నీకు, నీకుపూర్వం గ్రంథం ఇవ్వబడిన వారికి కూడా మేము అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండాలనే ఆదేశించాం. (అన్-నిసా: 131)
మామూలుగా బతకడం అంటే, తిన్నామా? పడుకున్నామా! – తెల్లారిందా? అంటూ కాలక్షేపం చేయడం. ఏ లక్ష్యం, ఆశయం. ప్రణాళిక, ప్రయత్నం, కృషి లేకుండా కాలం గడుపుతున్నామంటే కేవలం తినడానికే బతుకుతున్నామా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. మనిషి ఇలా నిరర్థకంగా, నిరుపయోగంగా బతుకు వెళ్లదీసుకోవడం కాదు, సంపూర్ణం గా జీవించాలి. జీవితానికో అర్థం, పరమార్థం ఉండాలి. మనిషికి మనసుంటుంది. దానికి కోరిక లుంటాయి. ఆ కోరికలకు ధర్మం స్నేహితుడి వంటిది. హితబోధలో గురువు లాంటిది రణరంగాన సైనికుడికి సమమైనది. ధనార్జనలో మంత్రి మాదిరిది. ఇలా గ్రహించినప్పుడు మనసు పెడదారి పట్టదు. వ్యసనాలకు బానిస కాదు. మానవ జీవితం ఓ ఆరాధన, పవిత్ర తపన. అంత పవిత్రంగా దాన్ని గౌరవించుకోవాలి. ఒకవేళ మానవ దౌర్బల్యాల, బలహీనతల మూలంగా తప్పులు దొర్లితే సవరించుకుంటూ, పాపపు అడుసు తొక్కితే, తొక్కిన అడుగును కడుక్కోవాలి.నిత్యం తనను తాను నవనవోన్మేషంగా తీర్చిదిద్దుకొంటూ సాగడమే జీవితాన్ని సార్ధకం చేస్తుంది.
విశ్వసించేవారికి ధరణిపై అనేక నిదర్శనాలున్నాయి. (అజ్-జారియాత్: 20)
కనులుండి కానగలగాలేగానీ, వీనులుండి వినగలగాలేగానీ, హృదయం ఉంది అర్థం చేసుకోవాలేగానీ ఈ విశ్వబ్రహ్మాండంలో అడుగడుగునా అల్లాహ్ నిదర్శనాల మాహాద్భుత దృశ్యాలే దర్శనమిస్తాయి. అంతెందుకు –
స్వయంగా మీ (అస్తిత్వం)లో కూడా అనేక నిదర్శనాలు ఉన్నాయి. మీరీ విషయాన్ని గురించి యోచించరా?
(అజ్-జారియాత్: 21)
ఆ మహాద్భుత నిదర్శనాల్లో నవరంధ్రాల పాత్ర ఏ పాటిదో మనందరికీ తెలిసిందే! అలాహ్ మనకు ప్రసాదించిన వరానుగ్రహాలన్నింటికి మనం నిండు హృదయంతో, కృతజ్ఞత నిండిన మనస్సుతో చేసే ఆరాధనా భంగిమల్లో సజ్దా అల్లాహ్ కు మిక్కిలి ఇష్టమయినది. అట్టి మహోన్నత సజ్దాలో చేసే దుఆలలో ఒక దుఆ ఏమిటో తెలుసా?
నా ముఖం తనను సృష్టించిన, తనను తీర్చిదిద్దిన, తన చెవులనూ, కళ్లనూ తెరిచిన, చీల్చిన వాని ముందు మోకరిల్లింది. అత్యుత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ ఎంతో శుభకరుడు. ఘనాఘనుడు.
