపణ కోరడం  

ఖుర్ఆన్ లో ప్రవక్త ఇబ్రాహీమ్ ఇలా వేడుకున్నారు: నా తల్లిదండ్రుల్ని, యావత్తు విశ్వాసుల్ని కర్మవిచారణ రోజు క్షమించు.” (ఇబ్రాహీం-41)

దైవ ప్రవక్త (స)  అన్నారు: “మనిషి మరణించిన తర్వాత అతని క్రియలు ముగుస్తాయి, కానీ మూడు విషయాలు మాత్రం కొనసాగుతాయి: ① సదఖా జారియా (నిరంతర దానం), ② ప్రజలకు ఉపయోగకరమైన జ్ఞానం,  ③ అతని కోసం ప్రార్థించే సజ్జన  సంతానం.” (ముస్లిం)

మరొక హదీస్‌లో దైవ ప్రవక్త (స)  అన్నారు:  ఒక మనిషి స్వర్గంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. అతను అడుగుతాడు: ‘ఇది ఎలా వచ్చింది?’ ప్పుడు చెప్పబడుతుంది: ‘నీ కుమారుడు నీ కోసం ఇస్టిగ్ఫార్ – క్షమాపణ కోరడం మూలంగా ఇది నీకు ప్రాప్తినిచ్చింది’” అని.  (ఇబ్ను మాజా)

ఆమిర్‌ ఇబ్ను అబ్దుల్లాహ్‌ ఇబ్ను జుబైర్‌ అన్నారు:  “నా తండ్రి మరణించిన తర్వాత నేను ఏడాది పాటు ప్రతి రోజూ అల్లాహ్‌ తో  ఆయన క్షమాపణ కోసం ప్రార్థించేవాడిని”.

తల్లిదండ్రుల మధ్య వివాదం ఉంటే ఏం చేయాలి?

తల్లి తన పిల్లలకు “నీ తండ్రితో సంబంధం పెట్టుకోకు” అని చెబితే, లేదా తండ్రి తన సంతానాన్ని మీతల్లితో ఇలాంటి  సంబంధం పెట్టుకోకంది అని చెబితే ఇద్దరూ చేస్తున్నది తప్పే. ఇదిధర్మానికి  విరుద్ధమైనది, దయరహితమైనది, పిల్లల మనశ్శాంతి, సంతోషాన్ని నాశనం చేసే దుష్ట చర్య, దుర్మార్గపు చేష్ట. ఇలాంటి పాపం విషయాలలో పిల్లలు తల్లినిగానీ, తండ్రినిగానీ  అనుసరించరాదు, ఎందుకంటే, పాపం విషయంలో  విధేయత  ఉండదు, విధేయత  కేవలం అల్లాహ్‌ ఆజ్ఞల విషయంలో, మంచి విషయాలలో మాత్రమే  ఉంటుంది.

ఒక వ్యక్తి ఇమామ్ మాలిక్‌ (రహ్)ను అడిగాడు:  “నా తండ్రి సూడాన్‌లో ఉన్నాడు, నన్ను తన వద్దకు రమ్మని పిలిచాడు. కానీ నా తల్లి అడ్డుకుంటోంది, నేను ఏం చేయాలి?”ఇమామ్  మాలిక్‌ (రహ్మ) అన్నారు: “నీ తండ్రికి విధేయత చూపు, కానీ నీ తల్లికి అవిధేయత చూపకు.” అంటే ఆమె నుండి ఈ విషయం దాచి ఉంచు అని.  ఇలాంటి సందర్భాల్లో పిల్లలు జాగ్రత్తగా వ్యవహరించాలి. నొప్పించక, తా నొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు అన్నట్టు – గుట్టుచప్పుడు కాకుండా – తల్లిదండ్రులలో ఏ ఒక్కరికి  నొప్పి కలగకుండా, రహస్యంగా దయా సంబంధం కొనసాగించాలి.

ఒక వ్యక్తి ఇలా  అడిగాడు:  “నా తండ్రి నన్ను నా మావయ్యలను (తల్లి వైపు బంధువులను) చూడనీయడంలేదు.”

సమాధానం: “వారిని రహస్యంగా సందర్శించు, వారిపై ప్రేమ చూపు. కేవలం  అల్లాహ్‌ ప్రసన్నత  కోసం మాత్రమే ఇలా చెయ్యాలి.నీ తండ్రికి విరుద్ధంగా ప్రవర్తించావన్నట్లుగా వ్యహరించవద్దు. ఇలా గనక  చేస్తే, నీవు తల్లి, తండ్రి ఇద్దరికీ విధేయుడవుతావు, వారిలో ఎవరికీ నొప్పి కలిగించకుండా.”