“అల్లాహ్ యెడల నిజమైన సిగ్గు కలిగి జీవించండి. ఎవరైతే అల్లాహ్ యెడల నిజంగా సిగ్గు కలిగి నడుచు కుంటారో వారు తమ తలతో పాటు దానిలో ఉన్న సకల విషయాలను – మెదడు, ఆలోచనలు, జ్ఞానం,చెవులు, కళ్ళు, ముక్కు, నోరు అన్నింటిని కాపాడాలి. తమ పొట్టను మరియు దానితో ముడిపడిన సకల విషయాలను – మర్మ స్థానాలు, కడుపులో చేరే చేరే ఆహారం, – అన్నింటిని కాపాడుకోవాలి. మరణాన్ని మరవకూడదు, శరీరం పాడవడాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. .పరలోకం కోసం పాటు పడుతూ, ఈ లోకపు వ్యర్థ అలంకారాలు, పరుల మెప్పు కోసం చేసే ఆడంబరాలను విడిచిపెట్టాలి. ఇలాచేసిన వాడే నిజంగా అల్లాహ్ యెడల నిజమైన సిగ్గు కలిగి జీవించినవాడవుతాడు.” అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ (స). (సహీహుల్ జామే)
మానవుని శరీరములోని బాహ్య రంధ్రాలు తొమ్మిది. వీటిని నవరంధ్రాలు అంటారు. రెండు కళ్ళు, చెవులు రెండు, ముక్కు రంధ్రాలు రెండు, నోరు ఒకటి. పాయువు (గుదము) ఒకటి. మూత్రవిసర్జన రంధ్రము ఒకటి. ఈ నవ రంథ్రాల్లో ఏ ఒక్క రంధ్రం ఇటు అటూ అయినా ఇక మనిషి బతుకు అతలాకుతలమే. కాబట్టి నవ రంథ్రాలను ఆరోగ్యం రీత్యా కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక రీత్యానూ రక్షించుకోవాలి. చెడు అనకూడదు, చెడు కనకూడదు, చెడు వినకూడదు. చెడు చేయకూడదు, చెడు బాటన నడవకూడదు. చెడ్డదయినది, అడ్డదిడ్డమయినది ఏదీ తినకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అన్నీ మూసుకొని కాదు గాని, మన నవరంథ్రాలను అదుపులో పెట్టుకుంటే నాకలోకం (స్వర్గం) మన సొంతమవుతుంది. ఇది నేనంటున్న మాట కాదు. అక్షరాలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) సెలవిచ్చిన ముత్యాల మూట.
“ఎవడు తన రెండు దవడల మధ్య ఉన్నదాన్ని (అంటే నాలుకను), మరియు తన రెండు కాళ్ల మధ్య ఉన్నదాన్ని (మర్మావయవాలను) కాపాడుకుంటానని మాటిస్తాడో – నేను అతనికి స్వర్గపు హామీ ఇస్తున్నాను.
కాదు కూడదు అంటే మాత్రం గూబ గుయ్యిమనిపించే నరకమే మన నివాస స్థలమవుతుంది జాగ్రత్త! తోలు తిత్తియిది – తూట్లు తొమ్మిది – తుస్సుమనుట ఖాయం అన్నారు వెనకటికి పెద్దలు. మనం మన నవ రంథ్రాలను, నవ నాడులను ప్రపంచంలో పాపానికి, అనారోగ్యానికి గురి కాకుండా, రేపు పరలోకంలో నరకాగ్ని పాలు కాకుండా కాపాడుకోవాలి. నవ అనగానే నవనవలాడే యవ్వనం గుర్తుకు రావడం సహజమే. అలాగే నవ నాడులు, నవ గ్రహాలూ, నవరసాలు తట్టడం కూడా అంతే సహజం. నవనవలాడే యవ్వనమయినా, నవ నాడులయినా, నవరసాలయినా ధర్మానికి లోబడి ఉంటేనే శ్రేయం, క్షేమం.
అలా అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత వారి కళ్ళు, చెవులు, చర్మాలు వారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమేమి చేసేవారో సాక్ష్యమిస్తాయి. ( అప్పుడు వారు తమ చర్మాలను ఉద్దేశించి “మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిస్తున్నారు?” అని అడుగుతారు. దానికవి ఇలా సమాధానమిస్తాయి: “ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తినిచ్చిన దేవుడే మాకూ మాట్లాడే శక్తినిచ్చాడు. ఆయనే మిమ్మల్ని మొదటిసారి పుట్టించాడు. ఇప్పుడు ఆయన దగ్గరికే మీరు తీసుకురాబడ్డారు. మీరు రహస్యంగా నేరాలు చేస్తున్నప్పుడు, ఎప్పుడో ఓసారి మీ కళ్ళు, చెవులు, చర్మాలు కూడా మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచనే మీకు కలగలేదు. పైపెచ్చు మీరు చేసే దుష్కార్యాలు అనేకం దేవునికి కూడా తెలియదని మీరు భావిస్తుండేవారు. దేవుడ్ని గురించి మీలో ఏర్పడిన ఈ దుష్టభావనే మిమ్మల్ని (నట్టేట) ముంచింది. అందుకే మీరిప్పుడు నష్టపోయారు.” (హామీమ్ 20-23) మానవుడికన్నా సున్నితమయిన జీవిని అల్లాహ్ సృష్టించలేదు. కాని మానవుడు తనకన్నా మందబుద్ధిగల జీవి ఈ సృష్టిలోనే లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడు.
మంచి తలంపులతో మంచికి తలుపులు అవుదాం రండి!
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు: “కొంతమంది మనుషులు మంచి పనులకు తాళం చెవులు, చెడుకి తాళం వేసేవారు. అలాగే కొంతమంది చెడుకి తాళం చెవులు, మంచికి తాళం వేసేవారు. కాబట్టి ఎవరి చేతులలో అల్లాహ్ మంచి పనుల తాళం చెవులు ఉంచుతాడో వారు ధన్యులు. ఎవరి చేతులలో అల్లాహ్ చెడుకి తాళం చెవులు ఉంచుతాడో వారు శాపగ్రస్తులు.” (ఇబ్ను మాజహ్) మనమూ మంచి పనులకు తాళం చెవులుగా, చెడు పనులకు తాళం వేసేవారిగా మారాలని కోరుకుంటే – చేయాల్సింది: నవ రత్నాల్లాంటి ఈ నీతులు పాటించడమే!
1) నిష్కపటత, సంకల్పశుద్ధి (ఇఖ్లాస్): మన మాటల్లోనూ, చేతల్లోనూ సంకల్పశుద్ధి నిండి ఉండేలా చూసుకోవాలి. ఆత్మశుద్ధితోపాటు కర్మశుద్ధి, వాక్శుద్ధి చాల ముఖ్యం. మనం ఏ పని చేసినా అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ చేయాలి. ప్రదర్శనాబుద్ధికి ఏ కాసింత అవకాశమివ్వకూడదు. తౌహీద్ కు పెద్ద పీత వెయ్యాలి. షిర్క్ ను అన్ని విధాలా విడనాడాలి. ఒక్క అల్లాహ్ ను మనం పొందగలిగితే ఇక దేన్నీ కోల్పొయినా బాధ ఉండదు. లోకం, లోకాల్లోని సంపద సాంతం మన సొంతం అయినా అల్లాహ్ మెప్పు లేకుంటే దానికంటే భయంకర ముప్పు మరొకటి లేదు. ఉండబోదు.
2) దువా చేయడం: అల్లాహ్ సహాయం కోసం కందక ప్రజల గాథలోని పట్టు వదలని బాలుడిలా ప్రార్థించాలి. ఎందుకంటే దువా ప్రతి మంచి పనికి తాళం చెవి. దుఆ ప్రతి కీడు నిండి కాపాడే రక్షక కవచం. దుఆ విశ్వాసిని షైతాన్ ఎత్తుగడల నుండి, ప్రేమరణాల నుండి, ప్రలోభాల నుండి, సకల విధమయినాటి వశీకరణ విష వలయాల నుండి కాపాడే వజ్రాయుధం.