చిరు హెచ్చరిక:

ఏ పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులతో సంబంధం తెంచకూడదు. ఎప్పుడూ అల్లాహ్‌ సంతోషం ముందు ఉంచాలి. ఎందుకంటే తల్లిదండ్రులలో ఎవరి పట్ల అయినా అన్యాయం, తీర్పు దినాన నిన్ను కాపాడదు.  (పాప)భారం మోసేవారెవరూ ఇతరుల (పాప)భారం మోయలేరు. (పాప)భారం క్రింద అణగిపోయినవాడు తన భారం తొలగించుకోవడానికి ఎవరినైనా పిలిస్తే, అతని భారంలోని అణుమాత్రం బరువుకూడా మోయడానికి ఎవరూ ముందుకు రారు. చివరికి అతి సన్నిహితులైన అతని బంధువులు సైతం ముందుకు రారు.(ఫాతిర్: 18)

దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: బంధువులతో   సంబంధ బాంధవ్యాలు   తెంచుకున్నవాడు స్వర్గంలో ప్రవేశించడు.” (బుఖారీ, ముస్లిం)

అలీ ఇబ్ను అబీ తాలిబ్‌ (ర.అ) అన్నారు: సూరా లుక్మాన్ చదివిన తరువాత కూడా తల్లిదండ్రులకు అవిధేయత చూపే మనిషిపై నాకు ఆశ్చర్యం కలుగుతుంది!  ఎందుకంటే అల్లాహ్‌ తన ఆజ్ఞతోపాటు తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా ప్రస్తావించాడు.”

ఒక్క విషయం  మాత్రం గుర్తు పెట్టుకోండి!  ఐహిక జీవిత బహు స్వల్పం. అన్యాయం చేసినవారిపై కాలం తిరిగి  కక్ష తీర్చుకుంటుందని మరువకండి. ఎవరు తమ తల్లిదండ్రులను బాధపెట్టారో, వారు ఇహంలోనూ, పరలోకంలోనూ ఘోరంగా నష్టపోతారు. మానవ చరిత్రను భాష ప్రాంతాలకు అతీతమగా గమనిస్తే, ఎందరో తల్లిదండ్రుల్ని  ఇంటి నుండి గెంటేసిన  పిల్లలు చివరికి కుక్క చావు చావడం మనకు కనబడుతుంది. తల్లిదండ్రుల  శాపం వారి ఇహలోకాన్ని, పరలోకాన్ని నాశనం చేసింది. కాబట్టి, అమ్మానాన్నల  పట్ల విధేయత, మర్యాద, ప్రేమ, ,దయతో – వారి సేవలో తరిస్తేనే  స్వర్గాన్నీ పొందగలం. అన్యదా నరకమే మహా చెడ్డ నివాస స్థలం.

చివరి మాట

సృష్టి కార్యంలో విజేయులై  – లోకానికి ప్రేగు బంధాన్ని పరిచయం చేయడం మాత్రమే కాక మనిషిగా మన ఉనికిని చాటడంలో కారణ భూతులైన అమూల్య వరాలు అమ్మానాన్నలు. సంసార సాగరంలో  సంభవించే లెక్కకు మిక్కిలి ఆటుపోట్లకు ఎదురీది సంతానపు నావను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో నిరంతర శ్రామికులు అమ్మానాన్నలు. కష్టాల కొలిమిలో  కాలిపోతున్నా లెక్కచేయక జన్మనిచ్చిన సంతుకు  సుఖ సంపద సమకూర్చే త్యాగజీవులు అమ్మానాన్నలు. ఇంటి కోడల్లే కంకి కొడవళ్ళయి, అడ్డుగోడలై వేరు కుంపటికి సిద్ధమైనా బదులు చెప్పని బాధాతప్త హృదయాలు అమ్మానాన్నలు. రెక్కలొచ్చిన పక్షులు సుదూరాలకు తరలిపోతూ ఒంటరితనపు కానుకనిచ్చినా సర్దుబాటుతో స్వీకరించే శ్రేయోభి లాషులు అమ్మానాన్నలు. జీవన పయనంలో చివరి మజిలీలో ఇద్దరుగా మిగిలి.. కేవలం ఇద్దరుగా మిగిలి  ఊపిరికి వీడ్కోలుకై ఎదురు చూసే వృద్ధ పక్షులు అమ్మానాన్నలు. కాబట్టి – వృద్ధాప్యంలో తల్లిదండ్రులు సేవచేసే అదృష్టం గనక వరిస్తే దాన్ని స్వర్గాన్ని సాధించే ఒక అమూల్య అవకాశంగా భావించి, హృదయ పూర్వకంగా, స్వర్గం పొందే ఆ  సువర్ణావకాశం  ఎక్కడ చేజారిపోతుందో అన్నంత అపురూపంగా తల్లిదండ్రుల సేవలో తరించాలి మనం.

పిల్లలు స్వతంత్రంగా ఎదిగిన తర్వాత, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. తల్లి తండ్రి మనల్ని ఎంత అల్లారుముద్దుగా పెంచారో, అచ్చం అలాగే అంత ప్రేమగా, ఆత్మీయంగా చూసుకోవాలి. వయసు పైబడి, తమ పనులు తాము చేసుకోలేకపోతే, పిల్లలు తప్పకుండా ఆ పనులు చేయాలి.. అది కూడా విసుక్కోకుండా, అసహనం లేకుండా, ఈసడించుకోకుండా ప్రేమగా చేయాలి. మన చిన్నతనం నుండి పెద్దయ్యే వరకి ఎంత ప్రేమగా, ఆప్యాయతగా పెంచారో అదే ప్రేమ వారి వయసు మల్లుతున్న సమయంలోనూ మరియు ముఖ్యంగా వృద్దాప్యంలో వారికి తోడుండాలి, వారికి సమయం ఇవ్వాలి, ప్రేమగా మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి!

Related Post