3) ప్రయోజనకరమైన జ్ఞాన సముపార్జన: ఎందుకంటే జ్ఞానం సద్గుణాలవైపు నడిపిస్తుంది, చెడుకు అడ్డుగోడ వలె అడ్డంగా నిలబడిపోతుంది. జ్ఞానం మనసులు ప్రోగు చేసుకోవాల్సిన సంపదల్లో ఉత్తమ సంపద. హృదయాలు అనునియం పరితపించాల్సిన గొప్ప కర్తవ్యం, మనో చీకట్లను, మనసులోని తమస్సును తొలగించే ఉషస్సు, గొప్ప తపస్సు. ఇది ప్రతి ఒక్కరి ధార్మిక అవసరం, జీవనావశ్యకత కూడా. జ్ఞానంతో మనిషి మనోధర్మం సరిదిద్దబడుతుంది, జ్ఞానంతోనే ప్రజలు తమ ప్రభువును తెలుసుకుంటారు. అలాగే ప్రాపంచిక విద్య, విజ్ఞానం ద్వారా కూడా ముస్లింలు లాభపడతారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, నిర్మాణాలు, ఉట్పట్టి, ప్రతి ఉత్పత్తి – అన్నీ జ్ఞానం ద్వారానే సాధ్యం. జ్ఞానంతోనే జాతులు ఎదుగుతాయి, దేశాలు గొప్ప కీర్తిని, గౌరవాన్ని పొందుతాయి.
అత్యున్నత జ్ఞానం ఖుర్ఆన్ మరియు సున్నత్ విద్య. ఇది ప్రవక్తల వారసత్వం. అందుకే మనంధర్మ జ్ఞానం కోసం శ్రద్ధ వహించాలి. మన దేశంలో ధార్మిక విద్యాసంస్థలు, ఖుర్ఆన్ మదర్సాలు విస్తరించాయి. అల్లాహ్ కృపతో వాటిలో ప్రవేశం అందుబాటులో ఉంది.
4) ఆరాధనలో శ్రద్ధ: ముఖ్యంగా ఫరాయిజ్ విషయంలో, మరీ చెప్పాలంటే ప్రత్యేకంగా నమాజ్న విషయంలో శ్రద్ధాసక్తులు ఏంటో అవసరం. శ్రద్ధ లేని నమాజు ఓ అలాటి ముతక బట్టలో చుట్టి అదే నామాజీ ముఖాన విసిరి కొట్టడం జరుగుతుండనై స్వయంగా ప్రవక్త (స) హెచ్చరించడమే కాక, అట్టి శార్ధ రహిత ప్రార్థనకు అతని తలపైకి కూడా వెళ్లగలిగేంతటి శక్తి కూడా ఉండదని సృషట పర్చారు. ఇక తలపైకే వెళ్లలేని ఆ ప్రార్థన కోసం ఆకాశ తలుపులు ఎలా తెరుచుకుంటాయి ఒక్కసారి ఆలోచించండి! సకల మేళ్లు ఒక్క నమాజులోనే ఉన్నాయి అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. సకల చెడుల నుడి నమాజు మనిషిని ఆపుతుంది అంటే అతిశయం ఎంతమాత్రం కాదు. స్వయనాగా ప్రవక్త (స) సెలవిచ్చిన మాట – నమాజు లేని సముదాయంలో అసలు శుభమే లేదు, ఉండబోదు.
మన ప్రధమ కర్తవ్యమయిన నమాజును సమయానికి చేయడం అంటే అల్లాహ్ ఆదేశానికి అనుగుణంగా జీవించడమే. నమాజు వాళ్ళ మనకు సత్సంగం లభిస్తే, సత్సంగం మనకు సమయాన్ని విలువైనదిగా చూసే దృష్టినిస్తుంది. కాలం పరిణామశీలం. అది మనకు అల్లాహ్ ఇచ్చిన గొప్ప అవకాశం. మన జీవితాన్ని నిర్మించగల శక్తి ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణానికీ ఉంది. కానీ స్వార్ధానికి, ఇహలోకపు ఆకర్షణలూ ఆడంబరాలకు బానిసలమై అల్లాహ్ ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ప్రతి వ్యక్తీ పడుకునే ముందు ఇవాళ నేను ఆ పరమోన్నత ప్రభువు అయిన అల్లాహ్ కు చేరువయ్యే పని ఏదన్నా చేశానా? లేదా? అని ప్రశ్నించుకోవడం అలవరచుకుంటే, అలవాటు చేసుకుంటే మన లభించిన జీవిత సమయం సద్వినియోగం అయి తీరుతుంది.
5) మంచి నడవడిని అలవరచుకోవడం: ఉన్నత నైతిక ప్రామాణాలతో జీవించాలి. అంటే, మంచిని పంచాలి,. పెంచాలి, సర్వవ్యాప్తం చెయ్యాలి. దిగువ స్థాయి, అధమ స్థాయి ప్రవర్తనను విడిచి పెట్టాలి, దుష్ప్రవర్తనను పరిత్యజించాలి. అంటే, చెడును తుంచాలి, తెంచాలి. నియంత్రించాలి, నిర్మూలించాలి. ప్రవక్త (స) వారి ప్రభావనానికి మూల కారణం తౌహీద్ ప్రబోధన అయితే, మౌలిక ధ్యేయం ఉన్నత నైతిక ప్రమాణాల పరిపూర్తి.
6) సద్గుణవంతుల సావాసం: మంచివారి స్నేహం కలిగి ఉండాలి. గుణవంతులతో సమయం గడపాలి. వారి సభలలో, సమావేశాలలో, సత్య సదనాలలో అల్లాహ్ కారుణ్యం మలయ పవనమయి వీస్తూ, వారి మనోసీమల్ని అల్లాహ్ నామ స్మరణతో పావనం, పునీతం చేస్తూ ఉంటుంది. గుణహీనుల, సదాచారశూన్యుల సావాసం నుండి, సభలు సమావేశాల నుండి దూరంగా ఉండాలి. “కూసే గాడిద వచ్చి (కాలక్రమాన మోసే కాస్తా మేసేగా మారిపోయింది) మేసే గాడిదను చెడగొట్టింది” అన్నట్టు పనికిమాలిన, అనవసరమైన విషయాలు చేసే వ్యక్తి, పని చేసే మంచి వ్యక్తిని కూడా పనికిరాకుండా చెడగొడతాడు. పగ బడతాడు, మంచి వారితో విడగొడతాడు, చివరికి భయంకర వ్యసన కుంపటిలో, పాప ఊబిలో పడగొడతాడు. అంతా అయ్యాక కావాలంటే తొడ కూడా కొడతాడు.
7) ప్రజలకు మేలు చేయడం: జీవితానికి అర్ధం మనం జీవించడమే కాదు. సాటివారికి మంచి జీవితాన్ని ఇవ్వాలి. ‘ఇతరులను దోచుకునేవారు పైకి ఎన్ని ప్రార్థనలు చేసినా జీవిత సౌఖ్యాన్ని, శాంతిని ఎన్నటికీ పొందలేరు. సంతృప్తికి మించిన సంపద లేదు. ఇతరుల సుగుణాలతో తన దోషాలను సవరించుకునేవాడు జ్ఞానమార్గంలో జీవిస్తాడు అని గ్రహించాలి.
మీలో ఒకవర్గం (ప్రజల్ని) మంచి వైపునకు పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆజ్ఞాపించేవారు, చెడు పనుల నుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. అలాంటి వారే (ఇహపరలోకాల్లో) సాఫల్యం చెందేవారు. స్పష్టమైన సూచనలు, ప్రమాణాలు వచ్చి నప్పటికీ పరస్పరం విభేదించుకొని విభిన్నవర్గాలుగా చీలిపోయినవారిలా మీరూ కాకండి. అలాంటివారికి ఘోరమైన (నరక) యాతనలు కాచుకొని ఉన్నాయి. (ఆల్–ఇమ్రాన్: 104-105)
8) పరలోక చింతన: ఒక రోజు మనమంతా అల్లాహ్ ఎదుట నిలబడతాం. “ఎవడు పరమాణువంత మంచిపని చేస్తే దానిని చూస్తాడు; ఎవడు పరమాణువంత చెడుపని చేస్తే దానిని చూస్తాడు.” (అల్-జల్జలహ్: 7–8)
అప్పుడు కుడిచేతికి కర్మలపత్రం ఇవ్వబడిన మనిషి (ఎంతో సంతోషిస్తూ తన బంధుమిత్రుల్ని కలుసుకొని) “ఇదిగో నా కర్మలపత్రం, చదవండి. నేను నా (కర్మఫలం) లెక్క నాకు తప్పక లభిస్తుందని భావిస్తుండేవాణ్ణి” అనంటాడు. అతనిక కోరిన సుఖ సంతోషాలు అనుభవిస్తాడు. మహా అద్భుతమైన స్వర్గవనంలో ఉంటాడు. దాని పండ్ల గుత్తులు బరువుతో వంగిఉంటాయి. “హాయిగా తినండి, త్రాగండి మీరు గతజీవితంలో చేసుకున్న సుకృతఫలం అనుభవించండి” (అంటారు దైవదూతలు).
ఇక ఎడమచేతికి కర్మల పత్రం ఇవ్వబడినవాడు (తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ) ఇలా అంటాడు: “అయ్యయ్యో! నా కర్మపత్రం నాకసలు లభించకుండా, నా లెక్కేమిటో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది! నాకొచ్చిన (తొలి)చావే నన్ను పూర్తిగా తుదముట్టించి ఉంటే బాగుండేది!! ఈరోజు నా సిరిసంపదలు నాకేమాత్రం పనికి రాలేదు. నా అధికారం, ఆధిపత్యాలన్నీ మట్టిలో కలిసిపోయాయి.”
(అప్పుడిలా ఆజ్ఞవుతుంది:) “పట్టుకోండి వాడ్ని. వాడిమెడకు గుదిబండ కట్టి నరకం లోకి త్రోసేయండి. తర్వాత డెబ్భయిమూరల గొలుసుతో వాడ్ని బిగించికట్టండి. మహోన్న తుడైన దేవుడ్ని వీడు నమ్మేవాడు కాదు; పేదవాడికి పట్టెడన్నం కూడా పెట్టేవాడు కాదు. అలాంటి సహాయకార్యాల కోసం ఇతరుల్ని ప్రోత్సహించేవాడు కాదు. అందువల్ల ఈ రోజిక్కడ వీడ్ని పట్టించుకునేవాడే లేడు. చీము, నెత్తురు తప్ప వాడికి తినడానికి మరేమీ లభించదు. పాపాత్ములే ఇలాంటి (జుగుప్సాకరమైన) తిండితింటారు” (అల్-హాక్ఖహ్: 19-38)
9) ఆసక్తి, దృఢ సంకల్పం: మంచి విషయాల పట్ల ఆసక్తి, ఉన్న వ్యక్తి ప్రపంచపు ఏ శక్తీ ఆపజాలదు. దాసుని హృదయంలో మంచి పనులపై నిజమైన తపన, దృఢమైన సంకల్పం కలిగి, అల్లాహ్పై ఆధారపడి పనులను సరైన మార్గంలో చేస్తే – అతడే అల్లాహ్ అనుమతితో మంచి పనులకు తాళం చెవి అవుతాడు. చెడు విషయాలను తాళం వేసేవాడు, ముకుతాడు బిగించేవాడవుతాడు.
చివరి మాట
మత ధర్మం కేవలం ఒక ఆచారంగా, సంప్రదాయంగా మారి పోయిననాడు వింత పరిస్థితి నెలకొంటుంది. ధర్మం పేరిట ఎన్నో ఉత్సవాలు, ఆడంబరాలు జరుగుతుంటాయి. కాని సిసలయిన ధర్మం ఎంత అరుదైపోతుందంటే, ఎంత అన్వేషించినా ఎక్కడా కనబడదు. నేడు మిల్లత్ (ముస్లిం సమాజం) పరిస్థితి ఇంచుమించు ఇలాగే తయారయింది. నమాజు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కాని దైవభక్తితో ఆయన ముందు వంగేవారే కనిపించటంలేదు. సత్య ధర్మం కొరకు ఘోషించే వారెందరో ఉన్నారు. కాని సత్య ధర్మం కోసం సంయమనం పాటించే వారులేరు. ముస్లిం సమాజాన్ని వినాశం నుండి కాపాడటానికి ప్రతివ్యక్తీ యోధుడుగా మారాడానికి, వేదికలెక్కి మాట్లాడానికి, నోరేసుకొని పడిపోవడానికి సదా సంసిద్ధంగా ఉన్నవారు చాలా మండే ఉన్నారు: . కాని వ్యక్తిని, సంఘాన్ని, సమాజాన్ని వినాశం నుండి రక్షించాలని ఎవరూ చింతించటం లేదు. ప్రతి ఒక్కరూ తన ధర్మనిరతి విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. కాని ఇతరులు ధర్మనిష్ట గురించిన చింతన ఎవరికీ లేదాయో. అరుగులపై కూర్చుని దైవభక్తిని చాటుకునేవారి సంఖ్యకు కొదవలేదు. కాని ఏకాంతంలో దైవ ధ్యానం చేసే వారే కరువైపోయారు. దైవధర్మాన్ని యావత్ జగత్తులో స్థాపింపజేయాలని ప్రతి వ్యక్తి ఉవ్విళ్ళూరుతున్నాడు. కాని తన వ్యక్తి జీవితంతో దాన్ని ప్రతిష్ఠింపజేయాలన్న ధ్యాస ఎవరికీ లేదు. తీరిక అంతకన్నా లేదు. ప్రతి వ్యక్తి దగ్గరా అందమైన పదజాలాలు కుప్పతెప్పలుఆ పడి ఉన్నాయి. కాని సదాచరణ ఖజానా ఎవరివద్దా లేదు. స్వర్గంలోనే తాళం చెవులు అందరి దగ్గరా ఉన్నాయి. అయితే నరకాగ్ని జ్వాలల్ని తలచుకుని భయపడే అవసరం ఉందని ఎవరికీ అనిపించటం లేదు. ప్రాపంచిక జీవితంలో పౌర లౌకిక ప్రకంపనలను పుట్టించే కళాకాంతులు గల ఇస్లాంవైపుకు ప్రతి ఒక్కరూ ఎగబడుతున్నాడు. కాని ఇస్లాంతో వాస్తవానికి ఎవరికీ శ్రద్ధాసక్తులు లేవు.
ప్రపంచంలో ప్రతి మంచిపనికీ ప్రతిబంధకం ఏర్పడటం లోకసహజం. అది చేడాత్మ మరియు షైతాన్ మూక శక్తుల ప్రభావం. లోకంలో సద్గుణాలు – దుర్గుణాలు అనుక్షణం పరస్పరం సంఘర్షిస్తూనే ఉంటాయి. ఒకరకంగా నీరు, నిప్పులాంటివవి. ఘర్షణ వాటి సహజ స్వభావం. వాటిలో నీరు బలమైనదైతే- నిప్పు ఆరిపోతుంది. నిప్పు తీవ్రమైనదైతే, నీరు ఆవిరైపోతుంది. అలా ఒక్కోసారి ఒక్కో శక్తిది పైచేయి అవుతుంది. ఇందులో మనసుది కీలక పాత్ర. అందుకే ఖుర్ఆన్ ఇలా హితవు పలుకుతుంది: నిస్సందేహంగా ఆత్మప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. అంతరాత్మను అణచిపెట్టినవాడు నాశనమవుతాడు. (అష్-షమ్స్: 9-10)
ఇస్లాం అంటేనే మనల్ని మనం అల్లాహ్ కు బేషరతుగా సంపూర్ణంగా స్వయం సమర్పణ చేసుకోవడం. మనం మన నవ రంధ్రాలను అన్ని విధాలా కాపాడుకుంటూ, పైన పేర్కొనబడిన నవ నీతులను పాటించంటే మన జీవితం నవనీతం అవ్వడం ఖాయం.
Arabic
English
Spanish
Russian
Romanian
Hindi
Tagalog
Bengali
Sinhalese
Nepali
